టోక్యో ఒలింపిక్స్: జపాన్ వారికి నాణేలపై ఉన్న మోజు మాటల్లో చెప్పలేం

ఫొటో సోర్స్, YOSHIKAZU TSUNO/AFP VIA GETTY IMAGES
- రచయిత, అరవింద్ ఛాబ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి, టోక్యో నుంచి
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో టోక్యో ఒకటి. ఈ నగరంలో టాయిలెట్ల నుంచి వెండింగ్ మిషన్ల వరకూ జపనీయులు వాడే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సందర్శకులను అబ్బురపరుస్తుంది.
అయితే, వీటన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జపాన్ ప్రజలకు నాణేలంటే చాలా మక్కువ.
ప్రపంచంలో నాణేల కథ ముగిసిపోయింది, నోట్లదే రాజ్యం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ, జపనీయులను చూస్తే మన ఆలోచన తప్పు అనిపించక మానదు.
నేను టోక్యో వచ్చి రెండు వారాలైంది. ప్రతిరోజూ నా దగ్గర పోగవుతున్న నాణేలను జాగ్రత్తచేయడం చాలా కష్టమైపోతోంది.
జపాన్ కరెన్సీలో అన్నిటికన్నా చిన్న నోటు వెయ్యి యెన్‌ల నోటు. పదివేల యెన్‌ల నోటు అన్నిటికంటే పెద్దది. అంటే వెయ్యి యెన్‌ల కంటే తక్కువ కరెన్సీ అంతా నాణేల్లోనే నడుస్తుందన్నమాట.

ఘల్లుమంటున్న నాణేలు
500 యెన్‌లు, 100 యెన్‌ల నాణేలను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన భారతదేశంలో అంత పెద్ద మొత్తం నాణేల్లో ఉండదు.
జేబులో ఒక యెన్ నుంచి 500 యెన్‌ల వరకూ నాణేలు వేసుకుని తిరుగుతుంటే, అవి ఘల్లు ఘల్లుమని గజ్జెలు కట్టుకుని తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.
నాణేలు వాడే అలవాటు తప్పిపోయిన దేశం నుంచి వచ్చిన నాలాంటివారికి ఇది వింతగా ఉంటుంది.
ఇన్ని నాణేలు చూసుకోవడం కష్టమే
మన దేశంలో ఐదు రూపాయలు, పది రూపాయల నాణేలతో కొనగల వస్తువులు చాలా తక్కువ. పది రూపాయల తరువాత అన్నీ నోట్లే కాబట్టి మన జేబులో నాణేలు లేకపోయినా నష్టమేమీ ఉండదు.
కానీ, జపాన్‌లో అలా కాదు. పెద్ద నోట్లు మాత్రమే జేబులో పెట్టుకుని వెళ్తే ఏమీ కొనుక్కోలేం. వెయ్యి రూపాయల కన్నా తక్కువ కరెన్సీ అంతా నాణేల్లోనే ఉంటుంది కాబట్టి జేబు నిండా అవే వేసుకుని వెళ్లాలి.
నిజం చెప్పాలంటే, ఈ నాణేల పద్ధతి నన్ను చాలా ఆకట్టుకుంది. జపాన్‌లో ఏదైనా విశేషంగానే ఉంటుందని అని మరోసారి రుజువైంది.

ఫొటో సోర్స్, Getty Images
రోజువారీ విషయాలు
ఇక్కడికి వచ్చిన మొదటి రోజే నాకు పెద్ద షాక్ తగిలింది. రెండు మంచి నీళ్ల బాటిళ్లు కొని, షాపులో 5 వేల యెన్‌ల నోటు ఇచ్చాను. ఆయన నాకు 500, 100 నాణేలతో పాటూ మరి కొంత చిల్లర ఇచ్చారు. అన్ని నాణేలు చూసి హైరానా పడిపోయాను.
నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది. కానీ దానిపై అదనపు టాక్స్ పడుతుంది. రోజూ కొనే చిన్న చిన్న వస్తువులకు క్రెడిట్ కార్డు వాడడం దండగ.
ఇక్కడికి వచ్చే ముందు ఒక ఫారెక్స్ కార్డ్ (విదేశాల్లో వస్తువుల కొనుగోళ్లకు ఉపయోగపడేది) కొన్నాను. అయితే, ఒక్కోసారి ఇండియాలో బ్యాంకులు ఎలా పని చేస్తాయో మనకు తెలిసిందే కదా. నా ఫారెక్స్ కార్డును యాక్టివేట్ చేయడానికి ఇప్పటికీ నానాయాతన పడుతున్నాను.
అందుకే బయటికెళ్లేప్పుడు వేసుకునే బట్టల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాను. ఎక్కువ జేబులున్న షర్టు, ప్యాంటు వేసుకోకపోతే కష్టమే. నాతో పాటూ పని చేస్తున్న మరో వ్యక్తి ఈ నాణేల కోసం ప్రత్యేకంగా ఒక పర్సు పెట్టుకుంటారు.
మన దేశంలో అయితే ఐదు రూపాయల నోట్లు కూడా ఉంటాయి. అతి పెద్ద నోటు రెండు వేల రూపాయలది. దాన్ని కూడా ఐదేళ్ల క్రితమే, డీమానిటైజేషన్ తరువాత ప్రవేశపెట్టారు.

