ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు మిగతా దేశాలకు ఎందుకు ఆందోళన కలిగిస్తున్నాయి

ఫొటో సోర్స్, KCNA
- రచయిత, అంకిత్ పండా
- హోదా, నార్త్ కొరియా అనలిస్ట్
జపాన్‌లోని చాలా ప్రాంతాలపై దాడి చేయగలిగే సామర్థ్యం ఉన్న అధునాతన 'లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్'ను విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.
బాలిస్టిక్ క్షిపణుల్లా కాకుండా క్రూయిజ్ క్షిపణులు మార్గం మధ్యలో ఎప్పుడైనా తమ దిశ, గమనాలను మార్చుకోగలవు. ఈ లక్షణం వలన ఊహించని కోణాల నుంచి దాడులు చేయగల సామర్థ్యం వాటికి ఉంటుంది.
అణ్వాయుధాలను తయారుచేసేందుకు ఉత్తర కొరియా వైవిధ్యమైన, అధునాతనమైన మార్గాలను అన్వేషిస్తూనే ఉందని ఈ ప్రయోగం ద్వారా వెల్లడైంది.
కోవిడ్ మహమ్మారిగానీ, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులుగానీ ఆ దేశం అణ్వాయుధాలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని, ఆ దిశగా ప్రయోగాలను ఆపలేకపోయాయని స్పష్టమవుతోంది.
తాజా క్షిపణి పరీక్పై అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఉత్తర కొరియా ఈ ప్రయోగాన్ని చేపట్టింది? ఇది ఎందుకంత ముఖ్యం? దీని ద్వారా ఆ దేశ ప్రాధాన్యాల గురించి మనకు ఏం అర్థం అవుతోంది?

ఫొటో సోర్స్, Reuters
ఆ దేశ విధానాల్లో ఏ మార్పూ లేదు
2019 నుంచి ఉత్తర కొరియా తమ అణ్వాయుధాలను మెరుగుపరచుకోవడం, విస్తరించడంపై దృష్టి సారిస్తోంది.
అదే ఏడాది వియత్నాంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో జరిపిన శిఖరాగ్ర సమావేశాలు విఫలమైన తరువాత.. తమ అణ్వాయుధాల విస్తరణ కొనసాగుతుందని, జాతీయ రక్షణ విధానాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా కృషి చేస్తామని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు.
అయితే, ఆహార కొరత, తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నప్పటికీ ఉత్తర కొరియా ఎందుకు ఈ ప్రయోగాలు నిర్వహిస్తోంది?
దీనికి అనేక లక్ష్యాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
జాతీయ రక్షణ విధానంలో స్వయం సమృద్ధి సాధించాలనే కిమ్ ఆశయానికి ఈ ప్రయోగాలు, పరీక్షలు బలం చేకుర్చుతున్నాయి. దేశంలో అంతర్గతంగా ధైర్యాన్ని నింపుతాయి.
ఆ దేశ ప్రత్యర్థులకు సవాలుగా నిలుస్తుంది. వారు ఇప్పుడు క్రూయిజ్ క్షిపణుల్లాంటి అధునాతన ఆయుధాలతో తలపడేందుకు సిద్ధం కావాలి.
బాలిస్టిక్ క్షిపణుల్లా కాకుండా క్రూయిజ్ క్షిపణులు తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడి చేయగలవు.
తాజాగా నార్త్ కొరియా పరీక్షించిన క్రూయిజ్ క్షిపణులు సుమారు 1,500 కిమీ (930 మైళ్లు) దూరం ప్రయాణించడానికి రెండు గంటల కన్నా కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాయి.
అదే బాలిస్టిక్ క్షిపణులైతే, ఆ దూరాన్ని కొన్ని నిముషాల్లో చేరుకోగలవు.
కానీ, ప్రత్యర్థులను తికమక పెట్టడమే నార్త్ కొరియా లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే క్రూయిజ్ క్షిపణులను ఎంచుకుంటోంది. ప్రత్యర్థులకు వీటిని పసిగట్టడం, ఎదురుదాడి చేయడం అంత సులభమేమీ కాదు.
అంతర్గతంగా ఆర్థిక ఇబ్బందులు, కరువు పరిస్థితులతో తలపడుతున్నప్పటికీ, తమ అణు సామర్ధ్యాలను పెంపొందించుకోవాలనే కిమ్ ప్రయత్నాలకు తాజా పరీక్షలు అద్దం పడుతున్నాయి.
ఉత్తర కొరియా మౌలిక ప్రాధాన్యాలు మారితేనో లేదా అమెరికా రాయబారం ఫలిస్తేనో తప్ప భవిష్యత్తులో కూడా ఆ దేశం అణ్వాయుధాల ప్రయోగాలను కొనసాగించేలా కనిపిస్తోంది.
అయితే, ఈ సమయంలో నార్త్ కొరియా ఇలాంటి అణ్వాయుధాల సామార్థ్యాన్ని పెంచుకోవడం ఆందోళన కలిగించే విషయమా?
