మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి? కిన్నెర చరిత్ర ఏంటి?

దర్శనం మొగిలయ్య
ఫొటో క్యాప్షన్, దర్శనం మొగిలయ్య
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ విడుదల తరువాత మొగిలయ్య పాట, కిన్నెర వాయిద్యం ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

ఆ పాటలో కనిపించిన మొగిలయ్య అనే కిన్నెర వాయిద్యకారుడిపై విస్తృతంగా చర్చ జరిగింది.

అందరూ అనుకుంటున్నట్టు కిన్నెర వాయిద్యం అంతరించిపోతోందా? మొగిలయ్య తరువాత ఆ వాయిద్యాన్ని వాయించే వారే లేరా? ఇంతకీ ఏంటా కిన్నెర? ఎందుకు దానిపై ఇంత చర్చ?

భీమ్లా నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ అసలు పాట "ఆడాలేడు మియా సాబ్ ఈడాలేడు మియా సాబ్" అంటూ సాగుతుంది. ఇది మహబూబ్ నగర్ ప్రాంతంలో పేదల కోసం పోరాడిన మియా సాహెబ్ అనే వ్యక్తిపై రాసిన పాట. ఆ పాట పదాలు మార్చి బీమ్లా నాయక్ కోసం ఉపయోగించారు.

దర్శనం మొగిలయ్య కేవలం మియా సాహెబ్ మాత్రమే కాదు.. ఆ ప్రాంతంలో పేదలకు మేలు చేసిన, ప్రభుత్వాలపై తిరగబడ్డ కొందరి వీరుల చరిత్రలు పాడుతుండేవారు.

మొగలయ్య వంశపారంపర్యంగా ఈ కిన్నెర వాద్యాన్ని నేర్చుకున్నారు. స్థానికంగా దొరికే వస్తువులతో ఈ కిన్నెరను తయారు చేస్తారు. తన ముందు తరాల పేర్లు చెప్పి ఈ వాయిద్యం ఎక్కడి నుంచి మొదలైందో వివరిస్తారు ఆయన. ఆ పాటల్లోని వ్యక్తుల చరిత్రలు కూడా తన పూర్వీకులు శృతి కట్టినవే అని చెబుతారు మొగిలయ్య.

కిన్నెర

ప్రస్తుతం దక్షిణ తెలంగాణ – నల్లమల ప్రాంతంలో ఈ వాయిద్యం వచ్చిన వారిలో మొగిలయ్యే అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వరకూ మొగిలియ్య బతుకులో ఏ మార్పు, పెద్ద పేరూ లేదు. సంతల్లో ఈ వాయిద్యం వాయిస్తూ పొట్టపోసుకున్నారు. మట్టి పని, కూలీ పని చేశారు. పేదరికం వల్ల పిల్లల్ని పోగొట్టుకున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మొగిలయ్యకు సన్మానం చేశారు. ఆ తరువాత ఆయన చరిత్ర 8వ తరగతి సిలబస్ లో చేర్చారు. దీంతో అప్పుడప్పుడు స్కూళ్లకు వెళ్లి ప్రదర్శనలిచ్చినప్పుడు అక్కడి ఉపాధ్యాయులు ఇచ్చే విరాళాలు కూడా మొగిలయ్యకు ఉపాధి కల్పించాయి.

మొగిలియ్య పాటలపై పీహెచ్డీ చేసిన డి రంగయ్య అనే ఆయన, మొగిలియ్యను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి పరిచయం చేశారు. ఆయన మొగిలయ్యకు సాయం చేశారు. ప్రస్తుత తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మొగిలయ్యకు ఇటీవలే కళాకారుల పింఛన్ ఏర్పాటు చేశారు. ఆయన రిఫరెన్సుతోనే మొగిలయ్య పవన్ కళ్యాణ్ సినిమా పాట పాడారు. సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు కూడా మొగిలయ్యకు సాయం అందించారు. తాజాగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా ఆయనకు సాయం అందించారు.

పవన్ కల్యాణ్ ను కలిసిన తరువాత తన జీవితంలో చాలా మార్పు వచ్చిందంటున్నారు మొగిలయ్య. పవన్ ఫాన్స్ కి మొగిలయ్య పెద్ద అట్రాక్షన్ అయ్యారు. ఆయన ఎక్కడ కనిపించినా సెల్ఫీలు తీసుకుంటున్నారు.

ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు సేకరించిన ప్రాచీన వాయిద్యాలు

ఫొటో సోర్స్, Kondaveeti Gopi / FB

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు సేకరించిన ప్రాచీన కిన్నెర

కిన్నెర నల్లమల దళితులకు ఎలా వచ్చింది?

