#HerChoice: నేను పెళ్లి చేసుకోలేదు.. అందుకే నీకు నాన్న లేడు!

నా ఏడేళ్ల కూతురు ఇతర పిల్లలందరి లాంటిదే. అందరిలాగే ఆనందం, ఆసక్తి, నిర్లక్ష్యం అన్నీ తనలో ఉన్నాయి.
తన చుట్టూ ఉండే ప్రపంచం గురించి ఆమెకెంతో ఆసక్తి. తన జీవితం గురించి చెప్పలేనంత కుతూహలం.
'నాకు నాన్న ఎందుకు లేడు' అని తరచూ నన్ను అడుగుతుంటుంది.
ప్రతీసారి తనకు నిజమే చెప్పా. నేను ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నా. 'నాకు పెళ్లి కాలేదు. అందుకే నీకు నాన్న లేడు' అని వివరించా.
కానీ, ఈ సమాధానంతో తను పూర్తిగా సంతృప్తి చెందిందన్న నమ్మకమైతే నాకు లేదు.
నేను నా కూతురిని దత్తత తీసుకున్నా. అలా తను నా కుటుంబంలోకి వచ్చింది.
అమ్మ మాత్రమే ఉంటుంది..!
ఇక్కడ కేవలం అమ్మ మాత్రమే ఉంటుంది. కానీ నాన్న ఉండడు. నాన్న ఎందుకు లేడో ఆ చిట్టి మెదడుకు అర్థం కాదు.
తను ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక రోజు నన్నో విషయం అడిగింది.
"అమ్మా, అబ్బాయిలు, అమ్మాయిలు పెద్దయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వారికి పిల్లలు పుడతారని చెప్పావు కదా. నా కన్నతల్లి కూడా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకునే ఉంటుంది కదా. నా కన్నతల్లి ఎవరో మనకు తెలియదు. అలాగే, నా కన్నతండ్రి కూడా తెలియదు. అలాంటప్పుడు నాకు నాన్న లేడని ఎలా చెబుతావు?"
అది వినగానే నాకు కన్నీళ్లు ఆగలేదు. అప్పుడు అనిపించింది నా సమాధానం ఎంత అరకొరగా ఉందోనని. నా సమాధానం తనను ఎంతగా బాధించి ఉంటుందోనని అర్థమైంది.
తనకు సంబంధించి ఇదొక చిన్న లాజిక్. ఐదేళ్ల చిన్నారి తన ప్రశ్నకు తానే సమాధానం కనిపెట్టుకుంది.
నా వివరణ ఎంత అరకొరగా ఉందో తన ప్రశ్న నాకు గుర్తుచేసింది.
నేను తనకు ఎలాంటి అనుభూతిని, అనుభవాన్ని అందిస్తున్నానో ఒక తల్లిగా, ఒక మనిషిగా నన్ను ఆలోచింప చేసింది.

#హర్‌చాయిస్ - 12 మంది భారతీయ మహిళల వాస్తవగాథలు. ఈ కథనాలు 'ఆధునిక భారతీయ మహిళ' ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆకాంక్షలు, ప్రాధాన్యతల గురించి వివరిస్తూ, మన భావనల పరిధిని విస్తృతం చేస్తాయి.

