ఆంధ్రప్రదేశ్: 'సినిమా వ్యాపారం మాది, ప్రభుత్వం టికెట్లు అమ్ముకుంటే ఎలా?' - కొత్త జీవోపై కలకలం

ఏపీ సినీ టికెట్ల అమ్మకం

ఫొటో సోర్స్, fb/Andhra Pradesh CM

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల అమ్మకాలను నియంత్రించాలన్న ప్రభుత్వ ఆలోచన కొత్త చర్చకు దారి తీసింది.

ఈ తాజా ఉత్తర్వు కేవలం సినీ పరిశ్రమ ఆర్థిక వ్యవహారాలే కాదు, సినీ పరిశ్రమతో జగన్ బంధంపై కూడా కొత్త అనుమానాలను లేవనెత్తుతోంది.

ఆంధ్రాలో ఎవరు సినిమా చూడాలన్నా గవర్నమెంటు ప్రారంభించే ఒక వెబ్ సైట్ ద్వారానే టికెట్ కొనేలా ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. దానికి అనుగుణంగా జీవో నంబర్ 782 ఇచ్చింది. ఈ వెబ్‌సైట్‌ను ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.

ఈ వ్యవహారంపై ఒక కమిటీ వేశారు. అందులో హోం శాఖ, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శులు, ఐ అండ్ పిఆర్ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ ప్రతినిధి, ఏపీటీఎస్ ఎండీ, ఐటి శాఖ ప్రత్యేక కార్యదర్శి, కృష్ణా గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఇందులో ఉంటారు. సినిమా రంగానికి సంబంధించి ఇంత కీలకమైన కమిటీలో ఆ రంగం నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేరు.

అయితే, ఆ వెబ్ సైట్ విధి విధానాలు ఇంకా ఖరారు కాకపోయినా, టికెట్ల డబ్బు నెలకోసారి మాత్రమే చెల్లిస్తారన్న వార్తలు సినీ రంగంలో కలకలం రేపాయి. నిజానికి ఈ జీవో ఆగష్టు 31న విడుదలైనా, అది రెండు రోజుల క్రితమే బయటకు వచ్చింది.

థియేటర్

ఫొటో సోర్స్, Getty Images

అదే సమయంలో సీఎం జగన్ తో సినీ పరిశ్రమ పెద్దల సమావేశం సెప్టెంబరు 4న జరగాల్సి ఉంది. అది రద్దయింది. సీఎం ఈ సమావేశాన్ని రద్దు చేశారా లేక పరిశ్రమ వర్గాలే సీఎం సమావేశానికి రాలేదా అనేది రహస్యంగా ఉండిపోయింది.

కరోనా సమయం నుంచి సినిమా పరిశ్రమ వారు ప్రభుత్వాలను చాలా సాయం అడుగుతున్నారు. ఆంధ్రలో టికెట్ల ధర, సీట్ల పరిమితి సమస్యలు ఇంకా తేలలేదు.

ఈ సమయంలో అసలు పరిశ్రమ పాత్రలేని కమిటీ నియామకం, జగన్ తో సినీ పెద్దల సమావేశం రద్దు కావడం చూస్తుంటే సినీ పరిశ్రమకూ, ఆంధ్ర ప్రభుత్వానికీ మధ్య పెరుగుతోన్న గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది.

నిజానికి ఇదే తరహా వెబ్ సైట్ ప్రతిపాదనలను 2019లో తమిళనాడులో ఒక మంత్రి ముందుకు తెచ్చారు. దానికి అప్పటి సినీ పెద్దలు కొందరు మద్దతిచ్చారు. కానీ, ఎందుకో అది అక్కడ అమలు కాలేదు. మళ్లీ ఇప్పుడు ఆంధ్రలో అలాంటి పద్ధతి రాబోతోంది.

అయితే, సినీ పరిశ్రమకు సంబంధించిన ఇంత కీలక అంశంపై తెలుగు సినిమాలో పెద్ద వారుగా పేరున్న నిర్మాతలు కానీ, నటులు కానీ ఎవరూ పెదవి విప్పడం లేదు. వారు స్వతహాగా మాట్లాడలేదు. మీడియాతో కూడా మాట్లాడడం లేదు.

