చార్మినార్
ఈ అపూర్వ కట్టడం ఇప్పుడెలా ఉంది?

చార్మినార్.. హైదరాబాద్‌కు చిహ్నం. కానీ 428 సంవత్సరాల పురాతనమైన ఈ చారిత్రక నిర్మాణం కాలంతో పాటు దెబ్బతింటూ వచ్చింది. ఇటీవలి ఘటనలతో, చార్మినార్ పొరల మధ్య పగుళ్లు, ఖాళీలు బయటపడ్డాయి. కాలక్రమేణా చార్మినార్, అది ఉన్న స్థలాన్ని నిర్లక్ష్యం చేశారు. చేస్తున్నారు.
పెచ్చులూడుతున్న మినార్

ఆఫ్రోజ్ అనే ఫొటోగ్రాఫర్ చార్మినార్ దగ్గర 15 సంవత్సరాల నుంచి ఫొటోలు తీసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. “చార్మినార్ ఒక పొడవైన నిర్మాణం. ప్రజల దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నప్పటికీ, దీని ముందు నిలబడి ఫొటో తీయించుకొని ఆ ఫొటో హార్డ్ కాపీ చూసుకున్న ప్రతిసారీ వచ్చే ఆనందమే వేరు” అని చెప్పారు ఆఫ్రోజ్.
మే ఒకటి అర్థరాత్రి చార్మినార్ మినార్లలో ఒకదాని నుంచి కొంత భాగం పడిపోయింది. మక్కా మసీదు ఎదురుగా ఉన్న మినార్ గ్రానైట్ స్లాబ్ నుంచి సున్నం మిశ్రమంతో చేసి అతికించిన భాగాలు వేరై కింద పడిపోయాయి. చార్మినార్‌కి ఇలా జరిగినందుకు బాధపడుతున్నాని చెప్పారు ఆఫ్రోజ్. "ఇది మూడో ఘటన. నేను ఆ మర్నాడు ఇక్కడకు వచ్చినప్పుడు ఆ శిథిలాలు చూశాను. ఈ నిర్మాణం చాలా పాతది. ఇంకా చాలా మంది ప్రజలు వచ్చి చార్మినార్ అందాన్ని చూడాలంటే మనం దీన్ని కాపాడుకోవాలి” అన్నారు ఆఫ్రోజ్.
కానీ, చార్మినార్ కట్టడానికి జరుగుతున్న నష్టాలు ఆందోళనకు కారణం అవుతున్నాయి. మినార్ ముక్క పడిపోయిన తరువాత ఇటీవల పొరలలోని ఖాళీలు, పగుళ్లు బహిర్గతం అయ్యాయి. సున్నం ప్లాస్టర్లు ఊడిపోవడం కొత్త కాదు. అయితే తాజా ఘటనలు, ఆ నిర్మాణంలో పగుళ్లను కూడా బహిర్గతం చేసింది. దీంతో మొత్తం చార్మినార్ ఎంత భద్రంగా ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
సంఘటన జరిగిన తరువాత, ఏఎస్ఐ పర్యవేక్షక పురావస్తు శాస్త్రవేత్త మిలిన్ కుమార్ చౌలే నిర్మాణం భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. "అలంకరణగా ఉన్న ఒక సున్నం మోర్టార్ భాగం కింద పడిపోయింది. పడిపోయిన భాగం పగుళ్లను బహిర్గతం చేసిందని సంఘటనా స్థలాన్ని సందర్శించిన అధికారులు చెప్పారు. పగుళ్లు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. కొంచెం పెద్ద ముక్క పడిపోతుందని మేం భయపడుతున్నాం. కాబట్టి, మేం దాని చుట్టూ ఒక మెష్ వేస్తున్నాం” అని చౌలే చెప్పారు.
చార్మినార్

