తెలంగాణ: అమిత్ షా ‘రజాకార్ కార్డు’ బీజేపీకి ఓట్లు తెచ్చిపెడుతుందా?

అమిత్ షా

ఫొటో సోర్స్, Facebook/BJP Telangana

ఫొటో క్యాప్షన్, నిర్మల్ సభలో అమిత్ షా
    • రచయిత, జింకా నాగరాజు
    • హోదా, బీబీసీ కోసం

గత అయిదారేళ్లుగా హైదరాబాద్‌ను, ఆపైన తెలంగాణను మచ్చిక చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. చరిత్రను ఒక ఆయుధంగా మలుచుకుని పకడ్బందీగా వ్యూహం అమలు చేస్తోంది.

నిజాం దౌష్ట్యాలు, నిజామీ సంస్కృతి, పాతబస్తీ, రజాకార్ల మారణ కాండ, పాకిస్తాన్, ఎంఐఎం అనేవి బీజేపీ అస్త్రాలు. అయినా సరే, బీజేపీ మాట వినకుండా హైదరాబాద్, తెలంగాణ మొరాయిస్తున్నాయి.

అయితే, ఈ ప్రచారం వల్ల తెలంగాణలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తయారైందని, దీనికి దుబ్బాక ఉప ఎన్నిక, తర్వాతి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సాక్ష్యమని, అదే కొనసాగుతుందని నమ్మించేందుకు బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది.

ఆ ప్రచారాన్ని పట్టణాల నుంచి పల్లెలకు, గిరిజన ప్రాంతాలకు విస్తరింప చేయాలని చూస్తోంది. అందుకే బీజేపీ మరుగుపడిన వీరులను, త్యాగాలను వెదికివెదికి పట్టుకొచ్చి తన ఖాతాలో వేసుకుని టీఆర్ఎస్ మీద దాడి ప్రారంభిస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ తరఫున ఇంత బలమయిన వాదన వినిపించేందుకు ఎవరూ లేకపోవడంతో బీజేపీ నిజంగానే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమవుతోందా అనే అనుమానం కలుగుతూ వచ్చింది.

అమిత్ షా

ఫొటో సోర్స్, Facebook/BJP Telangana

ఫొటో క్యాప్షన్, "రాంజీ త్యాగాన్నీ, వెయ్యి మంది బలిదానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరిస్తున్నారు" అని అమిత్ షా అన్నారు.

నిర్మల్ పట్టణంలో జరిగిన 'తెలంగాణ విమోచన సభ'కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. బీజేపీ ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించింది.

ఈ సమావేశంలో ఆయన రజాకార్ల ఊచకోతలకు ఎదురు నిలిచిన తెలంగాణ తెగువను ప్రస్తావించారు. ఎప్పుడో 1860లో చనిపోయిన గోండు వీరుడు రాంజీ గోండుని ఆయన ప్రస్తుతించారు. రాంజీ గోండ్ అప్పటి నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా పోరాడారని, అప్పుడు ఆయనతో పాటు వెయ్యి మందిని అరెస్టు చేసి నిర్మల్ దగ్గర ఉన్న మర్రిచెట్టుకు ఉరి తీశారని చెప్పారు. దీనికి తెలంగాణ విమోచన దినానికి లంకె వేశారు. ఈ సంఘటనకు తెలంగాణ విమోచన దినానికి సంబంధం ఏమిటో తెలియదు.

"రాంజీ త్యాగాన్నీ, వెయ్యి మంది బలిదానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరిస్తున్నారు" అని ఆయన విమర్శించారు.

ఆయన ప్రసంగం రజాకార్ల చుట్టూ, పాకిస్తాన్ చుట్టూ తిరిగింది. అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ లేకపోతే, తెలంగాణ పాకిస్తాన్‌లో భాగమై ఉండేదని ఆయన భయపెట్టారు. ఈ ప్రమాదం తప్పేందుకు కారణం సర్దార్ పటేల్ అని, ఇలా పటేల్ తెలంగాణను కాపాడిన రోజును ముఖ్యమంత్రి గుర్తించకపోవడానికి కారణం ఎంఐఎం అని అమిత్ షా ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఎంఐఎంకు భయపడదని, 2024లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తూనే ఘనంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

మొత్తానికి అమిత్ షా రజాకార్లను, పాకిస్తాన్‌ను, ఎంఐఎం పేర్లని తెలంగాణ వశీకరణ మంత్రంగా వాడుకుంటున్నారు. ఈ వాగ్బాణాలను ప్రయోగించడానికి ముందు కొమురం భీమ్, రాంజీ గోండులకు నివాళులర్పించారు.

