‘ఆయన గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను ఆయన టీ షర్ట్ వేసుకుంటాను.. ఒక్కోసారి ఆయన మళ్లీ వస్తారని అనిపిస్తుంది’

- రచయిత, చింకీ సిన్హా
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో చాలా కుటుంబాలను భిన్నాభిన్నం చేసింది. చాలామంది యువతులు చిన్న వయసులోనే తమ భర్తలను కోల్పోయారు.
30, 40ల వయసులోనే చాలా మంది వితంతువులుగా మారారు. వీరిలో చాలా మంది గృహిణులు కూడా ఉన్నారు. ఇదివరకు ఎలాంటి ఉద్యోగమూ చేయని వీరి పరిస్థితి నేడు ప్రశ్నార్థకంగా మారింది.
వితంతువులుగా మారిన వారిలో చాలామంది పురుషాధిపత్య కుటుంబాల్లో పెరిగిన వారున్నారు. వీరు పెద్దగా చదువుకోలేదు. రెండో పెళ్లి అనే ఆప్షన్ కూడా వీరికి లేదు.
ఇటీవల వితంతువుగా మారిన 32 ఏళ్ల మహిళతో బీబీసీ మాట్లాడింది. భర్తను కోల్పోయిన తర్వాత, తన జీవితం ఎలా కష్టాలమయం అయిందో ఆమె బీబీసీకి వివరించారు.
2021 ఏప్రిల్ 25న రేణు తన భర్తను కోల్పోయారు.
ఇది ఆమె కథ.

ఆయన గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను ఆయన టీ షర్ట్ వేసుకుంటున్నాను. ఆ టీషర్టు ఎప్పటికీ ఉండిపోదని నాకు తెలుసు. కానీ ఏం చేయను. ఏదీ జీవితాంతం మనతోనే ఉండిపోదుగా.
నా భర్త చివరివరకు తోడుగా ఉంటారని అనుకున్నాను. కానీ అలా జరగలేదు.
ఆయన పక్కన లేకపోవడంతో నిద్ర కూడా సరిగా పట్టట్లేదు. ఉదయం లేవగానే ఏడుపొస్తోంది.
నేను పక్కన లేకపోతే మా అమ్మాయి నిద్రపోదు. తనకు అన్ని విషయాలూ నెమ్మదిగా అర్థం అవుతున్నాయి. ఒకరోజు తను మెట్లపై కూర్చుని ఏడుస్తుంటే చూశాను.
చేతిలో నాన్న ఫోటో పట్టుకుని ఆమె వెక్కివెక్కి ఏడుస్తోంది. వెంటనే తన దగ్గరకు వెళ్లాను. నువ్వు ఇలా ఏడిస్తే నాకు కూడా ఏడుపొస్తుంది, అప్పుడు మన కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? అని అన్నాను. దీంతో ఇంకెప్పుడూ ఏడ్వనని తను మాట ఇచ్చింది.
నా కొడుకు వయసు నాలుగేళ్లు. వాడు ఇంకా నాన్న ఆసుపత్రికి వెళ్లారని, త్వరలో తిరిగి వస్తారని అనుకుంటున్నాడు.
ఆయన మరణించిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతోందని చెప్పగానే మేం ఆసుపత్రికి తీసుకెళ్లాం. అప్పటివరకు ఆయనకు కోవిడ్-19 సోకిందని మాకు ఎవరికీ తెలియదు.
ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేదు. దీంతో ఇంటికి తీసుకొచ్చేద్దామని మా అత్తమామలు చెప్పారు. ఆయన స్నేహితుల సాయంతో మేం ఆక్సిజన్ సిలెండర్లు సంపాదించగలిగాం.
ఆ రోజు ఏప్రిల్ 25. ఆయన స్నేహితులు మా ఇంటికి వచ్చారు. నేను ఆయనతోనే ఉన్నాను. సాయంత్రం పిల్లల్ని చూడాలని ఉందని ఆయన అన్నారు. వెంటనే నేను పిల్లల్ని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టాను. ఆయన కాస్త దూరం నుంచే వారిని చూశారు. ఆ తర్వాత చిన్న నవ్వు నవ్వారు. మీకేమీ కాదు, నేను మీతోనే ఉంటానని ఆయనతో అన్నాను.
