టోక్యో ఒలింపిక్స్: మహిళా క్రీడాకారుల దుస్తుల గురించి ఎందుకంత రాద్ధాంతం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
భారత్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తారని దేశం మొత్తం ఎదురుచూస్తోంది.
వినేశ్ ఫోగట్ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టినప్పుడు తనకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించాలని అనుకున్నారు. టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ అయితే రెజ్లింగ్‌కు అనువుగా ఉంటుందని భావించారు.
అయితే, ఆ బట్టల్లో ఆమె శరీర భాగాలు కొట్టొచ్చినట్టు కనిపించడం జనానికి రుచించలేదు.
హరియాణాలోని పుట్టి పెరిగిన వినేశ్ సల్వార్ సూటుకు బదులు శరీరానికి అతుక్కుపోయినట్టు ఉండే బిగుతు దుస్తులు ధరించి రెజ్లింగ్‌లో పాల్గొనడం చూసి అక్కడి ప్రజలు విస్తుపోయారు.
అమ్మాయిని అలాంటి దుస్తుల్లో ఎలా బయటకు పంపిస్తారంటూ వినేశ్ కుటుంబాన్ని వేలెత్తి చూపారు.
అంటే ఆటలు ఆడుతున్నప్పుడు కూడా అమ్మాయిలు పూర్తిగా ఒళ్లు కప్పుకుని ఉండాలి. రెజ్లింగ్ ఆడుతున్నప్పుడు కూడా సంప్రదాయ దుస్తులే ధరించాలి. వారి మాట చెల్లితే, తల నిండా ముసుగు వేసుకుని ఆడాలని కూడా కొందరు అనగలరు.
వినేశ్ కథ హరియాణాలో ఓ మారుమూల గ్రామానికి చెందినది. పైగా ఇది పదిహేనేళ్ల క్రితం మాట.
కానీ, ఇప్పటికీ ప్రపంచంలో ఏదో ఓ మూల మహిళా క్రీడాకారుల దుస్తుల గురించి చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి.
ఈ వివాదాలన్నీ ఆ క్రీడాకారిణుల ఆట తీరుపై, అంకితభావంపై ప్రభావం చూపకమానవు.

ఫొటో సోర్స్, Getty Images
టోక్యో ఒలింపిక్స్‌లో కూడా..
టోక్యో ఒలింపిక్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. అక్కడ కూడా మహిళా క్రీడాకారుల దుస్తుల విషయంలో వివాదాలు చెలరేగుతున్నాయి.
ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న జర్మన్ మహిళల జిమ్నాస్టిక్ బృందం, సాధారణంగా వేసుకునే బికినీ టైపు 'లియోటార్డ్' దుస్తులు కాకుండా, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే 'యూనిటార్డ్' దుస్తులు ధరించాలని నిర్ణయించుకుంది.
పూర్తి సూట్లు ధరించడమే తమకు సౌకర్యంగా ఉందని, పురుషుల్లాగే తమకు కూడా నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉండాలనేది వారి వాదన.
అంతర్జాతీయ క్రీడల్లో సాధారణంగా మహిళా క్రీడాకారులు బాగా పొట్టిగా, బిగుతుగా ఉండే దుస్తులే ధరిస్తుంటారు.
కానీ, పురుషుల దుస్తుల విషయంలో అలా కాదు. వారికి ఎలాంటి నియమాలూ వర్తించవు. వారిని ఆకర్షణీయంగా మార్చాలన్న చింత ఉండదు. ధ్యాస అంతా వారి ఆట మీదే ఉంటుంది.
ఇప్పటివరకూ ఇలాంటిది జరగలేదుగానీ, ఒకవేళ టెన్నిస్ ఆడే మహిళలు స్కర్టులు కాకుండా పురుషుల్లా పొడవైన షార్ట్స్ ధరించి ఆడాలని నిర్ణయించుకుంటే ఎలాంటి వివాదాలు పుట్టుకొస్తాయో ఊహించలేం.
ఆట నియమాలు ఏర్పరిచేవాళ్లు, మార్కెట్ కూడా మహిళా క్రీడాకారుల ఆటతో పాటు వారి శరీరాలకు కూడా ప్రాధాన్యాన్ని కట్టబెట్టారు.

ఫొటో సోర్స్, Reuters
పురుషుల ప్రపంచంలో మహిళలు ఆకర్షణీయంగానే ఉండాలా?
క్రీడా ప్రపంచంలో ఎల్లప్పుడూ పురుషుల ఆధిక్యమే కొనసాగుతోంది.
ఆటల్లోకి అడుగుపెట్టిన మహిళలు శారీరక కోమలత్వం, సున్నితత్వాలను పక్కనపెట్టి పురుషుల్లాగే కఠోర శ్రమ చేస్తారు. శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకుంటారు.