ఇటీవల అమిత్ షా పర్యటనలన్నీ ఈ మూడు మాటల చుట్టే తిరుగుతున్నాయి. రజాకార్లు, పాకిస్తాన్, ఎంఐఎం అనే ఈ మూడు ముప్పులకు విరుగుడు నాడు సర్దార్ పటేల్, ఇప్పుడు బీజేపీ అని నచ్చచెప్పేందుకు అమిత్ షా ప్రయత్నించడం ఆయన పర్యటనలన్నింటి సారాంశం.

భాగ్యలక్ష్మి ఆలయం

ఫొటో సోర్స్, Raja Deen Dayal family/BBC

ఫొటో క్యాప్షన్, భాగ్యలక్ష్మి ఆలయం

2020 నవంబర్ 29న అమిత్ షా హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఆయన ప్రచారం జీహెచ్‌ఎంసీ చుట్టూకాకుండా రజాకార్ల చుట్టూ తిరిగింది.

ఆయన చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అక్కడ 'ఈ ఓల్డ్ సిటీ ఎవరి అడ్డా? ఈ భాగ్యలక్ష్మి గుడి ఎవరి అడ్డా? పాతబస్తీ మాది, తెలంగాణ మాది,' అన్నారు. పాత బస్తీ పరాయిదని అన్నదెవరు? పాతబస్తీ ఎవరిచేతిలోనో ఉందని దానికి విముక్తి చేసేపని బీజేపీదని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇలా ప్రశ్న తనే వేసి, జవాబూ తనే చెప్పి ఆయన పత్రికలకు మంచి హెడ్‌లైన్లు అందించిపోతుంటారు.

ఈ గుడిని దర్శించాక, అమిత్ షా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి,"నైజామీ కల్చర్‌లో కూరుకుపోయి ఉన్న హైదరాబాద్‌ను విముక్తి చేస్తాం, హైదరాబాద్‌ను మినీ భారత్ చేస్తాం" అన్నారు. ఇది మరొక పెద్ద హెడ్‌లైన్.

అంతకుముందు 2017 మే 22న లోక్‌సభ ఎన్నికల ముందు నల్గొండ వచ్చి తేరటపల్లిలోని ఒక దళితుడి ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. (అయితే భోజనం ఒక హోటల్ నుంచి వచ్చింది. ఆ మరుసటి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పారు) ఇక్కడ కూడా ఆయన రజాకార్ల ప్రస్తావన తెచ్చి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని బీజేపీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. అక్కడ, ఆ రోజుల్లో రజాకార్ల చేతిలో చనిపోయిన 160 కుటుంబాల వారికి ఆయన సన్మానం చేసి భావోద్వేగం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.

హైదరాబాద్ చార్మినార్ ల్యాండ్ మార్క్‌ని భాగ్యలక్ష్మి టెంపుల్ లాండ్ మార్క్‌గా చేసేందుకు ఈ మధ్య బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ బీజేపీకి బండి సంజయ్ కుమార్ అధ్యక్షులయ్యాక ఒక కొత్త ఒరవడి తీసుకువచ్చారు.

ప్రతికార్యక్రమాన్ని పాతబస్తీలో, 56 మీటర్లు ఎత్తున్న చార్మినార్ పక్కన స్వాతంత్ర్యం కొత్తగా పుట్టుకొచ్చిన చిన్న గుడి భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభిస్తున్నారు. బీజేపీ పదవులు పొందిన వాళ్లంతా ఇక్కడకు వచ్చి పూజలు చేశారు. బండి సంజయ్ తన 'ప్రజా సంగ్రామయాత్ర' ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. పార్టీనేతలు, బీజేపీ అభిమానులైన హిందీ నటులు కూడా ఇక్కడి వస్తున్నారు.

మొత్తానికి చిన్న గుడిని హైదరాబాద్ 'అయోధ్య'ని చేసే ప్రయత్నం జరుగుతోంది. అంతేకాదు, ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారానికి వస్తే, ఇక్కడ పెద్ద ఆలయం కడతామని కూడా బండి సంజయ్ ప్రకటించారు. అయినా సరే హైదరాబాద్ హిందువులంతా పోలోమని గుడికి బారులు కట్టలేదు. అలాగే ఈ ప్రసంగాలు విని పాతబస్తీ ముస్లిం యువకులు రెచ్చిపోలేదు. అమిత్ షా పర్యటనలు, నిప్పులు చిమ్మే ప్రసంగాలు హైదరాబాద్ ప్రజలును కదలించలేకపోతున్నాయ్. ఎందుకు?

