ఒలింపిక్స్ పోటీలలో ఆటగాళ్లు నగ్నంగా పాల్గొనే ప్రాచీన గ్రీకు సంప్రదాయం మళ్లీ వస్తుందా?

ఫొటో సోర్స్, Aris Messinis/AFP/Getty Images
పురాతన గ్రీకు గాథల్లో నగ్నంగా క్రీడల్లో పాల్గొనడం గురించి ఓ కథ ఉంది. క్రీ.పూ 720లో మెగారాకు చెందిన ఓర్సిప్పస్ అనే ఒలింపిక్ అథ్లెట్ 185 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటూ ఉండగా, నడుముకు కట్టుకున్న వస్త్రం జారి కింద పడిపోయింది.
అయితే, ఓర్సిప్పస్ తన పరుగు ఆపకుండా ముందుకు సాగి ఆ పోటీలో విజయం సాధించారు. ఆ గెలుపు నగ్నంగా అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనే ఓ సరికొత్త ప్రక్రియకు తెర తీసింది. గ్రీస్‌లో నగ్న అథ్లెటిక్ పోటీలు ఊపందుకున్నాయి. అది యూదులకు ఇచ్చే అత్యంత గొప్ప నివాళిగా ప్రసిద్ధికెక్కింది.
"అప్పట్లో ఓర్సిప్పస్‌ను ఓ హీరోగా, విజేతగా చూశారు. నగ్నంగా పోటీలో గెలవడాన్ని ఓ గొప్ప విషయంగా పరిగణిస్తూ సంబరాలు చేసుకున్నారు. గ్రీకు ప్రజలు నగ్నంగా క్రీడల్లో పాల్గొనడం ఆ దేశ సంప్రదాయానికి, నాగరికతకు చిహ్నంగా భావించారు" అని డాక్టర్ సారా బాండ్ వివరించారు. డాక్టర్ బాండ్ అయోవా విశ్వవిద్యాలయానికి చెందిన చరిత్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అనంతరం, 1896లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు రూపుదిద్దుకున్న కాలానికి, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి నిర్వాహకులు గ్రీక్ సంప్రదాయ నగ్న పోటీలను మళ్లీ ప్రవేశపెట్టాలనే ఆలోచనే చేయలేదు.
అంతేకాకుండా, ఆధునిక అథ్లెటిక్ పోటీల్లో క్రీడాకారుల వస్త్రధారణ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కూడా. షూస్ అథ్లెట్ల కాళ్లకు పట్టు అందిస్తూ వేగంగా పరిగెత్తేందుకు సహకరిస్తాయి. అలాగే, స్విమ్ సూట్లు నీటిలో సులువుగా చొచ్చుకుపోయేందుకు సహకరిస్తాయి.

ఫొటో సోర్స్, Araldo de Luca/Corbis/Getty Images
టోక్యో ఒలింపిక్స్‌లో నగ్న అథ్లెటిక్ పోటీలు ప్రవేశపెడితే..?
గ్రీకు గాథల్లో చెప్పిన ఒలింపిక్స్ లాగే, ఈ ఏడాది టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ కూడా ప్రత్యేకమైనదనే చెప్పుకోవాలి. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన వేళ, అనేక నిబంధనల మధ్య ఈ పోటీలు జరుగుతున్నాయి.
ఒకవేళ, టోక్యో ఒలింపిక్స్‌లో గ్రీకు సంప్రదాయమైన నగ్న పోటీలను మళ్లీ ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అలాంటి ఆలోచన ఎవరూ చేయట్లేదుగానీ ఆ ఊహే చాలా కుతూహలం కలిగిస్తోంది.
ప్రస్తుత ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న సామాజిక, సాంస్కృతిక కట్టుబాట్లు, నియమాలు, లైంగిక పరమైన అణచివేత (సెక్సిజం), అనేక ఇతర వైవిధ్యాల నేపథ్యంలో నగ్న పోటీల ఆలోచన పలు ఆసక్తికరమైన అంశాలకు, ప్రశ్నలకు తెర తీస్తుంది.
నగ్నంగా క్రీడల పోటీల్లో పాల్గొనడం చాలామంది అథ్లెట్లకు ఇబ్బంది కలిగించవచ్చు. ఆధునిక పోటీల్లో చాలామంది అథ్లెట్లు నగ్నంగా కాదుగానీ, చర్మానికి అంటుకుపోతూ బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం పరిపాటే. వాటికి కొన్ని లక్ష్యాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మహిళల వక్షోజాలు, పురుషుల జననాంగాలు కదలకుండా ఉంచుతూ క్రీడాకారులకు సౌకర్యాన్ని కలుగజేస్తాయి.
