ప్రాచీన గ్రీక్ ఒలింపిక్ ఆటగాళ్లు అంత ధృఢంగా ఉండేందుకు ఏం చేసేవారో తెలుసా?

గ్రీక్ ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రీకుల కాలంలో పోరాట వ్యూహాలు క్రూరంగా ఉండేవి. ఒక్కోసారి ప్రత్యర్థి అవయవాలు తీవ్రంగా దెబ్బతినేవి
    • రచయిత, రిచర్డ్ ఫిషర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తత్వశాస్త్రం చదవడం, జంతువుల్ని ఎత్తడం, సెక్స్‌కు దూరంగా ఉండటం... ఇలాంటివన్నీ చేస్తూ పురాతన కాలంలో గ్రీకు అథ్లెట్లు, ప్రస్తుత అథ్లెట్ల తరహాలోనే కఠినంగా కృషి చేసేవారు. ఇప్పుడు పటిష్టమైన గ్రీకు ఫిట్‌నెస్‌కు సంబంధించిన 10 అంశాల గురించి తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం, గ్రీకులో మిలో ఆఫ్ క్రోటన్ అనే బలవంతుడైన అథ్లెట్ ఉండేవాడు. అతను తన తల చుట్టూ చుట్టిన వస్త్రాన్ని కేవలం తన నుదుటి బలంతో చీల్చివేసేవాడని ప్రతీతి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ధంలో అతడ్ని అత్యంత శక్తిమంతమైన రెజ్లర్‌గా పరిగణించేవారు. ఒలింపిక్ గేమ్స్‌లో అతను 6 సార్లు విజేతగా నిలిచారు. ప్రత్యర్థి కదలికలకు అనుగుణంగా మిలో తన కండరాలు, చర్యలపై పూర్తిగా నియంత్రణను పాటించేవారు.

అతనికి అంత శక్తి ఎలా వచ్చింది? శక్తి కోసం మిలో అసాధారణ పద్ధతులు ఉపయోగించేవారని కథలు చెబుతున్నాయి. నాటి కాలంలో ప్రోటీన్ షేక్స్, డంబెల్స్ అందుబాటులో లేనప్పటికీ దూడలను ఎత్తడం ద్వారా కండరాల బలం పెంచుకునేవాడని కథల ద్వారా తెలుస్తోంది. ఆ దూడ, ఎద్దుగా ఎదిగే వరకు కూడా మిలో దానితోనే కసరత్తులు చేసేవారంట.

కానీ, పూర్తిగా ఎదిగిన ఎద్దు 500 నుంచి 1000 కిలోల బరువు ఉంటుంది. మానవుడు అంత బరువు ఎత్తుతూ కసరత్తు చేయడం అసాధ్యం. ఒకవేళ నిజంగా అంత బరువు ఎత్తి ఉంటే అత్యధిక బరువు ఎత్తిన రికార్డు అతని పేరిటే ఉండేది. కాబట్టి మిలో గురించి వచ్చిన కథల్లో అతిశయోక్తి ఉన్నట్లు మనం గుర్తించాలి.

కానీ ఇక్కడ ఆసక్తికరమైన అంశమేంటంటే అతను పాటించిన టెక్నిక్. ఆ టెక్నిక్ ప్రస్తుతమున్న 'ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్' అనే సూత్రాన్ని ప్రతిబింబిస్తోంది. దీని ప్రకారం కండరాలను శక్తిమంతం చేయడానికి అథ్లెట్లు ఒక నిర్దిష్ట కాలం పాటు ఒకే రకమైన బరువున్నవస్తువులను ఎత్తుతారు. ఆ తర్వాత బరువులను స్థిరంగా పెంచుతూ దీన్నే పున‌రావృతం చేస్తారు.

గ్రీక్ ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇతర పురాతన అథ్లెట్లు ఎలాంటి శిక్షణ పొందారు? ఒలింపిక్స్ గేమ్స్ తొలితరం పోరాటయోధులు కేవలం ప్రాథమిక సాంకేతికత, తక్కువ శారీరక పరిజ్ఞానాన్ని కలిగి ఉండేవారు. కానీ ఇప్పటివారెవరూ కనీసం ఊహించలేని శిక్షణా పద్ధతులను వారు అనుసరించేవారు.