బండి సంజయ్

ఫొటో సోర్స్, Facebook/BJP Telangana

హైదరాబాద్ మారింది. ప్రజలూ మారారు. గత నాలుగు దశాబ్దాలలో హైదరాబాద్ బాగా రూపాంతరం చెందింది. పాతతరం అంటే నైజాం పోరాటాన్ని కళ్లారా చూసిన తరం వెళ్లిపోయింది.

పార్టీలలో కొత్త తరాలు నాయకత్వంలోకి వచ్చాయి. ప్రజల్లో కొత్త తరం దూసుకువచ్చింది. హైదరాబాద్ అంతర్జాతీయ నగరమయింది. ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. చదువుసంధ్యలు లేని వాళ్లకి కూడా లెక్కలేనన్ని ఉపాధి అవకాశాలు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలు, బిర్యానీ మోజు, మాల్స్, ఓలా, ఉబర్, ఇతర ఆన్‌లైన్ సర్వీసులు పెరిగిపోయి లక్షలాది మందికి ఉపాధినిస్తున్నాయి.

పూర్వం పాతబస్తీ దాటి బయట కాలుమోపని ముస్లిం యువకులుండే వారు. ఇపుడు వారు కొత్తతరం ఉద్యోగాల్లో ఇమిడిపోయారు. ఓలా క్యాబ్ డ్రైవర్, అర్బన్ కంపెనీ, ఏసీ మెకానిక్, జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ దాకా ఎక్కడా చూసిన వారే.

ఇది 1983కు ముందున్న పరిస్థితికి పూర్తిగా విభిన్నం. అపుడు హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించడం రాజకీయ పార్టీలకు ఒక సర్వైవల్ స్ట్రాటజీ‌గా ఉంది. మతాల మధ్య వైషమ్యం అంటించేందుకు నిరుద్యోగ యువకులు రెండు మతాల్లోనూ బోలెడంత మంది అందుబాటులో ఉండేవారు. అందుకే ఏ నాయకుడికి కోపమొచ్చినా హైదరాబాద్ భగ్గున మండేది.

అయితే 1983లో ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామరావు నాటి రాజకీయ సంస్కృతిని పూర్తిగా తుడిచేశారు. ఆ తర్వాత పెట్టుబడి, నగరంలో ఉపాధి విస్తరిస్తూ వచ్చింది. తర్వాత 1990లో ఒకసారి అల్లర్లు జరిగాయి. అది తప్ప ఇప్పటి దాకా మత కల్లోలాలనేవి లేవు. తర్వాతి పార్టీలు కూడా ఈ విధానం కొనసాగించాయి.

ఇపుడు హైదరాబాద్‌లో అలర్లు సృష్టించేందుకు కాదు, ర్యాలీలకు కూడా యువకులు దొరకడం లేదు. ఈ విషయాన్ని బీజేపీ నేత ఒకరు అంగీకరించారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యక్రమాలకు ఈ మధ్య యువకులు దొరకడం లేదు, రావడం లేదని ఆయన నిర్మోహమాటంగా చెప్పారు. ఇది బీజేపీకే కాదు, ఎంఐఎంతో సహా అన్ని పార్టీలకు ఎదురవుతున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కూలీలను పట్టుకొచ్చే పరిస్థితి వచ్చింది.

"ఇప్పటి తరం ఈ ప్రశాంత వాతావరణం ఫలితాలు అనుభవిస్తూ ఉంది. ఇది హిందువుల్లోనే కాదు, పాతబస్తీ ముస్లింలలో ఇదే ధోరణి కనిపిస్తోంది. బీజేపీ రెచ్చగొట్టినా ఎంఐఎం రెచ్చిపోకుండా ఏదో ఒక ట్వీట్ వదిలి సంతృప్తి చెందుతూ ఉంది. ఎంఐఎం రెచ్చగొట్టినపుడు ఇటువైపు నుంచి కూడా ఇదే తంతు. వాగ్యుద్ధం నడుస్తోంది గాని భౌతిక దాడులు లేవు. భౌతిక దాడులు జరపుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అందుకే బీజేపీనేతలు ఎంత ప్రయత్నించినా, వాళ్లు చెబుతున్న నిజాం చరిత్ర ఇంతవరకు ఎవరినీ భావోద్వేగానికి గురిచేయలేక పోయిందని రాజకీయ విశ్లేషకుడు, జర్నలిస్టు టంకశాల అశోక్ అన్నారు.

