రావిపూడి వెంకటాద్రి: 100 ఏళ్లలో 100 పుస్తకాలు రచించిన హేతువాది

రావిపూడి వెంకటాద్రి
ఫొటో క్యాప్షన్, రావిపూడి వెంకటాద్రి
    • రచయిత, వి శంకర్
    • హోదా, బీబీసీ కోసం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

భారతదేశంలో హేతువాద ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక మంది హేతువాద దృక్పథంతో ఆచరణాత్మకంగా వ్యవహరించిన వారున్నారు.

హేతువాదాన్ని ఒక ఉద్యమంగా మలిచి, దానిని ప్రచారం చేసే కార్యక్రమాలను తెలుగునాట మొదలుపెట్టిన వారిలో రావిపూడి వెంకటాద్రి ఒకరు. ఇప్పటికీ ఆయన కార్యక్రమాలను ఆపలేదు.

రావిపూడికి నేటితో (ఫిబ్రవరి 9)తో వందేళ్లు పూర్తవతున్నాయి. ఈ వందేళ్ల జీవితంలో 8 దశాబ్దాలకుపైగా హేతువాదిగానే ఆయన ప్రయాణం సాగించారు.

ఈ క్రమంలో సుమారు వంద పుస్తకాలు రచించారు. వేల కొద్ది ఉపన్యాసాలు చేశారు. హేతువాది అనే మాసపత్రికను ఇప్పటికీ నడిపిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, రామభక్తుడైన రావిపూడి హేతువాది

తెలుగు నాట హేతువాద బీజాలు

చార్వాకం పూర్తి హేతువాద దృక్పథంతో సాగిందని... ఆ తర్వాత బౌద్ధ, జైన మతాల్లో కూడా హేతువాద ఛాయలున్నాయని చెబుతారు. ఆ తర్వాత హేతువాద భావాలతో ముందుకు సాగిన వారిలో కవి వేమన, పోతులూరి వీరబ్రహ్మం వంటి వారి పేర్లను ప్రస్తావిస్తారు.

వివిధ రూపాల్లో సంస్కరణలకు బాటలు వేసిన స్వామినేని ముద్దు నరసింహనాయుడు, పుదూరు అనంతరామశాస్త్రి, పరావస్తు వెంకటరంగాచార్యులు, కందుకూరి వీరేశలింగం (1848-1919) వంటి వారిని కూడా హేతువాద ప్రారంభకులుగా చెబుతారు.

కందుకూరి స్వయంగా అంటరానితనానికి వ్యతిరేకంగా, బాల్య వివాహాలను ఎదురించడంలో ఆస్తిక హేతువాదిగా వ్యవహరించినట్టు భావిస్తారు.

మూఢవిశ్వాసాలను పీఠాధిపతుల్నీ విమర్శించడం. అమావాస్య రోజునే ఉపాధ్యాయుడిగా చేరడం, జందెం తీసేయడం, కృష్ణమిశ్రుడి నాస్తికగ్రంథం ప్రబోధచంద్రోదయాన్నితెలుగులోకి అనువదించడం వంటి చర్యల ద్వారా కందుకూరి వీరేశలింగం హేతువాద దృక్పథం చాటుకున్నట్టు చెబుతారు.

గురజాడ అప్పారావు కూడా మానవతావాదిగా హేతువాద ఆలోచనలను చాటుకున్నట్టు కనిపిస్తోంది.

శూద్రుడనే కారణంతో బ్రాహ్మణులు తన పట్టాభిషేకానికి నిరాకరించిన నేపథ్యంలో ఛత్రపతి శివాజీ రాజ్యంలో బ్రాహ్మణేతరులకు పౌరోహిత్యం నేర్పే పాఠశాలలు పెట్టించారని కూడా అంటారు.

విశ్వబ్రాహ్మణులకు కూడా పౌరోహిత్యం చేసే హక్కు ఉందని పోరాటడంతో 1817లో ఆ మేరకు కోర్టు తీర్పు కూడా వచ్చింది. పాలకొల్లుకు చెందిన వైశ్యుడు మామిడి వెంకయ్య (1764-1834), తర్వాత కొంత కాలానికి శిల్పులు కూడా పౌరోహిత్యంలో తమకు కూడా హక్కు కావాలని పోరాడారు. పెనుమాక కంసాలి చెర్వుగట్టు రామాచార్యులు సుదీర్ఘకాలం పాటు పోరాడారు.

Short presentational grey line

హేతువాదం అంటే ఏంటి?

