పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ప్రియురాలిని 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచాడు... 18 రోజుల తరువాత దిల్లీ సిటీలో విసిరేశాడు

ఫొటో సోర్స్, ANI
ఆరు నెలల కిందట దిల్లీలో జరిగిన హత్య కేసు విచారణలో పోలీసులు మరికొన్ని కొత్త ఆధారాలను సేకరించారు.
తనతో లివ్-ఇన్ రిలేషన్ (సహజీవనం)లో ఉన్న శ్రద్ధ అనే యువతిని అఫ్తాబ్ అనే యువకుడు హత్య చేసి, తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక్కో భాగాన్ని ఒక్కో ప్రాంతంలో విసిరేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ హత్య తర్వాత శ్రద్ధ మొబైల్ ఫోన్‌ను అఫ్తాబ్ ఎక్కడ విసిరేశాడో గుర్తించే ప్రయత్నం చేశారు. మొబైల్ చివరిసారి ఉపయోగించిన లోకేషన్‌ను పోలీసులు గుర్తించగలిగారు.
ఈ ఏడాది మే నెలలో శ్రద్ధను హత్య చేసిన తర్వాత, అఫ్తాబ్ జూన్ వరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఉపయోగించాడని, దీని ద్వారా శ్రద్ధ బతికే ఉందని ఆమె స్నేహితులు, బంధువులను నమ్మించేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు.
అయితే, శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు అఫ్తాబ్ ఉపయోగించిన ఆయుధాన్ని ఇప్పటి వరకు పోలీసులు కనుగొనలేకపోయారు.
మంగళవారంనాడు పోలీసులు శ్రద్ధా శరీరభాగాలను విసిరేసినట్లుగా చెబుతున్న అటవీ ప్రాంతానికి పోలీసులు అఫ్తాబ్‌ను తీసుకెళ్లి ఆధారాల కోసం అన్వేషించారు.

ఫొటో సోర్స్, ANI
అసలు ఏంటీ కేసు?
దిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఆరు నెలల కిందట జరిగిన హత్య కేసు ఇటీవల బయటపడింది. అఫ్తాబ్ అనే వ్యక్తి మే 18న తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధ అనే యువతిని హత్య చేసి, ఆపై మృతదేహాన్ని ముక్కలుగా చేసి అటవీ ప్రాంతంలోని వివిధ చోట్ల పడేశారు.
ముంబైలో పని చేస్తున్న సమయంలో నిందితుడు అఫ్తాబ్, శ్రద్ధా స్నేహితులయ్యారు. వీరిద్దరి ప్రేమను శ్రద్ధ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.
అయితే, తల్లిదండ్రుల మాటలను లక్ష్యపెట్టని శ్రద్ధ, అఫ్తాబ్‌తో కలిసి దిల్లీ వచ్చిందనీ, ఛత్తర్‌పూర్ ప్రాంతంలో ఒక ఫ్లాట్‌లో వారిద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారని పోలీసులు తెలిపారు.
అయితే, పెళ్లి కోసం అఫ్తాబ్‌పై శ్రద్ధ ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయని పోలీసులు వెల్లడించారు.
మే 18న వీరి మధ్య పెళ్లి విషయంలో తీవ్రమైన గొడవ జరిగింది. ఆగ్రహంలో అఫ్తాబ్ ఆమె గొంతుకోసి హత్య చేశారు.
‘‘హత్యానంతరం తన ప్రియురాలి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు పెద్ద సైజు ఫ్రిజ్ కొని అందులో మృతదేహం ముక్కలను ఉంచాడు.
రాత్రిపూట నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అడవిలో అప్పుడప్పుడూ మృతదేహం ముక్కలను విసిరేవాడు’’ అని దిల్లీ పోలీసు అదనపు డీసీపీ (సౌత్) అంకిత్ చౌహాన్ వెల్లడించారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?
కూతురి మిస్సింగ్‌పై శ్రద్ధా తండ్రి ఫిర్యాదు చేశారు.
కొన్నేళ్ల కిందట తన భార్య, తానూ విడిపోయామని, మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో తల్లితో కలిసి ఉంటున్నానని శ్రద్ధ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
తన కుమార్తె శ్రద్ధ 2018 నుంచి ముంబయిలోని ఒక కాల్ సెంటర్‌లో పనిచేస్తోందని, అక్కడ ఆమెకు అఫ్తాబ్ పూనావాలా అనే యువకుడు పరిచయమయ్యాడని ఆమె తండ్రి వెల్లడించారు.
“2019లో అఫ్తాబ్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకుంటున్నానని శ్రద్ధ తన తల్లికి చెప్పింది. కానీ మా కుటుంబంలో ఇతర మతాలు, కులాల వారిని పెళ్లి చేసుకోవడం ఇంత వరకు లేదు. కాబట్టి, నా భార్య అందుకు నిరాకరించింది. మా నిర్ణయాలను ఒప్పుకోని మా అమ్మాయి, తనకు సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉందని చెప్పింది’’ అని ఆయన పేర్కొన్నారు.
తల్లితో గొడవపడిన శ్రద్ధ, ఇల్లు వదిలి అఫ్తాబ్‌తో సహజీవనం చేయడం ప్రారంభించిందని ఆయన తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, “శ్రద్ధ, అఫ్తాబ్‌లు కొన్నిరోజులు నయాగావ్‌లో ఉండి, ఆపై వసాయ్ ప్రాంతానికి వెళ్లారు. నా కూతురు అప్పుడప్పుడూ తన తల్లికి ఫోన్ చేసేదని, అయితే, కుటుంబంతో కలవవద్దని అఫ్తాబ్ ఆమెను కొట్టేవాడని తండ్రి వెల్లడించారు.