చార్మినార్‌ను 1591లో కుతుబ్ షాహీ రాజవంశంలోని ఐదో పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. హైదరాబాద్ నగరం కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ (నిజాం)ల రాజధాని.
హైదరాబాద్ నగరం లేఅవుట్‌కి చార్మినార్ మూలం అని చరిత్రకారులు అంటున్నారు. చరిత్రాత్మక వాణిజ్య మార్గం మధ్యలో ఉంది చార్మినార్. గోల్కొండ మార్కెట్లను మచిలీపట్టణం ఓడరేవును కలుపుతూ ఉన్న మార్గంలో ఉంది చార్మినార్. అష్ట దిక్కుల్లో కనిపించే చార్మినార్, చార్ కమాన్లు ఉమ్మడిగా రెండో ఇస్లామిక్ సహస్రాబ్ది ప్రారంభానికి సంకేతాలు. షియాల నగర ప్రణాళికకు ఈ కట్టడం ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.
ఈ నిర్మాణం పర్షియన్ వాస్తు శిల్పం ద్వారా ప్రేరణ పొందింది. చార్మినార్‌ను గ్రానైట్, సున్నపురాయి, మోర్టార్, పల్వరైజ్డ్ పాలరాయితో నిర్మించారు. చార్మినార్ నాలుగు అంతస్తుల చదరపు నిర్మాణం. నాలుగు మినార్లను నాలుగు వైపులా నిర్మించారు. ప్రతి మినార్ బేస్ వద్ద నమూనాల వంటి రేకులతో ఉబ్బెత్తు గోపురం ద్వారా కిరీటాలు నిర్మించారు. గార (స్టక్కో) అలంకరణలు, బ్యాలస్ట్రేడ్లు, బాల్కనీల అమరిక చార్మినార్‌కు ప్రత్యేకమైనవి. పై అంతస్తులకు చేరుకోవడానికి 149 మెట్లు ఉన్నాయి. పైకప్పుకు పశ్చిమ భాగంలో మసీదు ఉంది. ఈ మసీదులో 40 మంది ప్రార్థనలు చేయడానికి సరిపడే స్థలం ఉంది. నాలుగు వైపులా తోరణాలపై గడియారాలు ఉన్నాయి.

గార (స్టక్కో) అలంకరణల క్లిష్టమైన నమూనాలు మంత్రముగ్ధులను చేస్తాయి. దీనిని నిర్మించిన కార్మికులను పర్షియా నుంచి తీసుకువచ్చారు. కొన్ని భాగాల్లో వెదురు ముక్కల చుట్టూ సున్నం మోర్టార్ వేసి చేసిన అలంకరణలున్నాయి. కొన్ని అలంకరణలు టెర్రకోటతో తయారు చేశారు."
చార్మినార్ నిర్మాణంలో స్థానికంగా లభించే గ్రానైట్, ఇటుక, ఇసుక, సున్నం, పాలరాయి పొడులను ఉపయోగించారు. మన్నికైన గారను ఇవ్వడానికి ప్లాస్టర్ కోసం సున్నం, పాలరాయి పొడి ఉపయోగించారు. సున్నం బలాన్ని పెంచడానికి షెల్స్, బెల్లం, గుడ్డు తెల్లసొన ఉపయోగించారు.
అసఫ్ జాహీ పాలనలో నైరుతి వైపున్న మినార్ పిడుగుపాటుకు దెబ్బతింది. 60,000 రూపాయల వ్యయంతో మరమ్మతు పనులను సుబేదార్ దిల్ ఖాన్ చేపట్టారని చరిత్రకారుడు సఫీవుల్లా చెప్పారు. 1894లో, ఈ స్మారక చిహ్నాన్ని లక్ష రూపాయల వ్యయంతో మూడో అసఫ్ జాహీ తిరిగి ప్లాస్టరింగ్ చేయించారు. 2001లో, భారీ వర్షాల కారణంగా అదే నైరుతి మినార్ సున్నం గార పని ఊడి పడిపోయింది. పునరుద్ధరణ పనులను ఏఎస్ఐ చేపట్టింది.
పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం-1958 కింద చార్మినార్ జాతీయ ప్రాముఖ్యం కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించారు. ఆ విధంగా చార్మినార్ సంరక్షణ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి వచ్చింది. దీని రక్షణ, నిర్వహణ వారి బాధ్యతే.
తాజా ఘటన కూడా మళ్లీ అదే నైరుతి మినార్‌లో జరిగింది. వాన వల్ల సున్నపురాయి మోర్టార్ నానిపోయిందని వివరించారు పురావస్తు శాస్త్రవేత్తలు. "పడిపోయిన భాగాలు చూస్తే అది పొడి పొడిగా ముక్కలైంది (క్రంబ్లీ). 30 గ్రాముల సున్నపురాయి ప్లాస్టర్ నీటిలో నానబెట్టినప్పుడు దాని బరువు రెండింతలు అవుతుంది. పడిపోయిన భాగానికి ఏ ఆధారమూ లేదు” అని మిలిన్ కుమార్ చౌలీ వివరించారు.