అయినప్పటికీ, స్త్రీ అంటే ఆకర్షణే. ఇది చాలా విచారకరమైన ఆలోచన. పోనీ, ఆకర్షణీయంగా కనిపిస్తే, ఆట నుంచి దృష్టి మరల్చే ప్రయత్నాలని మళ్లీ వాళ్లనే నిందిస్తారు.
వినేశ్ ఫోగట్ అక్క గీతా ఫోగట్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మహిళా క్రీడాకారులపై ఎలాంటి వివక్ష ఉంటుందో వివరించారు.
"ఒక అమ్మాయి వల్ల ఏదైనా పొరపాటు జరిగినా, లేదా ఓ అబ్బాయితో స్నేహం చేసినా అమ్మాయి తల్లిదండ్రులను నిందిస్తారు. ఆటలని, పాటలని అమ్మాయిలను బయటకు పంపితే వాళ్లు అలాగే తయారవుతారని దుర్భాషలాడతారు. మహిళా క్రీడాకారులు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తే వారికి సత్ప్రవర్తన లేదని తీర్పులిచ్చేస్తారు" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ జబ్బు తగ్గదు
2017లో, భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ తన స్నేహితులతో కలిసి తీసుకున్న సెల్ఫీ ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్ వేసుకున్నారు. ఆ ఫొటోపై వచ్చిన విమర్శలు ఇన్నీ అన్నీ కావు.
ట్విట్టర్‌లో విపరీతంగా ట్రోల్ చేశారు. మీడియాలో ఆమె గురించి ప్రచురించిన కథనాల హెడ్‌లైన్‌లలో 'పోర్న్ స్టార్', 'ఇన్‌డీసెంట్', 'ఇనెప్రోప్రియేట్' లాంటి పదాలు కూడా వాడారు.
'మిథాలీ రాజ్ ట్రోల్డ్: ఆర్ యూ పోర్న్ స్టార్? ట్విట్టర్ షామ్స్ హెర్, క్వశ్చన్స్ డ్రెస్ సెన్స్'
'ఇండియన్ కెప్టెన్ మిథాలీ రాజ్ ట్రోల్డ్ ఆన్ ట్విట్టర్ ఫర్ హెర్ ఇండీసెంట్ డ్రెస్సింగ్'
'మిథాలీ రాజ్ గెట్స్ ట్రోల్డ్ ఫర్ ఇనెప్రోప్రియేట్ డ్రెస్సింగ్; గెట్స్ టన్స్ ఆఫ్ సపోర్ట్ ఇన్ రిటర్న్'
..ఇవీ కొన్ని హెడ్‌లైన్స్.

ఫొటో సోర్స్, Reuters
క్రీడా ప్రపంచంలో, మైదానంలో కానివ్వండి, బయట కానివ్వండి.. మోడరన్, ఫార్వర్డ్ లాంటి బిరుదలన్నీ మహిళలకే ఇస్తారు. వారు వేసుకునే బట్టలపైనే సవాళ్లు తలెత్తుతాయి.
18 ఏళ్ల వయసులోనే భారతదేశానికి ఖ్యాతి తెచ్చిపెట్టిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జా దుస్తులపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె సభ్య సమాజం నియమాలను ఉల్లంఘించారంటూ ఆరోపించారు.
2005లో సున్నీ ఉలేమా బోర్డ్‌కు చెందిన ఒక మౌలానా, సానియా "అసభ్యకరమైన" దుస్తులు ధరించి ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఈ తరహా వస్త్రధారణ "యువతులపై చెడు ప్రభావం కలిగిస్తుందని" విమర్శించారు.
ఆమెపై ఫత్వా జారీ చేస్తూ, మహిళలు పొట్టి బట్టలు వేసుకోవడాన్ని ఇస్లాం అనుమతించదని, సానియా మిర్జా వేసుకున్న బట్టలు చాలావరకు తన శరీర భాగాలను కప్పి ఉంచట్లేదని, దానివల్ల ఊహకు ఇంకేం మిగలడం లేదని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ ఫత్వాపై స్పందించడానికి సానియా నిరాకరించారు. తాను వేసుకునే దుస్తులపై ఎన్నో వివాదాలు ఉన్నాయని, అవన్నీ తన మనసును బాధపెడతాయని అన్నారు.
కొన్నిసార్లు మతం, కొన్నిసార్లు సమాజం, మరి కొన్నిసార్లు మార్కెట్.. మహిళా క్రీడాకారుల దుస్తుల విషయంలో వివాదాలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. వారికి మనస్తాపం కలిగిస్తూనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, JOZO CABRAJA / KOLEKTIFF
సెక్సిజం, హింస
పురుషాధిక్య ప్రపంచంలో పొట్టి బట్టలేసుకుని ఆడే మహిళా క్రీడాకారులు "అవైలబుల్"గా ఉంటారని భావిస్తుంటారు.
