అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?

స్కూల్
ఫొటో క్యాప్షన్, మనుచెహ్రిలోని ప్రస్తుత విద్యార్థులు తమ ముందు తరాల తరహాలో డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వగలరా?
    • రచయిత, సికిందర్ కిర్మానీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అదొక తరగతి గది. ఆరు నుంచి ఏడేళ్ల వయసు ఉన్న బాలికలు ఉత్సాహంగా చేతులు పైకెత్తి టీచర్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పర్షియన్ గ్రామర్‌కు సంబంధించి టీచర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు వారంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

2001లో అమెరికా చేతిలో తాలిబాన్లు పరాజయం పాలైన తర్వాత, కాబుల్‌లోని మనుచెహ్రి ప్రైమరీ పాఠశాలను బాలికల కోసం పున: ప్రారంభించారు. అప్పుడు ఆ పాఠశాలలో కేవలం ఒక గది మాత్రమే ఉంది. అందులో పిల్లలంతా నేలపై కూర్చొని పాఠాలు వినేవారు.

1996లో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలన మొదలైన తర్వాత బాలికల విద్యపై నిషేధం విధించారు. మహిళా టీచర్లు ఇంట్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

అందులో అయేషా మిస్బా ఒకరు. కానీ ఇప్పుడామె హెడ్ టీచర్.

తాను చదువు నేర్పిన చాలామంది విద్యార్థులు... డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కొందరు పాఠశాలల్లో టీచర్లుగా స్థిరపడ్డారని ఆమె చెప్పారు.

''ఇది మేం సాధించిన అతిపెద్ద విజయం. మా విద్యార్థులంతా చాలా తెలివైనవారు. వారి తెలివి, నైపుణ్యాలతో ఒక్కోసారి టీచర్లనే ఆశ్చర్యపరిచేవారు. ఇప్పుడు కూడా బాలికలు ఇవన్నీ చేసేందుకు తాలిబాన్లు అనుమతిస్తారని నేను ఆశిస్తున్నాను'' అని ఆమె అన్నారు.

అఫ్గానిస్తాన్‌లో తాజాగా అధికారం హస్తగతం చేసుకున్న తాలిబాన్లు, బాలికలు చదువుకునేందుకు అనుమతించారు.

అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మాత్రమే తరగతులకు హాజరవుతున్నారు. సెకండరీ పాఠశాలలకు సంబంధించిన మార్గదర్శకాల కోసం టీచర్లు ఎదురుచూస్తున్నారు.

కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తాలిబాన్ కమాండర్లు యుక్త వయస్సు వచ్చేంత వరకు మాత్రమే బాలికలను పాఠశాలలకు వెళ్లనిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

తాలిబాన్ల గత పాలనతో పోలిస్తే, ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చదువుతోన్న బాలికల సంఖ్య 40 శాతం అధికంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ తాజా గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈ సంఖ్య ఆ ప్రాంతంలోని ఇరుగుపొరుగు దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఆరోగ్య సంరక్షణ రంగంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. మాతా, శిశు మరణాల రేటు కాస్త మెరుగుపడినట్లు కనిపిస్తున్నా.. అది ఇతర దేశాలతో పోలిస్తే తీవ్ర ఆందోళనకర స్థాయిలో ఉంది.

మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చని తాలిబాన్లు చెప్పినప్పటికీ, కొంతమంది దీన్ని నమ్మట్లేదు. ఎందుకంటే దేశంలో భద్రత మెరుగుపడేవరకు ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగానికి చెందిన వారు తప్ప మిగతా రంగాల్లో పనిచేసే మహిళలంతా ఇంట్లోనే ఉండాలంటూ ఇటీవలే తాలిబాన్ అధికారులు పేర్కొన్నారు.

మహిళలు పనిచేయకుండా ఆపడానికి 1990ల్లో కూడా తాలిబాన్లు ఈ తరహాలోనే ఆదేశాలు జారీ చేశారు.

స్కూల్
ఫొటో క్యాప్షన్, మనుచెహ్రిలో స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన గుడారాల కిందే సగం మంది విద్యార్థులు చదువుకుంటారు.

మనుచెహ్రిలోని విద్యార్థులు ఇతర సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నారు.

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారికి సరిపడ తరగతి గదులు లేక వారు బయటే కూర్చొని చదువుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఆట స్థలంలో మూడు గుడారాలను ఏర్పాటు చేసి అందులో బ్లాక్ బోర్డ్, డెస్క్‌లను ఉంచారు.

మౌలిక సదుపాయాల కోసం చేసిన విన్నపాలను గత ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. పాఠశాలలకు సహాయం చేసేందుకు ప్రభుత్వేతర సంస్థలు ముందుకు వచ్చినప్పటికీ, ఆ డబ్బును మొదట విద్యా మంత్రిత్వ శాఖకు పంపించాలని ఆదేశించేవారు.

గత రెండు దశాబ్ధాలుగా అఫ్గానిస్తాన్‌లో అవినీతి పేరుకుపోయింది. ఫలితంగా అంతర్జాతీయ సాయం కూడా అవసరంలో ఉన్న వారికి అందకుండా పోయింది.

అయినప్పటికీ అక్కడి విద్యావ్యవస్థ... తాము నమ్మే సిద్ధాంతాల కోసం నిలబడే, తాలిబాన్లను సవాలు చేసేందుకు గళమెత్తే యువతీయువకులతో కూడిన ఒక తరాన్ని తయారు చేసింది.

ప్రొటెస్టర్
ఫొటో క్యాప్షన్, తాము చావుకు భయపడబోమని కాబుల్‌లో జరిగిన నిరసనల్లో ఒక మహిళ అన్నారు

''20 ఏళ్ల క్రితం, తాలిబాన్లకు భయపడి లొంగిపోయిన కాలం నాటి మనుషులం కాదు'' అని కాబుల్‌లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఒక మహిళ వ్యాఖ్యానించారు.

''మేం చావుకు భయపడం. దేశంలో శాంతిని తీసుకురావడానికి పోరాడే యువతరం మాది'' అని ఆమె ఉద్వేగంగా చెప్పారు.

తాలిబాన్లు ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వంలో అందరూ పురుషులే ఉన్నారు.

వీరిలో చాలామంది 1990ల నాటి తాలిబాన్ పాలనలో ఉన్నత స్థానాల్లో పనిచేసినవారే.

బ్యూటీ పార్లర్
ఫొటో క్యాప్షన్, తాలిబాన్ల భయంతో కాబుల్‌లోని బ్యూటీ సెలూన్లకు పేయింట్ వేశారు.

కొంతమంది అఫ్గాన్లపై యుద్ధం ప్రభావం పడలేదు. కానీ కనీసం హింసకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో, కొన్ని గ్రామాలు తాలిబాన్ల రాకను స్వాగతించాయి.

కాబుల్‌ తాలిబాన్ల చేతిలోకి వెళ్లిన వారంలోపే నేను అక్కడి మధ్యతరగతికి చెందిన యువకుల బృందాన్ని స్నూకర్ క్లబ్‌లో కలిశాను.

విద్యార్థులు, వ్యాపారులతో కూడిన ఆ బృందం అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుతూ తాలిబాన్లపై విరుచుకుపడింది.

తాలిబాన్లు 'జాంబీస్' లాగా కనిపిస్తున్నారని, వారు త్వరలోనే మేమెలా గడ్డం చేసుకోవాలి? జుట్టును ఎలా దువ్వుకోవాలో కూడా నిర్దేశించడం ప్రారంభిస్తారని ఒకరు పేర్కొన్నారు. ఎన్నో ఆత్మాహుతి దాడులకు, హింసలకు కారణమైన తాలిబాన్లను ఎలా నమ్మాలి? అని మరొకరు ప్రశ్నించారు.

అఫ్గాన్‌లోని రాజకీయ వర్గాలపై కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విదేశాలకు పారిపోయిన మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

''మిలియన్ డాలర్ల డబ్బుతో పారిపోయిన ఆయన దేశంలోని యువత భవిష్యత్‌ను అమ్మేశారు'' అని ఒకరు ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఘనీ ఖండించారు.

ఘనీతో పాటు ప్రస్తుతం అఫ్గాన్‌లోనే ఉన్న ఇతర రాజకీయ నేతలపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

''ప్రజా సమస్యల పరిష్కారానికి వారెప్పుడూ ప్రయత్నించలేదు. వారి ఖజానా నింపుకోవడానికి, దేశ సంపదను తమ బంధువులతో పంచుకోవడానికే రాజకీయ నేతలు ప్రయత్నిస్తున్నారు''అని విమర్శించారు.

అఫ్గానిస్తాన్‌లో గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఓటింగ్ సమయంలో భారీ మోసాలు జరిగాయని వారు చెప్పుకొచ్చారు.

''మేం కష్టపడి చదువుకున్నాం. దేశ అభివృద్ధిలో పాలుపంచుకున్నాం. కానీ ఇప్పుడు దేశం కోసం ఏమీ చేయలేం'' అని అన్నారు.