ఎందరికో జీవనాధారం

చార్మినార్ చార్ కమాన్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ అత్తర్ షాపులను దాటి, చార్మినార్ చుట్టూ బిజీగా ఉన్న మార్కెట్ గుండా వెళ్తూ, ఉస్మానియా బిస్కెట్లతో ఇరానీ చాయ్ సిప్ చేయడం ప్రతి పర్యాటకుడికీ ఓ మధురానుభూతి. చార్మినార్ చుట్టూ ఉన్న ఇరానీ చాయ్ కేఫ్‌లు ఉస్మానియా బిస్కట్‌ల నుంచి బిర్యానీల వరకు అందిస్తాయి. లాడ్ బజార్‌లోని ‘చార్మినార్ కే ఫేమస్ చుడి’ బజార్‌ను గాజుల కోసం చాలా మంది పర్యటకులు తప్పక సందర్శిస్తారు.
ఈ మార్కెట్ చాలా మంది హాకర్లకు జీవనాధారం. “నేను తోపుడు బండి మీద పళ్లు అమ్మేందుకు మా నాన్నతో చార్మినార్‌కు వచ్చేవాడిని. అప్పుడు నాకు 14 ఏళ్లుంటాయి. నా ఇద్దరు సోదరిలకూ పెళ్లి చేయగలిగాం. ఇల్లు కొనుక్కున్నాం. నా వయసు ఇప్పుడు 54 సంవత్సరాలు. నేను పళ్లవ్యాపారం మీదే ఆధారపడి బతుకుతున్నా. చార్మినార్ చరిత్రలో చాలా మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ నాలాంటి చాలా మంది ఉన్నారు. చార్మినార్ వల్లే వారు వ్యాపారాలు చేసుకుంటున్నారు” అని అహ్మద్ చెప్పారు.
ఏదేమైనా, చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచీ ఇక్కడి చిరువ్యాపారుల వేగం తగ్గింది. 2018లో హాకర్లను తొలగించారు. కానీ హాకర్లు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ పొంది తిరిగి వచ్చారు. అధికారులు మాత్రం ఇది తాత్కాలికమే అంటున్నారు. హాకర్లను వేరే ప్రదేశానికి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
చార్మినార్ పాదచారుల ప్రాజెక్టును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ 1993లో ప్రారంభమైంది. "రీస్ట్రక్చరింగ్ హిస్టారిక్ కోర్ ఆఫ్ చార్మినార్" పేరుతో ఈ ప్రాజెక్టు చేపట్టారు.

చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్

చార్మినార్ ప్రాంతంలో పరిసరాల వాతావరణం, పరిస్థితులు, పర్యటక మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ కింద, జీహెచ్ఎంసీ.. చార్మినార్ చుట్టూ ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను, మల్టీపర్పస్ పార్కింగ్, కట్టడం చుట్టూ బఫర్ జోన్ సృష్టించడం (నిర్మాణానికి ట్రాఫిక్ వల్ల ఇబ్బంది కలగకుండా), సుందరీకరణ పనులు, మొక్కల పెంపకం చేపట్టారు. ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దీనివల్ల చార్మినార్ దగ్గర ట్రాఫిక్ తగ్గిందని వివరించారు శ్రీనివాస్.

