ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పుతో కొత్త సమస్యలు వచ్చి పడతాయా?

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాఘవేంద్ర రావ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణకు మద్దతు పలుకుతూ సుప్రీం కోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది.

విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2019లో ఈ రాజ్యాంగ సవరణను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా ఆర్టికల్ 15, 16ల్లో ప్రత్యేక నిబంధనలు చేర్చింది.

ఫలితంగా రిజర్వేషన్లు అందని ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించింది. దీని కోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలను కొట్టివేయాలంటూ దాఖలైన అభ్యర్థనలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్‌ను ఈ రాజ్యాంగ సవరణ ఉల్లంఘిస్తోందని పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్వాగతించారు.

కులాల ఆధారిత రిజర్వేషన్ల ఫలాలు పొందని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మేలు చేస్తాయని ఆయన చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ‘‘మరాఠా రిజర్వేషన్లు’’ కోసం కృషి చేస్తోందని ఆయన వివరించారు.

సుప్రీం కోర్టు తీర్పు, ఆ తర్వాత ఫడణవీస్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఏళ్ల నుంచి రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్న కొన్ని ఉన్నత వర్గాలు నేడు మళ్లీ నిరసనల బాట పడతాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

కొన్నిసార్లు రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఈ ఉద్యమాలు హింసాత్మక రూపాన్ని కూడా సంతరించుకున్నాయి.

మరాఠా రిజర్వేషన్లు

‘‘మరాఠాలకు పూర్తి రిజర్వేషన్ల కోసం కాదు ఇది..’’

పంజాబ్, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ అగర్వాల్.. హరియాణా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిషన్‌కు చైర్మన్‌గా కూడా పనిచేశారు.

‘‘మరాఠా వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రస్తుత రిజర్వేషన్లు వస్తాయి. అంటే మరాఠాల్లోని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు. ఇక్కడ మరాఠాలకు పూర్తి రిజర్వేషన్లు కాదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి’’అని ఆయన చెప్పారు.

మొత్తంగా రిజర్వేషన్ల 50 శాతాన్ని మించకూడదని సుప్రీం కోర్టు పదేపదే స్పష్టం చేస్తోందని జస్టిస్ అగర్వాల్ మరోసారి పునరుద్ఘాటించారు.

‘‘షెడ్యూల్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్ తెగలు (ఎస్‌టీ), వెనుకబడిన కులాలు (బీసీ)ల రిజర్వేషన్లు ఇప్పటికే దాదాపు 50 శాతానికి చేరుకున్నాయి. ఇప్పుడు జనరల్ కేటగిరీలోని రూ.ఎనిమిది లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు లేదా వ్యవసాయ భూమి ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉండేవారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి’’అని ఆయన చెప్పారు.

డాక్టర్ చంచల్ కుమార్ సింగ్.. హిమాచల్ ప్రదేవ్ నేషనల్ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఈ రిజర్వేషన్లపై బీబీసీతో మాట్లాడారు.

రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

‘‘రాజకీయంగా చూస్తే.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సుప్రీం కోర్టు మద్దతు పలికింది కాబట్టి.. ఉన్నత వర్గాల్లోని వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అందుబాటులో ఉంచాలి. నిజానికి, ఒక కులానికి మొత్తంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. రిజర్వేషన్లు ఇస్తే తమను ప్రోత్సహించినట్లు అవుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి’’అని ఆయన అన్నారు.

అయితే, వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌కు ఇదివరకే సుప్రీం కోర్టు చెప్పిందని ఆయన అన్నారు. ఇదివరకు ఈ వెనుకబాటును సామాజిక లేదా విద్యాపరమైన వెనుకబాటుగా కోర్టు పేర్కొంది. దీనికి తాజాగా ఆర్థిక వెనుకబాటును కూడా చేర్చింది.

‘‘ఇప్పుడు రిజర్వేషన్లు కోరే వర్గాలు కోర్టు నిర్దేశించిన ఆ నిబంధనల్లోకి వస్తాయో లేదో తామే ముందుగా నిర్దేశించుకోవాలి’’అని చంచల్ కుమార్ సింగ్ వివరించారు.

‘‘మరాఠా రిజ్వేషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఎందుకంటే ఆ వర్గాలు వెనుకబడి ఉన్నాయని నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అసలు మరాఠాలు వెనుకబడి ఉన్నారని ఆధారాలు చూపించే ప్రక్రియలనే అప్పుడు మొదలుపెట్టలేదు’’అని ఆయన చెప్పారు.

మే 2021లో సుప్రీం కోర్టులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మరాఠా రిజర్వేషన్లను తోసిపుచ్చింది. రిజర్వేషన్లు మొత్తంగా 50 శాతం కోటాను మించిపోయాయని కూడా అప్పట్లో కోర్టు నొక్కిచెప్పింది.

