యాంగ్‌బియన్: ఉత్తర కొరియా న్యూక్లియర్ రియాక్టర్ పనులను పునఃప్రారంభించిందంటున్న ఐరాస

కిమ్ జాంగ్ ఉన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఐఏఈఏను బహిష్కరించినప్పటి నుంచి ఉత్తర కొరియా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది.

యాంగ్‌బియన్ న్యూక్లియర్ రియాక్టర్‌ను ఉత్తర కొరియా పునఃప్రారంభించినట్లుందని యూఎన్ ఆటమిక్ ఏజెన్సీ ఒక నివేదికలో పేర్కొంది.

అణు ఆయుధాల తయారీకి ఉపయోగించే ఫ్లుటోనియంను రియాక్టర్ కాంప్లెక్స్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు భావిస్తున్నారు.

ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఈ అంచనాకు వచ్చింది. ఐఏఈఏను 2009లో ఉత్తరకొరియా బహిష్కరించింది.

రియాక్టర్.. జులై నుంచి కూలింగ్ వాటర్‌ను విడుదల చేస్తోందని, అది పనిచేస్తోందని చెప్పడానికి ఇదే సూచిక అని ఐఏఈఏ వెల్లడించింది.

ఉత్తర కొరియా అణు కార్యక్రమంలో 5 మెగావాట్‌ల సామర్థ్యం గల యాంగ్‌బియన్ న్యూక్లియర్ కాంప్లెక్స్ చాలా కీలకమైనది.

2018 డిసెంబర్ తర్వాత రియాక్టర్‌ క్రియాశీలంగా మారిందని చెప్పడానికి ఇదే తొలి సంకేతం. ఐఏఈఏ ప్రకారం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సింగపూర్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను కలిసిన నెలల వ్యవధిలోనే ఇది జరిగింది.

ఉత్తర కొరియా ప్రభుత్వం ఎన్ని ఆయుధాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందో తెలుసుకునేందుకు యాంగ్‌బియన్ కార్యకలాపాలను నిపుణులు చాలా కాలంగా పర్యవేక్షిస్తున్నారు.

కాంప్లెక్స్‌లో ఉన్న'రేడియో కెమికల్ ల్యాబొరేటరీ' గురించి ఐఏఈఏ మరింత సమాచారాన్ని వెల్లడించింది. ఉపయోగించిన న్యూక్లియర్ చమురును ఈ ప్రయోగశాలలో శుద్ధి చేస్తారు. ఈ ల్యాబొరేటరీ కార్యకలాపాల గురించి ఐఏఈఏ జూన్‌లోనే తెలిపింది.

తాజా నివేదిక ప్రకారం, ఈ ల్యాబొరేటరీ పని ప్రారంభించి జులై నాటికే 5 నెలలు గడిచిందని పేర్కొంది. ఈ సమయంలోనే రియాక్టర్‌లో ఉపయోగించిన చమురు అంతటినీ ల్యాబొరేటరీలో శుద్ధి చేసినట్లు సూచనప్రాయంగా చెప్పింది.

శాటిలైట్ ఇమేజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2019 డిసెంబర్ నాటి యాంగ్‌బియాన్ ఉపగ్రహ చిత్రం.

రియాక్టర్‌తో పాటు ప్రయోగశాల వద్ద పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించేవని, యూఎన్ భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘనకు స్పష్టమైన ఆధారాలని వ్యాఖ్యానించింది.

యునైటెడ్ స్టేట్స్‌తో కలిసి ఉత్తర కొరియాలో జరిగే న్యూక్లియర్, మిసైల్ కార్యక్రమాలను చాలా దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ యాన్‌హాప్ న్యూస్ ఏజెన్సీతో చెప్పింది.

ఐఏఈఏను బహిష్కరించినప్పటి నుంచి ఉత్తర కొరియా న్యూక్లియర్ ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. 2017లో చివరిసారిగా అణ్వాయుధాలను పరీక్షించింది.

లారా బికర్

డోనల్డ్ ట్రంప్‌తో సంప్రదింపుల వ్యవహారంలో కిమ్ జోంగ్ ఉన్ యాంగ్‌బియన్ న్యూక్లియర్ కాంప్లెక్స్‌ను ప్రధానంగా భావిస్తున్నారు.

ప్యాంగ్‌యాంగ్‌లో ప్లుటోనియం గ్రేడ్ ఆయుధాల తయారీకి 5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ రియాక్టరే ప్రధాన వనరు. అయినప్పటికీ అక్కడి వసతులు పాడుబడుతున్నట్లు చాలామంది నిపుణులు పేర్కొంటున్నారు.

ఆంక్షల ఉపశమనానికి బదులుగా ఈ రియాక్టర్‌ను కూల్చివేసే ఒప్పందానికి డోనల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఇదే వారిద్దరి మధ్య 2019 హనోయ్ వేదికగా జరిగిన చర్చలు విఫలం కావడానికి కారణమై ఉంటుందని నాకు అనిపిస్తోంది.

తమ అణు ఆయుధాలను మరింత అభివృద్ధి చేస్తామని జనవరిలో కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు.

దేశంలో ఆహార కొరత, దిగజారుతోన్న ఆర్థిక వ్యవస్థను పట్టించుకునేందుకు బదులుగా ఉత్తర కొరియా ఈ ప్రాజెక్టులపై పనిచేస్తున్నట్లుంది.

ఉపగ్రహ చిత్రాల ఆధారంగా యాంగ్‌బియాన్‌లో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుసుకోవడం నిపుణులకు కష్టమే. కానీ అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్న నివేదికలు మాత్రం కొట్టిపడేయాల్సినవి కావు.

ఉత్తర కొరియాతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలక వర్గానికి ఇది మరో తలనొప్పిగా మారనుంది. కానీ అమెరికా ఇంకా ఉత్తరకొరియాను ప్రధాన పాలసీ మేకర్‌గా భావించట్లేదు.

మరోవైపు వాషింగ్టన్‌తో కలిసి పనిచేసేందుకు ఇదే సరైన సమయమని ప్యాంగ్ యాంగ్ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)