ఇథియోపియా: ఈ దేశంలో సంవత్సరానికి 13 నెలలు.. వీరి క్యాలెండర్ ఏడేళ్లు వెనక్కి ఎందుకుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లూసీ ఫ్లెమింగ్
- హోదా, బీబీసీ న్యూస్
ఇథియోపియా ప్రజలు సెప్టెంబరు 11న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
పెరుగుతున్న ధరలు, దేశంలోని ఉత్తర భూభాగంలో రగులుతున్న యుద్ధం, ఆకలి మంటల నడుమ ఈ వేడుకలను విందు, వినోదాలతో సంబరంగా జరుపుకున్నాయి.
ఇథియోపియాకున్న వినూత్నమైన క్యాలెండర్, సాంస్కృతిక వారసత్వం గురించి ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం.
1) ఇక్కడ సంవత్సరానికి 13 నెలలు
ఇథియోపియాలో సంవత్సరానికి 13 నెలలు ఉంటాయి. అంతేకాదు వీరి క్యాలెండరు కూడా భిన్నంగా ఉంటుంది. పశ్చిమ దేశాల క్యాలెండరుతో పోలిస్తే, వీరి క్యాలెండరు 7 సంవత్సరాల 8 నెలలు వెనక ఉంటుంది.
నిన్న (శనివారం) వారికి 2014 మొదలయింది. వారు జీసస్ జన్మదినాన్ని భిన్నంగా లెక్కించడం వల్ల ఇలా జరిగింది.
క్రీస్తుశకం 500లో క్యాథలిక్ చర్చి క్రీస్తు జననాన్ని లెక్కించే విధానంలో సవరణ చేసినప్పటికీ, ఇథియోపియా చర్చి మాత్రం పాత లెక్కల్లో ఎటువంటి మార్పూ చేయలేదు.
అంటే, పాశ్చాత్య క్యాలెండరును అనుసరించి సెప్టెంబరు 11 వారి కొత్త సంవత్సరం అవుతుంది. లీపు సంవత్సరాల్లో ఇది సెప్టెంబరు 12న వస్తుంది.

ఫొటో సోర్స్, AFP
ప్రతీ నెలలో ఎన్ని రోజులుంటాయో ఇథియోపియా పిల్లలు ఇతర దేశాల పిల్లల మాదిరిగా నేర్చుకునే పని లేదు.
ఇథియోపియాలో ఈ లెక్కలు చాలా సరళంగా ఉంటాయి. సంవత్సరంలో 12 నెలల్లోనూ 30 రోజులే ఉంటాయి. 13వ నెలలో కేవలం 5 లేదా 6 రోజులు ఉంటాయి. అది లీపు సంవత్సరాన్ని బట్టి ఉంటుంది.
సమయాన్ని కూడా భిన్నంగా లెక్కిస్తారు. పొద్దున్న ఆరు గంటల నుంచి మొదలుపెట్టి 12 గంటల చొప్పున రెండు భాగాలుగా విభజిస్తారు.
అంటే, అడిస్ అబాబాలో మిమ్మల్ని ఎవరైనా 10 గంటలకు కాఫీకి పిలిస్తే, వారు సాయంత్రం నాలుగు గంటలకు కనిపిస్తే, మీరు ఆశ్చర్యపోకండి. అరబిక కాఫీ బీన్ ఇథియోపియాలోనే పుట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
2) వలస పాలనకు గురవ్వని ఒకే ఒక్క దేశం
ఇథియోపియాను ఆక్రమించాలని ఇటలీ ప్రయత్నించింది. 1895లో దీనికి అబిస్సీనియా అనే పేరు ఉండేది. కానీ, యుద్ధంలో ఇటలీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
దాంతో, ఇటలీకి చెందిన షిప్పింగ్ సంస్థ పొరుగున ఉన్న అస్సాబ్ ఎర్ర సముద్రపు రేవును కొనుక్కోవడంతో ఎరిత్రియాను పాలించేందుకు ఇటలీకి అవకాశం దక్కింది.
1889లో ఇథియోపియా చక్రవర్తి యోహాన్నెస్ IV మరణించడంతో అయోమయం నెలకొంది. ఆ సమయంలో తీరప్రాంతంలో ఉన్న పర్వత ప్రాంతాలను ఇటలీ ఆక్రమించేందుకు అవకాశం దక్కింది.