ఈ ప్రాజెక్ట్ కింద చార్మినార్ చుట్టూ కాబిల్డ్ రాళ్లు వేశారు. అసలు ఈ ప్రాజెక్టు చేపట్టిందే చార్మినార్ చుట్టూ వాహనాలు తిరగకుండా చేయడం కోసం. అందులో భాగంగా, చార్మినార్ వైపు వెళ్లే దారులన్నింటిలోనూ వాహనాలు వెళ్లకుండా సిమెంటు దిమ్మెలు అడ్డుగా పెట్టారు.
పని ఇంకా కొనసాగుతోంది. చార్మినార్ పరిసరాలను అందంగా తీర్చిదిద్ది, ఈ కట్టడం సౌందర్యాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
ఈ ప్రాజెక్టు కోసం 1993 నుంచి ఇప్పటివరకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
చార్మినార్ బలహీనపడుతోంది

ఈ కట్టడం సరిహద్దుల విషయంలో ఏఎస్ఐ, చార్మినార్‌ను పరిరక్షించే ఇతర విభాగాల మధ్య కొన్ని భేదాభిప్రాయాలున్నాయి.
పాదచారుల ప్రాజెక్టు జీహెచ్‌ఎంసీ చేపట్టింది. కానీ జీహెచ్ఎంసీ చేసిన పనుల వల్ల చార్మినార్ పరిసరాలు అందంగా మారడం అటుంచి, మొత్తం కట్టడానికి హాని కలిగించేలా ఉన్నాయని ఏఎస్ఐ అంటోంది. జీహెచ్‌ఎంసీ పనుల వల్ల ఏర్పడ్డ ప్రమాదాల గురించి మిలిన్ కుమార్ చౌలే గట్టిగానే నిరసన వినిపించారు. చార్మినార్‌కి 20 మీటర్ల దూరంలో భూగర్భ పైపులైన్ ప్రాజెక్టు చేపట్టింది జీహెచ్ఎంసీ. “అసలు ప్రణాళిక ప్రకారం 1 అడుగు వ్యాసం పైపులైన్ వెయ్యాలి. కానీ గ్రేటర్ వాళ్లు మాత్రం 6-7 అడుగులు తవ్వి, మూడు అడుగుల వ్యాసం ఉన్న రెండు పైప్ లైన్లు వేశారు. అది కూడా చార్మినార్‌కు 20 మీటర్ల దూరంలో. ఆ పైపులైనుకు జాయింట్లు ఉన్నాయి. దీని వల్ల నీరు లీక్ అయ్యే ప్రమాదం ఉంది” అని మిలిన్ కుమార్ చెప్పారు.
ఏఎస్ఐ అనుమతి, సంప్రదింపులు లేకుండా ఈ పని చేపట్టారని ఆయన అన్నారు. "పైపులైన్లు వేసినప్పుడు, ఎర్త్ మూవర్స్ వాడటం వల్ల మట్టి (సబ్‌సోయిల్) కదిలింది. మే మొదటి వారంలో జరిగిన ప్రమాదానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు” అని అన్నారాయన.

మిలిన్ మరో కారణం కూడా చెప్పారు. 1930లో రహదారి నిర్మాణం చేపట్టినప్పుడు అది చార్మినార్ బేస్‌ను తాకుతూ సాగింది. దీని వల్ల రోడ్డుపై వాహనాలు వెళ్లినప్పుడు వైబ్రేషన్లు (ప్రకంపనలు) నేరుగా చార్మినార్ పునాదులను తాకుతున్నాయి. ఇది కూడా సమస్యకు మరో కారణంగా మారింది. "ఎన్జీఆర్ఐ వారు చార్మినార్‌కీ రోడ్డుకీ మధ్య ఖాళీ స్థలం ఏర్పాటు చేసి దాన్ని ఇసుకతో నింపమని సలహా ఇచ్చారు. దానివల్ల చార్మినార్ పునాదులను తాకే ప్రకంపనలు తగ్గుతాయి” అని మిలిన్ కుమార్ వివరించారు.

వర్షం, ఉష్ణోగ్రతలో వైవిధ్యం, గాలి ప్రవాహం, ప్రకృతి వైపరీత్యాలు కూడా నిర్మాణం క్షీణతకు కారణమవుతాయి. కాలుష్యం కూడా ఒక కారణమని చెబుతోంది పురావస్తు శాఖ. ఏఎస్ఐ దక్షిణ ప్రాంత రసాయన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేశ్వరి దీనిపై ఓ నివేదిక ఇచ్చారు. “వాహనాల నుంచి వెలువడే పొగ, అక్కడ వాహనాలు తిరగడం వల్ల లేచే దుమ్ము చేరడం కూడా చార్మినార్ ఆకృతి, రంగు, అందం చెడిపోవడానికి ముఖ్య కారణం అవుతున్నాయి" అని ఆ నివేదికలో పేర్కొన్నారు.

