INDvsENG: 21 మంది ఆటగాళ్లతో ఇంగ్లండ్ వెళ్లిన భారత క్రికెట్ జట్టు 11 మందిని మైదానంలోకి దించలేకపోవడానికి కారణం ఏంటి?

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, PA Media

    • రచయిత, స్టీఫెన్ షిమిల్ట్
    • హోదా, బీబీసీ స్పోర్ట్స్

భారత్, ఇంగ్లండ్ మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగాల్సిన ఐదో మ్యాచ్ రద్దు కావడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈ సిరీస్‌లో క్లైమాక్స్‌ను చూసే అవకాశం కోల్పోయామని అనుకున్నారు.

ముఖ్యంగా ఈ మ్యాచ్‌ చూసేందుకు పనులన్నీ వదిలేసి ఓల్డ్ ట్రాఫోర్డ్‌కు వచ్చిన వారు మరింత అసంతృప్తికి గురయ్యారు.

ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దుతో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి ఇంగ్లండ్, భారత్ క్రికెట్ బోర్డులు చాలా చాకచక్యంగా, రాయబార భాషలో సమాధానాలు ఇస్తున్నప్పటికీ, అనుమానాలు మాత్రం తీరట్లేదు.

ఈ ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే ఇప్పుడు సమాధానాలు చెప్పగలం. మరికొన్నింటికి సమాధానాలు రావాలంటే మాత్రం చాలా సమయం పట్టొచ్చు.

జో రూట్, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, PA Media

ఏం జరిగింది?

గతవారం భారత్ నాలుగో టెస్టును గెలుచుకున్న సమయంలో జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మరో ముగ్గురు కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.

గురువారం ఫిజియోథెరపిస్ట్‌కు కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో టీమిండియా ప్రాక్టీస్‌ రద్దు చేసింది.

అయితే, క్రికెటర్లందరికీ నెగెటివ్ వచ్చింది.

టెస్ట్ మ్యాచ్ కొనసాగుతుందని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ - ఈసీబీ ప్రకటించింది. గురువారం రాత్రి వరకు దీనిపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి.

అయితే, శుక్రవారం మ్యాచ్ మరో రెండు గంటల్లో ప్రారంభం కాబోతోందనగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి టెస్టును కోల్పోయిందని, సిరీస్ 2-2తో డ్రా అయినట్లు ఈసీబీ తొలుత చెప్పింది. ఆ తర్వాత ఆ ప్రకటనను సవరించింది.

దాంతో ఇప్పుడు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మొదటి నాలుగు రోజులకు దాదాపు 80వేల టికెట్లు ఇదివరకే అమ్ముడయ్యాయి. ఇప్పుడు వాళ్లందరికీ పూర్తి రిఫండ్ ఇస్తారని చెబుతున్నారు.

అయితే, ఈ సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు కొందరు సెలవులు పెట్టి వచ్చారు. ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. హోటళ్లలో రూంలు సైతం బుక్ చేసుకున్నారు. ఇప్పుడు వారికి టికెట్ డబ్బులను పూర్తిగా వెనక్కి ఇస్తామని చెప్పినంత మాత్రాన వారి అసంతృప్తి, కోపం చల్లారదు.

మ్యాచ్‌ రద్దు చేయడం మొత్తం క్రికెట్ ప్రపంచానికి చెడు సంకేతాలు పంపిస్తుంది. ఈసీబీ, ఓల్డ్ ట్రాఫోర్డ్‌, బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లపై ఆర్థికంగా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

ఇంగ్లండ్ టీమ్

ఫొటో సోర్స్, Getty Images

మ్యాచ్‌ రద్దు చేయడం మంచి నిర్ణయమేనా?

మీరు ఎవర్ని అడుగుతున్నారన్న దానిపై ఈ ప్రశ్నకు సమాధానం అధారపడి ఉంటుంది.

ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైంది ఒక్క టీమిండియా ప్లేయర్‌కి కూడా కరోనా సోకలేదు. కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా 21 మంది ప్లేయర్లు ఇంగ్లండ్‌ వచ్చారు.

అయితే, గత జూన్ నుంచి టీమిండియా పర్యటనలోనే ఉంది. క్రీడాకారులపై పెట్టిన ఆంక్షలు ఇతర సిరీస్‌లతో పోలిస్తే అంత కఠినంగా లేవు. అయితే, సాధారణ ప్రజల మాదిరిగా వాళ్లు స్వేచ్ఛగా తిరగలేరు.

ఇంగ్లండ్‌ జట్టుకు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. గత డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ పాక్షికంగా వాయిదా పడింది. జట్టు సభ్యులకు కోవిడ్ సోకిందని భావించి, ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆటగాళ్ల మానసిక ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హరిసన్ శుక్రవారం బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్‌లో చెప్పారు.

కోవిడ్‌ మన పరిసరాల్లోకి చొరబడినప్పుడు, అది చాలా వేగంగా వ్యాపిస్తుంది. గతంలో మనం కూడా చూశాం అని ఆయన అన్నారు.

చాలామంది టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబాలతో పాటు ప్రయాణిస్తున్నారు. దాంతో కోవిడ్ వారికి కూడా సోకుతుందేమో అన్న భయాలు నెలకొన్నాయి.

టీమిండియా జట్టు సభ్యులు చాలామంది తమ కుటుంబంతోపాటే ఇంగ్లండ్‌కు వచ్చారని మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా అన్నారు.