ఏపీ సీఎంను కలిసిన చిరంజీవి

ఫొటో సోర్స్, UGC

పరిశ్రమలో భిన్న స్వరాలు

దీనిపై పరిశ్రమలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది అందరికీ నష్టం అని కొందరు చెబుతుంటే, అంత నష్టం ఉండకపోవచ్చని కొందరి మాట.

"దీని వల్ల సినిమా పరిశ్రమ నాశనం అయిపోతుంది. వాస్తవానికి పరిశ్రమలో ఎవరి దగ్గరా ఎప్పుడూ డబ్బు ఫుల్ గా ఉండదు. థియేటర్ల దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ డబ్బు అడ్వాన్స్ తీసుకుని అది నిర్మాతకు కట్టి సినిమా తెచ్చుకుంటారు. ఇప్పుడు నెల రోజుల పాటూ గవర్నమెంటు దగ్గర ఆ డబ్బు ఆగిపోతే అడ్వాన్సులు, మెయింటెనెన్సులు ఎలా కడతారు? పైగా థియేటర్ ఓనర్ నుంచి నిర్మాత వరకూ జరిగే వ్యాపారంలో ప్రభుత్వం ప్రత్యక్షంగా పార్టనర్ అవడం ఏంటి? సినిమా ఏమీ నిత్యావసర వస్తువు కాదు. దీనికి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రభుత్వం దీన్ని కొంత వరకూ నియంత్రించవచ్చు కానీ, నేరుగా తానే వ్యాపారం చేయకూడదు.'' అని బీబీసీతో అన్నారు పదుల సంఖ్యలో చిన్న సినిమాలు తీసిన నిర్మాత సత్యనారాయణ.

ఇదే జరిగితే ఎవరూ సినిమా తీయలేరు, కొనలేరు, థియేటర్లో వేయలేరు. వాస్తవానికి చిన్న సినిమా వారికి ఎలానూ ఎప్పుడూ థియేటర్లు దొరకవు. అలాగే, చిన్న సినిమాలు చూడ్డానికి ఎవరూ థియేటర్లకు రారు. దీని వల్ల పెద్ద సినిమాలకు భారీ నష్టం. అలాగే మొత్తం పరిశ్రమకు కూడా నష్టమే అన్నారు ఆయన. ఈ నిర్ణయం కోర్టులో నిలబడదు అంటున్నారు సత్యనారాయణ.

అయితే ఈ తాజా విధానం వల్ల పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలకు ఇబ్బందేనని ఒప్పుకున్న ఫిలిం చాంబర్ కార్యదర్శి ప్రసన్న, దీనివల్ల ఆడియెన్స్ కి మాత్రం లాభం జరుగుతుందని అంటున్నారు.

"ఈ పద్ధతి వల్ల విచ్చలవిడిగా రేట్లు వసూలు చేయడం ఉండదు. ఫిక్స్ చేసిన ధర ఉంటుంది. అప్పుడు ఆడియెన్స్‌కి భారం తగ్గి సినిమా ఎక్కువ సార్లు చూడ్డానికి, ఎక్కువ సినిమాలు చూడ్డానికి అవకాశం దొరుకుతుంది. రిలీజ్ అప్పుడు కూడా రూ.500, రూ.1000 బదులు అదే వంద రూపాయల టికెట్ ఉంటుంది. ఆడియన్స్ ఆ మిగిలిన డబ్బును ఇతర సినిమాలకు ఖర్చు చేస్తారు'' అన్నారు ప్రసన్న కుమార్.

ఈ పద్ధతి వల్ల చిన్న సినిమాలకు లాభం ఉంటుందని ఆయన చెబుతున్నారు. అంతేకాకుండా, ప్రైవేటు వెబ్ సైట్లు భారీ ఎత్తున ఫీజులు తీసుకుంటూ, నిర్మాతలు, థియేటర్లపై పెత్తనం చేస్తున్నాయనీ, వారి పెత్తనం కూడా తగ్గుతుందని అంటున్నారు.

నెల రోజుల పాటూ డబ్బు ఇవ్వకుండా ఆపడం మినహాయిస్తే, ఈ పద్ధతి వల్ల నష్టేమేమీ లేదనేది ఆయన వాదన.

"పెద్ద నిర్మాతల భారీ వసూళ్లు తగ్గుతాయి. పెద్ద హీరోల రెమ్యూనరేషన్లపై కూడా ప్రభావం పడుతుంది" అంటారు ప్రసన్న కుమార్.