కాలుష్య కారకాల స్థాయిని అంచనా వేయడానికి, చార్మినార్ ప్లాస్టర్‌పై ఒక అధ్యయనం చేపట్టారు. గాలిలో పొగ, దుమ్ము, ఏరోసోల్స్‌తో చేసిన కణ పదార్థాలు వీటికి కారణాలని వివరించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సూచించిన స్థాయిలో కంటే కాలుష్య కారకాలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనం వెల్లడించింది. వాహనాల కదలిక వలన వచ్చే శబ్దం స్థాయులను కూడా అధ్యయనం చేశారు. ఆ శబ్దాల వల్ల అతి చిన్న పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీని గురించే చార్మినార్ చుట్టూ ఉన్న ప్రదేశాలలోకి ఆటోలు ప్రవేశించకుండా నిలిపేశారు అధికారులు. అయినప్పటికీ అది కాలుష్య స్థాయిని తగ్గించడంలో పెద్దగా ప్రభావం చూపలేదు.

మరో ప్రధాన సమస్య.. ఆక్రమణలు. ఈ కట్టడం సరిహద్దులను నిర్వచించడానికి రెవెన్యూ మ్యాపులు లేవు. అదో సమస్యగా మారింది. పరిరక్షణ పనులకు ఇది ఆటంకంగా మారింది. మినార్‌లోకి చొచ్చుకువచ్చి ఒక గుడి నిర్మించారు. “ఆ ఆలయం ఇప్పుడు మినార్‌ను తాకుతోంది. మేం ఆ ప్రాంతంలోని పెద్ద స్థలంలో ఎలాంటి పరిరక్షణ పనులను నిర్వహించలేకపోతున్నాం. 1950నాటి ఫొటోలు అసలక్కడ ఆలయమే లేదని చూపిస్తున్నాయి” అని మిలిన్ కుమార్ అన్నారు.
పరిరక్షణ - సంరక్షణ కోసం కేటాయించిన బడ్జెట్లు చాలా తక్కువ అని కూడా అధికారులు చెప్తున్నారు. మంచి నైపుణ్యం ఉన్న శ్రామికులు, ఇలాంటి కట్టడాల దగ్గర పనిచేసే అనుభవం ఉన్నవారు చాలా తక్కువ. వారికి ఏఎస్ఐ ఇచ్చే డబ్బు సరిపోక, పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.
ఈ కారణాలన్నీ కలగలిసి చార్మినార్ అందం, రూపం, నిర్మాణం, ఆకృతులను చెడగొడుతున్నాయి. మొత్తం చార్మినార్ కట్టడమే దెబ్బతింటోంది. అందం పోతోంది.
చార్మినార్ నిర్మించడానికి కారణాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం అని చెప్పారు సయ్యద్ అజ్గర్ హుస్సేన్. ఆయన వాస్తుశిల్పి మీర్ మోమిన్ అస్టారావాడి గురించి పరిశోధన చేస్తున్నారు. "అప్పట్లో గోల్కొండలో రద్దీ, జనాభా పెరిగిపోవడంతో హైదరాబాద్ నగరాన్ని నిర్మించాలనుకున్నారు. ఆ కాలంలో, ప్రస్తుత చార్మినార్ చుట్టూ కార్మిక వర్గం ప్రజలు నివసించేవారు. కాబట్టి నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు, దానికంటే ముందే చార్మినార్‌ని పూర్తి చేయాలని ప్రజలు ఆయనను కోరారు. ఎందుకంటే స్మారక చిహ్నం ఆ తరం ఎంత బాగా బతికిందో సూచిస్తుంది. ఆ తరం ప్లేగు వ్యాధితో పోరాడింది" అని ఆయనన్నారు. చార్మినార్ పరిరక్షణ గురించి ఆయన ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు, చార్మినార్ ఇప్పుడున్న స్థితి దురదృష్టకరమని చెప్పారు. “ఇది కేవలం ఒక స్మారక చిహ్నం మాత్రమే కాదు. దీని వెనుక ఓ అర్థం ఉంది. ఈ నిర్మాణం నగర బాగోగులను సూచిస్తుంది. చార్మినార్‌ను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది” అని సయ్యద్ అజ్గర్ హుస్సేన్ చెప్పారు.
ప్రపంచ వారసత్వ సంపద హోదా ?

