తెలంగాణ: వందలాది వీధి కుక్కలను చంపేసినట్టు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ళ సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
(గమనిక : మనసును కలిచివేసే అంశాలు)
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో 350కు పైగా వీధి కుక్కలను చంపేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ ప్రారంభించారు.
పలు గ్రామ పంచాయతీల సర్పంచులు ఈ దారుణానికి ఒడిగట్టారని, వారికి స్థానికులు సహకరించారని ఫిర్యాదుదారులు ఆరోపించారు.
ఈ చర్యను జంతు ప్రేమికులు ఖండిస్తున్నారు.
తెలంగాణలో చాలా గ్రామాల్లో వీధి కుక్కలు, కోతుల బెడద విస్తృతంగా ఉంది.
దీనిపై కొంత కాలంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఆ క్రమంలో తాజాగా పెద్ద సంఖ్యలో కుక్కలను చంపిన ఘటనలు బయటకు వస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో పంచాయతీ సర్పంచులు కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు వాటిని సామూహికంగా చంపించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
వీటిల్లో నాలుగు ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయి.


ఫొటో సోర్స్, Getty Images
మాచారెడ్డి పోలీసు స్టేషన్ పరిధిలో
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే భవానీపేట, పాల్వంచ, ఫరీద్‌పేట్, వాడి, బండ రామేశ్వరంపల్లి గ్రామాల్లోని వీధి కుక్కలను పెద్ద సంఖ్యలో చంపేసినట్లు స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన క్రూయాల్టీ ప్రివెన్షన్ మేనేజర్ ఏ.గౌతమ్ జనవరి 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
''విచారణ జరుగుతోంది. ఎవర్నీ కస్టడీలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో నాలుగు ప్రాంతాల్లో 244 కుక్కలు చంపి, పూడ్చిపెట్టినట్టు తేలింది. ప్రభుత్వ పశు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. కొన్ని శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపాం. రిపోర్టులు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఐదు గ్రామాల్లో ఈ ఘటనలు జరగలేదు. భవానీపేట, ఫరీద్‌పేట్, పాల్వంచలో జరిగాయి'' అని మాచారెడ్డి స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ అనిల్ ఈనెల 15వ తేదీన బీబీసీతో చెప్పారు.
''ఈ మూడు గ్రామాల్లోని పంచాయతీ సర్పంచులకు ఈ ఘటనతో ప్రమేయం ఉందని తెలిసింది. కానీ, ఎందుకు, ఎలా చంపారో ఇంకా తెలియదు'' అని అనిల్ తెలిపారు.
కేసు విచారణలో తాజా పురోగతిపై మాచారెడ్డి పోలీసులు స్పందించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
శాయంపేట, ఆరేపల్లిలో..
వరంగల్‌కు సమీపంలోని హనుమకొండ జిల్లా శాయంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో నాలుగు రోజుల్లోనే 300 వీధి కుక్కలను చంపేసినట్లు పోలీసుల వద్ద ఫిర్యాదు నమోదయింది.
దీనిలో ఆ రెండు గ్రామ పంచాయతీల సర్పంచులకు, కార్యదర్శులకు ప్రమేయం ఉందని ఫిర్యాదుదారు గౌతమ్ ఆరోపించారు. జనవరి 9న దీనిపై ఫిర్యాదు చేయగా, అదే రోజు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
''మా టీమ్ స్వయంగా శాయంపేట, ఆరేపల్లి పంచాయతీల సర్పంచులను అడగగా, వారు కుక్కలను చంపినట్లు ఒప్పుకున్నారు'' అని ఫిర్యాదులో గౌతమ్ పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రమేయం ఉన్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు శాయంపేట పోలీసులు బీబీసీకి చెప్పారు.
''విచారణ జరుగుతోంది. 110 కుక్కలను చంపేశారు. మేం వాటిని వెలికితీసి, కొన్ని శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. పశు వైద్యుల నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం. వారిలో సర్పంచులు ఉన్నారు'' అని జనవరి 15న శాయంపేట సబ్-ఇన్‌స్పెక్టర్ పరమేశ్వర్ బీబీసీకి తెలిపారు.
అయితే కేసు పురోగతిపై తాజా సమాచారాన్ని బీబీసీతో పంచుకోవడానికి శాయంపేట పోలీసులు నిరాకరించారు. ఫిర్యాదుదారుకు మాత్రమే సమాచారం ఇస్తామన్నారు.
ఈ రెండు ఘటనల్లో కూడా బీఎన్ఎస్ సెక్షన్ 325(జంతువులను చంపడం, విషం పెట్టడం, వాటిని గాయపర్చడం), జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని (వీధికుక్కలతో సహా జంతువులను చంపడాన్ని నేరంగా పరిగణించే చట్టం) సెక్షన్ 11 కింద కేసులు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ధర్మపురి ఘటన
ధర్మపురి పోలీసులకు గౌతమ్ చేసిన ఫిర్యాదులో ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో 2025 డిసెంబర్ 28, 30 తేదీల్లో మొత్తం 40 కుక్కలను చంపినట్లు ఆరోపించారు.