అయితే, సౌకర్యంగా ఉండడం కాకుండా అథ్లెట్ల ఆటతీరుకు దుస్తులు ఎంతవరకు దోహహపడతాయనేది అస్పష్టమే.
అథ్లెట్లకు దుస్తుల వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?
దుస్తుల వలన కలిగే ప్రయోజనాలు పూర్తిగా ఆ వస్త్రాలపై ఆధారపడి ఉంటాయని, అవి ఒక అథ్లెట్‌కు ఎంత బాగా సరిపోతాయన్నదానిపై ఆధారపడి ఉంటుందని మెల్‌బోర్న్ ఆర్ఎంఐటీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఓల్గా ట్రోనికోవ్ అభిప్రాయపడ్డారు.
క్రీడాకారులు వేసుకునే దుస్తులు వారి శరీరాన్ని ఒక పద్ధతిలో ఉంచేందుకు, కండరాల శక్తిని కేంద్రీకృతం చేసేందుకు సహకరిస్తాయని ప్రొఫెసర్ ట్రోనికోవ్ అన్నారు. ఉదాహరణకు వెయిట్ లిఫ్టింగ్ బెల్టులు, స్పాండెక్స్ క్రీడాకారుల శక్తిని కేంద్రీకృతం చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ రకమైన వస్త్రధారణ లేకపోతే వారి ప్రదర్శన కుంటుపడవచ్చు.
సుతిమెత్తని దుస్తులు గాల్లో లేదా నీటిలో కదులుతున్నప్పుడు శరీరం ఎదుర్కొనే ప్రతిఘటనలను తగ్గిస్తాయి. ఉదాహరణకు, సైకిలిస్టులు కాళ్లకున్న వెంట్రుకలను షేవ్ చేసుకోనక్కర్లేకుండా బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే ఇబ్బంది ఉండదు.
దుస్తులు అందించే అథ్లెటిక్ ప్రయోజనాలకు మంచి ఉదాహరణ స్విమ్మింగ్. 2008 బీజింగ్ ఒలింపిక్స్ స్విమ్మింగ్ పోటీల్లో ఆటగాళ్లు 25 ప్రపంచ రికార్డులను బద్దలుగొట్టారు. వారిలో 23మంది అథ్లెట్లు 'ఎల్‌జెడ్ఆర్ రేసర్' అనే ప్రత్యేకమైన పాలియురేతేన్ ఫుల్ సూట్ ధరించారు. ఈ ప్రత్యేకమైన దుస్తులు వారి మెరుగైన ప్రదర్శనకు సహకరించాయి.
ఈ ఫుల్ సూట్ శరీరంపై రాపిడిని 24 శాతం తగ్గిస్తుందని, నీరు శరీరాన్ని కిందకు లాగకుండా సహాయపడుతుందని ఎల్‌జెడ్ఆర్ రేసర్ దుస్తుల రూపకల్పనలో భాగం పంచుకున్న నాసా సైంటిస్టులు వివరించారు.
అయితే, ఎల్‌జెడ్ఆర్ రేసర్ దుస్తులు ధరించినవారికి అదనపు ప్రయోజనం చేకూరడం అన్యాయమేనని 2010లో స్విమ్మింగ్ అంతర్జాతీయ పాలక మండలి 'ఎఫ్ఐఎన్ఏ' నిర్థరించింది.
తరువాత, స్విమ్మర్లకు అదనపు ప్రయోజనాలు కలిగించే స్విమ్ సూట్లను ఎఫ్ఐఎన్ఏ నిషేధించింది.
ఈ నేపథ్యంలో, శారీరక సౌకర్యం మినహాయించి, నగ్నంగా పోటీల్లో పాల్గొనడం స్విమ్మర్లపై పెద్ద ప్రభావాన్ని చూపించకపోవచ్చు.
మిగతా క్రీడల విషయానికొస్తే దుస్తుల ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది ప్రశ్నార్థకమేనని ట్రోనికోవ్ అన్నారు.
"దుస్తుల వల్ల ఆ ప్రయోజనం ఉంది, ఈ లాభం ఉంది అని చెప్పడమేగానీ వాస్తవంలో అంత లాభమేమీ ఉండకపోవచ్చు" అని ఆమె అభిప్రాయపడ్డారు.
శరీరానికి బిగుతుగా ఉండే దుస్తుల వల్ల ఆటతీరు మెరుగుపడుతుందా లేదా అనే అంశంపై పరిశోధకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సగం మంది బిగుతు దుస్తులు శరీరంలో రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తూ ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తాయని విశ్వసిస్తున్నారు. మరో సగం మంది దుస్తుల వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు లేవని నమ్ముతున్నారు.