క్రీ.పూ 776లో తొలి ఒలింపిక్స్ జరిగాయి. అప్పుడు అవి పరుగు పందేలతో ప్రారంభమయ్యాయి. తర్వాత ఈ క్రీడల్లో జంపింగ్, బాక్సింగ్, రెజ్లింగ్‌లతో పాటు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైన ప్రమాదకర 'పంక్రేషన్' అనే పోరాట క్రీడను కూడా గ్రీకులు చేర్చారు. ఈ పంక్రేషన్ క్రీడా పోటీల్లో ఒక్కోసారి మరణాలు కూడా సంభవిస్తుండేవి.

అందుబాటులో ఉన్న అతి తక్కువ వనరులతోనే ఈ ఈవెంట్ల కోసం పోటీదారులు ఎలా సన్నద్ధమయ్యారనే అంశంపై చరిత్రకారుల వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆకాలపు 'అథ్లెటిక్ ట్రెయినింగ్'పై పరిశోధనలు చేసిన సౌత్ డకోటా యూనివర్సిటీకి చెందిన క్లేటన్ లేహ్‌మన్ వీటి గురించి వివరించారు.

'మాకు చాలా కొద్ది పరిమాణంలో లభించిన సాహిత్య గ్రంథాలపైనే మేం పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అలాగే పరోక్ష ఆధారాలను పరిగణలోకి తీసుకుంటాం. ముఖ్యంగా కుండలపై వేసిన పేయింటింగ్స్ మాకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే నాటి కాలంలో శిక్షణ ఎలా సాగిందో తెలిపే చిత్రాలను కుండలపై మనం గమనించవచ్చు' అని ఆయన తెలిపారు.

ఈ అథ్లెటిక్ ట్రెయినింగ్‌కు సంబంధించి తెలుసుకునేందుకు ముఖ్యమైన వనరు 'జిమ్నాస్టికస్' గ్రంథం. దీన్ని క్రీ.శ 2వ శతాబ్ధంలో తత్వవేత్త ఫిలోస్ట్రాటస్ రచించారు. ఇందులో అథ్లెట్ల రోజూవారీ దినచర్య గురించి ఫిలోస్ట్రాటస్ తెలుపలేదు. కానీ క్రీడల గొప్పతనం గురించి వివరించారు. అందులో భాగంగానే సందర్భానుసారంగా అథ్లెట్ల శిక్షణ గురించి తెలిపారు. జంతువుల వెంట పరిగెత్తడం, ఇనుప రాడ్లను వంచడం, సముద్రాల్లో ఈత కొట్టడం ద్వారా అథ్లెట్లు శిక్షణ పొందేవారని వివరించారు.

దీనితో పాటు అందుబాటులో ఉన్న ఇతర వనరులను అనుసరించి పురాతన గ్రీకు అథ్లెట్ లాగా ఎలా శిక్షణ పొందాలో తెలుసుకుందాం.

గ్రీక్ ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుస్తీపోటి కుడ్యచిత్రం, ఉబ్బిన పొట్టలు బ్రీతింగ్ టెక్నిక్ అప్పట్లోనే వాడారనడానికి సంకేతమా?

పెద్ద బండరాళ్లు, జంతువుల ద్వారా బలం పెంచుకోవడం

రెజ్లర్ మిలో కేవలం దూడను ఎత్తడం ద్వారానే దేహ దారుఢ్యాన్ని పొందలేదు. దానితో పాటు ఒకేసారి 4 గుర్రాలను నియంత్రించడం, ఇతరుల పంచ్‌లను సమర్థంగా నియంత్రించడం, పిండి లేదా ఇసుక నింపిన సంచులపై బలంగా పిడి గుద్దులు గుద్దుతూ శక్తిని సంపాదించారు.

ఎంతో బరువుండే డిస్క్‌లను రెజ్లర్‌లు బలంగా విసిరేవారు. పెద్ద పెద్ద బండరాళ్లను చేతులతో ఎత్తేవారు. థెరా నగరంలో చాలా మంది మనుషుల కన్నా ఎత్తున్న 480 కిలోల నల్లటి ఉల్క రాయిని భూమిపై నుంచి ఒక రెజ్లర్ ఎత్తినట్లు దానిపై రూపొందించిన శిలా శాసనం ద్వారా తెలుస్తోంది.