ఇదే వారిని ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవేళ ఆటగాడితో పాటు వాళ్ల కుటుంబానికి కూడా కోవిడ్ సోకితే పరిస్థితి ఏంటని వాళ్లు కంగారు పడుతున్నారని దాస్ గుప్తా చెప్పారు.

అయితే, దక్షిణాఫ్రికాలో ఇంగ్లండ్ జట్టు తన బాధ్యతను నిర్వర్తించినట్లుగానే ఇప్పుడు మ్యాచ్‌ను ముగించే బాధ్యత టీమిండియాపై ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డారు.

ఆ సమయంలో దక్షిణాఫ్రికాను ఇంగ్లంగ్ నిరాశపరిచిందని నేను అనుకున్నాను. ఆ తర్వాత ఇంగ్లండ్‌ మళ్లీ ఆడింది. ఇప్పుడు టీమిండియా కూడా అదే పని చేస్తుందని నమ్ముతున్నానని ఆయన చెప్పారు.

భారత జట్టు ఇంగ్లండ్‌ను నిరాశపరిచిందని ఫీలవుతున్నాను అని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇప్పుడేం జరుగుతుంది?

ఇప్పటికిప్పుడు పెద్దగా ఏమీ జరగకపోవచ్చు.

భారత జట్టు సభ్యులు, మరికొంతమంది ఇంగ్లండ్ క్రికెటర్లు సెప్టెంబర్ 19 నుంచి తిరిగి ప్రారంభంకాబోతున్న ఐపీఎల్ కోసం వెళ్తారు.

అయితే, టెస్ట్ సిరీస్‌ చిక్కుముడిని ఎలా పరిష్కరిస్తారన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది.

సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి టెస్టును కోల్పోయిందనే తన వాదనను ఈసీబీ వెంటనే సవరించుకోవడం ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎందుకంటే భారత్ చివరి టెస్టును కోల్పోతే, మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినట్లు అవుతుంది. అప్పుడు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌ షిప్‌లో ఇంగ్లండ్‌కు కూడా పాయింట్లు వస్తాయి.

ఈ మ్యాచ్ ఎలా, ఎందుకు ఆపేశారన్న అంశం కూడా ఇన్సూరెన్సు విషయంలో ఈసీబీపై ఆర్థికంగా ప్రభావం చూపిస్తుంది.

ఈ మ్యాచ్‌ ఫలితం ఇక్కడ ముఖ్యమైన విషయంగా కనిపించకపోవచ్చు. కానీ వందల కోట్ల పరిహారాన్ని నిర్ణయించాల్సి ఉంది. దానికోసం మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని బీబీసీ క్రికెట్ కరస్పాండెంట్ జొనాథన్ అగ్నెవ్ అన్నారు.

మ్యాచ్ ఫలితం ఇవాళ తేలే విషయం కాదు. దాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ - ఐసీసీ నిర్ణయిస్తుందని హరిసన్ చెప్పారు.

ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. కానీ అది ఈ సిరీస్‌లో భాగంగా కంటే అదొక ప్రత్యేక టెస్ట్ మ్యాచ్‌గా ఉండొచ్చు.

అయితే, ఆ మ్యాచ్ ఎప్పుడు ఆడతారన్న దానిపై స్పష్టత లేదు.

మూడు ట్వంటీ20లు, మూడు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడటానికి వచ్చే వేసవిలో టీమిండియా తిరిగి ఇంగ్లండ్‌ వెళ్తోంది.

కానీ ఇంగ్లండ్ జట్టు షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. అంటే ఈ మ్యాచ్ ఆడటానికి చాలా మార్పులు చేయాల్సి రావొచ్చు.

క్రికెట్ ఆడుతున్న ఫ్యాన్స్

ఫొటో సోర్స్, PA Media

ఇదంతా ఐపీఎల్ కోసమేనా?

గత మే నెలలో భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఐపీఎల్‌ను వాయిదా వేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌లో వచ్చేవారం మళ్లీ ఇది ప్రారంభం కాబోతోంది.

అది కారణం కాకపోతే, ఐదో టెస్ట్ మ్యాచ్‌ను ఆలస్యం చేయడానికి కారణం ఏముంటుంది? పైగా ఐపీఎల్‌ ఆడేందుకు వీలుగా సిరీస్‌లో కొన్ని మార్పులు చేయాలని బీసీసీఐ అనధికారికంగా విజ్ఞప్తి చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే, ఫైనల్ మ్యాచ్ రద్దు కావడానికి దీనికి సంబంధం ఉందా అన్న దానిపై స్పష్టత లేదు.

ఐపీఎల్ అనేది కేవలం ఆటగాళ్లు, బీసీసీఐకి మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్‌కు పెద్ద ఆర్థిక వనరు.

ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడలేకపోతారని బీసీసీఐ భయపడి ఉంటుందని ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డారు.

కోవిడ్ బారిన పడితే ఐపీఎల్ ఆడే అవకాశం ఉండదని ఆటగాళ్లు భావించి ఉంటారు.

ఇదంతా ఐపీఎల్ డబ్బుల కోసమే. బీసీసీఐతో విబేధించడానికి ఈసీబీ ఇష్టపడదు అని ఆయన అన్నారు.

అయితే, రద్దైన మ్యాచ్‌కు ఐపీఎల్‌కు మధ్య లింకు పెట్టడం సరికాదని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హరిసన్ అన్నారు. ఐపీఎల్‌ను రీషెడ్యూల్ చేయడం వల్ల తలెత్తిన ఇబ్బంది ఇది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)