సమంత అక్కినేని.. వన్ బకెట్ చాలెంజ్ ఎందుకు? దీనికీ హైదరాబాద్‌కు సంబంధం ఏంటి? - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, instagram/samantharuthprabhuoffl/Getty Images
నీళ్ల కోసం నల్లాను తెరిచి అలా వదిలేయకూడదని.. ప్రతి నీటి బొట్టూ విలువైనదని నటి సమంత అన్నారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
హైదరాబాద్‌లో భూగర్భజలాలు అడుగంటి పోవడం.. 1500 అడుగులకు లోతున గానీ నీటి చెమ్మ తగిలే పరిస్థితి లేకపోవడంతో నీటిని జాగ్రత్తగా వాడుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
బోరువెల్స్, వాటర్ పాలసీని కఠినంగా అమలుచేయలంటూ అందులో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలంటూ సోషల్ మీడియాలో వన్ బకెట్ ఛాలెంజ్ ప్రారంభమైంది.
ఈ క్రమంలో జూలై 21న చేపట్టే వన్ బకెట్ చాలెంజ్‌ను నటి సమంత స్వీకరించారు. నీటిని వృథా చేయొద్దని ట్విటర్ వేదికగా ఆమె ప్రజలను కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఛాలెంజ్ ప్రకారం సమంత జూలై 21న కేవలం ఒక బకెట్ నీటినే వాడుతారు.
`నాతో పాటు ఎవరు ఉంటారు? ఆదివారం వన్‌బకెట్ ఛాలెంజ్‌ను ఎవరు స్వీకరిస్తారు? ఎక్కువ సేపు స్నానం చేయకూడదు. వాహనాలను కడగవద్దు. ముఖం కడుక్కునేటప్పుడు నల్లాను తెరిచి వదిలేయకూడదు. నా ఛాలెంజ్‌ను నేను పోస్ట్ చేస్తా.. మీరెవరూ మోసం చేయకండా.. ప్రతి చుక్కా లెక్కే` అంటూ ట్విట్టర్ ద్వారా ఛాలెంజ్ విషయాన్ని తెలియజేస్తూ మెసేజ్ పోస్ట్ చేశారు.
'నాతోపాటు ఎవరు ఉంటారు? అంటూ నెటిజన్లను ఉద్దేశిస్తూ అమె ట్విట్‌చేశారు. చాలెంజ్ స్వీకరించేవారు ఫొటోలు కూడా షేర్ చేయాలని.. తన వన్ బకెట్ చాలెంజ్ ఫొటోను పోస్ట్ చేస్తానని పేర్కొన్నారు.
వన్ బకెట్ ఛాలెంజ్‌పై సినీ ప్రముఖులు వరణ్ తేజ్, నాగ అశ్విన్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు పలువురు స్పందించారు.

ఫొటో సోర్స్, facebook/ysjagan
11,114 గ్రామసచివాలయాలు.. 91,652 ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11,114 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. వీటిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు కొత్తగా 91,652 ఉద్యోగుల నియామకానికి అనుమతించింది.
ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రతి సచివాలయంలో పది మంది శాశ్వత ఉద్యోగులను నియమిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాన్ని ఇక గ్రామసచివాలయంగా పరిగణిస్తారు.
రెండు వేల జనాభాకు మించి నాలుగువేల కంటే తక్కువ ఉన్న గ్రామపంచాయతీని ఒక సచివాలయంగా గుర్తిస్తారు. ఇంతకుమించి జనాభా ఉన్న గ్రామపంచాయతీల్లో రెండు నుంచి మూడు సచివాలయాలను ఏర్పాటుచేస్తారు.
రెండువేల జనాభాకంటే తక్కువ ఉంటే ఒకటి, రెండు కలిపి ఒక సచివాలయంగా ఏర్పాటుచేస్తారు. ఉద్యోగుల నియామక ప్రక్రియపై నిర్ణయాలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించింది.
కమిటీ ఛైర్మన్‌గా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వ్యవహరిస్తారు. జులై 23 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఉద్యోగుల నియామకం చేపడతారు. సెప్టెంబరు 16 నుంచి 28 మధ్య ఎంపికైన ఉద్యోగులకు శిక్షణనిస్తారు. 20నాటికి తగిన సౌకర్యాలతో సచివాలయాలను సిద్ధం చేస్తారు. ఉద్యోగులకు 30న సచివాలయాలను కేటాయిస్తారు. అక్టోబరు 2 నుంచి సచివాలయాలు అమల్లోకివస్తాయి.