రాత్రి 10.30 గంటలకు మేం ఆక్సిజన్ సిలెండర్ మారుస్తుండగా పరిస్థితి విషమించింది. ఆయన స్నేహితుడు వచ్చి వెంటనే ఆక్సీమీటర్ రీడింగ్ చూశారు. SPO2 లెవల్ జీరోకు పడిపోయింది. పల్స్ రేటు కూడా 15కు పడిపోయింది.
వెంటనే ఆసుపత్రిలో పనిచేసే ఆయన స్నేహితుడు సందీప్ వచ్చారు. వైద్యులు సూచించిన ఓ ఇంజెక్షన్‌ను ఆయనకు ఇచ్చారు.
కాసేపటికి ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అలా ఆయన చనిపోయారు.
ఆయన వయసు 37ఏళ్లే.
ఒక్క నిమిషంలోనే మా జీవితాలు తలకిందులయ్యాయి.
లాక్‌డౌన్ సమయంలో ఆయన వంటగదిలో కొత్త వంటలు చేసేవారు. గూగుల్‌లో కొత్త కొత్త రెసిపీలు వెతికి పట్టుకునేవారు. నేను కూరగాయలు కోసి ఇస్తే, ఆయన వండేవారు. ఇప్పుడు ఏం వండాలో చెప్పడానికి నాకు ఎవరూ లేరు.
భవిష్యత్ గురించి తలచుకుంటేనే భయం వేస్తోంది. తండ్రి ప్రేమ లేకుండానే నా పిల్లలను పెంచాల్సి ఉంటుంది.
నేను చిన్నప్పటి నుంచి మంచి మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నాను. పదో తరగతి తర్వాత చదువు మానేశాను. నాకు చదువుపై అంత ఆసక్తి ఉండేదికాదు.
నేను పాత దిల్లీలో పెరిగాను. మా అమ్మ గృహిణి. నాన్న రైల్వేలో పనిచేసేవారు. నేను, మా అన్నయ్య కవల పిల్లలం. మా తర్వాత మా అమ్మకు మరో ఇద్దరు పిల్లలు పుట్టారు.
నాకు మంచి బట్టలు వేసుకోవడం, ముస్తాబు అవ్వడం అంటే చాలా ఇష్టం. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడే మా అత్తయ్య లిప్‌స్టిక్‌ను దొంగిలించి వేసుకునేదాన్ని. ఒకసారి ఆ విషయం ఆమెకు తెలియడంతో నాపై కోప్పడింది. కానీ నేనేమీ పట్టించుకోలేదు.
లక్ష్మీనగర్‌లో మా అత్తయ్యకు పార్లర్ ఉండేది. నేను అక్కడికి వెళ్లి, అన్నీ జాగ్రత్తగా చూసేదాన్ని.
నాకు 20ఏళ్ల వయసున్నప్పుడు తొలిసారిగా నా భర్తను చూశాను.
అది 2009.
పెళ్లి చూపుల కోసం ఆయన తన తల్లిదండ్రులతో కలిసి మా ఇంటికి వచ్చారు. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అప్పట్లో మా నాన్నకు ఆరోగ్యం బావుండేదికాదు. నా పెళ్లి దగ్గరుండి చూడాలనేది ఆయన చివరికోరిక.
సినిమాల్లో చూపించినట్లే.. స్వీట్లు, టీ పట్టుకొని వారి ముందుకు వెళ్లాను. అప్పుడే ఆయన్ను మొదటిసారి చూశాను. ఆ తర్వాత ఏమైనా మాట్లాడాలని ఉంటే, మాట్లాడుకోండని మమ్మల్ని పక్క గదిలోకి పంపించారు.
నాకు మంచి మంచి బట్టలు వేసుకోవడం, ముస్తాబు అవ్వడం అంటే చాలా ఇష్టమని ఆయనకు చెప్పాను. ఆయన అన్నింటికి సరే అన్నట్లు నవ్వారు. నువ్వు నాకు బాగా నచ్చావ్ అన్నారు. ఆ తర్వాత బయటకు వెళ్లి, ఆయన నచ్చారని మా అమ్మానాన్నలతో చెప్పాను.