"దీనిపై కొంత పరిశోధన జరుగుతోందిగానీ ఫలితాలు అస్పష్టంగా ఉన్నాయి" అని ట్రోనికోవ్ అన్నారు.

ఫొటో సోర్స్, STR/AFP/Getty Images
కాళ్లకు వేసుకునే షూస్ కథ వేరు
అయితే, కాళ్లకు వేసుకునే షూస్ విషయంలో ఈ అంశాలు భిన్నంగా ఉంటాయి. అవి కాళ్లకు పట్టు అందించడమే కాకుండా రక్షణ కల్పిస్తాయి కూడా. రన్నింగ్, జంపింగ్ లాంటి క్రీడల్లో షూస్ అందించే ప్రయోజనాలు ఎక్కువే. అలాగే, నడుము కింద భాగంలో ఉన్న ఎముకలు, కండరాలు, కీళ్లపై తక్కువ ఒత్తిడి పడేలా సహకరిస్తాయి.
"శరీరం మొత్తం బరువు కాళ్ల మీదే ఉంటుంది. అందుకే కాళ్లకు సరిగా సరిపోయేలా మంచి, సౌకర్యవంతమైన షూస్ వేసుకోవడం తప్పనిసరి" అని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీలోని విల్సన్ కాలేజ్ ఆఫ్ టెక్స్‌టైల్స్‌లో ఇండస్ట్రియల్ ఇంజనీర్ పమేలా మెక్కాలీ అన్నారు.
కొన్ని క్రీడలకు ప్రత్యేకమైన షూస్ కావాల్సి వస్తుంది. ఉదాహరణకు సెయిలింగ్. కాళ్లు జారిపోకుండా, బోటు అంచున నిలబడగలిగేలా మంచి పట్టు ఉన్న ప్రత్యేకమైన షూస్ వారికి అవసరం. ఇవి ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి.
"నగ్న పోటీలను ప్రవేశపెట్టినా ఫరవాలేదుగానీ షూస్ వేసుకునేందుకు మాత్రం అనుమతించాలి" అని మెక్కాలీ అభిప్రాయపడ్డారు.
క్రీడాకారులు నిరసనలు తెలుపవచ్చు
నగ్నంగా పోటీల్లో పాల్గొనాలంటే కొందరు అథ్లెట్లు ఒప్పుకోకపోవచ్చు. నిరసనగా ఒలింపిక్స్ నుంచి తప్పుకోవచ్చు. కొంత సంప్రదాయమైన దేశాలు నగ్న పోటీల్లో పాల్గొనేందుకు వారి క్రీడాకారులను అనుమతించకపోవచ్చు.
"సంప్రదాయ దేశాల్లో, నమ్రతకు ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో ఈ ఆలోచనే అసాధ్యం" అని 'న్యూడిటీ: ఏ కల్చరల్ అనాటమీ' పుస్తక రచయిత, సిడ్నీ యూనివర్సిటీలో జెండర్ స్టడీస్ ప్రొఫెసర్ రుత్ బార్కాన్ అన్నారు.
చట్టపరమైన, నైతిక సమస్యలు
18 ఏళ్లలోపు అథ్లెట్లు కూడా నగ్నంగా పోటీ చేయవలసి వస్తే తీవ్రమైన నైతిక సమస్యలు, చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చు.
"పురాతన గ్రీకు ఒలింపిక్ క్రీడల్లో పురుషులు 12 ఏళ్ల వయసు వాళ్ల దగ్గర నుంచి నగ్నంగా పోటీల్లో పాల్గొన్నారు. క్రీడాకారులను లైంగిక దృష్టితో చూడడం, ఇతర లైంగిక కార్యకలాపాలు కచ్చితంగా నిషిద్ధం. ఇవాళ్టి రోజుల్లో అది అసాధ్యం. చరిత్రలో నగ్నంగా క్రీడల్లో పాల్గొనడానికి అర్థాలు, లక్ష్యాలు వేరు. ఇప్పుడు ఆ పద్ధతిని ప్రవేశపెడితే చాలా అశ్లీలంగా మారే అవకాశం ఉంది. లైంగిక దాడులు కూడా పెరగవచ్చు" అని ప్రొఫెసర్ బాండ్ అన్నారు.
పూర్వం గ్రీసులో ఒలింపిక్ క్రీడలు ఉన్నత వర్గాలకు చెందిన ఆటలు. ఒకే రకమైన సంస్కృతి, మతాల నుంచి వచ్చినవారు ఆడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. భిన్న సంప్రదాయాలు, సంస్కృతుల నుంచి వచ్చిన క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.