ఫొటో సోర్స్, NOAH SEELAM/Getty images
హైదరాబాద్‌లోనే తలసరి వ్యర్థాల ఉత్పత్తి అత్యధికం
తలసరి చెత్త ఉత్పత్తిలో దేశంలోకెల్లా హైదరాబాద్ నగరమే తొలి స్థానంలో నిలిచిందని సాక్షి దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
భాగ్యనగరంలో ఒక్కో వ్యక్తి సగటున రోజుకు 570 గ్రాముల చెత్త ఉత్పత్తి చేస్తున్నట్లు నాగ్‌పూర్‌కు చెందిన జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ (నీరి) చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
510 గ్రాముల తలసరి చెత్త ఉత్పత్తితో చెన్నై రెండోస్థానంలో ఉండగా, 410 గ్రాములతో ఢిల్లీ మూడో స్థానంలో, 360 గ్రాములతో అహ్మదాబాద్ నాలుగో స్థానంలో, 300 గ్రాములతో ముంబై ఐదో స్థానంలో నిలిచాయి. కోల్‌కతాలో కేవలం 260 గ్రాముల చెత్త ఉత్పత్తితో ఆరో స్థానంలో నిలిచింది.
మరోవైపు వ్యర్థాల ఉత్పత్తి ఇతర పెద్ద నగరాల స్థాయిలోనే ఉందని సర్వే తేల్చింది. నగరంలో రోజుకు 4,500 టన్నుల వ్యర్థాలను సేకరిస్తుండగా అహ్మదాబాద్‌లో 2,300 టన్నులు, బెంగళూరులో 3,700 టన్నులు, చెన్నైలో 4,500 టన్నులు, కోల్‌కతాలో 3,670 టన్నులు, ఢిల్లీలో 5,800 టన్నులు, ముంబైలో 6,500 టన్నుల చొప్పున నిత్యం వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రజలు భారీగా చెత్తను పడేస్తుండటంతో వ్యర్థాలను వేరు చేయడం నగరపాలక సంస్థకు తలకు మించిన భారం అవుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్ టెండూల్కర్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్‌కు అరుదైన గౌర వం దక్కిందని, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో మాస్టర్ బ్లాస్టర్‌కు స్థానం లభించిందని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ క్యాథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ కూడా ఇందులో చోటు దక్కించుకున్నారు. లెజండ్ అనే పదం సచిన్‌కు తక్కువే. తాజాగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆయనకు స్థానం కల్పించాంఅని ఐసీసీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీనిపై సచిన్ స్పందిస్తూ.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఆటకు విశేష సేవలందించిన వారి సరసన చేరడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సునీల్ గవాస్కర్, బీషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ తర్వాత హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఆరో భారత క్రికెటర్‌గా సచిన్ నిలిచాడు.
46 ఏండ్ల టెండూల్కర్ 2013 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో 15,921, వన్డేల్లో 18,426 పరుగులు చేసిన సచిన్ ఇప్పటికీ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీల అరుదైన రికార్డు సచిన్ పేరిటే ఉంది.
ఇక డొనాల్డ్ కెరీర్ మొత్తంలో 602 వికెట్లు (330 టెస్టుల్లో, 272 వన్డేల్లో) పడగొట్టగా.. ఫిట్జ్‌ప్యాట్రిక్ మహిళల క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (240) తీసిన రెండో బౌలర్‌గా గుర్తింపు సాధించడంతో పాటు కోచ్‌గా ఆసీస్ జట్టుకు మూడుసార్లు ప్రపంచకప్ అందించింది.
ఆలస్యం ఎందుకంటే..
హాల్ ఆఫ్ ఫేమ్‌లో అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ తర్వాత క్రికెట్ దేవుడికి చాన్స్ దక్కడంపై అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
కానీ ఈ జాప్యానికి అసలు కారణం ఐసీసీ నిబంధనలే.
ఈ జాబితాలో చోటు దక్కించుకోవాలంటే ఆటకు వీడ్కోలు పలికి కనీసం ఐదేండ్లు పూర్తి కావాలనే నిబంధన ఉండటంతో కుంబ్లే (2008లో రిటైర్డ్ అయ్యాడు), ద్రవిడ్ (2012లో రిటైర్డ్ అయ్యాడు) తర్వాత ఆలస్యంగా సచిన్‌కు ఈ గౌరవం దక్కింది.
ఇవి కూడా చదవండి:
- కార్గిల్ యుద్ధం: "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్ సైన్యంపై గ్రెనేడ్ విసిరా"
- అమరావతికి రుణంపై వచ్చే వారం 'ఆసియా' బ్యాంకు నిర్ణయం
- ‘అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు’
- ఫేస్ యాప్ ఉపయోగిస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త
- ఇంట్లో ప్రవేశించి మంచమెక్కి పడుకున్న పులి
- ధోనీ కూడా రిటైర్మెంట్ విషయంలో సచిన్, కపిల్ దేవ్ల దారిలోనే వెళ్తున్నాడా...
- అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?
- పోలవరం పనుల రివర్స్ టెండరింగ్.. ఇంతకీ రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- హైటెక్ వ్యవసాయం... వందేళ్లలో ఎంత మారింది?
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- జింబాబ్వేను సస్పెండ్ చేసిన ఐసీసీ.. క్రికెట్‌లో రాజకీయ జోక్యంతో జాతీయ జట్టుపై నిషేధం
- కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షను పాకిస్తాన్ ఎలా సమీక్షిస్తుంది...
- ఈ 'భారత ఎడిసన్' గురించి ఎంతమందికి తెలుసు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








