గోరఖ్‌పుర్: బ్రాహ్మణుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న దళితుడిని చంపేశారు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

అనీశ్, దీప్తిల వివాహం

ఫొటో సోర్స్, Aneesh Family

    • రచయిత, రాజేశ్ కుమార్ ఆర్య
    • హోదా, బీబీసీ కోసం

బ్రాహ్మణుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న దళిత యువకుడు అనీశ్ కుమార్ చౌధరిని జులై 24న దారుణంగా హత్య చేశారు. ఈ హత్య వెనకున్నది అనీశ్ అత్తింటివారేనని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు.

అనీశ్, దీప్తి మిశ్రాల పెళ్లి విషయంలో దీప్తి కుటుంబం కోపంగా ఉందని, ఈ హత్యను వారే చేయించారని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అయితే, ఈ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని దీప్తి తల్లి అంటున్నారు.

ఈ హత్యకు సంబంధించి 17 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

అనీశ్, దీప్తిల వివాహం

ఫొటో సోర్స్, Aneesh Family

కలిసి చదువుకున్నారు..

గోరఖ్‌పుర్‌లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ యూనివర్సిటీలో అనీశ్, దీప్తి కలిసి చదువుకున్నారు. వేర్వేరు సబ్జెక్టుల్లో వీరు పీజీ పూర్తిచేశారు. ఎంఏ ప్రాచీన చరిత్రలో అనీశ్, సోషియాలజీలో దీప్తి పీజీ పూర్తిచేశారు. కాలేజీలో ఉన్నప్పుడే, వీరిద్దరికీ గ్రామ పంచాయతీ అధికారి ఉద్యోగాలు వచ్చాయి.

ఉద్యోగం వచ్చిన తర్వాత, 2017 ఫిబ్రవరి 9న గోరఖ్‌పుర్‌లోని వికాస్ భవన్‌లో అనీశ్‌ను తొలిసారి కలిశానని దీప్తి చెప్పారు. ఇద్దరమూ ఒకే ఉద్యోగానికి ఎంపిక కావడంతో, శిక్షణ సమయంలో తమ మధ్య బంధం బలపడిందని ఆమె వివరించారు.

‘‘మా ఇంట్లోవారికి ఈ విషయం తెలియగానే వేధించడం మొదలుపెట్టారు. అప్పుడే పెళ్లి చేసుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఒకసారి పెళ్లి అయితే వారేమీ చేయలేరని అనుకున్నాం’’ అని దీప్తి చెప్పారు.

‘‘నా స్నేహితుల్లో అన్ని కులాల, మతాల వారు ఉన్నారు. నేను కులాల గురించి పట్టించుకోను’’ అని దీప్తి అన్నారు.

పెళ్లి సర్టిఫికేట్

ఫొటో సోర్స్, Rajesh Kumar Arya

ఫొటో క్యాప్షన్, పెళ్లి సర్టిఫికేట్

పెద్దవాళ్లు ఒప్పుకోలేదు..

గోరఖ్‌పుర్‌లో 2019 మే 12న అనీశ్, దీప్తి పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 9న వీరు తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు.

‘‘మేం ఇద్దరమూ బాగా చదువుకున్నాం. పైగా ఉద్యోగాలు చేస్తున్నాం. అందుకే పెళ్లికి ఎవరూ అడ్డుచెప్పరని మొదట్లో అనుకున్నాను. ఒకవేళ ఒప్పుకోకపోయినా, నెమ్మదిగా వారి మనసు మార్చొచ్చని భావించాను. నేను వారికి నచ్చచెప్పేందుకు చాలా ప్రయత్నించాను. కానీ వారు ఎప్పటికీ ఒప్పుకోలేదు’’అని దీప్తి వివరించారు.

‘‘అనీశ్‌ను పెళ్లి చేసుకున్నానని తెలియగానే మా ఇంట్లోవాళ్లు మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. ‘గుండె పోటు వస్తోంది. నేను చచ్చిపోయేలా ఉన్నాను’ అని మా నాన్న మొదట్లో అనేవారు. ఆ తర్వాత అనీశ్‌ను చంపేస్తానని బెదిరించారు. అనీశ్ బావుండాలని మొదట్లో వాళ్లు చెప్పే పనులను చేసేదాన్ని. అనీశ్‌ను ఎలాగైనా కాపాడుకోవాలని అనుకున్నాను’’ అని దీప్తి చెప్పారు.

