ఏ సినిమాకైనా, ఏ రోజైనా ఒకటే రేటు: ప్రెస్ రివ్యూ

ఏ సినిమా అయినా ఒకే రేటు

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో ఇక ఏ సినిమాకైనా, ఏ రోజైనా టికెట్ ధర ఒకేలా ఉంటుందని, పెంచుకోడానికి వీలు లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్లు సాక్షి పత్రిక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. తమ అభిమాన కథానాయకుడి సినిమాను తొలి రోజే చూడాలన్న ఉత్సాహం చాలా మంది అభిమానుల్లో ఉంటుంది.

ఈ అభిమానాన్ని వీలున్నంత వరకు 'క్యాష్‌' చేసుకోవాలనుకున్న సినిమా వాళ్ల అత్యాశ ఎంతో మంది పేదల జేబులకు చిల్లు పొడుస్తోంది.

ఆ బలహీనతను సొమ్ము చేసుకోవటానికి ఆ రెండు మూడు రోజులూ కొన్ని సినిమాల రేట్లను నాలుగైదు రెట్లు పెంచేయటమేంటన్నది అభిమానుల ఆక్రోశం కూడా.

ఎవరి సినిమా అయినా.. ఏ రోజైనా.. టికెట్‌ ధర మాత్రం ఒకటే ఉండాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. తొలి రోజైనా, తొలి మూడు రోజులైనా.. నాలుగో రోజైనా వేసేది అదే సినిమా.

అందులో తొలి మూడు రోజులు అదనపు పాటలు, సీన్ల వంటివేమీ ఉండవు. మరి అలాంటప్పుడు తొలి మూడు రోజులూ టికెట్ల ధరలు పెంచటం ఎందుకు అన్న సగటు ప్రేక్షకుడి ప్రశ్న సబబే అని ప్రభుత్వం ఏకీభవించింది.

ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని, నటీ నటులకు ఎక్కువ పారితోషికం ఇచ్చామని.. తదితర కారణాలతో టికెట్ల రేట్లు పెంచుతామంటే ఇకపై కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసిందని సాక్షి చెప్పింది.

అధికారిక బ్లాక్‌ను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు.. ఇలా ప్రాంతాల వారీగా టికెట్లకు ధరలు నిర్దేశించిందని, ఇవి అన్ని సినిమాలకూ... అన్ని రోజులూ అమలవుతాయని స్పష్టం చేస్తూ ఉత్తర్వులిచ్చిందని కథనంలో రాశారు.

తాజాగా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కూడా దీన్ని సమర్థించిన నేపథ్యంలో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అని సాక్షి వివరించింది.

సైబర్ నేరగాళ్ల కొత్త రూటు

ఫొటో సోర్స్, Getty Images

'అన్నా నంబర్ చెప్పవా' అంటారు... అకౌంట్ ఖాళీ చేస్తారు'

సైబర్ నేరస్థులు యువతులతో తెలంగాణ యాసలో మాట్లాడిస్తూ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న డెబిట్‌ కార్డుదారులకు తెలంగాణ యాసలో, తెలుగుభాషలో యువతులు ఫోన్‌చేసి మాట్లాడుతున్నారు.

ఇదంతా నగదు బదిలీ చేసుకునేందుకు సైబర్‌ నేరస్థుల మాయాజాలం.. ఆంగ్లం, హిందీలో మాట్లాడితే కొందరు స్పందించడం లేదని తెలుసుకున్న నేరస్థులు దిల్లీ, నోయిడాల్లో తెలుగుభాష తెలిసిన ట్యూటర్లతో తెలుగు భాష, తెలంగాణ యాసను యువతులకు నేర్పించి వారితో బాధితులకు ఫోన్‌ చేయిస్తున్నారని పత్రిక రాసింది.

రోజుకు రూ.లక్షలు స్వాహా చేస్తున్నారని, కొద్దిరోజుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ యాసలో మాట్లాడితే మనవారేనన్న భావన, భాషాభిమానంతో బాధితులు ఎక్కువ సేపు మాట్లాడతారన్న అంచనాతో సైబర్‌ నేరస్థులు స్థానిక భాషలను తెరపైకి తీసుకువచ్చారని ఈనాడు రాసింది.

దీంతోపాటు యువతులు మాట్లాడితే డెబిట్‌ కార్డుదారులు స్పందిస్తారన్న భావనతో వారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

ఇందుకోసం ఇంటర్‌, డిగ్రీ చదువుతోనే ఆపేసిన యువతులను ఎంపిక చేసుకుంటున్నారు. వారికి ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని కొంత నేర్పుతున్నారు.

ఆనక యువతులకు ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నారు. భాషా ప్రావీణ్యంతో బ్యాంకుల ప్రతినిధులమంటూ జనాలను బురిడికొట్టిస్తున్నారు.

నాలుగు కంప్యూటర్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఓ కాల్‌సెంటర్‌, వివిధ సిమ్‌కార్డులు.. ఇలా రూ.వేలల్లో పెట్టుబడి పెడుతున్న సైబర్‌ నేరస్థులు రూ.లక్షల్లో నగదు బదిలీ చేసుకుంటున్నారు.

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలను కొనసాగిస్తున్నారని పత్రికలో తెలిపారు.

ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులను పోలీసులు పరిశీలించగా.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ఖాతాలు ఉన్న 30 మంది నుంచి నేరస్థులు రూ.32 లక్షలు నగదు బదిలీ చేసుకున్నట్లు తేలింది.