"పూర్వంలో బీజేపీలో సమాజంలో ప్రతిష్ట ఉన్న నాయకులుండేవారు. జూపూడి యజ్ఞనారాయణ, బద్దం బాల్ రెడ్డి, వి. రామారావు, టైగర్ నరేంద్ర, ప్రొఫెసర్ శేషగిరిరావు, జంగారెడ్డి, సీహెచ్ విద్యాసాగర్ రావు. వీళ్ల మీద ప్రజల్లో చాలా గౌరవముండింది. వాళ్లే పార్టీకి హుందాతనం ఇచ్చారు. ఇపుడలాంటి లీడర్లు బీజేపీకి లేరు. ఇపుడు ఆ కొరత ఉంది. హైదరాబాద్ ప్రజలను ఆకట్టుకునేందుకు మాటిమాటికి దిల్లీ నుంచి అమిత్ షాను రప్పించాల్సి వస్తోంది.

గణేష్, దుర్గామాత, రాఖీ పండగ వంటి ఉత్సవాలను హిందూత్వ శక్తులు వాడుకుంటున్నాయి. అయితే, వీటిలోని 'సాంస్కృతిక సంబురం' కొంతమందిని ఆకట్టుకున్నా, మొత్తం తెలంగాణ సమాజాన్ని బీజేపీవైపు మళ్లించడానికి ఇది చాలడం లేదు" అని అశోక్ అభిప్రాయపడ్డారు.

కిషన్ రెడ్డి

ఫొటో సోర్స్, Facebook/BJP Telangana

ఈ మంత్రం పనిచేయకపోవచ్చేమో!

అక్కడక్కడ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచేందుకు ఈ వైషమ్యం కంటే స్థానిక సమస్యలు, స్థానిక నాయకుల బలమూ ప్రధానంగా పనిచేశాయని దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పనిచేసిన 'ప్రొఫెషనల్స్ ఫర్ మోదీ' కి చెందిన ఒక ముఖ్యుడు చెప్పారు. అంతా ఐటీ ఉద్యోగులున్న ఈ సంస్థ సభ్యులు, దాదాపు వంద మంది నెల రోజుల పాటు స్థానిక సమస్యలు చెప్పి, వాటికి పరిష్కారం బీజేపీయే అని దుబ్బాకలో సొంత ఖర్చులతో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. జీహెచ్‌ఎంసీలో కూడా ఇదే జరిగిందని చాలామంది చెబుతారు.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీల్లో వచ్చిన ఫలితాలు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో రాలేదు. ఇది తెలుసుకునే కాబోలు, హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనవసరంగా ఆవేశపడకుండా ప్రచారాన్ని పూర్తిగా స్థానికం చేసుకున్నారు. అది తన సొంత ఎన్నికగా పోరాడుతున్నారు. ఏమవుతుందో చూడాలి.

రాంజీ గోండు త్యాగాన్ని, తెలంగాణ యోధుల త్యాగాలను గుర్తించేందుకు నిర్మల్‌లో బీజేపీ సభ పెట్టలేదని, కేవలం ఈ రెండు పేర్లను వాడుకుని ఈ ప్రాంతంలో వైషమ్యం పెంచడమే ఈ సభ ఉద్దేశమని 'సామాజిక తెలంగాణ' ఛైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ అన్నారు.

"నిర్మల్‌కు సమీపంలోని భైంసాలో తరచు మత ఉద్రిక్తత చోటు చేసుకుంటూ ఉంది. ఇక్కడ ఉన్న ముస్లింలను బెదిరించేందుకు, ఈ ఉద్రిక్తతను సొమ్ము చేసుకునేందుకు మాత్రమే బీజేపీ 'తెలంగాణ విమోచన దినం' పేరుతో కేంద్ర మంత్రి అమిత్ షాను ఆహ్వానించి సభ ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ 'రజాకార్ కార్డు' తెలంగాణాలో పనిచేస్తుందా అనేది అనుమానమే" అని ప్రొఫెసర్ ప్రభంజన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)