గోరఖ్‌పుర్ జిల్లా గగహా పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్‌కలీ ధర్మసేన్‌ గ్రామానికి చెందిన నలిన్ కుమార్ మిశ్ర కుమార్తె దీప్తి. దీప్తికి ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. వీరందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. దీప్తి అన్నయ్య ఉత్తర్ ప్రదేశ్ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు.

ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ, తనకు ఎవరి నుంచీ సాయం అందలేదని దీప్తి అన్నారు.

దీప్తి

ఫొటో సోర్స్, Rajesh Kumar Arya

ఫొటో క్యాప్షన్, దీప్తి

కేసు కూడా పెట్టారు..

దీప్తి తండ్రి నలిన్ కొన్నేళ్లు దుబయిలో పనిచేశారు. ప్రస్తుతం ఆయనకు తమ గ్రామానికి సమీపంలోని మజ్‌గావ్‌లో ఓ బట్టల దుకాణం ఉంది. ఈయన అనీశ్‌పై కేసు కూడా పెట్టారు. తమ కుమార్తెపై అనీశ్ అత్యాచారం చేశారని కూడా ఆరోపణలు చేశారు.

కుటుంబ సభ్యులు విపరీతంగా ఒత్తిడి చేయడంతో తను కూడా అనీశ్‌కు వ్యతిరేకంగా పోలీసుల ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని దీప్తి చెప్పారు. అనీశ్‌ను చంపేస్తానని బెదిరించడంతో అలా చేయాల్సి వచ్చిందని వివరించారు.

‘‘నేను ఎక్కడికి వెళ్లినా మా నాన్న, బాబాయి, మరికొందరు కుటుంబ సభ్యులు వెంటే వచ్చేవారు. కొన్నిసార్లు బాబాయి అయితే, లైసెన్స్ పొందిన తుపాకీ కూడా వెంట తీసుకొని వచ్చేవాడు’’ అని దీప్తి చెప్పారు.

అనీశ్ సోదరుడు అనీల్ చౌధరి

ఫొటో సోర్స్, Rajesh Kumar Arya

ఫొటో క్యాప్షన్, అనీశ్ సోదరుడు అనీల్ చౌధరి

అనీశ్ కుటుంబ నేపథ్యమిదీ..

గోరఖ్‌పుర్‌లోని గోలా పోలీస్ స్టేషన్ పరిధిలో దళితులు, బీసీలు ఎక్కువగా ఉండే ఉనౌలీ గ్రామంలో అనీశ్ కుటుంబం ఉంటోంది.

పదేళ్లపాటు సర్పంచ్‌గా అనీశ్ అన్నయ్య అనీల్ చౌధరి పనిచేశారు. 2015లో ఈ గ్రామ సర్పంచ్ పదవిని మహిళలకు కేటాయించారు. దీంతో అనీల్ భార్య గీతా దేవి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

అనీశ్ తండ్రి, బాబాయి కూడా.. బ్యాంకాక్, సింగపూర్‌లలో పనిచేశారు. అయితే, ఈ కుటుంబం నుంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తొలి వ్యక్తి అనీశే.

‘‘నేను దీప్తి కుటుంబ సభ్యులతో మాట్లాడాను. అయితే, వారు ఒప్పుకోలేదు. ఒకసారి మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించారు కూడా’’ అని అనీల్ వివరించారు.

దేవీ దయాళ్

ఫొటో సోర్స్, Rajesh Kumar Arya

ఫొటో క్యాప్షన్, అనీశ్ బాబాయి దేవీ దయాళ్

ఆ రోజు ఏం జరిగింది?

ఘటన జరిగిన రోజు తన బాబాయి దేవి దయాళ్‌తో కలిసి అనీశ్ గోపాల్‌పుర్ మార్కెట్‌లోని ఓ హార్డ్‌వేర్ షాపుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగివస్తున్నప్పుడు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వీరిపై దాడిచేశారు. ఈ దాడిలో దేవీ దయాళ్ కూడా గాయపడ్డారు.