సంబంధిత వ్యక్తులను ఎలాగైనా పట్టుకునేందుకు సైబర్‌క్రైమ్‌ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

నిందితులంతా దిల్లీ, నోయిడాల్లో కాల్‌సెంటర్‌ తరహాలో తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారని తెలుసుకున్నారు.

వాటిల్లో యువతులను ఉద్యోగులుగా నియమించుకుని ఇదంతా చేస్తున్నారని పోలీసులు గుర్తించారని ఈనాడు వివరించింది.

వలంటీర్లకు పురస్కారాలు

ఫొటో సోర్స్, fb/Andhra Pradesh CM

ఏపీలో నేటి నుంచి వలంటీర్లకు పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి వలంటీర్లకు మూడు కేటగిరీల్లో పురస్కారాలు ఇవ్వనున్నట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.

ఏపీలో అత్యుత్తమ సేవలందించిన గ్రామ, వార్డు వలంటీర్లకు ఉగాది పండుగ రోజున పురస్కారాలు అందజేయాలని సీఎం జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో.. అనంతపురం జిల్లాలో సోమవారం నుంచే వాటిని అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ సేవలు, నవరత్నాల పథకాలు ప్రజలకు అందించడంలో విశేష కృషి చేస్తున్న వలంటీర్ల సేవలకు జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక రోజు సత్కార కార్యక్రమంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారని పత్రిక రాసింది.

ఈ నెల 24వ తేదీ వరకూ జిల్లాలో వలంటీర్లకు సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వలంటీర్లకు సేవా వజ్ర, రత్న, మిత్ర అవార్డులను అందజేస్తామని చెప్పారు.

వలంటీర్లకు మూడు కేటగిరీలుగా ఈ పురస్కారాలు అందజేస్తామన్నారు.

సేవా వజ్రకు రూ.30వేలు, శాలువా, బ్యాడ్జీ, మెడల్‌, సర్టిఫికెట్‌, సేవా రత్న పురస్కారానికి రూ. 20 వేలు, శాలువా, బ్యాడ్జీ, మెడల్‌, సర్టిఫికెట్‌, సేవామిత్ర పురస్కారానికి రూ. 10 వేలు, శాలువా, బ్యాడ్జీ, మెడల్‌, సర్టిఫికెట్లు ఇస్తామని కలెక్టర్ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.

నల్లమల అడవులు

యురేనియం తవ్వకాలపై కేంద్రం యూటర్న్

నల్లమల, నల్లగొండలో యురేనియం తవ్వకాలు జరపాలనుకున్న కేంద్రం ఆ నిర్ణయాన్ని విరమించుకుందని నమస్తే తెలంగాణ పత్రిక కథనం ప్రచురించింది.

నల్లమల అటవీ ప్రాంతంతోపాటు, నల్లగొండ పెద్దగుట్టలో యురేనియం ఖనిజాన్వేషణపై కేంద్రం యూటర్న్‌ తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో యురేనియం సర్వే నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిందని పత్రిక చెప్పింది.

నిక్షేపాల అన్వేషణకు చేపట్టిన బోర్‌వెల్స్‌, డ్రిల్లింగ్‌ ప్రణాళికలను నిలిపివేస్తున్నట్టు ఆటమిక్‌ మినరల్‌ డిపార్ట్‌మెంట్‌(ఏఎండీ) డైరెక్టర్‌ డీకే సిన్హా తెలిపారు.

దీనిపై పర్యావరణ ప్రేమికులు, అడవి బిడ్డల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ పరిధిలోని నల్లమల అటవీప్రాంతంలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌(ఏటీఆర్‌), నల్లగొండ పెద్దగుట్ట ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆటమిక్‌ ఎనర్జీ (డీఏఈ) 1995లోనే గుర్తించింది.

అప్పటినుంచి దాని అన్వేషణ, వెలికితీతకు ప్రయత్నాలు మొదలయ్యాయి. యురేనియం వెలికితీత ప్రయత్నాలను నాడు ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో యురేనియం ఖనిజాన్వేషణ మళ్లీ తెరపైకి వచ్చింది.

అసలు ఈ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఎంత పరిధిలో విస్తరించి ఉన్నాయి? ఎంత లోతులో ఉన్నాయి? అనేది గుర్తించేందుకు డ్రిల్లింగ్‌ చేపట్టాలని 2015-16లో డీఏఈ నిర్ణయించింది.

అమ్రాబాద్‌, నల్లగొండ జిల్లాల్లో మొత్తంగా 83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 4 వేల బోర్లు వేయాలని ప్రతిపాదించిన ఆటమిక్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ (ఏఎండీ).. ఇందుకోసం సుమారు రూ.45 కోట్ల అంచనా వ్యయంతో సర్వే ప్రాజెక్టును కూడా సిద్ధం చేసింది.

అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నల్లమల జీవవైవిధ్యం, పులుల సంరక్షణ, చెంచుల జీవన భద్రతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది.

రాష్ట్రప్రభుత్వ నివేదికను పట్టించుకోకుండా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణమార్పుల మంత్రిత్వశాఖ 2019లో గుట్టుచప్పుడు కాకుండా ఆ సర్వేకు అనుమతులు మంజూరుచేసింది.

దీనిపై తెలంగాణ ప్రభుత్వంతోపాటు, పర్యావరణ ప్రేమికులు, చెంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఈ విషయాన్ని పార్లమెంట్‌లో పలుమార్లు లేవనెత్తారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ దీనికి అనుమతించం' అంటూ 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించి ఆదివాసీలకు అభయమిచ్చారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతతో ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చిందని పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)