ఎందుకు అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడుతోంది?
చాలామంది భావిస్తున్నట్లు నార్త్ కొరియా ఇప్పుడు ఈ ప్రయోగాలను చేపట్టడానికి.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విధానాలతో, లేదా 9/11 దాడులు జరిగి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంతో సంబంధం ఉన్నటు కనిపించడం లేదు.
తాజాగా చేపట్టిన ఈ క్షిపణి పరీక్షలను ఆ దేశ ప్రభుత్వ మీడియా "వ్యూహాత్మక ఆయుధాలు"గా అభివర్ణించింది.
అంటే ఈ ఆయుధాలతో పాటూ న్యూక్లియర్ వార్‌హెడ్‌ను కూడా తయారుచేసే ప్రణాళిక ఉందని అర్థం.
ఇదే సౌత్ కొరియా, జపాన్ సహా అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగిస్తున్న విషయం.
అయితే, తాజా పరీక్షలు ఊహించనివేం కాదు. ఎందుకంటే 2021 జనవరిలో ఇలాంటి వ్యవస్థను అభివృద్ధి పరుస్తున్నట్లు కిమ్ ప్రకటించారు.
అంతే కాకుండా, భవిష్యత్తులో వీటిని వ్యూహాత్మక ప్రయోగించే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆయన సూచించారు.
ఈ క్షిపణుల గురించి ఇంకా తెలుసుకోవలసిన విషయాలేంటి?
క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల కన్నా భిన్నమైనవి. క్రూయిజ్ క్షిపణులు పరీక్షించిన రెండు రోజుల తరువాత నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులనూ పరీక్షించింది.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు ఉన్నాయి. కానీ, క్రూయిజ్ క్షిపణులపై ఎలాంటి ఆంక్షలూ లేవు.
ఎందుకంటే బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ప్రమాదకరమైనవిగా భద్రతా మండలి పరిగణిస్తుంది. ఇవి ఎక్కువ దూరాలకు వేగంగా ప్రయాణించగలగడమే కాక, శక్తివంతమైన, భారీ సామగ్రిని మోసుకెళ్లగలవు.
అయితే, బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యాలను చేరుకునే చివరి దశలో దిశ, గమనాలను మార్చుకోలేవు.
క్రూయిజ్ క్షిపణులు ఏ క్షణంలోనైనా దిశ, గమనాలను మార్చుకోగలవు. ఊహించని కోణాల నుంచి దాడి చేయగలవు.
ఇవి చాలా తక్కువ ఎత్తులో ఎగరగలవు కాబట్టి చివరి క్షణంలో తప్ప రాడార్ల కంటికి చిక్కవు. ఆ దశలో వాటిని అడ్డుకోవడం కష్టమే.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, నార్త్ కొరియాకు క్రూయిజ్ క్షిపణుల ప్రయోగాలు కొత్తేం కాదు. చాలా సంవత్సరాలుగా సోవియట్-డిరైవ్డ్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులను పరీక్షించి, మెరుగుపరుచుకుంటూ ఉంది.
కాగా, తాజాగా పరీక్షించిన క్రూయిజ్ క్షిపణులు గతంలో పరీక్షించినవాటి కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేయగలవు.
అయితే, ఈ క్రూయిజ్ క్షిపణులు ఉత్తర కొరియా చేస్తున్న విస్తృత ప్రయత్నంలో ఒక భాగం మాత్రమే.
యాంగ్‌బ్యాన్ కాంప్లెక్స్‌లోని గ్యాస్-గ్రాఫైట్ రియాక్టర్ వద్ద కూడా ఆ దేశం తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ఇటీవల అంచనా వేసింది. అంటే అణ్వాయుధాలలో ఉపయోగించేందుకు ప్లూటోనియంను ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోందని అర్థం.
తాజాగా క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల వరుస ప్రయోగాల బట్టీ నార్త్ కొరియా క్షిపణుల అభివృద్ధి, పరీక్షల ప్రక్రియను కొనసాగించనున్నట్లు స్పష్టం అవుతోంది.
(అంకిత్ పాండా కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లోని న్యూక్లియర్ పాలసీ ప్రోగ్రామ్‌లో స్టాంటన్ సీనియర్ ఫెలోగా ఉన్నారు.)
ఇవి కూడా చదవండి:
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- బియ్యం, పంచదార కోసం భారీ క్యూలైన్లు, ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయా?
- నరేంద్ర మోదీ 1993లో అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లారు? 40 రోజులు అక్కడ ఏం చేశారు?
- రష్యా భారత్‌కు దూరమై, పాకిస్తాన్‌కు దగ్గరవుతోందా?
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- అబ్దుల్ ఘనీ బరాదర్: ‘తాలిబాన్లలో కలహాలు లేవు, నేను క్షేమంగా ఉన్నాను’
- తాలిబాన్: అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ ఏమైపోయారు? ప్రత్యర్థి వర్గం కొట్టి చంపిందా
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










