బిర్సా ముండా: ఈ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడి స్వగ్రామం ఎలా ఉంది, ఆయన వారసులు ఏం చేస్తున్నారు?

బిర్సా ముండా విగ్రహం

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

    • రచయిత, రవి ప్రకాశ్
    • హోదా, బీబీసీ కోసం

బిర్సా ముండా... నేడు ఈ ఆదివాసీ స్వాతంత్ర్య పోరాట యోధుడి వర్ధంతి. 19వ శతాబ్దం చివరలో బిహార్, ఝార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన బిర్సా 1875 నవంబర్ 15న జన్మించారు. కేంద్రప్రభుత్వం ఆయన జయంతిని ‘ఆదివాసీల ఆత్మగౌరవ దినోత్సవం’గా జరుపుతోంది. బిర్సా1900 జూన్ 9న మరణించారు.

జార్ఖండ్ రాష్ట్ర స్థాపన దినోత్సవాన్ని కూడా ఆయన జయంతి రోజునే నిర్వహిస్తున్నారు.

గత ఏడాది బిర్సా జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన స్వగ్రామమైన ఉలిహాతూ వెళ్లారు. ఇది జార్ఖండ్ రాజధాని రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బిర్సా ముండా స్వస్థలాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

ఉలిహాతూలోని బిర్సా ముండా విగ్రహానికి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు.

ఆమె కూడా ఆదివాసీ సముదాయానికి చెందినవారే. రాష్ట్రపతి తమ ఊరికి రావడాన్ని చాలా గర్వంగా భావిస్తున్నారు ఆ ఊరి ప్రజలు.

బిర్సా ముండా విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

ఫొటో క్యాప్షన్, బిర్సా ముండా సొంత గ్రామానికి వచ్చిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు

గతమెంతో కీర్తి మరి వర్తమానం?

పూర్వీకులు గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవారు అయినప్పుడు వర్తమానంలో మన జీవితం వెలిగిపోతూ ఉంటుందనే హామీ ఉంటే... ఇప్పుడు ఉలిహాతూ కూడా మిలమిల మెరిసిపోతూ ఉండాలి.

పనస, చింత చెట్ల పక్కనే ఉండే ఎత్తైన స్థంభాల ద్వారా 24 గంటలు కరెంటు వస్తూ ఉండేది. ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు వచ్చేవి. శిథిలమైన మరుగుదొడ్లు కనిపించేవి కావు.

కానీ ఘనమైన వారసత్వం అనేది అభివృద్ధికి ప్రామాణికం కాదు.

బహుశా అందువల్లే కావొచ్చు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, ‘భగవాన్’గా పిలిపించుకుంటున్న బిర్సా ముండా స్వగ్రామంలో అభివృద్ధి అంటే... నాలుగు రాళ్ల మీద పోసిన నల్లని తారు, ప్రజల్లో చేతుల్లో స్మార్ట్ ఫోన్లు మాత్రమే కనిపిస్తున్నాయి.

అంతకు మించి అక్కడ కనిపించే ‘వికాసం’ ఏమీ లేదు.

ఇప్పుడు ఆ గ్రామాన్ని బాగా అలంకరించారు. మంచి మంచి రంగులు వేశారు. బిర్సా ముండా పుట్టిన ఇంటికి గోడల మీద అద్భుతమైన చిత్రాలు గీశారు. వీధులు శుభ్రం చేశారు. రాష్ట్రపతి హెలికాప్టర్ దిగడానికి హెలిపాడ్‌ను కూడా నిర్మించారు.

ఆసుపత్రిలో అన్ని రకాల మందులను తీసుకొచ్చి పెట్టారు. బంతి పూల దండలతో ద్వారాలను అలంకరించారు.

రాష్ట్రపతికి స్వాగతం పలుకుతూ హోర్డింగులు పెట్టారు. ఇలా బయటి ప్రపంచానికి ఉలిహాతూను అందంగా శుభ్రంగా చూపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జార్ఖండ్ చీఫ్ సెక్రటరీ సుఖ్‌దేవ్ సింగ్ కొద్ది రోజుల కిందట ఈ ఊరికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు.

బిర్సా ముండా స్వస్థలం ఉలిహాతూ

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

బయటకు కనిపించే మెరుగుల వెనుక ఏముంది?

