పీరియడ్స్ సమయంలో సెలవు ఇవ్వని ఎయిర్‌లైన్స్ మాజీ సీఈఓకు జరిమానా

PA MEDIA
ఫొటో క్యాప్షన్, PA MEDIA

దక్షిణకొరియాలో ఓ విమానయాన సంస్థ మాజీ సీఈఓ తమ సిబ్బందిలో మహిళలు పీరియడ్స్ కారణంగా సెలవులు అడిగితే నిరాకరించినందుకుగానూ కోర్టు ఆయనకు సుమారు 1,800 డాలర్ల జరిమానా విధించింది.

దక్షిణ కొరియాలో మహిళా ఉద్యోగులు పీరియడ్స్ సమయంలో సెలవు పెట్టేందుకు ఆ దేశ ఉపాధి చట్టం వీలు కల్పిస్తుంది. ఆ చట్టం ప్రకారమే ఈ జరిమానా విధించింది.

ఆసియానా ఎయిర్‌లైన్స్ మాజీ అధిపతి కిమ్ సూ-చెయోన్ 2014, 2015లో తమ సంస్థలో పనిచేస్తున్న 15 మంది మహిళలు పీరియడ్స్ సమయంలో పెట్టుకున్న సెలవులను నిరాకరించారు.

వారు రుతుస్రావానికి సంబంధించిన రుజువులు చూపలేదని కిమ్ వాదించారు.

దక్షిణ కొరియాలో 1953 నుంచి మహిళా ఉద్యోగులు పీరియడ్స్ సమయంలో అవస్థ ఎక్కువగా ఉంటే నెలకు ఒకరోజు సెలవు తీసుకోవచ్చనే చట్టం అమలులో ఉంది.

ఈ అంశంలో 2017లో తొలిసారిగా కిమ్‌పై కింది కోర్టులో విచారణ జరిగింది.

రుతుస్రావమని చెప్పి సెలవులు అడిగిన మహిళల్లో చాలా అనుమానాస్పద కేసులు ఉన్నాయంటూ కిమ్ కోర్టులో వాదించారని సౌత్ కొరియా వార్తా సంస్థ యోన్‌హాప్ తెలిపింది.

అయితే, రుతుస్రావానికి సాక్ష్యం చూపించాలని అడగడం "వ్యక్తిగత గోప్యతకు, మానవ హక్కులకు భంగమని" కోర్టు తేల్చి చెప్పింది.

తరువాత, కిమ్ పై కోర్టులో అప్పీల్ చేసుకున్నారు.

కాగా, పై కోర్టు కిమ్ వాదనను తిరస్కరిస్తూ, కింది కోర్టు తీర్పునే సమర్థించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)