ఆయన నవ్వంటే నాకు చాలా ఇష్టం. అంతకంటే ఇంకేం కావాలని అనుకుని, పెళ్లికి సిద్ధమయ్యాను.
సరిగ్గా సంవత్సరం తర్వాత 2010 నవంబరు 19న మా పెళ్లి జరిగింది.

పెళ్లి అయిన కొన్ని నెలలకే నేను గర్భం దాల్చాను. నాకు అప్పుడే తల్లి కావడం ఇష్టంలేదు. కానీ కడుపులో బిడ్డను అలా మధ్యలోనే తుంచేయకూడదని నా భర్త నచ్చచెప్పారు.
అలా మా అమ్మాయి పుట్టింది. తనంటే నా భర్తకు చాలా ఇష్టం.
2013లో మళ్లీ నేను మేకప్ కోర్సులో చేరాను. దాదాపుగా ఉద్యోగం కూడా ఖాయమైంది. కానీ మా పాప చిన్నది కావడంతో ఇంటిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను.
కానీ, అప్పుడప్పుడు ఫీల్యాన్సర్‌గా మేకప్ పనులకు వెళ్లేదాన్ని. ఏదైనా వేడుకలుంటే, అమ్మాయిలను ముస్తాబు చేయడానికి వెళ్లేదాన్ని. నెలకు రూ.20,000 నుంచి రూ.25,000 వరకు సంపాదించేదాన్ని. 2016లో నాకు బాబు పుట్టాడు.
గత ఏప్రిల్‌లో నాకు 20 పెళ్లి బుకింగ్‌లు వచ్చాయి. చాలా డబ్బులు వస్తాయని అనుకున్నాను. కానీ ఇంతలోనే లాక్‌డౌన్ వచ్చిపడింది. దీంతో ఏడాదిపాటు ఎలాంటి ఆదాయం లేకుండా పోయింది. నేను దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. నాకు పెద్దగా డబ్బులు దాచుకునే అలవాటు లేదు. డబ్బులు వచ్చినప్పుడల్లా, బంగారు నగలు, గిఫ్ట్‌లు, గౌన్లు కొనేదాన్ని.
చాలాసార్లు మా ఆయన మందలించేవారు. డబ్బులు నేను దుబారా చేస్తున్నానని గద్దించేవారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, డబ్బులు దాచుకోవాలి అనేవారు.
గత ఫిబ్రవరిలో, మేం రాజౌరీ గార్డెన్‌లోని ఒక మాల్‌కు వెళ్లాం. మా కుటుంబంలో ఒకరికి పెళ్లి ఉండటంతో, షాపింగ్‌కు వెళ్లాం. అక్కడ బొమ్మకు వేసిన ఒక గులాబీ రంగు గౌను నాకు బాగా నచ్చింది. దాని ధర రూ.4,000 ఉంటుందని అనుకున్నాను. అప్పుడు నా దగ్గర అంతే ఉండేవి.
కానీ షోరూమ్‌లోకి వెళ్లిన తర్వాత, ఆ గౌను ధర రూ.8,000 అని తెలిసింది. వెంటనే, వద్దులెండి, గౌను రోజూ వేసుకోలేను కదా అని నా భర్తతో అన్నాను. ఆ తర్వాత పిల్లలకు కొన్ని వస్తువులు కొనుక్కొని ఇంటికి వెళ్లిపోయాం.
మరుసటి రోజు సాయంత్రం ఓ గిఫ్ట్ ప్యాక్‌తో ఆయన ఇంటికి వచ్చారు. దాన్ని ఓపెన్ చేయమని పట్టుపట్టారు. తెరిచి చూస్తే, దానిలో నేను ఇష్టపడ్డ గౌన్ ఉంది.
ఆ తర్వాత ఆయన కోసం నేను పర్సు కొన్నాను. అవే మా చివరి గిఫ్ట్‌లు.