కానీ కొన్నేళ్ల తర్వాత ఇటలీ ఇథియోపియాను మరింత ఆక్రమించుకోవాలని ప్రయత్నించినప్పుడు, అడ్వా యుద్ధంలో ఇటలీ ఓడిపోయింది. చక్రవర్తి మెనెలిక్ II నేతృత్వంలో ఉన్న దేశం మార్చి 01, 1896లో ఇటలీ సైన్యాన్ని కొన్ని గంటల్లోనే ఓడించింది.
ఇథియోపియా స్వతంత్రాన్ని గుర్తిస్తూ ఇటలీ ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది.
కానీ కొన్ని దశాబ్దాల తర్వాత ఫాసిస్ట్ నాయకుడు బెనిటో ముస్సోలినీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఆ దేశాన్ని ఐదేళ్ల పాటు ఆక్రమించారు.
మెనెలిక్ తర్వాత పదవిని చేపట్టిన హైలీ సెలస్సీ చక్రవర్తి పాలనలో ఇటలీపై సాధించిన విజయంతో, ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ స్థాపన కోసం కృషి చేశారు. అదే ఇప్పుడు ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో ప్రధాన కేంద్రం ఉన్న ఆఫ్రికన్ యూనియన్‌గా రూపాంతరం చెందింది.
"ఆఫ్రికన్లు అందరూ స్వేచ్ఛను సంపాదించేవరకు మనం సాధించిన స్వతంత్రానికి అర్ధం లేదు" అని 1963లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీని స్థాపిస్తున్న సమయంలో ఆయన అన్నారు. అప్పటికి ఆఫ్రికాలో చాలా భూభాగం యూరోప్ దేశాల పాలనలో ఉంది.
వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి, నాయకత్వం వహిస్తున్న వారికి శిక్షణ ఇచ్చేందుకు సెలస్సీని ఆహ్వానించారు. అందులో దక్షిణ ఆఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా కూడా ఉన్నారు. ఆయనకు ఇథియోపియా పాస్‌పోర్టు కూడా లభించింది. దాంతో ఆయనకు 1962లో ఆఫ్రికా అంతటా తిరిగే అవకాశం లభించింది.
"నా మూలాలను వెలికి తీస్తూ నన్ను ఆఫ్రికా వ్యక్తిగా మలిచిన నా జన్మస్థానానికి వెళుతున్నట్లుగా అనిపిస్తోంది" అని ఇక్కడ పర్యటించిన సమయంలో నెల్సన్ మండేలా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
3) చక్రవర్తి హైలీ సెలస్సీని పూజించే రస్టఫేరియన్
ఇదంతా 'బ్యాక్ టు ఆఫ్రికా' ఉద్యమానికి మూలకారకుడైన ప్రముఖ జమైకా నల్ల జాతి నాయకుడు మార్కస్ గార్వీ 1920లో చేసిన ఒక కోట్ ఆధారంగా పుట్టింది.
"ఆఫ్రికా వైపు చూడండి. పదవిని చేపట్టే రోజు దగ్గరకు వచ్చేసరికి నల్ల జాతికి చెందిన రాజుకు సింహాసనం లభిస్తుంది" అని ఆయన అన్నారు.
సరిగ్గా ఒక దశాబ్దం తర్వాత 38 ఏళ్ల హైలీ సెలస్సీకి కిరీటాన్ని తొడిగినప్పుడు, జమైకాలో చాలా మంది మార్కస్ గార్వి చెప్పిన జోస్యం నిజమైనట్లు భావించారు. అప్పుడే రస్టాఫరీ ఉద్యమానికి నాంది పలికింది.
రస్టా సందేశాన్ని వ్యాప్తి చెందించడంలో ప్రముఖ సంగీతకారుడు బాబ్ మార్లీ కీలక పాత్ర పోషించారు. ఆయన 'యుద్ధం" అనే పాటకు రాసిన పదాల్లో చక్రవర్తి 1963లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రపంచ శాంతిని కోరుతూ చేసిన సందేశాన్ని చేర్చారు.
"ఒక జాతి గొప్పదని, మరొకటి తక్కువదని చెప్పే సిద్ధాంతానికి విలువనివ్వడం ఆపి, దానిని శాశ్వతంగా తుడిచి పెట్టేవరకూ, ఆఫ్రికా ఖండానికి శాంతి అంటే ఏంటో అర్ధమవ్వదు" అని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.