ప్రతిదానికీ కారణాన్ని, సాక్ష్యాన్ని అన్వేషించడమే హేతువాదం (రేషనలిజం). కారణమే జ్ఞానానికి మూలం అని హేతువాదులు విశ్వసిస్తారు. కారణం లేకుండా దేనినీ నమ్మరు. గుడ్డిగా దేనినీ అనుసరించరు.

19వ శతాబ్ధం నుంచి ‘ఫ్రీథాట్’ పేరుతో హేతువాదులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రజలు తమంతట తాముగా, స్వేచ్ఛగా ఆలోచించాలని, ఆ ఆలోచనలు కారణాన్ని, సాక్ష్యాలను, అనుభవాలను ఆధారంగా చేసుకోవాలని ఈ సంప్రదాయం సూచిస్తుంది.

ఈ కారణంగానే హేతువాదంలో కూడా భిన్నమైన ఆలోచనలు ఉంటుంటాయి.

Short presentational grey line

తెలుగుగడ్డపై తొలి బ్రాహ్మణేతర ఉద్యమాన్ని సూర్యదేవర రాఘవయ్య చౌదరి ప్రారంభించారు. జి.యస్.బి.సరస్వతి మరో అడుగు ముందుకేశారు. కమ్మ, వెలమ, బలిజ, రెడ్డి కులాలవారు శూద్రులు కాదని ప్రకటించారు. వారంతా సూర్యవంశ క్షత్రియులు అని 1931లోనే ప్రకటించారు.

అంతకుముందే 1917లో బ్రాహ్మణేతరుల సంక్షేమం కోసమంటూ జస్టిస్ పార్టీ ఏర్పడింది. త్రిపురనేని రామస్వామి, దుగ్గిరాల రాఘవచంద్రయ్య లాంటి వారు ఈ అంశంపై పలు చర్చలు చేశారు. చివరకు యర్రంశెట్టి వీరయ్యనాయుడుకు తొలిసారిగా జందెం వేశారు. దాంతో అర్చకత్వం, పౌరోహిత్యం చేయడం వంటివి ఇతర కులాల వారిలో కూడా మొదలయ్యింది.

రావిపూడి వెంకటాద్రి

హేతువాదం వైపు కొత్తతరం

ప్రారంభంలో కొద్ది మందే అయినప్పటికీ ఆ తర్వాత హేతువాద ఉద్యమంలో కొత్తతరం వచ్చి చేరింది. దాంతో ఈ ప్రభావం విస్తరించింది.

త్రిపురనేని రామస్వామి (1887-1943), తాపీ ధర్మారావు (1887-1973), గోరా (1902-1975), ఆవుల గోపాలకృష్ణమూర్తి (1917-1966), నార్ల వెంకటేశ్వరరావు (1907-1985), కట్టమంచి రామలింగారెడ్డి, పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, కొప్పరపు సుబ్బారావు, ఆరుద్ర, యలమంచిలి వెంకటప్పయ్య, చలం లాంటి ప్రముఖులంతా హేతువాదులుగా ప్రసిద్ధి చెందారు.

హేతువాద నాస్తికభావాల ప్రచారమే ప్రధానంగా పెట్టుకోకపోయినా గుర్రం జాషువా, పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు, సురమౌళి, మహీధర రామమోహనరావు, సురవరం ప్రతాపరెడ్డి, రాచకొండ విశ్వనాథశాస్త్రి, ఆమంచర్ల గోపాలరావు వంటి వారి రచనల్లో కూడా హేతువాద భావనలు విస్తృతంగా ఉండేవి.

ఉద్యమంగా హేతువాదం

1940లో గోరా ముదునూరులో నాస్తికకేంద్రం ప్రారంభించడంతో హేతువాదం ఓ ఉద్యమ రూపం దాల్చింది.

కొద్దికాలానికే 1943లో నాగండ్లలో రావిపూడి వెంకటాద్రి కవిరాజాశ్రమం పేరుతో హేతువాద ప్రచారానికి పూనుకున్నారు.

1949లో మద్రాసులో భారత హేతువాద సంఘం ఏర్పడింది. అప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలువురు హేతువాదులు విడివిడిగా ఉద్యమంగా హేతువాదాన్ని ప్రచారం చేసేందుకు పూనుకున్నారు. అనేకమందిలో ఆలోచనలు రేకెత్తించారు.

అనంతరం 1972లో జయగోపాల్ భారత నాస్తిక సమాజం స్థాపించగా, 1976లో అనంతపురం కేంద్రంగా డాక్టర్ జె.వెంకట్రామప్ప హేతువాద సంఘం స్థాపించారు.