మగాళ్లంటే ద్వేషం లేదు!
తను చెప్తూనే ఉంది. 'అమ్మా మళ్లీ పెళ్లి చేసుకో' అని.
అప్పుడు నేను తనకి వివరించా. 'పెళ్లి చేసుకోకూడదని నాకేం లేదు. ఏమో ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటానేమో!
కానీ నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరకాలి. అంతేకాదు, అతను నిన్ను కూడా అర్థం చేసుకోవాలి అని నేనన్నా.
తను పెరిగి పెద్దయ్యాక మళ్లీ ఇదే ప్రశ్న వేసినా, నా సమాధానం మాత్రం మారదు.
ఒంటరిగా ఉండటం ఏమంత బాధించే విషయం కాదు. సింగిల్ పేరెంట్‌గా నా కూతురితో నేనెంతో ఆనందాన్ని అనుభవిస్తున్నా.
నాకు మగాళ్లంటే ద్వేషం లేదు. నాకు వాళ్లంటే గౌరవం. నా కూతురు కూడా నా నుంచి అదే నేర్చుకుంటోంది.
పెళ్లెందుకు చేసుకోలేదు? ఒంటరిగా ఉండాలనుకున్నప్పుడు కూతురిని ఎందుకు దత్తత తీసుకున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు.
బాహ్యసౌందర్యాన్నే చూసేవారు!
సుమారు 20 సంవత్సరాల క్రితం, అంటే నేను యుక్త వయసులో ఉన్నప్పుడు, మా కులంలో చాలా మంది వ్యాపారాలు చేసేవారు.
అందుకే చదువుకున్న మగవాళ్లు చాలా తక్కువగా ఉండేవాళ్లు.
చదువుకున్నామని గర్వంగా చెప్పుకునే వాళ్లు బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు.
బాగా చదువుకుని, నైతిక విలువలు కలిగి, నన్ను నన్నుగా గౌరవించే వ్యక్తి కావాలని నేను కోరుకున్నా. బాహ్య సౌందర్యం కంటే నాలోని అంతర్ సౌందర్యాన్ని ఆరాధించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.
ఈ ప్రయాణంలో నన్ను నేను కొత్తగా తెలుసుకున్నా.
నేను మహారాష్ట్రలోని మారుమూల పల్లెలో ఒక సంప్రదాయ కుటుంబంలో పెరిగా. చాలామంది భారతీయ అమ్మాయిల్లాగే మా ఇంట్లోనూ నాకు విలువ లేదు. నా అభిప్రాయం ఎవరికీ అవసరం లేదు.
కానీ ఉన్నత చదువుల్లోకి వెళ్లేందుకు మా నాన్న నన్ను ప్రోత్సహించారు. అప్పట్లో అమ్మాయిలు చదువుకోవడం మా కులంలో చాలా అరుదు.
నేను బాగా చదువుకున్నా. నాకు మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి. నా కాళ్లపై నేను నిలబడ్డా. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

నా జీవితాన్ని మరొకరు ఎందుకు నిర్ణయించాలి?
ఈ క్రమంలో నాకొకటి అర్థమైంది. ఎవరి జోక్యం లేని స్వతంత్ర జీవితాన్ని నేను చాలా ఇష్టపడ్డా.
ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది చాలా కీలకమైన నిర్ణయం. నా విషయంలో పెళ్లి అంటే నేను మాత్రమే. నేనొక్కదాన్నే.
ఎవరో ఒకరు నా జీవితాన్ని ఎందుకు నిర్ణయించాలి? అందుకే నాకు మగ తోడు లేదా భర్త అవసరం లేదని అనుకున్నా. ఒంటరిగానే ఉన్నా.
మా కంపెనీ సామాజిక బాధ్యత కార్యక్రమం (సీఎస్‌ఆర్)లో భాగంగా నేను అనాథ పిల్లలతో కలిసి పనిచేసి ఉండకపోతే, నా జీవితంలో ఇలాంటి మార్పు వచ్చేది కాదేమో.
పిల్లలకు చదువు చెప్పడం, వారితో ఆడుకోవడం, చిన్నారులతో గడపడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. ఆ సంతోషం ఇంకా ఇంకా కావాలనిపించేది.
కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. వారికి దూరంగా ఉండటం అనేది చాలా బాధించే విషయం.
మంచి 'సింగిల్ పేరెంట్'గా ఉండగలనా?
అప్పుడే నేను దత్తత తీసుకోవాలని ఆలోచించా. కానీ ఆ పరిష్కారం నాపై ఎన్నో ప్రశ్నలను సంధించింది.
ఆ చిన్నారి నా కుటుంబంలో ఎలా కలిసిపోతుంది? నేనొక మంచి సింగిల్ పేరెంట్‌గా ఉండగలనా? ఒంటరిగా నేనా పాపను పెంచి పెద్ద చేయగలనా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి.
రెండేళ్ల పాటు నన్ను నేనే ఈ ప్రశ్నలు వేసుకున్నా. చివరికి ఆడపిల్లను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా నాపై నాకు ఏదో అపనమ్మకం.
అప్పుడు నా స్నేహితులతో మాట్లాడా. నన్ను కలవర పెడుతున్న అంశాలను ఒక కాగితంపై రాసుకున్నా.
ఒంటరి తల్లిగా నా బాధ్యతలు ఏమిటో అర్థమైంది. సింగిల్ పేరెంట్‌గా ఉండాలంటే నా స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు ఎంత అవసరమో నాకు తెలిసొచ్చింది.