బాబ్ మార్లీ రూపొందించిన మ్యూజిక్ టైటిల్ ట్రాక్‌ను టైం పత్రిక 20వ శతాబ్దపు ఆల్బమ్ అని పేర్కొంది. అందులో ఆఫ్రికాకు వెళ్లాలనే రస్టాఫరీ కోరికను ప్రతిబింబిస్తుంది. ట్రాన్స్ అట్లాంటిక్ బానిస వ్యాపారంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఆఫ్రికాను వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది.
ఇప్పటికీ, ఇథియోపియాలో అడిస్ అబాబాకు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాషామీనే పట్టణంలో రస్టఫేరియన్ జాతికి చెందినవారు నివసిస్తున్నారు. ముస్సోలినీకి వ్యతిరేకంగా పోరాడినప్పుడు తనకు మద్దతిచ్చినవారికి సెలస్సీ ఈ ప్రాంతంలో కొంత భూమిని విరాళంగా ఇచ్చారు.
సెలస్సీ సనాతన క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి. ఆయన రస్టా మతాన్ని నమ్మిన వ్యక్తి కాకపోవచ్చు. ఆయన ఎప్పటికీ సజీవంగా ఉండిపోనని చెబుతూ ఉండేవారు. కానీ, రస్టఫేరియన్లు మాత్రం ఆయనను ఇప్పటికీ 'లయన్ ఆఫ్ జుడా'గా భావించి పూజిస్తారు.
సెలస్సీ.. బైబిల్లో పేర్కొన్న సోలమన్ వారసత్వానికి చెందిన వాడని చాలా మంది ఇథియోపియా ప్రజలు, రస్టఫేరియన్లు కూడా నమ్ముతూ ఉంటారు.

ఫొటో సోర్స్, AFP
4) భద్రంగా ఉన్న 10 కమాండ్మెంట్స్
జీసస్ మోషేకు ఇచ్చిన పవిత్రమైన పెట్టె ఎక్కడికీ పోలేదు అని ఇథియోపియన్లు నమ్ముతారు. ఆ పెట్టెలో బైబిల్‌లో నిర్దేశించిన 10 మార్గనిర్దేశకాలను పొందుపర్చిన రెండు పలకలు ఉంటాయి.
అక్సమ్‌లో ఉన్న అవర్ లేడీ మేరీ ఆఫ్ జియాన్ చర్చి గ్రౌండ్‌లో ఈ పెట్టె నిరంతరం పర్యవేక్షణలో ఉంటుందని సనాతన ఇథియోపియా చర్చి చెబుతుంది. ఇది చూసేందుకు ఎవరికీ అనుమతి లేదు.
క్వీన్ ఆఫ్ షీబా వల్ల ఈ పవిత్రమైన చిహ్నం ఇక్కడ వరకు వచ్చిందని ఇథియోపియన్లు చెబుతారు. అయితే, ఆమె ఉనికిని చరిత్రకారులు అంగీకరించరు.
సాలమన్ చక్రవర్తికున్న విజ్ఞానం గురించి మరింత తెలుసుకోవడానికి ఆయనను కలిసేందుకు సుమారు క్రీస్తుశకం 950లో ఆమె అక్సమ్ నుంచి జెరూసలెం వెళ్లారని చెబుతారు.
ఆమె ప్రయాణ వివరాలు, సాలమన్ ఆమెను సమ్మోహనపరచడం లాంటి వివరాలు కెబ్రా నాగాస్ట్ గ్రంథంలో వివరించారు. ఇది 14వ శతాబ్దంలో గీజ్ భాషలో రాసిన ఇథియోపియా సాహిత్యం.
ఈ పురాణంలో, క్వీన్ ఆఫ్ షీబా (మకేడా) తన కొడుకు మెనెలిక్‌కు జన్మనిచ్చిన వివరాలతో పాటు, కొన్నేళ్ల తర్వాత ఆయన తన తండ్రిని కలుసుకునేందుకు జెరూసలెం ప్రయాణానికి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి.
సోలమన్ మరణం తర్వాత రాజ్యాన్ని పరిపాలించమని మెనెలిక్‌ను కోరినప్పటికీ ఆయన కాదనడంతో, మెనెలిక్ తిరిగి స్వదేశానికి వెళ్ళడానికి అంగీకరిస్తారు.
సోలమన్ కొడుకుతో పాటు ఇజ్రాయెల్ సేనలను కూడా తోడుగా పంపారు. అందులో ఒక సైనిక బృందం ఈ పెట్టెను దొంగలించి దాని స్థానంలో నకిలీ పెట్టెను పెట్టారని చెబుతారు.