ఏపీ సినీ టికెట్ల అమ్మకం

ఫొటో సోర్స్, Reuters

పన్నులో పారదర్శకత

అన్ని వ్యాపారాల్లో ఉన్నట్టే సినిమా వ్యాపారంలో కూడా జీఎస్టీ పన్ను చెల్లింపుల్లో పారదర్శకత లేదు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రలో థియేటర్లు ఎక్కువ. రిలీజ్ సమయంలో టికెట్ ధరలు పెంచడం కూడా ఎక్కువే. కానీ, తెలంగాణ కంటే ఆంధ్రలో జీఎస్టీ వసూళ్లు చాలా తక్కువ అవుతున్నాయి.

రాయలసీమలో జీఎస్టీ వసూళ్లు చాలా తక్కువని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సినిమా జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

"ఈ కొత్త విధానం వస్తే పన్ను వసూలు విషయంలో పారదర్శకత వస్తుందని వారు చెబుతున్నారు. బహుశా ప్రభుత్వం కూడా ఈ ఉత్తర్వు తేవడం వెనుక జీఎస్టీ కోణం కూడా ఉండవచ్చు. ఆంధ్రా ప్రభుత్వం కోట్ల రూపాయలు కోల్పోతోంది. కానీ, ఎంతైనా సినిమా పరిశ్రమను కూడా ఈ విధానంలో భాగస్వామ్యం చేసుంటే బాగుడేంది" అని సదరు జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

ప్రేక్షకులు తక్కువ బడ్జెట్లో ఎక్కువ సినిమాలు చూడడం ద్వారా చిన్న సినిమాలకు లాభం అనీ, పెద్ద నిర్మాతల విచ్చలవిడితనం, భారీ రెమ్యూనరేషన్లు, వేల రూపాయల టికెట్ ధరలు పోతాయనీ ప్రసన్న అంటున్నారు.

ఏపీ సినీ టికెట్ల అమ్మకం

ఫొటో సోర్స్, Getty Images

అయితే, మొత్తం సినిమా రంగం పట్ల ప్రభుత్వ విధానం ఏంటో అర్థం కావడం లేదని క్షేత్ర స్థాయిలో థియేటర్లు నిర్వహించే వారు మాత్రం గగ్గోలు పెడుతున్నారు.

"ఇప్పటికే కరోనాతో చాలా ఇబ్బంది పడ్డాం. కరెంటు బిల్లు కూడా తగ్గించలేదు. లక్షల రూపాయలు కడుతున్నాం. టికెట్ ధరల నియంత్రణ దేశంలో ఎక్కడా లేనంత ఉంది. వాటిపై క్లారిటీ కోసం మేం ఎదురు చూస్తున్న సమయంలో ఈ జీవో వచ్చింది. అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పటికే బుక్ మై షో, పేటీఎం వంటి వారి నుంచి చాలా మంది థియేటర్ల యజమానులు పెద్ద ఎత్తున అడ్వాన్సులు తీసుకున్నారు. వాళ్లు టికెట్ డబ్బులు ఒకట్రెండు రోజుల్లో వేసేస్తారు. కానీ గవర్నమెంటు నెల రోజులు టికెట్ డబ్బు ఉంచేసుకుంటే వ్యాపారం సాగదు.'' అని రాజమండ్రిలో అనుశ్రీ థియేటర్ల యజమాని, తెలుగు ఫిలిం చాంబర్ ఈసీ మెంబర్ సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

థియేటర్ల వ్యవస్థపై అవగాహన లేని అధికారుల వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

''రైల్వేలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది కాబట్టి రైలు టికెట్లు వారు అమ్ముతారు. మేం పెట్టుబడి పెట్టే వ్యాపారానికి వాళ్లు టికెట్లు అమ్మడం ఏంటి?'' అని ప్రశ్నించారు.

అయితే, ఈ మొత్తం వ్యవహారంపై సినీ పెద్దలు ఇంకా స్పందించాల్సి ఉంది. ''ప్రస్తుతం వాళ్లు బయటకేం మాట్లాడకపోవచ్చు. అది కొత్త సమస్యలు తెచ్చుకోవడమే" అని ఒక సీనియర్ ఫిలిం జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం సీఎం జగన్ - సినీ పరిశ్రమ పెద్దల మధ్య రద్దయిన మీటింగ్ మళ్లీ జరిగితేనే చాలా విషయాలపై క్లారిటీ వస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)