ఫొటో సోర్స్, EPA
ఈ నాణేలను వదిలించుకునే పని
రోజు రోజుకూ పోగవుతున్న నాణేలను చూస్తుంటే నాకు కంగారుగా ఉంటోంది. వీటిని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుంటాను.
అప్పుడప్పుడూ అవసరం లేకపోయినా, అలా షాపుకు వెళ్లి ఏవో స్నాక్స్, అవీ, ఇవీ కొనుక్కుంటూ ఉంటాను.
ఒకటి, ఐదు, పది యెన్‌ల నాణేలు ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు. వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను.
ఏదేమైనా, జపాన్‌కు ఉన్న ఈ ప్రత్యేకత చాలా ఆసక్తికరంగా ఉంది. డాలర్, పౌండ్ల కన్నా తక్కువ మారకపు విలువ ఉన్న భారత రూపాయలకు కూడా బోలెడన్ని జపనీస్ నాణేలు వస్తాయి.
భారత్‌లో 100 రూపాయలు ఇక్కడ 150 యెన్‌లకు సమానం. మన దేశంలో వంద నోటు ఒకటి ఉంటే చాలు. కానీ, జపాన్‌లో 150 యెన్‌ల నాణేలు పెట్టుకోవాలి.
ఈ నాణేల విషయం పక్కనపెడితే, టోక్యో చాలా ఖరీదైన నగరం. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన నగరాల్లో టోక్యో ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
టోక్యోలో ఖరీదైన జీవితం
టోక్యోలో నివసించడం కూడా ఖరీదైన వ్యవహారమే. అర లీటరు వాటర్ బాటిల్ 100 యెన్‌లు. సాఫ్ట్ డ్రింక్ లేదా చిన్న జూస్ ప్యాకెట్ కూడా అంతే ఉంటుంది.
నేను ఎక్కువగా నీళ్లు, సాఫ్ట్ డ్రింక్స్ కోసమే ఖర్చు పెట్టా. ఇక్కడి వెండిగ్ మిషన్ టెక్నాలజీ నా మనసును దోచుకుంది. అలాగే నా జేబును కూడా.
పని మీద టోక్యోకు వచ్చిన జర్నలిస్టులు ఇక్కడి ఖరీదైన జీవనశైలి గురించి మాట్లాడకుండా ఉండరు.
ఒక మామూలు హోటల్ గదికి రోజుకు 16,000 యెన్‌లు (రూ.10 వేలు పైనే) చెల్లిస్తున్నట్లు ఒక జర్నలిస్ట్ మిత్రుడు నా దగ్గర వాపోయాడు.
దానికంటే ఎక్కువగా టాక్సీ ఖర్చు నా మిత్రుడిని బాధపెట్టింది. తను ఉంటున్న హోటెల్ నుంచి ఒలింపిక్స్ వేదికకు చేరాలంటే 4200 యెన్‌లు (రూ. 2900) టాక్సీకి చెలించాలి. ఇంతకూ, ఇంత డబ్బు పెట్టేది కేవలం ఏడు కిలోమీటర్ల ప్రయాణానికే.
మా అదృష్టం కొద్దీ, స్థానిక ప్రభుత్వం ఒలింపిక్స్ వేదిక నుంచి షటిల్ సర్వీసులు ఏర్పాటు చేసింది. హోటల్‌కు తిరిగి వెళ్లడానికి వాటిని వాడుకోవచ్చు. అవి ఉచితమే కాబట్టి మాకు ఖర్చు మిగులుతుంది.
ఇవి కూడా చదవండి:
- టోక్యో ఒలింపిక్స్: భారత ఆర్చర్ దీపికా కుమారికి నిరాశ
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