2010లో యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రపంచ వారసత్వ ట్యాగ్ కోసం కావల్సిన పత్రాలన్నింటినీ కలిపి పంపింది. చార్మినార్‌తోపాటు గోల్కొండ, కుతుబ్ షాహీ సమాధులను కూడా ఆ జాబితాలో చేర్చారు.
యునెస్కో వెబ్‌సైట్‌లోని తాత్కాలిక జాబితాలో చార్మినార్ పేరు ఉంది. అయితే, ఆ అప్లికేషన్ పరిస్థితి ఏంటో తెలియదు. యునెస్కోకి సమర్పించిన పత్రాల ప్రకారం, "చార్మినార్ దాదాపుగా చెక్కుచెదరకుండా ఉంది, కానీ ఆ కట్టడం ఉన్న స్థలం (సైట్) సమగ్రత విషయంలో ఏళ్ల తరబడి రాజీ పడ్డారు" అని పేర్కొన్నారు. ఇక్కడ రాజీ పడడం అంటే ఏంటనేది అధికారికంగా చెప్పడానికి అధికారులు నిరాకరించినా, చార్మినార్‌కు ప్రపంచ వారసత్వ సంపద హోదా రాకపోవడానికి ఒక కారణం దాన్ని ఆనుకుని ఉన్న ఆలయం అని భావిస్తున్నారు.
ఏఎస్ఐ సూపరింటెండింగ్ పురావస్తు శాస్త్రవేత్త మిలిన్ కుమార్ చౌలే 2018 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. కొన్ని దశాబ్దాల క్రితం అక్కడ ఆలయం లేదని తన ప్రెజెంటేషన్‌లో ఆయన వాదించారు. వివిధ సందర్భాల్లో తీసిన పాత ఫొటోల సాక్ష్యాలను కూడా సమర్పించారు. మొహమ్మద్ సఫీవుల్లా వంటి చరిత్రకారులు కూడా ఆగ్నేయ మినార్ వద్ద ఆక్రమణలు కట్టడం సౌందర్యాన్ని నాశనం చేశాయని చెప్పారు. చార్మినార్ ప్రపంచ వారసత్వ హోదా పొందడంలో ఇది అడ్డంకిగా మారింది. అయితే, ఆ గుర్తింపు కోసం మళ్లీ దరఖాస్తు పంపి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ కట్టడం హైదరాబాద్‌కి చిహ్నం.
అయితే, ఆలయ కమిటీ దీనిపై మాట్లాడటానికి అందుబాటులో లేరు.


ప్రభుత్వాలు, పరిరక్షణాధికారులు, ఏఎస్ఐ.. ఈ నిర్మాణాన్ని పరిరక్షించాలనే ఆలోచిస్తున్నాయి. కానీ వారి మార్గాలు, పద్ధతుల్లో కొన్ని బేధాలున్నాయి.
ఈ నిర్మాణాన్ని పరిరక్షించడంలో ప్రజలు, పర్యటకులు సహాయపడాలని ఏఎస్ఐ విజ్ఞప్తి చేస్తోంది. ఇతర ప్రభుత్వ సంస్థలు వాటితో సమన్వయంతో పనిచేస్తాయని ఆశిస్తోంది. "మేం చార్మినార్ చుట్టూ ఎక్కువ స్థలం ఉండాలని అనుకుంటున్నాం. దానివల్ల చార్మినార్ నిర్వహణ, బాగోగులు చూసుకోవడం సులువవుతుంది. ప్రస్తుతం, చార్మినార్ చుట్టూ 15 అడుగులే అందుబాటులో ఉంది. కానీ ఇంకా ఎక్కువ స్థలం మా చేతిలో ఉంటే, చార్మినార్‌ను సందర్శించే వారికి మరింత మంచి అనుభవం అందించగలం” అంటున్నారు మిలిన్ కుమార్ చౌలే.
రిపోర్టర్: దీప్తి బత్తిని
ఫొటోలు: నవీన్ కుమార్
ఇలస్ట్రేషన్స్: పునీత్ బర్నాలా
ప్రొడక్షన్: షాదాబ్ నజ్మీ