రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి

ఫొటో సోర్స్, PIB
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. ఇది హైదరాబాద్‌కి 200 కిలోమీటర్లు, వరంగల్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
రుద్రేశ్వరుడు అనే పేరుతో శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ గుడి శిల్ప సంపద విశిష్టమైనది. దీంతో ఈ ఆలయాన్ని తాజాగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది యునెస్కో.
కాకతీయులు క్రీస్తు శకం 1123–1323 మధ్య తెలుగు రాష్ట్రాల్లో సింహ భాగాన్ని పాలించారు. 1213లో ఈ గుడి నిర్మాణం ప్రారంభం అయింది. నిర్మాణానికి సుమారు 40 ఏళ్లు పట్టిందని చరిత్రకారుల అంచనా.
కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు ఈ గుడి కట్టించినట్టు శాసనాలు చెబుతున్నాయి. రేచర్ల రుద్రుడినే రుద్ర సేనాని, రుద్ర దేవుడని, రుద్ర రెడ్డి అని రాశారు.
ఈ గుడి శిల్పి పేరు రామప్ప. శిల్పి పేరుతో ఖ్యాతి గడించిన గుడి లేదా నిర్మాణం అరుదు.

ఫొటో సోర్స్, ASI
నిర్మాణ శైలి
నేల నుంచి ఆరు అడుగులు ఎత్తున్న నక్షత్రాకార మండపంపై ఈ గుడి నిర్మించారు. నీటి మీద తేలియాడుతాయని చెప్పే ఇటుకలతో గర్భాలయం, విమానం నిర్మించారు. గుడిలో పలు ఉపాలయాలు, నంది విగ్రహం ఉన్నాయి.
పక్కనే ఉన్న రామప్ప చెరువు, అందమైన తోటలు దీనికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
గుడిని ప్రధానంగా ఎర్ర ఇసుకరాయి (రెడిష్ శాండ్ స్టోన్)తో నిర్మించారు. బయటి భాగాల్లో నల్లరాయి వాడారు. పునాది లేకుండా నేరుగా ఇసుకపై ఈ గుడి నిర్మించారు. రాయి రంగు ఇప్పటికీ కోల్పోలేదు.
అనేక యుద్ధాలు, దాడులు, 17వ శతాబ్దిలోని ఒక భూకంపాన్ని తట్టుకుని ఈ గుడి నిలిచింది. అయితే గుడి పరిధిలోని కొన్ని చిన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ప్రధాన ద్వారం దెబ్బతింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
ఈ గుడి నిర్మాణం సాంకేతికతను ‘‘శాండ్ బాక్స్ టెక్నిక్’’ అంటారు. భూకంపాలను తట్టుకునేలా దీన్ని నిర్మించడం విశేషం.
1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కఫూర్ దక్షిణ భారత దండయాత్రల్లో ఈ గుడి కొంచెం ధ్వంసం అయిందని చెబుతారు. ఆధునిక కాలంలో గుప్త నిధులు కోసం తవ్వేవాళ్లు మరికొంత ధ్వంసం చేశారు.

ఫొటో సోర్స్, ASI
శిల్పకళ
గర్భగుడి ముందుండే మండపంలో అద్భుత శిల్పకళ ఉంటుంది. పురాణ గాథలు, నాట్యగత్తెలు, సంగీత వాయిద్యకారులు, పౌరాణిక జంతువులు.. ఇలాంటివి ఆ శిల్పాలపై చెక్కారు.
హైహీల్స్ వేసుకున్న మహిళ శిల్పం ప్రత్యేక ఆకర్షణ. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలోని నంది శిల్పం కూడా మిగతా చోట్ల కంటే భిన్నంగా ఉంటుంది.
స్తంభాల నుంచి పైకప్పు మధ్యలో ఉన్న నల్లరాతిలో చెక్కిన నాట్య భంగిమలు... మండపం పైకప్పు లోపలి భాగంలో చెక్కిన సూక్ష్మ శిల్పాలు, బయటి గోడలపైనా, స్తంభాలపైనా ఉన్న వివిధ శిల్పాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. నల్లరాయి, ఎర్ర ఇసుక ఇటుకల మేళవింపు ఈ గుడి.

ఫొటో సోర్స్, PIB
శిల్పాల నుంచి నాట్యం పుట్టింది!
ఈ గుడిపై ఉండే శిల్ప భంగిమలను ఆధారం చేసుకుని అంతరించిపోయిన పేరిణి శివతాండవం అనే నృత్యాన్ని తిరిగి పునరుద్ధరించారు నటరాజ రామకృష్ణ. జాయప సేనాని రాసిన నృత్య రత్నావళిలోని కొన్ని భంగిమలు కూడా ఈ గుడిపై శిల్పాలుగా చెక్కారు.

ఫొటో సోర్స్, PIB
శాసనానికో మండపం
ప్రతి గుడి నిర్మాణానికీ కొన్ని శాసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని పాడవుతుంటాయి. అయితే ఈ గుడికి సంబంధించిన శాసనం పాడవకుండా, ప్రత్యేకంగా ఆ శాసనం కోసమే ఒక మండపం కట్టించారు.
హెరిటేజ్ హోదా
ఈ గుడి ప్రస్తుతం భారత పురావస్తు సర్వే వారి ఆధీనంలో ఉంది. తెలంగాణ పర్యటక విభాగం కూడా ఈ గుడిని ప్రమోట్ చేస్తోంది. ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. శివరాత్రి ఉత్సవాలు చేస్తారు. వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా కోసం 2014లో ఈ గుడిని నామినేట్ చేశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
2019లో భారత ప్రభుత్వం, వారసత్వ హోదా కోసం ఈ ఒక్క గుడిని మాత్రమే పంపింది. ఐక్యరాజ్య సమితి విభాగం అయిన యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశంలో ఈ గుడికి ప్రపంచం వారసత్వ కట్టడం హోదా ఇస్తూ తీర్మానించింది.
వాస్తవానికి 2020వ సంవత్సరంలోనే జరగాల్సిన ఈ సమావేశం, కరోనావైరస్ వ్యాప్తి వల్ల వాయిదా పడి 2021లో జరిగింది.
ఇవి కూడా చదవండి:
- మీరాబాయి చానూ: రియో ఒలింపిక్స్‌లో ఓటమి నుంచి టోక్యోలో విజయం వరకు
- తెలంగాణ: వనపర్తి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమేంటి?
- కృష్ణా జల వివాదం: నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ వివాదం, దీనికి మూలం ఎక్కడ?
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