కొన్ని రోజుల తర్వాత, నా భర్త వస్తువులన్నీ మా అత్తమామలకు ఇచ్చేయాలి. అది ఇక్కడ సంప్రదాయం. కానీ నేను కొన్ని వస్తువులు ఉంచుకుంటారు. ముఖ్యంగా అతడికి నేను కొనిచ్చిన పర్సు ఉంచుకుంటాను.
గోవా ట్రిప్ కోసం మేం డబ్బులు దాచుకున్నాం. ఈ ఏప్రిల్‌లోనే గోవాకి వెళ్లి, అక్కడి బీచ్‌లో ఆడుకోవాలని అనుకున్నాం. అందరి జంటల్లానే గోవా బీచ్‌లో ఫోటోలు తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆయనే లేరు.
ఇప్పుడు నన్ను బయటకు ఎవరు తీసుకెళ్తారు? నేను ఒంటరిని అయిపోయాను.
మా మమయ్యకు నెలకు రూ.4,000 పింఛను వస్తుంది. కానీ మా మాప స్కూల్ ఫీజే రూ.2,100. మాకు రోజులు గడవడమే కష్టంగా ఉంది. నా మరిది ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తాడు. కానీ అతడి జీతం చాలా తక్కువ. కుటుంబం మొత్తం అతడిపై భారం వేయడం సరికాదు.
నేను ఉద్యోగం వెతుక్కుంటున్నాను. చాలా మందిని ఇప్పటికే కలిశాను. చైల్డ్ సర్వైవల్ ఇండియా నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఉద్యోగం వెతుక్కోవడంలో నాకు వారు సాయం చేస్తానని అన్నారు. ఫ్రీల్యాన్సింగ్‌తో రోజులు గడవడం చాలా కష్టం.
నా పిల్లల గురించి చాలా ఆందోళనగా ఉంది. బాగా చదువుకొని వారు మంచిగా స్థిరపడాలని కోరుకుంటున్నాను. నా జీవితం ఎలాగోలా గడిచిపోతుంది.
నేను ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన బాగా గుర్తుకు వస్తారు. నేను ఆయన వీడియోలు, ఫోటోలు చూస్తూ గడిపేస్తున్నాను. కొన్నిసార్లు ఆయన మళ్లీ తిరిగొస్తారని కూడా అనిపిస్తోంది.
తన పర్సులో మా అత్తమామలు, పిల్లలు, నా ఫొటోలు ఉంటాయి. అతడి పేరు అమిత్. చాలా అందమైన, చిన్న పేరు.

మళ్లీ పెళ్లి చేసుకోవాలని చాలా మంది అంటున్నారు. ఆ వచ్చిన వ్యక్తి నా పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోతే?
మా అమ్మాయికి వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. వారిద్దరూ రోజూ కలిసి వాకింగ్‌కు వెళ్లేవారు. నేను ఎప్పుడైనా తనను తిడితే, మా ఆయన కోప్పడేవారు. తనని పైలట్ చేయాలని నా భర్త కలగనేవారు.
పెళ్లి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం సరికాదు. అయినా, నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, మా అత్తమామలు అడ్డుచెప్పరు. కానీ వారిని ఎవరు చూసుకుంటారు? నేను వారికి తోడుగా ఉంటానని నా భర్తకు మాటిచ్చాను.
నన్ను పెళ్లి చేసుకుంటానని ఓ స్నేహితుడు ముందుకు వచ్చారు. కానీ నేను ఇప్పుడు సిద్ధంగాలేనని చెప్పాను. ఆయన నా భర్త స్నేహితుడే. సంవత్సరం నుంచి అతడు నాకు తెలుసు.
కానీ, ఇద్దరు పిల్లలున్న వితంతువును అతడి కుటుంబం అంగీకరిస్తుందా? అయితే, అతడి కుటుంబం చాలా మంచిదని చెబుతున్నారు. కానీ, నా పిల్లల్ని అతడు సరిగ్గా చూసుకోలేకపోతే? అందుకే వద్దని చెప్పాను. ఆ తర్వాత అతడు మాట్లాడటం మానేశాడు.
నేను భారం మొత్తం దేవుడి మీదే వేశాను.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