ఇద్దరు మున్సిపల్ వర్కర్లకు దీనిలో ప్రమేయం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. కుక్కలకు ఇంజెక్షన్లు ఇస్తున్న సమయంలో తీసిన వీడియో కూడా ఉందని గౌతమ్ తన ఫిర్యాదులో రాశారు.
దీనికి సంబంధించి డిసెంబర్ 30న ఫిర్యాదు దాఖలు కాగా.. జనవరి 5న ఎఫ్ఐఆర్ నమోదైంది.
అయితే, ఈ ఘటనలో బీఎన్ఎస్ 325 సెక్షన్ కింద మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టాన్ని దీనిపై ప్రయోగించలేదు.
''ఈ ఘటనలో వీధి కుక్కల మృతదేహాలు దొరకలేదు. విచారణ జరుగుతోంది'' అని పోలీసులు బీబీసీకి చెప్పారు
ఈ కేసు తాజా పురోగతిపై కూడా ధర్మపురి పోలీసులు స్పందించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, NOAH SEELAM/AFP via Getty Images
యాచారం ఘటన
హైదరాబాద్‌కు దగ్గరగా ఉండే యాచారంలోనూ కుక్కలను చంపిన ఘటనలు జరిగాయి. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థే ఇక్కడ కూడా ఫిర్యాదుదారుగా ఉంది.
''ఈ ఘటన గురించి మాకు ఈనెల 19వ తేదీన తెలిసింది. 20వ తేదీన యాచారం గ్రామానికి వెళ్లి స్థానికులతో మాట్లాడి నిర్థరించుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చాక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం.. కుక్కలకు ఇంజెక్షన్లు ఇచ్చి, ట్రాక్టర్‌లో ఊరి అవతలకు తరలించి పూడ్చారు. పంచాయతీ ప్రెసిడెంట్, కార్యదర్శి, కుక్కలను చంపిన వారిపై ఫిర్యాదు చేశాం. 21వ తేదీ ఆ కుక్కలను పూడ్చిన స్థలాన్ని గుర్తించారు'' అని బీబీసీకి చెప్పారు స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో క్రూయాల్టీ ప్రివెన్షన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ముదావత్ ప్రీతి.
'' కొందరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఈ పనిచేస్తున్నట్టు మాకు తెలిసింది యాచారంలో కనీసం వంద కుక్కలను చంపారని మా అనుమానం. అక్కడ తవ్వకాలు జరిపి, విచారణ చేస్తామని పోలీసులు చెప్పారు '' అని ప్రీతి బీబీసీకి చెప్పారు.
దీనిపై యాచారం పోలీసులు స్పందించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇది ఆ సర్పంచుల పనే’
ఆరేపల్లి, శాయంపేట, మాచారెడ్డి పరిసర గ్రామాల్లో వీధి కుక్కలను చంపడం ఆయా గ్రామాల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగానే జరిగాయని జంతు సంరక్షణ కార్యకర్త గౌతమ్ ఆరోపించారు.
''విషపూరితమైన ఇంజెక్షన్లను ఇచ్చి కుక్కలను దారుణంగా చంపారు. దీనికోసం గ్రామ సర్పంచులు ఒక వ్యక్తిని నియమించుకున్నారు. ఈ మొత్తం దారుణానికి ఒడిగట్టింది గ్రామ సర్పంచులే. చాలామంది గ్రామస్తులు కూడా దీనికి సహకరించారు. కుక్క కాట్లు ఎక్కువగా జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. అందుకే, వాటిని నిర్మూలించాలనుకున్నట్టు తెలిపారు. ఇవి మాత్రమే మా దృష్టికి వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు మాకు సమాచారం అందుతోంది'' అని గౌతమ్ బీబీసీకి తెలిపారు.
ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది.
'పిచ్చి కుక్కలను మాత్రమే చంపించాం’
శాయంపేట సమీపంలోని ఆరేపల్లి పంచాయతీ సర్పంచ్ రమ కుమారుడు రాజు బీబీసీతో మాట్లాడారు.
''మేం పిచ్చి కుక్కలను మాత్రమే చంపించాం. సాధారణ కుక్కలు ఇంకా మా ఊరిలో ఉన్నాయి. ఈ కుక్కలు రాత్రుళ్లు టూవీలర్లను వెంబడించడం వల్ల, వాటి భయానికి చాలామంది వేగం పెంచి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు . వాకింగ్ వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వాకింగ్‌కి వెళ్లిన ఒక వ్యక్తిని ఒళ్లంతా కుక్కలు పీకితే 40 రోజులు ఆసుపత్రిలో ఉండి వచ్చారు. ఎన్నో టూవీలర్ ప్రమాదాలు జరిగాయి'' అని బీబీసీతో చెప్పారు రాజు.