హత్యను ఎలా గుర్తించారు?
శ్రద్ధ తనను కలవడానికి వచ్చిందని, తన సమస్యను చెప్పుకుందని తండ్రి పేర్కొన్నారు. అఫ్తాబ్‌ను విడిచి పెట్టాల్సిందిగా తాను సూచించానని, అయితే అఫ్తాబ్ క్షమాపణలు చెప్పడంతో ఆమె తిరిగి వెళ్లిపోయిందని చెప్పారు.
తాను చెప్పిన మాటలను శ్రద్ధ అమలు చేయకపోవడంతో తాను ఆమెతో మాట్లాడటం మానేశానని శ్రద్ధ తండ్రి పోలీసులకు తెలిపారు.
అయితే, సెప్టెంబర్‌లో శ్రద్ధ ఫ్రెండ్ ఒకరు ఆమె తండ్రికి కాల్ చేసి, గత రెండు నెలలుగా ఆమె ఫోన్ స్విచాఫ్ వస్తోందని వెల్లడించారు.

ఫొటో సోర్స్, ANI
శ్రద్ధ ఆచూకీ కనిపించడం లేదంటూ ఆమె తండ్రి మహారాష్ట్రలోని మాణిక్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఈ ఎఫ్‌ఐఆర్‌లో అఫ్తాబ్‌తో శ్రద్ధకు ఉన్న సంబంధాన్ని కూడా పేర్కొన్నారు. శ్రద్ధ అదృశ్యంలో అఫ్తాబ్ హస్తం ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అఫ్తాబ్ కోసం వెతకడం ప్రారంభించారు.
అరెస్టు అనంతరం విచారణలో తమ మధ్య పెళ్లి విషయంలో గొడవ జరిగిందని, ఆవేశంతో హత్య చేశానని అఫ్తాబ్ అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు.
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం
వీరిద్దరు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైనట్లు విచారణలో తేలింది. ముంబయిలో ఉంటూ దిల్లీ వచ్చిన తర్వాత కూడా కలిసే ఉన్నారు.
ఇక్కడ ఉండగానే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఈ కేసులో అన్ని డిజిటల్, సైంటిఫిక్ ఆధారాలు సేకరించామని, వాటిని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని భద్రపరిచిన ఫ్రిజ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అఫ్తాబ్ చెప్పిన ఆధారాల ప్రకారం, మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో కొన్ని ఎముకలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
“కూతురు ఫోన్‌కాల్ కు అందుబాటులో రాకపోవడంతో తండ్రి ముంబయిలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ముంబయి పోలీసుల విచారణలో యువతి చివరి లొకేషన్ దిల్లీలో ఉన్నట్లు తేలింది. దీంతో శ్రద్ధ కుటుంబ సభ్యులు దిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు’’ అని అంకిత్ చౌహాన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సమంత: 'నేను చనిపోతానని కూడా రాసేశారు' అని కంటతడి పెట్టిన నటి
- కొమెర జాజి: నల్లమల అడవిలో పార్టీలు చేసుకునే కుర్రాళ్లకు ఆయన ఎందుకు క్లాసు తీసుకుంటారు?
- భారతదేశంలో రైళ్లకు ప్రత్యేక రంగులు, చిహ్నాలు ఉంటాయి ఎందుకు
- బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడితో అదే ఇంట్లో జీవించడం ఎలా?
- ‘రోబోలు విస్తరించాయి.. కానీ ‘మనుషులు ఇంకా అవసరమే’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