భద్రత కల్పించవలసిన శిక్షణ కేంద్రాలు, కోచ్‌లు కూడ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. కానీ, ఆ విషయాలు బయటకు చెప్తే ఎక్కడ ఆడే అవకాశాలు పోగొట్టుకుంటామో అని మహిళా క్రీడాకారులు భయపడుతుంటారు.
మొదటే క్రీడల్లో మహిళలకు అవకాశాలు తక్కువ, ఆపై ఇలాంటి వాటి గురించి బయటకు చెప్తే ఇంక అసలు ఆడనివ్వరేమోననే భయం ఉంటుంది.
మహిళా క్రీడాకారులను ఆకర్షణ అనే చట్రం నుంచే చూడడానికి, వారిపై లైంగిక హింసకు దగ్గర సంబంధం ఉంది.
టోక్యో ఒలింపిక్స్‌కు ముందే, ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన యూరోపియన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జర్మన్ జిమ్నాస్టిక్స్ జట్టు తొలిసారిగా 'యూనిటార్డ్' ధరించి, మహిళా క్రీడాకారుల దుస్తులపై చూపుతున్న వివక్షకు నిరసన వ్యక్తం చేసింది.
జిమ్నాస్టిక్స్‌లో మహిళల 'సెక్సువలైజేషన్ ', లైంగిక హింసను అడ్డుకోవడానికి ఈ రకమైన నిరసన అవసరమని జర్మన్ ఫెడరేషన్ పేర్కొంది.
జిమ్నాస్టిక్ క్రీడల ప్రపంచంలో లైంగిక హింసకు తాజా ఉదాహరణగా అమెరికా మహిళల టీమ్ డాక్టర్ లారీ నాసర్ కేసు గురించి చెప్పుకోవచ్చు.
150 మంది మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించారన్న ఆరోపపణలతో నాసర్‌కు 175 సంవత్సరాల జైలు శిక్ష పడింది.
గత వారం నార్వే మహిళల బీచ్-హ్యాండ్‌బాల్ జట్టు తమ సౌకర్యం కోసం బికినీ షార్ట్స్ కాకుండా నిక్కర్లు వేసుకోవాలని నిర్ణయించుకుంది. ఫలితంగా, వారు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. క్రీడా దుస్తుల నియమాన్ని ఉల్లంఘించారంటూ వారికి జరిమానా విధించారు.
అయితే, అమెరికా పాప్ స్టార్ పింక్, ఆ పరిహారం తాను చెల్లిస్తానంటూ ముందుకు వచ్చి ఈ మహిళా క్రీడాకారులకు అండగా నిలిచారు.
ఇలాంటి సెక్సిస్ట్ నియమాలను ప్రవేశపెట్టిన ఫెడరేషన్‌పై జరిమానా విధించాలంటూ పింక్ ట్వీట్ చేశారు.
"నార్వే మహిళల జట్టును చూసి నేను గర్వపడుతున్నాను. ఇలాగే ముందుకు వెళదాం" అంటూ ఆమె మద్దతు తెలిపారు.
ఈ "ముందుకు వెళదాం" అనే నినాదాన్ని ఆచరణలో పెట్టడానికి మహిళలు ఇంకా చాలా కుస్తీలు పట్టాల్సి ఉంది. ఇంకా ఎంతో పోరాటం మిగిలే ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఒలింపిక్స్ క్రీడలను భారత్ ఎందుకు నిర్వహించడం లేదు? ఆతిథ్య నగరాన్ని ఎవరు నిర్ణయిస్తారు.. 2048 ఒలింపిక్స్ భారత్‌లోనేనా?
- గోరఖ్‌పుర్: బ్రాహ్మణుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న దళితుడిని చంపేశారు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన భారత్‌కు ఇస్తున్న సందేశం ఏంటి?
- టోక్యో ఒలింపిక్స్: భారత్ నుంచి పతకం సాధించగలిగే అగ్రశ్రేణి క్రీడాకారులు వీరే...
- పోర్నోగ్రఫీ: ప్రస్తుత చట్టాలతో అడ్డుకోవచ్చా? శిల్పా శెట్టి భర్తపై ఆరోపణలు ఏంటి?
- చైనా తన అణ్వాయుధాల నిల్వలను పెంచుకుంటోందని ఆరోపించిన అమెరికా
- ప్రశాంత్ కిశోర్: జనాన్ని మెప్పించి ఎన్నికల్లో గెలవడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