తమ గ్రామంలో కుక్కలకు వ్యాధి వచ్చిందని, అందుకే చంపాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
''కుక్కలకు వెంట్రుకలు ఊడిపోయాయి. ఎలర్జీ వంటిది వచ్చింది. దాని వల్ల పిల్లలూ ఇబ్బంది పడుతున్నారు. ఒంటిపై పుండ్లు ఉన్నాయి'' అన్నారు రాజు.
ఎన్నికల సమయంలో పిచ్చి కుక్కలను చంపిస్తాం అని చెప్పింది వాస్తవమేనని రాజు అన్నారు.
అయితే, ఎన్నికల ముందు తాము అధికారంలో లేనందున, చంపకుండా వేరే ప్రత్యామ్నాయాలు చూశారా లేదా అన్నది తమకు తెలియదని చెప్పారు.
''వాస్తవానికి కుక్కలను చంపాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ, ఆ వ్యాధి ఉన్న వాటిని చంపాల్సి వచ్చింది. సాధారణ కుక్కలను ఏం చేయలేదు. అలాగే మా పక్కనే ఉన్న శాయంపేటలో చంపేసరికి అక్కడి నుంచి చాలా కుక్కలు మా ఊరు వచ్చాయి. కుక్కలను పట్టే వారు వచ్చినప్పుడు మేం ముందుగా ఆ కుక్కలను పట్టించి వేరే చోట వదిలేయాలనే అనుకున్నాం. కానీ, అవి దొరకడం లేదు. ఒకట్రెండు పట్టుకునే సరికి మిగతావి వెళ్లిపోతున్నాయి. అప్పుడు తప్పక చంపడానికి అనుమతించాం'' అన్నారు రాజు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తులు ఈ పని చేసినట్టు చెప్పారు గ్రామస్తులు.
తమ గ్రామంలో 20-25 కుక్కలను మాత్రమే చనిపోయినట్టు రాజు చెప్పారు. ఒక కుక్కకు చంపడానికి 250 రూపాయలు చెల్లించినట్టు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘రోగాలు వచ్చినవి కరిస్తే ఎలా?’
ఆరేపల్లికి చెందిన ప్రైవేటు ఉద్యోగి విజయ్ ఈ చర్యను సమర్థించారు.
''ఊళ్లో కుక్కలకు రోగాలు వచ్చాయి. వాటి చర్మం ఊడిపోయింది. శరీరంపై రక్తం కనిపిస్తోంది. ఈ రోగాలు ఒక కుక్క నుంచి మరో కుక్కకు వ్యాపిస్తున్నాయి. ఊళ్ళో పిల్లలు రోడ్లపై తిరుగుతారు. అవి వచ్చి ఇంటి గద్దెలపై పడుకుంటున్నాయి. కుక్కలు ఆరోగ్యంగా ఉంటే వేరు. కానీ రోగాల బారిన పడ్డాయి. అవేమో పిల్లలను కరుస్తున్నాయి. రోగాలు వచ్చినవి కరిస్తే ఎలా? ఇప్పటికే ఒక అబ్బాయిని కరిచాయి. 90 శాతం కుక్కలకు ఆ జబ్బు వచ్చింది. అయితే అన్ని కుక్కలూ మా ఊరివే కాదు. కొన్ని పక్కనే ఉన్న శాయంపేట నుంచి వచ్చాయి'' అని తెలిపారు విజయ్.
''ఎన్నికల సమయంలో మా గ్రామస్తులంతా కోతులు, కుక్కల బెడద నుంచి తప్పించాలని నాయకులకు చెప్పాం. ఇప్పుడు కూడా అవసరమైతే పోలీసులు దగ్గరకు ఊళ్లోవారమంతా వెళ్లడానికి సిద్ధం'' అన్నారు విజయ్.
పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం, సాధారణంగా కుక్కలు పట్టే వారు ఊరిలో ముఖ్యులతో మాట్లాడి ఒప్పందం చేసుకుంటారు. కొందరు కుక్కలను పట్టి దూరంగా అడవుల్లో వదలాలని చెబుతారు. ఇంకొందరు చంపాలని చెబుతారు.
కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం.. తెలంగాణలో 2022లో 92,924 కుక్క కాటు కేసులు, 2023లో 1,19,014 కేసులు, 2024లో 1,21,997 కేసులు నమోదయ్యాయి. అయితే, రేబిస్ వ్యాధి వల్ల ఎలాంటి మరణాలు చోటు చేసుకుని రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని ఈ డేటాలో వెల్లడైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