ఆరు వార్డులు ఉండే ఉలిహాతూ జనాభా సుమారు 1,250. బిర్సా ముండా జన్మించారు అనే పేరు, ఆయన పుట్టిన ఇల్లు తప్ప ఈ ఊరికి ఇంకే ప్రత్యేకత లేదు. అన్ని గ్రామాల మాదిరిగానే ఇది కనిపిస్తుంది.

ఇతర గ్రామాల్లోని ప్రజల మాదిరిగానే కనీస అవసరాలు లేక ఇక్కడి ప్రజలు సతమతమవుతున్నారు.

ఈ ఊరిలో నివసించే వారిలో అధిక శాతం ముండా వర్గానికి చెందిన ఆదివాసీలు ఉంటారు. వీరి ప్రధాన వృత్తులు వ్యవసాయం, కూలీ పనులు. గ్రామంలోని యువత ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌సోల్, దుర్గాపుర్, ముర్షిదాబాద్ వంటి పట్టణాలకు వెళ్తున్నారు.

కొందరు దిల్లీ, ముంబయి వంటి మెట్రో నగరాల్లో కూడా పని చేస్తున్నారు.

జార్ఖండ్ రాజధాని రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉలిహాతూకు ‘ఆదర్శ గ్రామం’ అనే హోదా వచ్చింది. ‘షహీద్ గ్రామ్ వికాస్ యోజన’ వంటి కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు అవుతున్నాయని చెబుతున్నారు.

అడవుల్లో ఉండే ఈ గ్రామంలో ఒకప్పుడు నక్సలిజం ప్రభావం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ఊరిలో పారామిలిటరీ బలగాలను మోహరించారు. ప్రభుత్వ భవనాల్లో అవి ఉంటున్నాయి. ఇది తమకు ఇబ్బందులు తెస్తున్నప్పటికీ మా సమస్యలను బయటకి రానివ్వకుండా అణచివేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

బిర్సా ముండా పుట్టిన ఇల్లు

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

ఫొటో క్యాప్షన్, బిర్సా ముండా పుట్టిన ఇల్లు

బిర్సా ముండా వారసులు ఎలా ఉన్నారు?

బిర్సా ముండా మూడోతరం, నాలుగోతరం వారసులు ప్రస్తుతం ఉలిహాతూలో నివసిస్తున్నారు. బిర్సా ముండా పుట్టిన ఇంటి వెనుకే వారి ఇళ్లు ఉన్నాయి. ఆయన మునిమనవడు సుఖ్‌రామ్ ముండా ఇక్కడ నివసిస్తున్నారు.

సుఖ్‌రామ్ ముండా నేటికి మట్టి ఇంటిలోనే ఉంటున్నారు. ప్రభుత్వం నిర్మించే పక్కా ఇల్లు కట్టుకోవడానికి సరిపడిన భూమి ఆయన వద్ద లేదు. స్థలం లేక పోవడం వల్ల ‘షహీద్ గ్రామ్ వికాస్ యోజన’ కింద పక్కా ఇంటిని పొందే అర్హతను కోల్పోయారు సుఖ్‌రామ్ ముండా.

మాములుగా అయితే బిర్సా ముండా స్మృతి స్థలాన్ని రోజూ శుభ్రం చేసేది సుఖ్‌రామ్ ముండానే. దాని బాగోగులు చూసుకునేది కూడా ఆయనే.

‘2017లో అమిత్ షా ఇక్కడకు వచ్చారు. నాడు రఘుబర్ దాస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ షహీద్ గ్రామ్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది ఆయనే. ఆ పథకం కింద 150 మందికి పైగా ఇళ్లు మంజూరు చేశారు. కానీ నేటికీ ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు.

ప్రతి ఇంటిలోనూ కుళాయిలు బిగించారు. కానీ నీరు రావడం లేదు. ఇప్పటికీ సమస్యలు తీరలేదు. ప్రతి ఏడాది పెద్దపెద్ద నాయకులు వస్తుంటారు. హామీలు ఇస్తుంటారు. కానీ వాటిలో చాలా వరకు అమలుకు నోచుకోవు.

రాష్ట్రపతి రాకతో మా ఆశలు మళ్లీ చిగురించాయి. ఖూంటీలోని బిర్సా ముండా కాలేజీలో నా కూతురు పీజీ చదువుతోంది. మా కొడుకులకు నాలుగో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. నా కూతురికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్రపతిని కోరతాను.