మెదడుకు సాన

అథ్లెట్లంతా జిమ్నాసియా(వ్యాయామశాల)తో పాటు రెజ్లింగ్ స్కూల్ 'పలెస్ట్రా' ప్రాంగణంలో సాధన చేసేవారు. ఇప్పుడు మనం చూస్తోన్న జిమ్‌ల తరహాలో కాకుండా ఈ జిమ్నాసియా, పలెస్ట్రా ప్రాంగణాలు గ్రంథాలయాలు, ఉపన్యాస మందిరాలను కలిగి ఉండేవి. ఆరోగ్యకరమైన శరీరంతోపాటు, ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండటం పౌరుల బాధ్యత అని గ్రీకులు నమ్మేవారు. సృజనాత్మక కళలు, తత్వం, గణితం, ఖగోళ శాస్త్రాల కంటే కూడా అథ్లెటిక్స్ కార్యకలాపాలను జ్ఞానానికి మరో రూపంగా భావించేవారు. అందుకే మెదడును సాన బెట్టడం ద్వారా కండరాలు కూడా బలాన్ని సంతరించుకుంటాయని నమ్మేవారు.

ఎంతోమంది గొప్ప తత్వవేత్తల సూక్తులను జిమ్నాసియంలో పొందుపరిచేవారని లేహ్‌మన్ చెప్పారు. ఈ వేదికలు ఏథెన్స్ వంటి గొప్ప ప్రజాస్వామ్య కేంద్రాల ఆవిర్భావానికి దోహదపడ్డాయి.

నూనె రుద్దడం

నాటి శిక్షకులను 'పైడోట్రైబ్స్'గా పిలిచేవారు. 'బాలుడు', 'రుద్దడం' అనే రెండు మూల పదాల కలయిక నుంచి పైడోట్రైబ్స్ అనే పదం ఏర్పడింది. 'చమురుతో శరీర మర్ధన' అనేది ఈ పదానికున్న అసలైన అర్థం.

శిక్షణా సమయంలో లేదా పోటీపడేటప్పుడు రెజ్లర్లు తమ శరీరం అంతటా నూనెను పట్టించుకునేవారు. ఆ తర్వాత బిగిపట్టు కోసం శరీరంపై ఇసుకను చల్లుకునేవారు. పోటీ తర్వాత శరీరంపై అంటుకున్న చమురు, ఇసుకను తొలిగించడానికి 'స్ట్రాగిల్' అనే పరికరాన్ని ఉపయోగించేవారు. ఈ పరికరం చెక్క , ఇనుము లేదా కాంస్య లోహాలతో తయారు చేస్తారు. 'అథ్లెట్ల శరీరం నుంచి సేకరించిన ఈ చెమట, ఇసుకను ప్రజలకు బాటిళ్లలో విక్రయించేవారు' అని లేహ్‌మన్ వెల్లడించారు.

గ్రీక్ ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Egisto Sani/Wikimedia Commons CC-BY-SA 2.0

ఫొటో క్యాప్షన్, బరువులు ఎత్తడానికి, జంపింగ్‌కు వాడిన హాల్టియర్ అని పిలిచే శిల

మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడం

శతాబ్ధ కాలపు అథ్లెట్స్‌తో పోలిస్తే తన కాలపు అథ్లెట్లు మందకొడివారని ఫిలోస్ట్రాటస్ వర్ణించారు. అథ్లెట్లకు ఎక్కువగా డబ్బులు చెల్లించడం, వారి సోమరితనం కారణంగా గ్రీకు ప్రపంచంలో అథ్లెటిక్స్ సంప్రదాయం క్షీణించిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. అథ్లెట్లను యుద్ధం నుంచి వేరుచేయడం, వారికి ధనంపై వ్యామోహం కలగడం, విలాసవంతమైన ఆహారాలు లభించడం పట్ల ఆయన తప్పుబట్టారు.

ఔత్సాహిక అథ్లెట్లకు ఆదర్శవంతమైన మానసిక సామర్థ్యం ఉండాలని, దాన్నివారు పెంపొందించుకోవడంలో ప్రోత్సాహం అందించాలని ఫిలోస్ట్రాటస్ విశ్వసించారు. త్వరగా కోపానికి గురయ్యేవారు, చిరాకుపడే అథ్లెట్లు సంయమనం పాటించాలని లేహ్‌మన్ అన్నారు.