వాస్తవానికి కిన్నెర వాయిద్యం ఆదివాసీలది అని చెబుతారు ఈ అంశంపై విస్తృతంగా పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు. ‘‘ఆదివాసీల నుంచి దళితులకు అందిన వాయిద్యం... కిన్నెర. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ గోండు ఆదివాసీలతో పాటు, మాదిగల ఆశ్రిత కులం అయిన డక్కలి కులస్తులు కిన్నెర వాయిస్తున్నారు. గోండులు దాన్ని జతుర్ అంటారు. కానీ చెంచుల నుంచి కిన్నెర పూర్తిగా దూరం అయింది. వారికి బదులు నల్లమల ప్రాంత దళితులకు ఆ వాయిద్యం అందింది’’ అన్నారు తిరుమల రావు.

చెంచుల నుంచి కిన్నెర దూరం అవడానికి రకరకాల జానపద కథలు, కొన్ని పర్యావరణ కారణాలూ ఉన్నాయి.

ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు సేకరించిన ప్రాచీన వాయిద్యాలు

ఫొటో సోర్స్, Kondaveeti Gopi / FB

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు సేకరించిన ప్రాచీన వాయిద్యాలు

ఒకసారి ఒక చెంచు మహిళ కిన్నెర సంగీత తన్మయత్వంలో కూరగాయలకు బదులు తన బిడ్డను కోసేసిందనీ, అప్పటి నుంచీ వారు దాన్ని వదిలేసారన్నది జానపద గాథ.

అయితే కిన్నెర తయారీకి ఒక రకమైన ఆనపకాయ డొల్లలు కావాలి. ఆ డొల్లలు కూడా చెట్టుపైనే ఎండాలి. ఏడాదికి పైగా ఎండాలి.

కానీ నల్లమల అడవుల్లో కోతుల జనాభా పెరిగిపోవడంతో ఆ డొల్లలు దొరకడం కష్టమై కిన్నెర తయారీ కష్టం అయిపోయింది అని చెబుతున్నారు జయధీర్ తిరుమల రావు.

వివిధ వర్గాల దగ్గర ఆ కిన్నెరకు ఎన్ని మెట్లు (వీణ మెట్లు లాగా) ఉంటాయన్న తేడా మాత్రం ఉంది. అలాగే ఆ కిన్నెరను పట్టుకుని వాయించే విధానం విషయంలో కూడా తేడాలున్నాయి.

‘‘4వ శతాబ్ది నుంచే కిన్నెర ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలున్నాయి. ముఖ్యంగా చెంచు మల్హరీ రాగం గురించి సంగీత శాస్త్రం కూడా చెబుతుంది. అయితే చెంచులకు 13 మెట్ల కిన్నెర వాయించడమే వచ్చు. నేను, మా బృందం దీని గురించి 30 ఏళ్లుగా పరిశోధన చేస్తున్నాం. నేను ఒకసారి 7 మెట్ల కిన్నెరను ఒక చెంచు వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాను. ఆయనకు కళ్లు కనపడవు. ఆ కిన్నెరను తాకి, ఇది 7 మెట్ల కిన్నెర, తాను వాయించలేననీ, తాను కేవలం 13 మొట్ల కిన్నెరే వాయించగలననీ చెప్పారు. వాస్తవానికి కిన్నెరె మెట్లు ఎక్కువ ఉంటే వాయించడం కష్టం. కానీ చెంచులకు 13 మెట్లు వాయించడమే వచ్చు. కానీ చెంచుల నుంచి కిన్నెర పాట వినలేకపోయాం’’ అన్నారు తిరుమల రావు.

ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు సేకరించిన ప్రాచీన వాయిద్యాలు

ఫొటో సోర్స్, Kondaveeti Gopi / FB

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు సేకరించిన ప్రాచీన వాయిద్యాలు

డక్కలి కులం దగ్గర కిన్నెర

తెలంగాణలో కనిపించే డక్కలి అనే కులం మాదిగలకు ఆశ్రిత కులం. అంటే మాదిగ కులస్తులకు కథలు, గాథలు చెబుతూ, వారిచ్చే దానితో జీవనం సాగిస్తుంటారు.

ఉత్తర తెలంగాణలో డక్కలి కులస్తులు జాంబవతుని కథ చెప్పడానికి, ఎల్లమ్మ కథ చెప్పడానికి ఈ కిన్నెర వాయిద్యాన్ని ఉపయోగిస్తుంటారు.

పోచయ్య అనే వ్యక్తి ఈ కిన్నెర వాయిద్యంలో ప్రావీణ్యత సంపాదించారు. ప్రస్తుతం పది మంది వరకూ కిన్నెర నేర్చుకుంటున్నారు.

‘‘కిన్నెర వంటి ఎన్నో ప్రాచీన సంగీత వాయిద్య పరికరాలున్నాయి. వాటిని భవిష్యత్ తరాలకు అందించాలి’’ అన్నారు జయధీర్ తిరుమల రావు. దాదాపు 4 దశాబ్దాలు ఈ అంశంపై పరిశోధన చేసిన తిరుమల రావు, గతంలో దాదాపు 2 వేల వరకూ ప్రాచీన సంగీత పరికరాలతో ఆద్యకళ అనే పేరుతో ప్రదర్శన కూడా నిర్వహించారు.

వీడియో క్యాప్షన్, మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)