సంప్రదాయ దేశాలు నగ్న పోటీలను నిషేధించవచ్చు. ఉదారవాద దేశాల్లో మీడియా సంస్థలు ఎక్కడలేని ఉత్సాహంతో వీటిని ప్రసారం చేసే అవకాశం ఉందని ప్రొఫెసర్ రూత్ బార్కన్ అభిప్రాయపడ్డారు.
మరో పక్క, ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపించవచ్చు.
"కొంతమందికి ఇది కళాత్మకంగా, గొప్పగా అనిపించవచ్చు. కొంతమందికి అసహ్యాన్ని కలిగించవచ్చు" అని బార్కన్ అన్నారు.
అన్ని రకాల అభిప్రాయలతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. క్రీడాకారుల శరీరాకృతి, తీరుఎతెన్నులపై చర్చలు, తీర్పులు పెచ్చుమీరుతాయి. ఇవన్నీ అథ్లెట్ల ఆటతీరుపై ప్రభావం చూపించవచ్చు.
"మహిళా క్రీడాకారులు, ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు నిస్సందేహంగా పురుషుల కన్నా ఎక్కువగా వివక్షను, తీర్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచంలో వచ్చిన మార్పులను, సాంస్కృతిక నేపథ్యాన్ని విస్మరించి నగ్న పోటీల ఆలోచనను పరిశీలించలేం" అని బార్కాన్ అభిప్రాయపడ్డారు.
1999 మహిళల సాకర్ ప్రపంచ కప్‌లో ఆట గెలిచే గోల్ సాధించిన తరువాత బ్రాందీ చాస్టియన్ తన జెర్సీని తీసి విసిరేసినప్పుడు మీడియా దృష్టి అంతా ఆమెపైనే పడింది. స్పోర్ట్స్ బ్రాలో ఈ సాకర్ క్రీడాకారిణి ఫొటోలు వార్తల్లో నిలిచాయి. పురుష క్రీడాకారులు షర్ట్ లేకుండా తిరగడం, షర్ట్ విప్పేసి విసిరేయడం ఎప్పుడూ జరిగేదే అయినా ఒక మహిళా క్రీడాకారిణి జెర్సీ తీసి విసిరేయగానే అది పెద్ద వార్త అయిపోయింది.
"దాన్ని కూడా అమెరికాలో లైంగిక దృష్టితోనే చూశారు. పూర్తి నగ్నంగా వెళితే ఇంకేమంటారో నేను ఊహించలేను" అని ప్రొఫెసర్ బాండ్ అన్నారు.

ఫొటో సోర్స్, Lucas Oleniuk/Toronto Star/Getty Images
అథ్లెట్లపై తీవ్ర మానసిక ప్రభావం
నగ్నంగా క్రీడల పోటీల్లో పాల్గొనడం వలన అథ్లెట్లలో శారీరక ప్రభావాల కన్నా మానసిక ప్రభావాలు చాలా ఎక్కువగా ఉండొచ్చు.
"ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆటగాళ్ల శరీరాలపై, అంగాలపై వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఊహకే కష్టంగా ఉంది. అది వారిపై తీవ్రమైన మానసిక ప్రభావాన్ని కలిగిస్తుంది" అని బార్కాన్ అన్నారు.
భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ నగ్న పోటీలు సంప్రదాయంగా మారే పరిస్థితి రావొచ్చు. నగ్నంగా పోటీల్లో పాల్గొన్నవారిని హీరోలుగా చూసే రోజులు కూడా రావొచ్చు. కానీ అదేమీ ఒక్కరోజులో జరిగిపోయే విషయం కాదని బార్కాన్ అన్నారు.
అయితే, ఆ ప్రక్రియలో భాగంగా అథ్లెట్లపై పడే బరువు, మానసిక ఆందోళన వారి ఆటతీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
కాబట్టి, ఎప్పుడైనా భవిష్యత్తులో నగ్న పోటీలు మళ్లీ వెలుగులోకి వస్తే అందులో గెలిచినవారు ఉత్తమ అథ్లెట్లుగా కాకుండా, అప్పటి గ్రీకు ప్రజల మనస్తత్వాన్ని మళ్లీ పునరుద్ధరించగలిగే సామర్థ్యం ఉన్నవారు కావొచ్చు.
ఇవి కూడా చదవండి:
- మీరాబాయి చానూ: రియో ఒలింపిక్స్‌లో ఓటమి నుంచి టోక్యోలో విజయం వరకు
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








