అమెరికా అమాయకులను చంపేసిందా? కాబుల్ చివరి డ్రోన్ దాడిలో ఏం జరిగింది?

కాబుల్‌లో అమెరికా క్షిపణి దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్షిపణి దాడి ఒక్కటే జరిగిందని, ఆ తర్వాత ఎలాంటి పేలుళ్లూ జరగలేదని స్థానికులు చెబుతున్నారు.. అమెరికా వాదన మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది
    • రచయిత, రియాలిటీ చెక్ టీం
    • హోదా, బీబీసీ న్యూస్

ఆగస్టు 29న కాబుల్ ఎయిర్‌పోర్ట్‌కు ఉత్తర దిశగా అమెరికా చేసిన డ్రోన్ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన అనేక మంది సభ్యులు మరణించారు. ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్లు అమెరికా ప్రకటించింది. కానీ, సమాధానం దొరకని అనేక ప్రశ్నలను మిగిల్చింది.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) స్థానిక అనుబంధ సంస్థ నుంచి ముప్పు పొంచి ఉందని వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ దాడిని చేసినట్లు అమెరికా చెబుతోంది. ప్రస్తుతం ఈ దాడి గురించి విచారణ చేస్తున్నట్లు చెబుతోంది.

అయితే, ఈ దాడి గురించి స్థానికులు అందించిన వివరాలు యూఎస్ అధికారులు చెబుతున్న వివరాలకు వ్యతిరేకంగా ఉన్నాయి.

తాజాగా అమెరికా మీడియా సైతం అనేక ప్రశ్నలను సంధిస్తోంది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశామంటున్న అమెరికా వాస్తవానికి రోజువారీ విధుల్లో ఉన్న ఒక సహాయ కార్మికుడిని చంపేసిందని న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పేర్కొన్నాయి.

కాబుల్‌లో అమెరికా క్షిపణి దాడి

ఈ దాడికి అమెరికా ఇస్తున్న వివరణ ఏంటి?

హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి పొంచి ఉన్న ముప్పును నివారించడానికి ఇస్లామిక్ స్టేట్ అఫ్గానిస్తాన్ శాఖకు చెందిన వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు అమెరికా చెబుతోంది.

తొలుత కారుపై దాడి జరిగింది. తర్వాత ఆ చుట్టు పక్కల మరి కొన్ని పేలుళ్లు సంభవించాయని చెబుతూ, సరైన లక్ష్యం పైనే దాడి చేశామని అమెరికా సమర్థించుకుంటోంది.

"దాడి చేసిన వాహనంలో అధిక మోతాదులో పేలుడు పదార్ధాలున్నట్లు మొదటి దాడి తర్వాత చోటు చేసుకున్న శక్తివంతమైన, గణనీయమైన పేలుళ్లు సూచిస్తున్నాయి" అని ఆగస్టు 29న అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

మొదటి దాడి తర్వాత పేలుళ్లు కచ్చితంగా జరిగాయని ఆ మరుసటి రోజే యూఎస్ రక్షణ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.

కానీ, ఈ విషయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించినప్పుడు, ఆయన సమాధానం ఇవ్వలేకపోయారు.

వీడియో క్యాప్షన్, అమెరికా అమాయకులను చంపేసిందా? అఫ్గాన్‌లో జరిపిన చివరి డ్రోన్ దాడిలో ఏం జరిగింది?

గ్యాస్ సిలిండర్ కానీ, మరేదైనా పేలడం కాకుండా దాడి చేసేందుకు సమకూర్చిన పేలుడు పదార్ధాల వల్లే తర్వాత దాడులు చోటు చేసుకున్నాయనే నమ్మకం తమకు ఉందని జనరల్ హ్యాంక్ టేలర్ చెప్పారు.

అంతకు మూడు రోజుల క్రితం, అంటే ఆగస్టు 26న కాబుల్ విమానాశ్రయం దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మందికి పైగా పౌరులు 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. ఈ దాడిని స్థానిక ఇస్లామిక్ స్టేట్ గ్రూపు తామే నిర్వహించినట్లు చెబుతోంది.

అమెరికా డ్రోన్ దాడిలో అజ్మల్ అహ్మదీ కుటుంబ సభ్యులు చనిపోయారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా డ్రోన్ దాడిలో అజ్మల్ అహ్మదీ కుటుంబ సభ్యులు చనిపోయారు

ఈ దాడి గురించి స్థానికులు ఏమి చెబుతున్నారు?

డ్రోన్ దాడి జరిగిన ప్రదేశం కాబుల్ ఎయిర్ పోర్టుకు దగ్గరలో అధిక నిర్మాణాలున్న ఖాజే బుఘ్రాలో జరిగింది. ఈ దాడి చేయడానికి అమెరికా చెబుతున్న కారణాలను స్థానికులు ఖండించారు.

అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం సరైంది కాదని, ఆ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ లేదని స్థానికులు విలేఖరులకు చెప్పారు.

అహ్మదీ కుటుంబానికి చెందిన సభ్యుడు ఆయన ఇంటి బయట కారు పార్క్ చేస్తుండగా జరిగిన దాడిలో ఆరుగురు పిల్లలు మరణించారని చెప్పారు.

ఆ ప్రదేశాన్ని బీబీసీ జర్నలిస్టులు సందర్శించారు. కారు పై జరిగిన దాడి తర్వాత తిరిగి ఎటువంటి పేలుళ్ల శబ్దాలు వినలేదని స్థానికులు చెప్పినట్లు బీబీసి ప్రతినిధి మాలిక్ ముదస్సర్ చెప్పారు.

ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఇతర మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు అహ్మదీ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఒక క్షిపణి కారులోంచి చొచ్చుకుపోయి కింద పడి పేలిపోయిందని వారు చెప్పారు. అక్కడ ఒక్క పేలుడు మాత్రమే సంభవించిందని, దగ్గర్లో పార్క్ చేసిన ఒక వాహనం ఆ పేలుడులో పూర్తిగా ధ్వంసమయిందని చెప్పారు.

కొంత మంది కుటుంబ సభ్యులు వారి ఇంటి ఆవరణలోనే ఉన్న గ్యాస్ సిలిండర్లను చూపించి, దాడి చేసిన కారులో బాంబులు ఉంటే అవెందుకు పేలలేదని ప్రశ్నించారు.

అమెరికా వాదనే నిజమైతే చుట్టుపక్కల భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతినాలని, కానీ అలా జరగలేదని నిపుణులు అంటున్నారు
ఫొటో క్యాప్షన్, అమెరికా వాదనే నిజమైతే చుట్టుపక్కల భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతినాలని, కానీ అలా జరగలేదని నిపుణులు అంటున్నారు

ఆధారాలు ఏమి చెబుతున్నాయి?

తొలి సారి పేలుడు జరిగిన తర్వాత ఆ ప్రాంతం నుంచి వస్తున్న పొగను చూస్తుంటే, వరుస పేలుళ్లు సంభవించినట్లు పేలుడు జరిగిన ప్రాంతం దగ్గర నుంచి తీసిన వీడియో సూచిస్తోంది.

అయితే, ఆ వీడియో చూస్తుంటే ఇది కేవలం కారులో మంటలు ఏర్పడిన తర్వాత దాడి ఒకసారి మాత్రమే జరిగినట్లు అనిపిస్తోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నిపుణుడు బ్రెయిన్ కాస్ట్నర్ చెప్పారు. అక్కడకు దగ్గర్లో ఉన్న మరో వాహనంలో ఇంధన ట్యాంకు పేలిపోయి ఉండవచ్చని అన్నారు.

"రెండవ సారి పేలుడు సంభవించినట్లు ఆధారాలు లేవు" అని ఆయన చెప్పారు.

"అక్కడ మరో పేలుడు సంభవించి ఉండి ఉంటే, ఆ ప్రాంతంలో మరింత విధ్వంసం జరిగి ఉండేదని నేను భావిస్తున్నాను" అని అన్నారు.

అక్కడకు దగ్గర్లో ఉన్న వాహనం, భవనాలకు తేలికపాటి నష్టం వాటిల్లినట్లు కనిపిస్తోందని అన్నారు.

ఆ వీడియోలో కనిపిస్తున్న నల్లని పొగ వాహనం నుంచి చెలరేగే పెట్రోల్ మంటలను తలపిస్తోందని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"అఫ్గానిస్తాన్‌లో ఉన్న ఇస్లామిక్ స్టేట్.. బాంబుల్లో ఎక్కువగా అమ్మోనియం నైట్రేట్ వాడుతుందని ప్రసిద్ధి చెందింది. దీనిని వ్యవసాయ ఎరువుతో తయారు చేయవచ్చు" అని బీబీసీ సెక్యూరిటీ ప్రతినిధి ఫ్రాంక్ గార్డనర్ చెప్పారు.

కాబుల్‌లో అమెరికా క్షిపణి దాడి

ఫొటో సోర్స్, Getty Images

అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ స్టేట్ అంటే ఎవరు?

ప్లాస్టిక్ పేలుడు పదార్ధాలు వాడి శక్తివంతమైన బాంబులు తయారు చేయాలంటే, మిలిటరీ సరఫరాల నుంచి తెప్పించాలి.

అమ్మోనియం నైట్రేట్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పేలుతుంది. ఉదాహరణకు మంటలు చెలరేగుతున్నప్పుడు, లేదా మంటను రగిల్చే మరొక ప్రేరకం ఉన్నప్పుడు, లేదా అధిక ఉష్ణోగ్రతల్లో మాత్రమే పేలుతుంది.

పేలుడు జరిగిన ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా ప్లాస్టిక్ పేలుడు పదార్ధాలు పేలే అవకాశం ఉంది.

దాడి చేసిన వాహనంలో ఎటువంటి పేలుడు పదార్ధాలున్నాయని అనుకుంటున్నారో, వారి లక్ష్యం ఎవరో యూఎస్ రక్షణ శాఖను వివరణ అడిగాం. కానీ, ఇప్పటి వరకు వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానమూ రాలేదు.

ఈ పేలుడుకు సంబంధించి విచారణ జరుగుతున్నట్లు జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లీ సెప్టెంబరు 1న చెప్పారు.

కారులో పేలుడు పదార్ధాలు ఉండటం వల్ల అక్కడ రెండవ సారి పేలుళ్లు సంభవించినట్లు తీర్మానించడం సమర్ధనీయమేనని అన్నారు.

ఆ దాడిలో మరణించిన వ్యక్తుల్లో కచ్చితంగా ఐసిస్ మిలిటెంట్ ఒకరు ఉన్నట్లు చెప్పారు.

"ఈ దాడిలో ఇతరులు మరణించారు. వారెవరో మాకు తెలియదు. అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ, ఇప్పుడు మాత్రం మేము సరైన విధానాలనే పాటించామని అనుకుంటున్నాం" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)