‘‘ఫోన్‌లో మాట్లాడుకుంటూ అనీశ్ ముందుకు వెళ్లాడు. అప్పుడు నలుగురు వ్యక్తులు వచ్చి పదునైన ఆయుధాలతో దాడిచేశారు. దీంతో అతడు స్పృహ తప్పిపోయాడు. కాసేపటి తర్వాత కళ్లు తెరిచిన అతడిపై మళ్లీ దాడిచేశారు. అదే సమయంలో నాపై కూడా దాడిచేశారు. అయితే, అక్కడకు కొందరు స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు’’ అని దేవి దయాళ్ చెప్పారు.

‘‘దాడి చేసిందో ఎవరో నాకు సరిగా కనిపించలేదు. వారంతా మాస్క్‌లు పెట్టుకున్నారు’’ అని ఆయన చెప్పారు. తీవ్రంగా గాయపడిన అనీశ్‌ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన మరణించారు.

దళితుడి హత్య

ఫొటో సోర్స్, Rajesh Kumar Arya

పోలీసులు ఏం చెబుతున్నారు?

అనీల్ చౌధరి ఫిర్యాదుపై 17 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల జాబితాలో దీప్తి తండ్రి నలిన్, సోదరుడు అభినవ్‌తోపాటు మరికొందరి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయని వివరించారు.

‘‘నలుగురిని అరెస్టు చేశాం. మరికొంత మందిని కూడా త్వరలో అరెస్టు చేస్తాం’’ అని పోలీసు అధికారి అంజని కుమార్ పాండే చెప్పారు.

తెలిసిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తంచేశారు.

దప్తి తల్లి జానకి మిశ్ర

ఫొటో సోర్స్, Rajesh Kumar Arya

ఫొటో క్యాప్షన్, దీప్తి తల్లి జానకి

దీప్తి తల్లి ఏం అన్నారు?

ఈ విషయంపై దీప్తి తల్లి జానకీ బీబీసీతో మాట్లాడారు. తమ కుటుంబానికి ఈ హత్యతో ఎలాంటి సంబంధమూ లేదని ఆమె వివరించారు.

‘‘నేను ఆ రోజు నా భర్తకు రోటీ కూర బాక్సులో పెట్టి ఇచ్చాను. ఆయన దుకాణానికి వెళ్లారు. అయితే, అనీశ్ హత్యకు గురయ్యాడని తెలియడంతో అందరూ తామే చేశారంటారనే భయంతో ఆయన వేరే ఊరుకు వెళ్లిపోయారు’’ అని ఆమె చెప్పారు.

‘‘ఆ తర్వాత నా భర్తతోపాటు కుటుంబ సభ్యులంతా పోలీసుల ముందుకు వెళ్లి మేమేం చేయలేదని చెప్పాం. మేం ఆ హత్య చేయలేదని చెప్పే సాక్ష్యాలను పోలీసులకు చూపించాం’’ అని ఆమె అన్నారు.

దీప్తి

ఫొటో సోర్స్, Rajesh Kumar Arya

ఫొటో క్యాప్షన్, దీప్తి

మీ అమ్మాయి దళిత యువకుణ్ని పెళ్లి చేసుకోవడంపై మీరు ఏమంటారు? అని బీబీసీ ఆమెను ప్రశ్నించింది.

‘‘అలాంటి అమ్మాయిల్ని చదివించడం, పెంచి పోషించడం దండగ. నిజానికి అలాంటి వారికి జన్మనివ్వకూడదు. నా కడుపుపై కాలితో తన్ని వెళ్లిపోయింది. మా కుటుంబం మొత్తం పరువు తీసింది’’అని ఆమె వ్యాఖ్యానించారు.

అయితే, ఈ కేసుతో సంబంధమున్న అందరికీ ఉరి శిక్ష వేయాలని దీప్తి డిమాండ్ చేస్తున్నారు.

‘‘మా కుటుంబం మొత్తానికీ ఈ కేసుతో సంబంధముంది. అందరినీ ఉరి తీయాలి. దీని కోసం నేను పోరాటం చేస్తాను’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

‘‘అనీశ్‌ను హత్య చేసిన వారిని చట్టం శిక్షించకపోతే, నేనే శిక్షలు విధిస్తా’’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)