రుతుక్రమం సక్రమంగా జరగాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు?

ఫొటో సోర్స్, Getty Images
మహిళలకు నెలసరి అనేది ఒక తలనొప్పి లాంటిది. ప్రతి మహిళకూ నెలనెలా దాదాపు 30 నుంచి 35ఏళ్లపాటు పీరియడ్స్ వస్తాయి. వీటితోపాటు వచ్చే నొప్పిని కూడా వారు భరించాల్సి ఉంటుంది.
గర్భధారణతోనూ నెలసరికి సంబంధం ఉంటుంది. మరోవైపు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయానికి రావు.
శరీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా నెలసరి ప్రభావితం చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏం తింటున్నామో ముఖ్యం..
మనం తీసుకునే ఆహారం, నెలసరి సమయానికి రావడంల.. మధ్య దగ్గర సంబంధం ఉంది.
సంతులిత ఆహారంతో క్రమం తప్పిన నెలసరిని గాడిన పెట్టొచ్చు. నెలసరి సమయంలో వచ్చే సమస్యలను ఆహారంలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా కట్టడిచేయొచ్చు.
నెలసరి సైకిల్‌ను నియంత్రించే హార్మోన్లపై చిరుతిండ్లు ప్రభావం చూపిస్తాయి. దీని వల్ల ఒక్కోసారి నెలసరి ఆలస్యం అవుతుంటుంది.
ఒకవేళ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే రుతుక్రమ సమయంలో విడుదలయ్యే బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది సమస్యలకు కూడా కారణం కావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఏం తినకూడదు?
నెలసరి క్రమం తప్పకుండా వచ్చేందుకు మన ఆహారంలో భాగంగా తీసుకునే కొవ్వులను తగ్గించుకోవాలని డాక్టర్ షా వివరించారు. ‘‘మీరు విపరీతంగా నూనె పదార్థాలు తీసుకుంటే హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీని వల్ల నెలసరి క్రమం తప్పుతుంది’’అని ఆయన వివరించారు.
‘‘మరోవైపు మీరు స్వీట్లను తినడం కూడా తగ్గించాలి. స్వీట్లు ఎక్కువగా తీసుకుంటే.. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో కేలరీలు పెరిగేకొద్దీ.. మన శరీరంలో హార్మోన్ల సమతౌల్యత దెబ్బ తింటుంది. ఒక్కోసారి శరీరంలో మేల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల చర్మం దెబ్బతినడం, నెలసరి క్రమం తప్పడం లాంటి సమస్యలు వస్తాయి’’అని ఆయన చెప్పారు.
మరోవైపు కారం, ఘాటు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా నెలసరి సమయంలో తీసుకోవద్దని ఆయన సూచిస్తున్నారు. దీని వల్ల నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని, పీరియడ్స్ సమయం కూడా పెరుగుతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, BSIP/SCIENCE PHOTO LIBRARY
పీరియడ్స్ సమయంలో అసౌకర్యాన్ని తగ్గించుకోవాలన్నా.. లేదా నెలసరి సమయానికి రావాలన్నా.. ఆహారం విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్ షా చెప్పారు. అవి ఏమిటంటే..
- రోజుకు మూడుసార్లు ఆహారం తీసుకోవాలి. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సమయానికి తీసుకోవాలి. అయితే, ఈ భోజనాల మధ్యలో ఇతర చిరుతిండ్లను తినడం వీలైనంతవరకు తగ్గించుకోవాలి.
- నిద్రపోయేందుకు మూడు గంటల ముందే భోజనాన్ని తీసుకోవాలి. భోజనం తిన్న వెంటనే నిద్రపోకూడదు.
- రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం మధ్య కనీసం 12 గంటల సమయం ఉండేలా చూసుకోవాలి.
ఈ సూచనలను పాటిస్తే, మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మనం తీసుకునే ఆహారం కొవ్వుగా మారే అవకాశం కూడా తగ్గుతుంది.
నెలసరి క్రమంగా వచ్చేందుకు ఏం తినాలి?
చాలా మంది మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయని షా చెప్పారు. ‘‘దీని వల్ల నెలసరి బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. కొంతమందిలో పీరియడ్సే రావు’’అని ఆయన వివరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో కొత్తమీర, పాలకూర, బీట్‌రూట్ లాంటి ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పులు, గింజలు, సోయాబీన్స్, మొలకలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటే ఫలితాలు కనిపిస్తాయని ఆయన వివరించారు.
