కృష్ణను పద్మాలయ స్టూడియోలోకి వెళ్లకుండా ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు

ఫొటో సోర్స్, Superstar Krishna Library/Facebook
- రచయిత, ప్రసాద్ బత్తుల
- హోదా, బీబీసీ కోసం
కృష్ణ స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని.
బీఎస్సీ చదువు పూర్తైన తరువాత ఇంజినీరింగ్ చదువుదామనే ఆలోచనలో ఉండగా అప్పటి అగ్రకథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావుకు ఏలూరులో సన్మానం జరిగింది.
ఆ కార్యక్రమంలో సినిమా అభిమానులు అక్కినేనిపై చూపించిన ప్రేమాభిమానాలు కృష్ణ మీద విపరీతమైన ప్రభావాన్ని చూపాయి. దాంతో కృష్ణ సినిమారంగంపై మక్కువ పెంచుకున్నారు.
దానికి తోడు కృష్ణ తల్లి నాగరత్నమ్మ తన పెద్ద కుమారుడిని సినిమా రంగానికి పంపాలని నిశ్చయించుకోవడంతో కృష్ణ సినిమా రంగప్రవేశం జరిగింది.
సీనియర్ నటుడు జగ్గయ్యతో ఉన్న పరిచయంతో కృష్ణను హీరోను చేసే బాధ్యతను నాగరత్నమ్మ ఆయనకు అప్పగించింది. నటనలో తర్ఫీదు కోసం ‘పదండి ముందు’కు సినిమాలో కృష్ణకు నటించే అవకాశం కల్పించారు జగ్గయ్య.

ఫొటో సోర్స్, Padmalaya Studios
గూఢచారి 116తో బ్రేక్
తరువాత ‘కులగోత్రాలు’ చిత్రంలో కూడా కృష్ణ నటించారు. అయితే అప్పట్లో ‘ఆంధ్రా దేవానంద్’గా పిలవబడుతున్న రామ్మోహన్‌తో కలసి నటించిన ‘తేనే మనసులు’ చిత్రం కృష్ణకు గుర్తింపు తెచ్చింది. రామ్మోహన్ అక్కినేని నాగేశ్వరరావును అనుకరించాడు, కృష్ణ తనదైన తరహాలో నటించాడని... అతని గురించి అప్పటి సినిమా విమర్శకులు అభిప్రాయపడ్డారు.
ఈ సినిమా అనంతరం ఆయన, అందం నటన ‘గుఢచారి 116’ అనే సినిమాలో నటించే అవకాశం తెచ్చిపెట్టాయి. ఆ సినిమా ఘన విజయం సాధించి పెట్టడంతో కథానాయకుడిగా ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

ఫొటో సోర్స్, Super Star Krishna Library/Facebook
మూడు సార్లు సూపర్ స్టార్
వరుస విజయాలతో దూసుకుపోతున్న కృష్ణ నటన, ఆయన వ్యక్తిత్వం ఎరిగిన వారందరూ ఆయనకు అభిమానులుగా మారారు. ఏ హీరోకూ లేని విధంగా హీరో కృష్ణకు దాదాపు 2,500 అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.
80వ దశకంలో అత్యధిక సర్క్యులేషన్ గల ‘జ్యోతి చిత్ర’ అనే సినిమా పత్రిక నిర్వహించిన ‘సూపర్ స్టార్’ అనే బ్యాలెట్ కాంపిటీషన్‌లో ఆయన వరుసగా మూడు దఫాలు ‘సూపర్ స్టార్’గా ఎన్నికయ్యారు.
నటుడిగా ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఎంత పెద్ద డైలాగ్ రాసిచ్చినా దాన్ని ఒక్కసారి మాత్రమే చదివి ఎలాంటి తప్పులూ లేకుండా చెప్పేవారు. నటుడికి ఉండవలసిన సమయపాలన, క్రమశిక్షణలూ ఆయన తు.చ. తప్పకుండా పాటించేవారిని ఆయనతో పనిచేసిన వారు చెప్పుకుంటారు.
కథానాయకుడిగా తను నటించిన సినిమాలు అపజయం పాలైన సమయంలో నిర్మాతలు నష్టపోకూడదని వారు ఆయన వద్దకు రాకున్నా పిలిపించి వారికి మరో సినిమా చేసే వారనే పేరు కృష్ణకు ఉంది.
సినిమా షూటింగ్ జరిగే సమయంలో నటీనటులకు, కార్మికులకు వేరు వేరుగా భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. అలాకాకుండా తన సినిమాకు పనిచేసే కార్మికులకు భోజన విషయంలో అందరికీ ఒకేరకమైన భోజనం తయారు చేయించే సంస్కృతికి నాంది పలికింది ఈయనే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎన్టీఆర్‌తో ‘రాజకీయ’ విభేదాలు
దక్షిణాదిలో అత్యధిక చిత్రాల్లో నటించిన కథానాయకుడిగా మలయాళ ‘ప్రేమ్ నజీర్’ పేరుగాంచితే ఆయన తరువాత 350 సినిమాల్లో నటించిన కథానాయకుడిగా కృష్ణ రెండవ స్థానం కైవసం చేసుకున్నారు.
తరువాత కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ స్వరాష్ట్రానికి తిరిగి రావాలనే ఆశయంలో భాగంగా ఫిల్మ్ నగర్‌లో పద్మాలయ స్టూడియో నిర్మించి అందులో అనేక చిత్రాలు రూపొందించారు. కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా అన్ని రంగాల్లో విజయం సాధించారు.
కురుక్షేత్రం అనే పౌరాణిక చిత్రం ద్వారా ‘సినిమా స్కోప్’ సాంకేతికతను తొలిసారి పరిచయం చేశారు.
‘దోపిడీ దొంగలు’ చిత్రం ద్వారా ‘టెక్నో విజన్’కు ‘ఈనాడు’ చిత్రం ద్వారా ‘ఈస్ట్‌మన్ కలర్’ను ‘సింహాసనం’ సినిమా ద్వారా ‘70ఎంఎం’ను పరిచయం చేశారు.
తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా కృష్ణకు కొన్ని వివాదాలు తప్పలేదు.
ఎన్టీ రామారావుకు వీరాభిమాని అయ్యుండి ఆయనతో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ రాజకీయపరంగా ఆయనతో విభేదించి ఎన్టీఆర్ మీద రాజకీయ వ్యంగ్య చిత్రాలను రూపొందించారు.
కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడై ఆ పార్టీలో చేరి చివరి వరకూ ఆ పార్టీలోనే కృష్ణ కొనసాగారు.