సెక్స్‌కు దూరంగా ఉండటం

సంయమనం పాటించడం అథ్లెట్లకు చాలా మంచింది. సెక్స్ అనేది అథ్లెట్లకు 'తలవంపులు తెచ్చేఆనందం. వారికి హాని కలిగించే విలాసవంతమైన అవినీతి రూపం. అథ్లెట్లలో మోసాన్ని, అవినీతిని పెంచే వ్యామోహం' అని ఫిలోస్ట్రాటస్ రాసుకొచ్చారు.

అథ్లెట్లు లైంగిక ప్రలోభాలకు తలొగ్గకుండా తమను తాము నియంత్రించుకున్నట్లు చరిత్రలో ఆధారాలున్నాయి. 'ఒక పంక్రేషన్ చాంపియన్ విందులో ఉండగా ఎవరో సెక్స్ గురించి మాట్లాడటం ప్రారంభించగానే ఆయన అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయనలోని అంతర్గత బలాన్ని, ఆటపై ఏకాగ్రతను నిలుపుకునేందుకు ఆయన అలా చేశారు' అని హిరోషిమా యూనివర్సిటీకి చెందిన లుకాస్ క్రిస్టోపోలస్ తన పరిశోధనా పత్రంలో రాసుకొచ్చారు.

పురుషుల పోటీ పడే ప్రదేశాల్లోకి మహిళల్ని నిషేధించేవారు. అయితే కలిపటేరియా అనే తల్లి తన కొడుకు బాక్సింగ్ మ్యాచ్ చూడాలని ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. మారు వేషంలో వెళ్లి కుమారుని మ్యాచ్ వీక్షించిన ఆమె కొడుకు గెలిచిన ఆనందంలో అరుస్తూ తానెవరో బయటపెట్టారు. అది శిక్షార్హం అయినప్పటికీ, ఆమె తండ్రి, సోదరుడు, కుమారుడు ఒలింపిక్స్ చాంపియన్స్ కావడంతో ఆమెకు క్షమాభిక్ష లభించింది.

కానీ మహిళలు కూడా క్రీడల్లో పాల్గొన్నట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. మసాచుసెట్స్ యూనివర్సిటీ చరిత్రకారుడు బెట్టీ స్పియర్స్... 'క్రీ.పూ 6వ శతాబ్ధంలో అట్లాంటా అనే ఒక మహిళ రెజ్లింగ్‌లో పురుషునితో పోటీపడుతున్నట్లు తెలిపే పేయింటింగ్స్‌ ఉన్నాయని తెలిపారు. క్రీ.శ 500వ సంవత్సరంలో ఒక యువతి పరిగెత్తుతున్నట్లు, కొంతమంది మహిళలు రథాల పోటీల్లో పాల్గొన్నట్లు పేయింటింగ్స్ ద్వారా తెలుస్తోందని ఆయన నొక్కి చెప్పారు. క్రీ. పూ 392 ఒలింపిక్స్‌లో మహిళలైన స్పార్టన్స్, సైనిస్కా విజేతలుగా నిలిచినట్లు కథనాలు ఉన్నాయి. వీరితో పాటు డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, రెజ్లింగ్ వంటి క్రీడల్లోనూ మహిళలు పాల్గొన్నారు.

దీర్ఘ శ్వాస, పట్టువదలని పోరాటం

బలంగా మారడానికి ఏమి చేయాలో గ్రీకులకు బాగా తెలుసు. కానీ వారి శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన ఆలోచనలు కాస్త చైనా వారి పోకడలకు దగ్గరగా ఉంటాయి. 'న్యూమా' అనే ప్రక్రియ ద్వారా వారు శక్తిని పొందుతారు. ఈ ప్రక్రియలో ఉఛ్వాస, నిశ్వాసాలపై నియంత్రణ సాగిస్తారు. రొమ్ము కండరాలను కదలించడం, కడపుతో పాటు డయాఫ్రమ్‌లోని కండరాలకు విశ్రాంతి కలిగిస్తారు. ఫలితంగా శరీరంలోని వ్యర్థాలు తొలిగిపోతాయని క్రిస్టోఫోలస్ పేర్కొన్నారు.

ఈ న్యూమా పద్ధతిని ఉపయోగించి, ఒక బాక్సర్ తన ప్రత్యర్థి పొత్తికడుపుపై బలంగా కొట్టడం వల్ల అతని శరీరం లోపలి భాగాలు, మాంసం చితికిపోయినట్లుగా భావిస్తున్నారు.