చివరకు 1978లో రాష్ట్రంలోని హేతువాద సంఘాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘంగా రూపుదిద్దుకున్నాయి. దానికి రావిపూడి వెంకటాద్రి అధ్యక్షత వహించారు.

అంతకుముందు చీరాలలో 1977లో జరిగిన సమావేశం ద్వారా హేతువాదులను సంఘటితం చేసే ప్రయత్నం జరిగింది.

ఆ తర్వాత కూడా హేతువాద ఉద్యమంలో భిన్నాభిప్రాయాలతో వివిధ ప్రాంతాల్లో కొత్త సంస్థలు ఏర్పాటయ్యాయి. వాటిలో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి.

1981లో చుక్కపల్లి రామకోటయ్య తెనాలిలో హేతువాద సంఘం స్థాపించగా, 1986లో ఎస్.వి.రావు నరసరావుపేటలో హేతువాద సమాఖ్య ప్రారంభించారు.

1980వ దశకంలో కత్తి పద్మారావు హేతువాద ఉద్యమాల పేరుతో వేల మంది ప్రజలను సమీకరించారు. భారీ బహిరంగసభలు నిర్వహిస్తూ హేతువాద ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు.

రావిపూడి వెంకటాద్రి

ఎం ఎన్ రాయ్ ప్రభావంతో..

ఎం.ఎన్.రాయ్ ప్రభావంతో పలువురు మానవతావాదులుగా, ఆ తర్వాత హేతువాద ఉద్యమంలో భాగస్వాములయ్యారని చెప్పవచ్చు.

1936లో రాయ్ ప్రారంభించిన ఇండిపెండెంట్ ఇండియా పత్రిక అనేకమందిని ప్రభావితులను చేసింది. అలా ప్రభావితం అయిన వారిలో ఆంధ్రా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ కట్టమంచి, లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణారావు వంటి వారు కూడా ఉన్నారు.

త్రిపురనేని గోపీచంద్ రాయ్ రచనలను అనువదించారు. ఆవులగోపాలకృష్ణమూర్తి, గుత్తికొండ నరహరి ఖాజామియా లాంటి ఎందరో ఉద్యమంలో చేరారు. రాడికల్ విహారి, ఆంధ్రా లేబర్ లాంటి పత్రికలు నడిచాయి. 1948లో రాడికల్ హ్యూమనిస్ట్ మూమెంట్‌గా పేరుమారింది.

కూచిపూడిలో కోగంటి సుబ్రమణ్యం కోగంటి రాధాకృష్ణమూర్తి లీగాఫ్ రాడికల్ కాంగ్రెస్ మెన్ స్థాపించారు. 1940లో తెనాలి రత్నాటాకీస్‌లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ మొదటి సభ జరిగింది.

ఇలా వివిధరూపాల్లో మానవతావాదం ప్రభావం చూపిన నేపథ్యంలోనే త్రిపురనేని కవిరాజు ప్రభావంతో తాను హేతువాదిగా మారినట్లు రావిపూడి వెంకటాద్రి చెబుతున్నారు. ఆయన తన ప్రస్థానం గురించి బీబీసీతో మాట్లాడారు.

‘‘నాకు వందేళ్లు నిండుతున్నాయి. అందులో 80 ఏళ్లు హేతువాద ఉద్యమంలోనే ఉన్నాను. ప్రారంభంలో భక్తుడిగా ఉన్నాను. కానీ త్రిపురనేని కవిరాజు గారిని ఓసారి కలిసినప్పుడు ఆయన నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. వాటిని చదివిన తర్వాత నాలో ఆలోచన మారింది’’ అని రావిపూడి చెప్పారు.

‘‘ఇంటర్ చదువుతుండగా గుంటూరు హిందూ కాలేజీలో సావిత్రి పతివ్రత ఎట్లాయెను అనే కవిత రాశాను. దానికి బహుమతి కూడా వచ్చింది. అప్పట్లో దానిని కొందరు విమర్శించారు. అయినా నాలో హేతువాద ఆలోచనలు మరింత బలపడ్డాయి. ఎం ఎన్ రాయ్ సహా అనేక మంది పుస్తకాలు చదవడంతో పూర్తి హేతువాదిగా మారి, దానిని ప్రచారం చేయడం కోసం కవిరాజాశ్రమం ప్రారంభించాను. అనేక మంది సహకరించారు. మా గ్రామంలో పలు మార్పులు తీసుకొచ్చాం. అస్పృశ్యతను పారదోలాం. సహపంక్తి భోజనాలు నేటికీ చాలా సహజం అయిపోయింది’’ అని ఆయన వివరించారు.