ఫొటో సోర్స్, Manjula Ghattamaneni/Facebook
తొలి స్పెషల్ సాంగ్
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిగిన చిన్న మనస్పర్థ వల్ల ఆయనకు పోటీగా ‘రాజ్ సీతారాం’ అనే గాయకుడిని సినిమా రంగానికి పరిచయం చేశారు.
సూపర్ స్టార్, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని అభిమానులు కీర్తిస్తున్నా ఆయనలో కించిత్ గర్వం ఉండేది కాదు. ఆయన జీవితంలో జరిగిన ఒక గమ్మత్తైన సంఘటన ఆయన వద్దకు వెళ్లిన వారితో చెప్పేవారు.
ఒకసారి తిరుపతికి వెళ్లి తలనీలాలు సమర్పించి, తన ఇంటి నుంచి పద్మాలయ స్టూడియోకు తాను సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతుండగా... స్టూడియో దగ్గరకు చేరుకుంటోన్న సమయంలో కారు ఆగిపోతే దగ్గరే కదా అని స్టూడియోలోకి నడుచుకుంటూ వెళ్లారు.
ఆ సమయంలో అక్కడ ఉన్న వాచ్ మెన్ కృష్ణను ఎప్పుడూ అలా చూడకపోవడంతో ఎవరో అనుకుని స్టూడియో లోపలికి పంపించడానికి నిరాకరించాడు.
పైగా వాచ్‌మన్‌కు తెలుగు రాకపోవడం కారణంగా గేటు దగ్గర అలాగే నిలుచిండిపోయారట. కొద్ది సేపటికి స్టూడియో మేనేజర్ వచ్చి, పరిస్థితి గమనించి కృష్ణను లోపలికి తీసుకువెళ్లారట. ఆ తరువాత వాచ్ మెన్ పనితీరు మెచ్చి అతడిని ఆయన అభినందించారు.
కథానాయకుడిగా కొనసాగుతూనే మాయలోడు సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించారు. అప్పటివరకూ ఒకే తరహాలో ఉండే కృష్ణ నృత్యరీతులను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కొత్తదనంగా చూపించారు.
ఆ పాటలో కృష్ణ మరో కోణంలో కొత్తగా కనిపించి, ప్రేక్షకులను అలరించారు.
కథానాయకుడిగా ఆయన తన పరివారంతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. సినిమా పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో తన వద్ద మేకప్ మెన్‌గా చేరిన వ్యక్తినే 40 సంవత్సరాల పాటు కొనసాగించారు.
దర్శకుడిగా ఆయన వద్ద పనిచేసే సహాయదర్శకులు, సాంకేతిక నిపుణులు ఏవైనా సలహాలు ఇస్తే ఎలాంటి భేషజాలు లేకుండా వాటిని తీసుకునే వారు.
అందమైన నవలా నాయకుడిగా, కౌబాయ్‌గా, గ్రామీణ రైతుగా ఇలా ఏ పాత్ర చేసినా అందులో ఆయన ఇమిడిపోయేవారు.
మరీ ముఖ్యంగా రైతు పాత్ర ఆయనకు నప్పినట్లు మరెవ్వరికీ కుదరలేదు అని ప్రేక్షకులు చెప్పుకొంటారు.
ఇవి కూడా చదవండి:
- బిర్సా ముండా జయంతి: సొంత గ్రామం ఎంతగా అభివృద్ధి చెందింది.. ఆయన వారసుల పరిస్థితి ఏంటి
- 21 ఏళ్లకే పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన యువతి.. ఈ యంగెస్ట్ సర్పంచ్ లక్ష్యం ఏంటో తెలుసా
- ఇద్దరూ పెళ్లైనవాళ్లే.. ‘ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు’.. నిజామాబాద్ నుంచి యూపీ వెళ్లిన మహిళ, హత్య చేసిన ‘లవర్’
- చిత్రకూట్, తీర్థగఢ్ వాటర్‌ఫాల్స్.. విశాఖకు దగ్గరలో బాహుబలి జలపాతం
- ఐటీ రంగం సంక్షోభంలో ఉందా, ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