ఆమె 2015లో మా ఊరికి వచ్చారు. అప్పుడు ఈ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. నాడు ఆమెను నేను కలిశాను. నా కూతురికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నా’ అని సుఖ్‌రామ్ ముండా బీబీసీతో అన్నారు.

బిర్సా ముండా ముని మనవడు సుఖ్‌రామ్ ముండా

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

ఫొటో క్యాప్షన్, బిర్సా ముండా ముని మనవడు సుఖ్‌రామ్ ముండా

నీటి సమస్య

ఇక్కడ ప్రధాన సమస్య నీరు. ఎద్దడి ప్రాంతం కావడం వల్ల సాగు, తాగు నీరు దొరకడం చాలా కష్టమైన విషయం.

ఇక్కడ ప్రజలు తేనే తీయడంతోపాటు వరి పంట వేస్తుంటారు. వరికి చాలా నీరు కావాలి. కానీ తగిన నీటి సరఫరా లేక పంటలు ఎండి పోతుంటాయి. తాగు నీటి కోసం బావులు, చేతి పంపుల మీద ఆధారపడుతుంటారు.

‘బాడీ నిజ్కేల్’ పంచాయతీలో ఉంటుంది ఈ ఉలిహాతూ గ్రామం. ‘గ్రామీణ నీటి సరఫరా పథకం కింద గ్రామానికి కుళాయిలు బిగించినా ఉపయోగం లేదు. నీటి ట్యాంక్ అయిదేళ్లుగా ఖాళీగా ఉంది. సౌరశక్తి ఆధారంగా తీసుకొచ్చిన నీటి సరఫరా కూడా ఉపయోగకరంగా లేదు.

ప్రస్తుతం చలికాలం వరకు మాత్రమే నీరు దొరుకుతుంది. ఎండా కాలంలో బావులు ఎండి పోవడం వల్ల సమస్య పెరుగుతుంది’ అని పంచాయితీ సర్పంచ్ మాలతీ దేవి అన్నారు.

చిన్నప్పుడు బిర్సా ముండాను ఆయన తల్లిదండ్రులు చాయీబాసాలోని ఒక మిషనరీ స్కూల్లో చేర్పించారు. నాడు ఇక్కడ బడి లేదు.

ఇప్పుడు ఉలిహాతూలో బిర్సా ముండా పేరుతో రెసిడెన్సియల్ స్కూల్‌ను స్థాపించారు. కానీ అక్కడి పిల్లలను నీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడ 300 మంది పిల్లలు చదువుతుంటే ముగ్గురు శాశ్వత టీచర్లు మాత్రమే ఉన్నారు.

వృథాగా ఉన్న మరుగుదొడ్డి

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

బహిరంగ మలవిసర్జన

బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రంగా జార్ఖండ్‌ను ప్రకటించారు. కానీ ఈ ఊరిలో కట్టిన చాలా మరుగుదొడ్లు పనికి రాకుండా ఉన్నాయి. ప్రజలు ఇప్పటికీ బయటే మలవిసర్జన చేస్తున్నారు.

మరుగుదొడ్లు బాగా ఉన్నా కూడా నీరు లేక పోవడం వల్ల వాటిని వాడలేక పోయేవాళ్లమని ఈ గ్రామానికి చెందిన కోటే ముండా అన్నారు.

ఉలిహాతూ గ్రామానికి నీటి సరఫరా కోసం రూ.14 కోట్లతో ప్రణాళిక రూపొందిచింనట్లు ఖూంటీ డిప్యూటీ కమిషనర్ శశిరంజన్ తెలిపారు.

‘జల్ జీవన్ మిషన్ కింద ఈ ఊరికి ఆరు నెలల్లో నీటి సదుపాయం కల్పిస్తాం. త్వరలోనే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటి సరఫరా చేస్తాం. ఇతర అభివృద్ధి పథకాల మీదా పని చేస్తున్నాం. ఆ ఊరి ప్రజలకు ప్రయోజనాలు లభించడం మొదలైంది.

షహీద్ గ్రామ్ వికాస్ యోజన కింద నిర్మించే ఇంటి విస్తీర్ణం విషయంలో గ్రామస్తులు కొన్ని అభ్యంతరాలు తెలిపారు. అందువల్లే ఇంటి నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి అయ్యే డబ్బులు ఇస్తున్నాం. చాలా ఇళ్లు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే అన్ని ఇళ్లను కట్టేస్తాం’ అని ఆయన మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి: