‘మా పెళ్లి జరిపించడానికి పూజారి ఒప్పుకోలేదు, అందుకే...’

సమీర్ సముద్ర

ఫొటో సోర్స్, SAMEER SAMUDRA

ఫొటో క్యాప్షన్, సమీర్, అమిత్‌లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు వారికి పూజారి దొరకలేదు.
    • రచయిత, సవిత పటేల్
    • హోదా, బీబీసీ కోసం

సమీర్ సముద్ర, అమిత్ గోఖలే హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు, ఆ జంట అనుకోని అవాంతరాలను ఎదుర్కొంది.

వివాహం జరిపించేందుకు వారికి పూజారి దొరకలేదు.

"మాకు హిందూ సంప్రదాయం తరహాలో వివాహం చేసుకోవాలని ఉండేది. కానీ పెళ్లి జరిపించడానికి చాలామంది పూజారులు అంగీకరించలేదు. ఒకరైతే, మేము స్వలింగ సంపర్కులం కాబట్టి చాలాపెద్ద మొత్తాన్ని డిమాండ్ చేశారు" అని నార్త్ కరోలినాలో నివసించే సమీర్ చెప్పారు.

పూజారి అయిష్టంగా తమ పెళ్లి జరిపించడం ఆ జంట ఇష్టపడలేదు. దాంతో వారు మరో మార్గాన్ని ఎంచుకున్నారు.

"పూజారి నిర్వహించే ప్రాథమిక విధులను మా స్నేహితుల్లో ఒకరు నేర్చుకున్నారు" అని సమీర్ చెప్పారు.

భారత్ - అమెరికా జంటలు బాలీవుడ్ తరహాలో సంప్రదాయ పద్ధతులతో కూడిన వివాహం చేసుకోవాలని కలలు కంటూ ఉంటాయి. కానీ ఈ జంటలకు ఈ తరహా వివాహాలు చేసుకోవడం అంత సులభమేమీ కాదు.

సపన్ పాండ్య

ఫొటో సోర్స్, SAPAN PANDYA

ఫొటో క్యాప్షన్, సప్నా, సెహర్ హిందూ-ముస్లిం పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.

అమెరికాలో 2015లోనే స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశారు.

అప్పటి నుంచి అమెరికాలో 300,000కు పైగా స్వలింగ వివాహాలు జరిగాయి.

కానీ చాలాసార్లు వారి వివాహాలను జరిపించాల్సినవారు వారిని వెలివేసినట్లు చూస్తారని ఇండియన్-అమెరికన్ జంటలు చెబుతున్నాయి.

కొన్ని దేవాలయాలు స్వలింగ సంపర్కుల వివాహాలు జరిపేందుకు అంగీకరించవు. పూజారులు ఫోన్ కాల్స్‌ను కట్ చేస్తారు. లేదా వారికి తగిన విధంగా క్రతువులను మార్చేందుకు అంగీకరించరు. కొన్నిసార్లు పెళ్లి జరిపించేందుకు ముందుగా ఒప్పుకుని, వివాహం జరిగే నాడు మాత్రం ముఖం చాటేస్తారు.

ఇలాంటి అనుభవాలతో తమ సంస్కృతిలో భాగమైన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇండియన్-అమెరికన్ స్వలింగ సంపర్క జంటలు స్నేహితులు, శ్రేయోభిలాషులపై ఆధారపడటం మొదలుపెట్టాయి.

హిందూ మతంలో మహిళా పూజారులు ఉండటం తక్కువే అయినప్పటికీ సప్నా పాండ్యా ఒక పూజారిగా మారారు.

ఆమె, పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం అమ్మాయి సెహర్‌ను వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు వారిద్దరూ ఎదుర్కొన్న అనుభవాల వల్ల ఆమె స్వయంగా పూజారిగా మారారు. వారిద్దరూ సంప్రదాయ రీతిలో వివాహం చేసుకోవాలని అనుకున్నారు.

"గుడికి వెళ్లి పూజారిని కలవడం నాకంత సౌకర్యంగా అనిపించలేదు. నా భార్యకు మసీదుకు వెళ్లి ఇమామ్‌ను అడగాలని అనిపించలేదు. అందుకే మా పెళ్లిని మేమే చేసుకున్నాం" అని సప్నా చెప్పారు.

నిక్కీ బరువా

ఫొటో సోర్స్, NIKKI BARUA

ఫొటో క్యాప్షన్, మోనికా, నిక్కీల పెళ్లిని ఒక అభ్యుదయ పూజారి చేశారు.

సప్నా పాండ్యా మైనారిటీల కోసం స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలను జరిపిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఆమెలాగే కొంత మంది పూజారులు ఉన్నారు. వారంతా స్వలింగ సంపర్కుల పట్ల నెలకొన్న ద్వేషాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి వేరే వృత్తులు కూడా ఉన్నాయి.

వివాహం అనేది స్త్రీ, పురుషుల మధ్యే జరగాలని భావించే సంప్రదాయ పూజారులకు ఇదొక సవాలుగా నిలుస్తోంది.

అభిషేక్ సంఘవి జైనమత పూజారి. ఆయన ట్యాక్స్ కన్సల్టెంట్‌గా కూడా పని చేస్తున్నారు.

2019లో వైభవ్ జైన్, పరాగ్ షా అనే స్వలింగ సంపర్క జంటకు ఆయన చేసిన వివాహానికి సంబంధించిన వీడియోలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది స్వలింగ సంపర్క జంటలకు స్ఫూర్తి కలిగించాయి.

"జైన మతం తరహాలో వివాహం చేసుకోవాలని ఆ అబ్బాయిలు అనుకున్నారు. అన్ని మతాలూ ప్రేమనే బోధిస్తాయి" అని అభిషేక్ సంఘవి చెప్పారు.

ఈయన మాటలతో డాక్టర్ షుకావక్ దాస్ అంగీకరించారు. ఆయన హిందూ మతంలోంచి క్రైస్తవ మతంలోకి మారారు. సంస్కృతం, ఇండియన్ స్టడీస్‌లో పీహెచ్‌డి చేశారు. లాస్‌ఏంజెల్స్‌లోని లక్ష్మి నారాయణ్ మందిర్ ప్రధాన అర్చకునిగా ఉన్నారు. ఆయన అనేక వివాహాలు జరిపించారు.

"స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలు జరగకూడదని హిందూమతంలో ఎక్కడ రాసుందో నాకు తెలియదు" అని ఆయన అన్నారు.

ఆయన ఇటీవల ఒక స్వలింగ సంపర్క జంట వివాహాన్ని జరిపించారు.

"ఈ ప్రపంచంలో మనమంతా జీవులమే. కొన్నిసార్లు మనకి పురుష శరీరాలు ఉంటే మరి కొన్నిసార్లు స్త్రీ శరీరం ఉంటుంది. కానీ, ఆత్మలన్నీ ఒకేలా ఉంటాయి" అని ఆయన అన్నారు.

మోనికా మార్క్వెజ్, నిక్కీ బరువా వివాహాన్ని కూడా దాస్ నిర్వహించారు.

"నేను, మోనికా ఇద్దరమూ మా సంస్కృతులను పాటిస్తాం. చిన్నప్పటి నుంచి సంప్రదాయ రీతిలో వివాహం చేసుకోవాలని కలలు కన్నాం" అని ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త, రచయత బరువా చెప్పారు.

ఆమె భాగస్వామి మెక్సికన్- అమెరికన్. వారి వివాహం జరిపించేందుకు పూజారిని వెతకడం చాలా కష్టమైంది. చివరకు దాస్ వారి వివాహాన్ని జరిపించారు.

"ఆయనెప్పుడూ మేము ఇబ్బందిపడేలా ప్రవర్తించలేదు. మాకు చాలా సహజంగా అనిపించింది. ఆ అనుభూతి చాలా అందంగా అనిపించింది" అని ఆమె చెప్పారు.

"మేము అందరికీ చెందినవారిలా అనిపించేలా చేసింది" అని చెప్పారు.

పృద్వి నారాయణ్

ఫొటో సోర్స్, PRITI NARAYANAN

ఫొటో క్యాప్షన్, మాధురి, ప్రీతి

దాస్, పాండ్యా లాంటి అభ్యుదయ పురోహితులకు అమెరికాలో ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. వివాహాలు జరిపించేందుకు చాలా మంది వేరే ఊర్లకు కూడా వెళుతూ ఉంటారు.

స్వలింగ సంపర్క జంటలకు వివాహాలు జరిపించేందుకు శాన్‌ఫ్రాన్సిస్కోలో తగినంత మంది పూజారులు లేరు. అక్కడున్న హిందూ దేవాలయాల్లో స్వలింగ సంపర్క జంటల వివాహాలు జరిపేందుకు అనుమతించరు.

ఈ విషయం తెలిసి మాధురి అంజి, ప్రీతి నారాయణన్‌కు విసుగు కలిగింది.

చివరకు సౌత్ ఆసియా ఎల్జీబీటీక్యూ గ్రూపులో మేము రాజా భట్టర్‌ను కనుగొన్నాం. మా సమాజం నుంచే వచ్చిన లాస్ఏంజెల్స్ పూజారి కూడా స్వలింగ సంపర్కులే అని నారాయణన్ చెప్పారు.

"మేము వివాహ క్రతువులో సరదాగా ఉండే పద్ధతులను ఉంచుకుని, విసుగు పుట్టించే వాటిని తొలగించాం. మేమిద్దరమూ అమ్మాయిలమే కాబట్టి స్త్రీ పురుషుల మధ్య ఉండే నిబంధనలను పెట్టుకోవడంలో అర్థం లేదనిపించింది" అని ఆమె చెప్పారు.

స్వలింగ వివాహాలను జరిపించే పూజారుల సంఖ్య కూడా పెరుగుతోంది.

"నేనొక హిందూ బైసెక్సువల్ వ్యక్తిని. అయినప్పటికీ స్వలింగ సంపర్క వివాహాలను, వేర్వేరు మతాల వారి మధ్య వివాహాలను జరిపించేందుకు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించారు" అని నార్త్ అమెరికా కోఆర్డినేటర్ ఫర్ యునైటెడ్ రెలీజియన్స్ ఇనీషియేటివ్, అభ్యుదయ హిందువుల సమ్మేళన సాధన సంస్థ సభ్యుడు తాహిల్ శర్మ చెప్పారు.

పూజారులు, క్యాటరర్లు, హెన్నా కళాకారుల ఆలోచనల్లో కూడా క్రమంగా మార్పు వస్తోంది.

ప్రస్తుతం చాలామంది వ్యాపారులు స్వలింగ సంపర్కు జంటల వివాహానికి తమ సేవలందించేందుకు అంగీకరిస్తున్నారు. స్వలింగ సంపర్క జంటలు నన్ను సంప్రదిస్తే నేను చాలా సంతోషిస్తాను" అని వెడ్డింగ్ ప్లానర్ పూర్వీ షా చెప్పారు.

"ఇంకా చాలా మంది ఆలోచనల్లో మార్పు రావల్సి ఉంది" అని దక్షిణ కాలిఫోర్నియాలోని హెన్నా ఆర్టిస్ట్ నేహా అన్నారు.

వేర్వేరు మతాల వారికి, స్వలింగ సంపర్కులకు అనుగుణంగా ఉండే డిజైన్లను కూడా ఆమె రూపొందించారు.

"గోరింటాకు డిజైనులో వధూవరుల పేర్లను చేర్చడం నాకిష్టం" అని అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)