ఆ పెట్టె ఇథియోపియాలో ఉండాలని అనుకోవడం భగవంతుని ఇష్టంగా భావించి మెనెలిక్ ఆ పెట్టెను తనతో పాటు ఉంచుకునేందుకు అంగీకరిస్తారు. అందుకే సనాతన క్రైస్తవులకు అది చాలా పవిత్రమైనది. దానిని, వాళ్ళ ప్రాణాలతో సమానంగా కాపాడుకోవాలని చూస్తారు.
గతేడాది టైగ్రేలో సంక్షోభం తలెత్తినప్పుడు కూడా ఒక బీభత్సమైన మారణహోమం తర్వాత ఎరిత్రియాకు చెందిన సైనికులు అవర్ లేడీ మేరీ ఆఫ్ జియాన్ చర్చిను కొల్లగొట్టాలని ప్రయత్నించారు.
అయితే, ఆ పెట్టెను పరిరక్షించడానికి యువత అంతా పరుగుపెట్టుకుంటూ వెళ్లారని, ఒక ప్రభుత్వ అధికారి బీబీసీకి చెప్పారు.
"ప్రతీ ఒక్కరూ వారితో పోరాడారు. వారు తుపాకీలతో కాల్చి కొంత మందిని చంపేశారు కూడా. కానీ, మా సంపదను సంరక్షించుకోవడంలో మేము విఫలం కాకపోవడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.
అదే సమయంలో మహమ్మద్ ప్రవక్త కూడా ప్రవచనాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో, ముస్లిమేతర పాలకులు ఆయననొక ముప్పుగా చూడటం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
5) అరేబియా దాటి వలస వెళ్లిన ముస్లిం మతస్థులు
7వ శతాబ్దంలోని మక్కాలో (ప్రస్తుత సౌదీ అరేబియా) ముస్లింలు హింసకు గురయినప్పుడు, "మీరు అబిస్సినియాకు వెళ్లగలిగితే అక్కడ మీకు అన్యాయాన్ని సహించని రాజు కనిపిస్తారు" అని మహమ్మద్ ప్రవక్త ఆయన అనుచరులకు చెప్పినట్లు చెబుతారు.
ఆయన సలహాను అనుసరించి, ఒక చిన్న బృందం అక్సమ్‌కు ప్రయాణం అయింది. ప్రస్తుత ఇథియోపియా, ఎరిత్రియా భూభాగాలు అక్సమ్ ప్రాంతంలో ఉండేవి. వారికి అక్కడ స్వాగతం లభించింది. వారి మతాన్ని అనుసరించేందుకు క్రైస్తవ చక్రవర్తి అర్మా అనుమతి ఇచ్చారు.
ప్రస్తుత టైగ్రే భూభాగం నెగాష్ గ్రామంగా ఉండేది.
ఇలా వలస వచ్చినవారు ఇక్కడ స్థిరపడి ఆఫ్రికాలో పురాతనమైన మసీదును నిర్మించారని చెబుతారు.

ఫొటో సోర్స్, AFP
గతేడాది టైగ్రేలో జరిగిన కాల్పుల్లో అల్ నెగాషి మసీదుపై బాంబు దాడి జరిగింది.
మహమ్మద్ ప్రవక్త 15 మంది శిష్యులు నెగాష్‌లోనే సమాధి చెందారని స్థానిక ముస్లింలు భావిస్తారు.
ఇస్లామిక్ సిద్ధాంతం ప్రకారం, ప్రవక్తను అనుసరించే బృందాలు ఆక్సమ్‌కు రావడాన్ని తొలి వలసగా పరిగణిస్తారు.
ఇథియోపియాలో ఉన్న 115 మిలియన్ జనాభాలో సుమారు 34 శాతం మంది ముస్లింలు ఉంటారు.
ఇవి కూడా చదవండి:
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
- అఫ్గానిస్తాన్: మహిళలపై టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలు ప్రయోగించిన తాలిబాన్లు
- చంద్రంపాలెం హైస్కూల్: ‘కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ సర్కారు బడికి పంపిస్తున్నారు’
- కిసాన్ మహా పంచాయత్: భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘాల దృష్టి
- 'మగతోడు లేకుండా మీరెందుకు బయటికొచ్చారు?'
- తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న కొత్తరకం కరోనావైరస్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