రాజ్యాంగంలో ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా)లను మరాఠా రిజర్వేషన్లు ఉల్లంఘిస్తున్నాయని అప్పట్లో కోర్టు చెప్పింది.

రిజర్వేషన్లు

చాలా కులాల డిమాండ్లు...

కొన్ని సంవత్సరాల నుంచి చాలా కులాలు తమకు కూడా రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నాయి.

కొన్నిసార్లు ఈ డిమాండ్లు హింసాత్మక నిరసనలకు కూడా కారణమయ్యాయి.

1931 కులాల జనగణన ఆధారంగా రాజస్థాన్‌లో గుజ్జర్ల వాటా మొత్తం రాష్ట్ర జనాభాలో ఏడు శాతం వరకూ ఉంటుంది.

తమను వెనకబడిన వర్గంగా గుర్తించి విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని 2005 నుంచి గుజ్జర్లు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ)లకు ఇస్తున్న 21 శాతం రిజర్వేషన్లకు అదనంగా తమకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

దీని కోసం గుజ్జర్లు చాలాసార్లు నిరసనలు కూడా చేపట్టారు.

వీడియో క్యాప్షన్, ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసి తండ్రికి శిక్ష పడేలా చేసిన కూతురు

హరియాణాలోని జాట్‌లు కూడా ఇలానే డిమాండ్ చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర జనాభాలో వీరి వాటా 29 శాతం వరకు ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లోనూ వీరు ప్రభావం చూపిస్తుంటారు.

2016లో జాట్‌లు రిజర్వేషన్ల కోసం చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వీటిలో 30మందికిపైగా మరణించారు.

ఈ నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం సంభవించింది.

గుజరాత్‌లో పాటీదార్ వర్గం కూడా ఇలానే రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తోంది. అయితే, ఆర్థికంగా బలమైన వర్గంగా పాటీదార్లకు పేరుంది.

విద్యా సంస్థల్లో పోటీ పెరగడం, నిరుద్యోగం కూడా ఎక్కువ కావడంతో తమకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని పాటీదార్లు డిమాండ్ చేస్తున్నారు.

ఓబీసీలు రిజర్వేషన్ల వల్లే తమ ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుపరచుకుంటున్నారని, రిజర్వేషన్లు లేకపోవడంతో పాటీదార్లు వెనకబడుతున్నారని పాటీదార్ నాయకులు చెబుతున్నారు.

తమకు కూడా ఓబీసీ హోదా కల్పించాలని 2015 జులైలో పాటీదార్లు భారీగా సభలు నిర్వహించారు. ఈ నిరసనలు కూడా హింసాత్మకంగా మారాయి.

వీడియో క్యాప్షన్, దిల్లీలో ట్విన్ టవర్స్ క్షణాల్లో ఎలా కుప్పకూలి పోయాయో చూడండి...

అసలు ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎలా చూడాలి?

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సుప్రీం కోర్టు మద్దతు పలకడంతో.. రిజర్వేషన్ల కోసం డిమాండ్లు చేస్తూ వచ్చిన సామాజిక వర్గాలు మళ్ళీ నిరసనలు మొదలుపెట్టవచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

అయితే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఓ కులాన్ని ఓబీసీలో చేర్చడం రెండు భిన్నమైన అంశాలని, వీటిని ఒకే కోణంలో చూడకూడదని నిపుణులు అంటున్నారు.

‘‘సుప్రీం కోర్టు నిర్ణయం సరైనది. జనరల్ కేటగిరీలో చాలా మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉపయోగపడతాయి’’అని జస్టిస్ ఎస్ఎన్ అగర్వాల్ వివరించారు.

‘‘ఇక్కడ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. దీని వల్ల ముఖ్యంగా పేదలకు మేలు జరుగుతుంది. దీనివల్ల వారి హక్కులను పరిరక్షించినట్లు అవుతుంది’’అని ఆయన అన్నారు.

ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సరైన చర్యేనని జస్టిస్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒకవేళ వీరికి రిజర్వేషన్లు ఇవ్వకపోతే, జనరల్ కేటగిరీలోని వీరు ఎక్కడికి వెళ్తారు?’’అని ఆయన ప్రశ్నించారు.

‘‘ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం మంచిదే. ఎందుకంటే దీని వల్ల పేదలకు ప్రయోజనాలు దక్కుతాయి’’అని ఆయన అన్నారు.

మరోవైపు చంచల్ కుమార్ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సుప్రీం కోర్టు మద్దతు పలకడాన్ని స్వాగతించారు.

‘‘గత 30ఏళ్లలో ఆర్థిక వెనుకబాటుపై చర్చ ఎక్కువ అవుతోంది. ప్రపంచీకరణ, ఆర్థిక అభివృద్ధి వల్ల కొన్ని వర్గాలు వెనుకబడ్డాయి. వారికి రిజర్వేషన్లు కల్పించడం చాలా ముఖ్యం’’అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)