అబ్దుల్ ఘనీ బరాదర్‌: ‘తాలిబాన్లలో వర్గపోరు లేదు, నేను క్షేమంగా ఉన్నాను’

బరాదర్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అఫ్గాన్ ఉప ప్రధాని బరాదర్

అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తాజాగా ఒక వీడియోలో కనిపించారు.

తాలిబాన్ సహవ్యవస్థాపకులలో ఒకరైన బరాదర్ కొన్ని రోజులుగా కనిపించడంలేదంటూ వార్తలు వచ్చాయి.

బరాదర్‌కు, శక్తివంతమైన హక్కానీ నెట్‌వర్క్‌కి విధేయులైన మరో వర్గానికి చెందిన తాలిబాన్ నాయకులకు పొసగడం లేదని కథనాలు వచ్చాయి.

అయితే, తాజాగా విడుదల చేసిన వీడియోలో.. తాలిబాన్లలో అంతర్గత కలహాలున్నట్టు వస్తున్న వార్తలను బరాదర్ ఖండించారు.

మీరు గాయపడ్డారా అనే ప్రశ్నకు "లేదు, అది నిజం కాదు. నేను బాగానే ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను" అని బారాదర్ చెప్పారు.

"నేను అప్పుడు కాబుల్‌లో లేను. ఈ ఫేక్‌ వార్తలను ఖండించడానికి ఆ సమయంలో నా దగ్గర ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేదు" అని వెల్లడించారు.

హిబ్తుల్లా అఖుంద్‌జాదా, ఘనీ బరాదర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హిబ్తుల్లా అఖుంద్‌జాదా, ఘనీ బరాదర్

దోహాలోని తాలిబాన్ రాజకీయ కార్యాలయం ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆయన ప్రభుత్వ టీవీ ఇంటర్వ్యూవర్ పక్కన ఓ సోఫాలో కూర్చుని ఉన్నారు. ఆయన పేపర్ చూస్తూ చదువుతున్నట్లు స్పష్టంగా కనిపించింది.

"దేవునికి ధన్యవాదాలు. మేం ఒకరితో మరొకరం మంచి సంబంధాలు కలిగి ఉన్నాం. మేం ఒకరినొకరు గౌరవించుకుంటాం. మా సంబంధాలు కుటుంబం కంటే మెరుగైనవి" అని ఆయన చెప్పారు.

అమెరికా అధ్యక్షుడితో నేరుగా ఫోన్లో సంభాషించిన మొట్టమొదటి తాలిబాన్ నాయకుడు బరాదర్. 2020లో డోనాల్డ్ ట్రంప్‌తో ఆయన మాట్లాడారు. అంతకుముందు, అమెరికా దళాలను ఉపసంహరించుకోవడంపై తాలిబాన్ తరఫున దోహా ఒప్పందంపై బరాదర్ సంతకం చేశారు.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, REUTERS/STRINGER

శరణార్థుల మంత్రి, హక్కానీ నెట్‌వర్క్‌లోని ప్రముఖ వ్యక్తి అయిన ఖలీల్ ఉర్-రహమాన్ హక్కానీకి చెందిన వర్గంతో, బరాదర్ అనుచరులు గొడవపడ్డారని సీనియర్ తాలిబాన్ అధికారులు ఇటీవల బీబీసీకి చెప్పారు.

తాత్కాలిక ప్రభుత్వ నిర్మాణంపై బారాదర్ అసంతృప్తి వ్యక్తం చేసినందువల్లే వాదన చెలరేగిందని వాళ్లు చెబుతున్నారు.

తాలిబాన్ల విజయంలో క్రెడిట్ ఎవరిదన్న దానిపై మాటామాటా పెరిగినట్లు భావిస్తున్నారు.

తనలాంటి వ్యక్తులు చేసిన దౌత్యం వల్లే విజయం సాధించామని, వారికి ప్రాధాన్యతనివ్వాలని బరాదర్ పేర్కొన్నట్టుగా చెబుతున్నారు. అయితే, సాయుధ పోరాటం వల్లే గెలుపు సాధ్యమైందని హక్కానీ గ్రూపు, దాని మద్దతుదారులు వాదించారు.

ఇటీవల అఫ్గాన్ దళాలు, అమెరికా, దాని మిత్రదేశాల బలగాలపై జరిగిన హింసాత్మక దాడులతో హక్కానీ నెట్‌వర్క్‌కు సంబంధం ఉంది.

హక్కానీ నెట్‌వర్క్ నాయకుడు సిరాజుద్దీన్ హక్కానీ అఫ్గాన్ కొత్త ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నారు.

బరాదర్ కనిపించకుండా పోయినప్పటి నుంచి పుకార్లు చెలరేగాయి. ఆయన చనిపోయారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో కనిపించాయి.

అయితే, గొడవ జరిగిన తర్వాత బరాదర్ కాబుల్‌ను విడిచి, కాందహార్‌కు వెళ్లారని తాలిబాన్ వర్గాలు బీబీసీకి తెలిపాయి.

తాలిబాన్లు ఆగస్టు 15న అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత దేశం పేరును "ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌"గా మార్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కేబినెట్‌లో అందరూ పురుషులే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)