తన కన్నతల్లిని కాదని నేనెప్పుడూ అనుకోలేదు!
నా కూతురు 6 నెలల పాపగా నా జీవితంలోకి అడుగుపెట్టిన రోజు నాకొక పండుగ లాంటిది. సుమారు 50 మంది ఆ చిన్నారికి స్వాగతం పలికారు. ఇలాంటి కార్యక్రమం జరగడం ఆ దత్తత కేంద్రం చరిత్రలో అదే తొలిసారి.
తను మా ఇంటికొచ్చిన తర్వాత నా అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. తను మా ఇంట్లో అందరికీ ఇష్టమైన మనవరాలు అయిపోయింది.
నేను ఆత్మవిశ్వాసం కలిగిన సింగిల్ పేరెంట్‌గా మారిపోయాను.
ఆ తర్వాత నా తల్లిదండ్రుల ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా స్వతంత్రంగా జీవించాలని నిర్ణయించుకున్నా. అలాచేస్తే పాపకూ, నాకు మధ్య బంధం మరింత బలపడుతుందని అనుకున్నా.
నేను తన కన్నతల్లిని కాదని నేనెప్పుడూ అనుకోలేదు.
తన నాన్న ఎవరన్న ప్రశ్నల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.
నా కూతురు నన్ను ఎంతో ప్రేమిస్తుంది. అందరికంటే 'మంచి అమ్మ నేనే' అని తరచూ నాతో చెబుతూ ఉంటుంది.
నేను ఎప్పుడైనా పనిచేస్తూ తనకి కనిపిస్తే 'నువ్విప్పుడు మా నాన్నవి' అని చెబుతుంది.
నాకది చాలు. ఆ అనుభూతి వెలకట్టలేనిది.
సమాజం సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పడం నేర్చుకుంటున్నాం
దత్తత తీసుకున్న చిన్నారుల జీవితం అంత సులువుగా ఉండదు.
సమాజం మాపై సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇప్పుడిప్పుడే మేమిద్దరం నేర్చుకుంటున్నాం.
చాలా మంది నా కూతురి గతం గురించి అడిగారు. కానీ అది నిజంగా గతం. మరి, దాని గురించి ఎందుకు ప్రశ్నించడం? ఆ ప్రశ్నలు ఆ చిట్టితల్లిని అడగడం ఎందుకు?
ఇన్ని సంక్లిష్టతలు ఉన్నప్పటికీ, మా జీవితంలో ఎంతో ఆనందం, సంతోషం ఉంది.
అంతేకాదు, మా సోదరి నన్ను ఆదర్శంగా తీసుకుని, తను కూడా ఒక చిన్నారిని దత్తత తీసుకుంది.
దత్తత అనేది నా జీవితంలో భాగమైపోయింది. ఇప్పుడు దత్తత విషయంలో తల్లిదండ్రులు, చిన్నారులకు నేను కౌన్సెలింగ్ ఇస్తున్నా.
నేను ఒంటరిని కాదు. కానీ ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతా!
నా కూతురికి స్కూల్‌కి వెళ్లడం ఇష్టం లేదు. అందుకే తనకు ఇంట్లోనే చదువు చెప్పిస్తున్నా.
స్వయంగా నిర్ణయాలు తీసుకునేలా తనకు నేను సాయం చేస్తున్నా. చిన్నప్పుడు నాకా అవకాశం లేదు. అదెంత విలువైందో ఇప్పుడు తెలుస్తోంది.
స్కూల్‌కి వెళ్లాలని తనకు ఎప్పుడనిపిస్తే అప్పుడు తనను బడికి తీసుకెళ్తా.
ఏం కావాలో? ఏది వద్దో నిర్ణయించుకునేలా, జీవితంలో తనకు తానే ఒక మాస్టర్ అయ్యేలా ఈ వ్యక్తిగత గుర్తింపు ఆమెకు సహాయం చేస్తుంది. అంటే అచ్చం నాలాగ అన్నమాట.
నేను ఒంటరిని కాదు. నేను ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాను. కానీ నా కూతురితో ఉన్నప్పుడు నేను చాలా ఆనందిస్తాను.
(పుణెకు చెందిన సంగీత బంగిన్వార్ తన నిజ జీవిత గాథను బీబీసీ ప్రతినిధి ప్రాజక్త దులప్‌తో పంచుకోగా, సీనియర్ ప్రతినిధి దివ్య ఆర్య దీనిని అక్షరబద్ధం చేశారు.)
ఇవి కూడా చదవండి:
- వేధింపుల బాధితులు ‘వన్ స్టాప్’ కేంద్రాలకు వెళ్లాలి. అక్కడెవరూ లేకపోతే ఎక్కడికెళ్లాలి?
- ఆ మహిళలే ఉత్తర కొరియా 'రహస్య ఆయుధాలు'!
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- ఈ డ్రెస్సులే లైంగిక వేధింపులకు కారణమా?
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- పంజాబ్ నేషనల్ బ్యాంక్: స్వదేశీ ఉద్యమం సాక్షిగా మొదలు
- కీటోడైట్ వివాదం: అసలేంటీ డైట్? అదెంత వరకు సురక్షితం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