క్రీ.పూ 564 ఒలింపిక్స్‌లో మరణించిన పంక్రేషన్ అథ్లెట్‌ను ఏ శ్వాస పద్ధతి కూడా కాపాడలేకపోయింది. పోటీలో ప్రత్యర్థి అతని మెడ చుట్టూ బిగించి పట్టాడు. దీంతో అతను మరణించాడు. వెంటనే అతని కోచ్ 'ఒలింపియాలో ఓడిపోలేదు. అతను పోటీలో గెలిచాడు. తర్వాత ఊపిరాడకపోవడంతో మరణించాడు' అని అరిచారు.

గ్రీక్ ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

నాలుగు రోజుల ప్రాక్టీస్ విధానం

టెట్రాడ్ అనేది ప్రసిద్ధ నాలుగు రోజుల శిక్షణా విధానం. ఈ విధానంతో కఠినమైన శిక్షణను సులభంగా పొందవచ్చు. ఇందులో తొలి రోజు స్వల్ప కాలం పాటు తీవ్రమైన ప్రాక్టీస్, రెండో రోజూ మొత్తం నైపుణ్యాల ప్రదర్శన, మూడో రోజు విశ్రాంతి, నాలుగో రోజు పరిమితమైన వ్యాయామం ఉంటుందని లేహ్‌మన్ చెప్పారు.

కానీ దీన్ని అందరూ స్వీకరించలేదు. కొంతమంది దీనిలో ఉండే అసౌలభ్యాన్ని విమర్శించారు. ఈ పద్ధతిలో రెండు రోజుల విరామం తర్వాత శిక్షణను తిరిగి ప్రారంభించమని కోచ్ ఒత్తిడి చేయడం అథ్లెట్ మరణానికి కారణమైంది.

ఇక్కడ ఆసక్తి కలిగించే అంశమేంటంటే, గ్రీకులు 'సూపర్ కంపెన్సేషన్ సూత్రాన్ని' పాటించారు. ఈ సూత్రం ప్రస్తుతం అథ్లెట్లు వాడుతోన్న విధానాన్ని పోలి ఉంటుంది. దీనిప్రకారం అధిక శ్రమ తర్వాత విశ్రాంతి తీసుకున్న కొద్ది రోజుల్లోనే... శరీరం ఉత్తమ పనితీరు కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని నమ్ముతారు.

చెట్లు ఎక్కడం, యుద్ధం చేయడం

జిమ్నాసియం వెలుపల ఉన్న వసతులను కొంతమంది అథ్లెట్లు తమ శారీరక వ్యాయామం కోసం వినియోగించుకునేవారు. ఫిలోస్ట్రాటస్ తన రచనలో అథ్లెట్లు చెట్లు ఎక్కడం, తాళ్లతో ఊగడం, బండ్లను లాగడం, చదునైనా లేదా గరుకు ఉపరితలాలపై పరుగెత్తడం వంటి పనులు చేసే వారని పేర్కొన్నారు. థానోస్‌కు చెందిన ఒక బాక్సర్ శరీర దృఢ‌త్వం కోసం 50 కి.మీ దూరం ఈత కొట్టగా, మరో అథ్లెట్ మందిరంలోని కాంస్య విగ్రహాన్ని తన ఇంటి వరకు మోసుకెళ్లారని క్రిస్టోపోలస్ వెల్లడించారు.

మిలో కూడా తన చేతులతో చెట్టు కొమ్మను లాగడం వల్ల మరణించినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. కొమ్మను లాగే క్రమంలో అతను పగుళ్లలో చిక్కుకున్నారు. ఆ తర్వాత ఆయన తోడేళ్లు, సింహాలకు ఆహారంగా మారారని కథల్లో పేర్కొన్నారు.

అథ్లెట్లు యుద్ధం కోసం భౌతిక పరీక్షలకు కూడా హాజరయ్యేవారిని తెలుస్తోంది. 'శారీరక శిక్షణ విషయంలో ఏ పౌరుడు కూడా నిర్లక్ష్యంగా ఉండరాదు. ఎప్పడూ శారీరకంగా పటిష్టంగా ఉండటం అతని బాధ్యతగా నాటి సమాజంలో పరిగణించేవారు. దేశానికి సేవ చేయడానికి ఎల్లప్పడూ సిద్ధంగా ఉండాలని అందరూ భావించేవారు. యువత బలహీనంగా ఉంటే యుద్ధం లేదా ఏదైనా ప్రమాదం తలెత్తితే దేశం బలహీనపడుతుందని అందరూ విశ్వసించేవారు.