మరోవైపు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చీజ్, చేపలు, కోడిమాంసంలను కూడా ఆహారంలో తీసుకోవాలని ఆయన సూచించారు. సాలడ్‌లు కూడా భోజనం తర్వాత తీసుకోవాలని చెప్పారు.
నెలసరికి ముందుగా ఏం తినాలి?
నెలసరికి ముందు, నెలసరి సమయంలో, ఆ తర్వాత మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో బ్రిటన్ నేషనల్ హెల్త్ సిస్టమ్ కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
నెలసరికి ముందు మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. మన శరీరం ప్రీమెన్‌స్టువల్ సిండ్రోమ్‌కు గురవుతుంది. మరోవైపు నెలసరి సమయంలో కొన్ని శరీరక, మానసిక సమస్యలు కూడా వస్తాయి. చాలా మందిలో మూడ్ స్వింగ్స్, నిరసన, చిరాకు కనిపిస్తాయి.
పీరియడ్స్ సమయంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. స్వీట్లు, ఘాటుగా, కారంగా ఉండే పదార్థాలు తీసుకోవాలని కూడా అనిపిస్తుంది.
ఎందుకంటే పీరియడ్స్‌కు కొన్ని రోజుల ముందు జీవక్రియా రేటు పెరుగుతుంది. అందుకే పీరియడ్స్ సమయంలో 100 నుంచి 300 క్యాలరీల ఆహారం ఎక్కువగా తీసుకోవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆహారం విషయంలో మన శరీరం చెప్పేది వినడం మంచిది. ఎందుకంటే మన శరీరం సరిగ్గా పనిచేసేందుకు అవసరమయ్యే శక్తి ఆహారం నుంచే వస్తుంది’’అని లండన్‌కు చెందిన డైటీషియన్ రో హాంట్రిస్ చెప్పారు.
పీరియడ్స్ సమయంలో ఫైబర్‌తోపాటు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే చిరుధాన్యాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు.
‘‘పీరియడ్స్ సమయంలో స్వీట్లు, చిరుతిండ్లు తినాలని అనిపిస్తుంది. అయితే, ఇది మన శరీరం నుంచి వచ్చే సంకేతం కాదు. మూడ్స్ నుంచి వచ్చే సంకేతాలు. సంతోష స్థాయిలను పెంచే చిరుతిండ్లు తీసుకోవాలని మన శరీరం సూచిస్తుంటుంది. అయితే, వీటి వల్ల నీరసం, నొప్పులు, నిద్రలేమి లాంటి సమస్యలు ఎక్కువ కావొచ్చు’’అని ఆమె అన్నారు.
మరోవైపు నెలసరి సమయంలో పళ్లను ఎక్కువగా తీసుకోవాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల నొప్పులు తగ్గే అవకాశముందని సూచిస్తున్నాయి.
చాక్లెట్ల విషయానికి వస్తే గ్లూజోక్ స్థాయిలు తక్కువగా ఉండే డార్క్ చాక్లెట్‌లు తీసుకుంటే మంచిది. మిగతా చాక్లెట్లు మనలో చికాకును పెంచే అవకాశం ఉంటుంది. మరోవైపు కాఫీ తీసుకోవడం తగ్గించాలని రో సూచించారు.
నీరు కూడా ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘నీరు ఎక్కువగా తీసుకోవడంతో బ్లీడింగ్ విపరీతంగా కావడాన్ని తగ్గించుకోవచ్చు. దీని వల్ల నొప్పులు కూడా తగ్గుతాయి’’అని రో చెప్పారు. ఆల్కహాల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆమె సూచించారు.
ఇవి కూడా చదవండి:
- కతార్ వరల్డ్ కప్: ‘మా పిల్లల చావుకు బాధ్యులెవరు?’ - వలస కార్మికుల మరణాలపై కుటుంబాల ప్రశ్నలు
- కృష్ణ: తిరుపతిలో గుండు చేయించుకుని వచ్చాక పద్మాలయ స్టుడియో గేటు దగ్గర ఆపేశారు, అప్పుడు ఏమైందంటే
- ఎల్ఎన్జీ అంటే ఏమిటి? యూరప్ ప్రజలకు అది ఎందుకంత కీలకంగా మారింది?
- పార్ట్ టైమ్ జాబ్ స్కామ్స్: ఫేక్ ఉద్యోగ సైట్లను ఎలా గుర్తించాలి, మోసపోకుండా ఏం చేయాలి
- రవీంద్ర జడేజా: ‘టీమిండియా క్రికెటర్ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చా?’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















