సమంత: నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న హీరోయిన్ - ప్రెస్‌రివ్యూ

సమంత

ఫొటో సోర్స్, instagram/samantharuthprabhuoffl

‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. అంటూ హీరోయిన్ సమంత పాత్రికేయులపై సీరియస్ అయ్యారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

‘‘శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఆమె, విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అనంతరం మీడియావారు తాజాగా చైతూ-సమంతలపై వినిపిస్తోన్న రూమర్స్ గురించి ప్రశ్నించగా.. దానికి ఆమె 'గుడికి వచ్చి.. బుద్ధుందా?'.. అంటూ సమాధానమిచ్చారు.

సాధారణంగా తిరుమలకు వచ్చే సెలబ్రిటీలు మీడియా వారికి బైట్స్ ఇవ్వడం, కొద్దిసేపు మాట్లాడటం.. అలాగే కెమెరాలకి స్టిల్స్ ఇవ్వడమూ చేస్తుంటారు. ఈ విధంగానే మీడియావారు సమంతను మాస్క్ తీసి వినిపిస్తున్న గాసిప్స్‌పై చిన్న బైట్ అడిగారు. కానీ ఆమె భిన్నంగా స్పందించారు.

ఈ మధ్య సమంత - నాగ చైతన్య విడిపోతున్నారంటూ, అందుకే ఎక్కడికెళ్ళినా ఎవరికి వారు ఒంటరిగానే కనిపిస్తున్నారంటూ వార్తలు టాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా శ్రీవారి దర్శనార్ధం ఆమె తిరుమలకు ఒంటరిగానే రావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

కేటీఆర్

ఫొటో సోర్స్, facebook/KTR

దూషిస్తే రాజద్రోహం కేసులు పెడతాం - కేటీఆర్

ఇకపై రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎలాపడితే అలా మాట్లాడినా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు దూషించినా, తెలంగాణను కించపరిచినా, రాష్ట్ర ప్రయోజనాలు, పురోగతి, గణాంకాల విషయంలో అబద్ధాలతో తప్పుదారి పట్టించినా రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనుకాడబోమని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు హెచ్చరించారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

‘‘ఇప్పటికే మహారాష్ట్రలో సీఎంను చెంపదెబ్బ కొడతామన్న కేంద్ర మంత్రిపై అక్కడి కాంగ్రెస్‌ భాగస్వామ్య ప్రభుత్వం కేసులు పెట్టిందని, దానినే తాము స్ఫూర్తిగా తీసుకుంటామన్నారు.

ఎవరి బాగోతమేంటో, అక్రమ సంపాదన ఎంతో తమకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామన్నారు.

తమ పార్టీ శ్రేణుల సహనానికీ హద్దు ఉంటుందని, మితిమీరి మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడతామన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

‘నాపై కొందరు డ్రగ్స్‌ ఆరోపణలు చేస్తున్నారు. నాకు.. డ్రగ్స్‌ కేసుకు ఏంసంబంధం? నేను అన్ని డ్రగ్స్‌ అనాలసిస్‌ పరీక్షలకు సిద్ధం. రక్తం, వెంట్రుకలు ఏదడిగినా ఇస్తా. మరి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాహుల్‌ గాంధీ కూడా సిద్ధమేనా’అని సవాల్‌ చేశారు’’అని ఈనాడు తెలిపింది.

ఆంధ్ర ప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఎన్నికల ఓటింగ్

ఫొటో సోర్స్, I&PR VisakhaPatnam

నేడు 'పరిషత్‌' ఎన్నికల ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఆదివారం వెల్లడి కాబోతున్నాయని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

‘‘7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన ఏడాదిన్నర తర్వాత నేడు వారి భవితవ్యం తేలబోతోంది.

ఏప్రిల్‌ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్‌ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే.

మూడు రోజుల క్రితమే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఓట్ల లెక్కింపునకు అనుమతించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లోని 209 ప్రదేశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు కోసం వేర్వేరు హాళ్లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లాల్లో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని శనివారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 44,155 మంది సిబ్బంది పని చేయనున్నారు’’అని సాక్షి తెలిపింది.

పూరీ జగన్నాథ్

ఫొటో సోర్స్, UGC

డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్, తరుణ్ లకు క్లీన్ చిట్

తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో తరుణ్‌లకు క్లీన్ చిట్ వచ్చిందని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

‘‘డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నిస్తూ.. వారి గోళ్లు, వెంట్రుకలను అధికారులు సేకరించి ఫోరెన్సిక్ లేబోరొటేరీకి పంపించారు.

ఈ కేసు తొలుత వెలుగులోకి వచ్చినప్పుడు 2017 జులై నెలలో ఎక్సైజ్ శాఖ అధికారులు.. దర్శకుడు పూరి జగన్నాథ్ తోపాటు హీరో తరుణ్ నుంచి శాంపిల్స్ సేకరించారు.

తమ ఆరోపణలకు స్పందించి వారు స్వచ్ఛందంగా గోళ్లు, వెంట్రుకలు ఇచ్చారని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఈ శాంపిల్స్‌ను పరీక్షించిన ఎఫ్ఎస్ఎల్ నమూనాల్లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని నివేదిక ఇచ్చిందని వారు తెలిపారు.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసిన సూత్రధారి కెల్విన్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఎక్సైజ్ అధికారులు, ఈ చార్జిషీట్‌కు ఫోరెన్సిక్ లేబొరేటరీ రిపోర్ట్ (ఎఫ్ఎస్ఎల్)ను కూడా జత చేసి కోర్టుకు సమర్పించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు’’అని వెలుగు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)