మంచి డైట్‌ను అనుసరించడం

మిలో ఆఫ్ క్రోటన్ రోజుకు 8 కిలోల మాంసాన్ని తినేవాడు. శతాబ్ధాలుగా అథ్లెట్లు ఏమీ తినాలి అనే అంశంపై వారికి అవగాహన లేదు.

మొదట క్రీడాకారులు కేవలం శాకాహారాన్నే తీసుకునేవారు. అత్తిపండ్లు, తాజా జున్ను, పాస్తా, బార్లీలను ఆహారంగా తినేవారి క్రిస్టోపోలస్ పేర్కొన్నారు. కానీ క్రీ.శ 5వ శతాబ్ధం నాటికి గొడ్డు మాంసంతో పాటు పందిమాంసం తినేవారు.

శిక్షకులు కూడా వారి డైట్‌పై వివిధ ప్రయోగాలు చేసేవారు. అందులో భారీ చీజ్ ఆహారంతో పాటు మరోసారి భారీ మాంస‌కృత్తుల‌ భోజనాన్ని అందించేవారు. 'ఒక్కోసారి అధిక ప్రొటీన్, మరోసారి అధిక కార్బొహైడ్రేట్ల భోజనం అథ్లెట్లకు లభించేది. అది వారు నివసించే ప్రాంతంపై ఆధారపడి ఉండేది. ఈ ఆహారం అందించడం వెనుక కూడా వారు ఏదో సిద్ధాంతాన్ని పాటించి ఉంటారు' అని లేహ్‌మన్ చెప్పారు. గ్రీకులు శరీరంలోని రక్తం, పసుపు పైత్య రసం, నలుపు పైత్యరసం, కఫం.. ఈ నాలుగు వ్యవస్థలను సమతుల్యం చేసే ఆహారాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు.

'మీరు ఒలింపిక్స్‌లో గెలవానుకుంటే నిబంధనలు పాటించండి, తీపిపదార్థాలను తినకండి' అంటూ నాటి తత్వవేత్త ఇచ్చిన పిలుపును లేహ్‌మన్ గుర్తు చేశారు.

గ్రీక్ ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Wikimedia Commons

నైతిక ఆదర్శాలను అవలంబించడం

బలానికి, పరాక్రమానికి ప్రసిద్ధి చెందిన పురాతన గ్రీకు అథ్లెట్లను ప్రజలు విపరీతంగా ఆరాధించేవారు. కానీ వారి సాధించిన కీర్తి, విజయాలకు కారణం వారు అవలంభించే ఆదర్శవంతమైన విధానాలే అని రీడ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆట గొప్పదనం, గుణాన్ని ఆటగాడి హృదయ స్పందన రేటు, పోటీలో ఆక్సిజన్ స్థాయిలు, ప్రదర్శన తదితర ప్రమాణాల ఆధారంగా కొలుస్తున్నారు. కానీ గ్రీకులు మాత్రం స్టార్ అథ్లెట్ చాలా గొప్ప విషయాలకు ప్రతినిధిగా నిలుస్తాడని నమ్ముతారు. 'పూర్వ కాలం నుంచి క్రీడలు మారినప్పటికీ, అథ్లెట్లను ప్రత్యేకంగా నిలిపి లక్షణాలు మాత్రం అలాగే నిలిచిపోయాయి. అథ్లెట్లు సంపాదించే డబ్బు, గౌరవం, విజయం కూడా కాదు వారు చూపించే ఆదర్శభావాలు వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి' అని రీడ్ వివరించారు.

క్రీడలంటే కేవలం ఫిట్‌నెస్, వినోదం మాత్రమే కాదు అవి ప్రజల ఆకాంక్షలు. దీన్నే గ్రీకు అథ్లెట్లు పాటించారు.

కాబట్టి మీరు ఎప్పుడైనా జిమ్ లేదా వ్యాయామానికి వెళ్లినప్పుడు క్రీడా ఆదర్శాలను గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)