ప్రచారమే పునాదిగా హేతువాద ఉద్యమం

ఫిబ్రవరి 9, 1922లో ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో జన్మించిన రావిపూడి వెంకటాద్రి సుదీర్ఘకాలం పాటు ఆ గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. 1955 నుంచి 1995 వరకూ ఆయనే పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

హేతువాదానికి నమ్మకాలుండవంటూ సమ్మతాలు (కన్విక్షన్స్) మాత్రమే ఉంటాయని చెప్పే రావిపూడి వెంకటాద్రి... తన ఆలోచనలను విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. తన 21వ ఏటనే కవిరాజాశ్రమం ప్రారంభించి మానవతావాదంతో సమాజాన్ని మానవ సంబంధాలైన ప్రేమ, ఆదరణ వైపు మళ్లించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

హేతువాద భావజాలం ప్రచారం కోసం ఆయన స్వయంగా దాదాపు వంద పుస్తకాలను రచించారు. వేల కొద్ది వ్యాసాలు రాశారు. నేటికీ రాస్తూనే ఉన్నారు.

సుదీర్ఘకాలం పాటు హేతువాద ఉద్యమంలో ఉన్న ఆయన రాష్ట్రంలోనూ, దేశం నలుమూలలా హేతువాదంపై ఉపన్యాసాలు ఇచ్చారు. 1982లో ఆయన ప్రారంభించిన హేతువాది పత్రికను నేటికీ మాసపత్రికగా కొనసాగిస్తున్నారు.

1946లో రావిపూడి రాసిన తొలి పుస్తకం ‘విశ్వాన్వేషణ’ వచ్చింది. ఆ తర్వాత 1949లో ‘జీవమంటే ఏమిటి?’ అనే పుస్తకం రాశారు. ఇప్పటి వరకూ తాను 96 పుస్తకాలు రచించినట్టు రావిపూడి తెలిపారు.

తాజాగా ఆయన రాసిన పలు పుస్తకాలు మళయాళం, కన్నడం, ఇంగ్లీష్, గుజరాతీ భాషల్లోకి అనువాదమయ్యాయి. వాటిలో కొన్నింటిని ఫిబ్రవరి 9న ఇంకొల్లులో నిర్వహించబోతున్న కార్యక్రమంలో ఆవిష్కరించేందుకు సిద్ధం చేశారు.

వెంకట్రాదికి ముందే హేతువాద ప్రచారంలో భాగంగా 1930లో బొంబాయిలో స్థాపించిన పురోహిత వ్యతిరేక సంఘం తరపున రీజన్ పత్రిక ప్రారంభమైంది. దానికి కాకినాడ నుంచి ఎమ్.వి.వి.కే.రంగాచారి వ్యాసాలు రాసేవారు.

1962 నుంచి హైదరాబాదులో ఆవుల సాంబశివరావు, ఎస్.కె.ఆచార్య, ఎ.ఎల్.నరసింహరావు, ఎన్.ఇన్నయ్యల వంటి వారు ది ఇండియన్ రేషనలిస్ట్ పత్రికను నడిపారు. అత్తలూరి సూర్యనారాయణ ఫ్రీ థాట్ అనే పత్రికను 1971లోనే మద్రాస్ నుంచి ప్రారంభించారు.

1974 లో ఎమ్.వి.రామమూర్తి సారథ్యంలో వికాసం, 1976లో తోటకూర వెంకటేశ్వర్లు నేతృత్వంలో చార్వాక అనే పత్రికలు వెలువడ్డాయి. 1980లలో నర్సరావుపేట నుంచి హేతువాద దర్శిని అనే లిఖిత పత్రిక ప్రారంభించారు. హేతువాదమ్ అనే పత్రికను య.స్.వి.రావు, సంపాదకుడిగా ప్రారంభించారు. అనాడు సీవీ రావు, కత్తి పద్మారావు. ఈశ్వర ప్రభువ వంటి వారి వ్యాసాలు అనేకమందిలో హేతువాద ఆలోచనలు పెంచేందుకు దోహదపడ్డాయని భావిస్తారు.

రావిపూడి వెంకటాద్రి

ఇంకొల్లు కేంద్రంగా రావిపూడి కార్యక్రమాలు

ప్రకాశం జిల్లా ఇంకొల్లులో రావిపూడి వెంకటాద్రి ర్యాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ ప్రారంభించారు. అక్కడి నుంచి ఆయన తన కార్యక్రమాలను నిర్వహించారు.

వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో మానవవాద, హేతువాద ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. తన కృషి కొంత వరకూ ఫలించిందని రావిపూడి అంటున్నారు. సమాజంలో మార్పు వస్తుందని, అయితే అది ఎప్పుడన్నది చెప్పలేమని ఆయన అన్నారు.

‘‘మానవులకు మార్గదర్శిగా హేతువాదం చేయూతనిస్తుంది. మూఢనమ్మకాలతో సతమతమవుతోన్నవారికి వెలుగు చూపుతుంది. హేతువాదం కూడా ఎక్కడో గాల్లోంచి పుట్టలేదు. వైజ్ఞానిక పద్ధతిలోనే పుట్టింది. ఎప్పటికప్పుడు పరిణమిస్తూ ఉంటుంది. ప్రశ్నించే వారంతా హేతువులను కోరుతున్నట్లే లెక్క. ఇది ప్రగతికి మొట్టు’’ అని రావిపూడి అన్నారు.

‘‘మా కృషి కొంత ఫలితాన్నిచ్చింది. సమాజంలో పలు మార్పులు జరుగుతున్నాయి. అయినా మూఢత్వం కొనసాగుతోంది. రాజకీయ పార్టీల విధానాల్లోనే అది ఉంది. ఏకంగా ప్రధానమంత్రి స్థాయి నేతలు కూడా సైన్స్ కాంగ్రెస్ సాక్షిగా చేసిన ప్రసంగాలు అశాస్త్రీయతను పెంచేందుకు మూలం అవుతున్నాయి. ప్రజల్లో మార్పు వస్తుంది. దానికి ఐదేళ్ళు, పదేళ్లు, వందేళ్లు అని చెప్పలేం. ఎప్పుడయినా సమూల మార్పు వచ్చి, శాస్త్రీయతతో సమాజం శాంతియుతంగా సాగేందుకు మార్గం ఏర్పడుతుంది’’ అని ఆయన అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘానికి 1989 వరకు ఆయన అధ్యక్షులుగా పనిచేశారు. 1988, 1996ల్లో కవిరాజు త్రిపురనేని అవార్డులు ఆయనకు దక్కాయి.

1992లో తాపీ ధర్మారావు అవార్డును పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నారు.

ఇంకొల్లులో రావిపూడి ప్రారంభించిన కేంద్రంలో నిత్యం హేతువాద ప్రచార కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో గ్రంథాలయం, సమావేశ మందిరం వంటివి నిర్మించారు.

యువతను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్టు ప్రస్తుతం ఈ కేంద్రం నిర్వహణా భాద్యతలు చూస్తున్న మేడూరి సత్యన్నారాయణ బీబీసీతో అన్నారు.

‘వెంకటాద్రి వారసత్వాన్ని కొనసాగిస్తాం’

వ్యక్తి సుఖజీవనమే సమాజాభివృద్ధికి మూలం అని చెబుతూ హేతువాద, మానవతావాద దృక్పథంతో మార్గదర్శనం చేసిన రావిపూడి వెంకటాద్రి వారసత్వాన్ని తామంతా కొనసాగిస్తామని మేడూరి సత్యన్నారాయణ అన్నారు.

‘‘సత్యాన్వేషణ మానవాభ్యుదయానికి మూలం. వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకొనే ఆటంకాలన్నీ తొలగిపోవాలని రావిపూడి వెంకటాద్రి ఆశిస్తున్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తాం. దానికి అనుగుణంగా హేతువాది పత్రికను నడుపుతున్నాం. దాని ముద్రణ, పంపిణీ అన్నీ ఇంకొల్లు నుంచే చేస్తున్నాం. విద్యార్థి దశలోనే హేతువాద దృక్పథం పెంచడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. మంచి స్పందన వస్తోంది. మా కేంద్రం నుంచి అవగాహన పెంచుకుని వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారంతా రిటైర్మెంట్ తర్వాత మళ్లీ ఈ కార్యక్రమాల్లోకి వస్తున్నారు. తద్వారా రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ ఆయన మార్గదర్శకత్వంలో సాగుతోంది’’ అంటూ వివరించారు.

ప్రస్తుతం చీరాలలో కుమార్తె ఇంట్లో ఉంటున్న రావిపూడి వెంకటాద్రి నేటికీ రచనా వ్యాసాంగం కొనసాగిస్తున్నారు.

ఆయనకు వందేళ్లు నిండుతున్న సందర్భంగా పలు కార్యక్రమాలను రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ నిర్వహిస్తోంది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)