గత రెండు దశాబ్ధాలలో దేశంలో సాధించిన విజయాల్లో, స్వతంత్ర స్థానిక మీడియాను తయారుచేసుకోవడం ప్రధానమైనది.

తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, దేశంలోని చాలా వార్తా సంస్థలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా పనిచేస్తున్నాయి.

ప్రభుత్వం నుంచి కొన్నిసార్లు జర్నలిస్టులు బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు.

''2020 తఖర్ ప్రావిన్సులో ప్రభుత్వం చేసిన వైమానిక దాడి కారణంగా పౌరులు చనిపోయారంటూ నకిలీ వార్తలు ప్రసారం చేసిన వారిని అరెస్ట్ చేయాలని'' మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఆదేశించారు. ఆయన ఇప్పుడు జాతీయ ప్రతిఘటన దళాన్ని నడిపిస్తున్న వారిలో ఒకరు.

జర్నలిస్టులు

ఫొటో సోర్స్, MARCUS YAM/LOS ANGELES TIMES/SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్, గాయపడిన జర్నలిస్టులు తఖీ డర్యాబీ (ఎడమ), నెమతుల్లా నక్డీ

అయితే, వ్యతిరేక వార్తలను తాలిబాన్లు సహించలేరనే భయం ఇటీవల జర్నలిస్టుల్లో పెరిగిపోయింది.

''ఇస్లామిక్ విలువలను ఉల్లంఘించనంత వరకు, జాతీయ ప్రయోజనాలకు భంగం కలగనంతవరకు జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసుకోనిస్తామని'' తాలిబాన్లు ప్రకటించారు.

కానీ ప్రజా నిరసనలను కవర్ చేస్తోన్న జర్నలిస్టులను నిర్బంధించిన తాలిబాన్లు వారిని దారుణంగా హింసించారు.

ఈ వారం ప్రారంభంలోనే పోలీస్ స్టేషన్ వద్ద జరుగుతోన్న ఒక ప్రదర్శనను కవర్ చేస్తోన్న 22 ఏళ్ల తఖీ డర్యాబీతో పాటు ఆయన సహోద్యోగిని తాలిబాన్లు నిర్బంధించారు.

''గదిలో దాదాపు 7 నుంచి 10 మంది వరకు ఉంటారు. వారంతా నన్ను కాలితో తన్నడం ప్రారంభించారు. కర్రలు, రబ్బర్ పైపులతో కొట్టారు'' అని బీబీసీతో తఖీ చెప్పారు. ఇప్పటికీ ఆయన వీపు, ముఖంపై గాయాలు అలాగే ఉన్నాయి.

''నీ తలను నరికేయలేదు. దానికి సంతోషపడు అని ఒక తాలిబాన్ నాతో చెప్పారు. ఇప్పుడు తాలిబాన్లే పాలిస్తున్నారు. ఇక ఎవరూ సురక్షితంగా ఉండలేరు. వాళ్లు జర్నలిస్టులను కిడ్నాప్ చేయడం, కొట్టడం, చంపడం లాంటివి గతంలో చూశాం. వారు మేం స్వేచ్ఛగా పనిచేయడానికి అనుమతించాలి'' అని తఖీ చెప్పుకొచ్చారు.

అఫ్గానిస్తాన్‌లో అమెరికాతో పాటు ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం ఇక కష్టమే కావొచ్చు.

ఇప్పటికే ఇక్కడ అమెరికా ప్రభావం మసకబారిపోయింది.

మిలిటరీ సామగ్రి అమ్మకానికి ప్రసిద్ధి చెందిన 'బుష్ బజార్'లో ఇప్పుడు అమ్మకానికి ఉన్న దాదాపు అన్నీ ఆయుధాలు చైనా ఆయుధాలను ప్రతిబింబిస్తున్నాయి.

అఫ్గాన్‌లోని శక్తిమంతమైన రాజకీయనాయకుల వద్ద పనిచేసే సైనికులు, భద్రతా సిబ్బంది ఒకప్పుడు ఈ బుష్ బజార్‌లో ఆయుధాలు కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు అది పూర్తిగా తాలిబాన్ల పరమైంది.

ఖోస్ట్ ఈస్ట్రన్ ప్రావిన్స్‌కు చెందిన ఒక వ్యక్తి అమెరికా తయారు చేసిన బూట్లు కొనాలని ఆశించారు. కానీ అక్కడ అన్నీ చైనీస్ ఉత్పత్తులే ఉండటం చూసి నిరాశ చెందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)