జస్టిస్ డీవై చంద్రచూడ్: సుప్రీం కోర్టులో తండ్రి తీర్పును తిరగరాసిన న్యాయమూర్తి

- రచయిత, సుచిత్ర మొహంతీ, శుభమ్ కిశోర్
- హోదా, బీబీసీ కోసం
‘‘వ్యక్తిగత గోప్యతా హక్కు’’ను ప్రాథమిక హక్కుల్లో భాగంగా పేర్కొంటూ 2017 ఆగస్టు 24న సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. తొమ్మిది మంది సభ్యులుగాగల ధర్మాసనం ఆ రోజు ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది.
ఆ తీర్పు అనంతరం, ధర్మాసనంలో సభ్యులుగానున్న జస్టిస్ డీవై చంద్రచూడ్ గురించి మీడియాలో చాలా చర్చ జరిగింది.
గతంలో ఇదే అంశంపై తన తండ్రి ఇచ్చిన తీర్పుకు పూర్తి భిన్నంగా ఆ రోజు జస్టిస్ చంద్రచూడ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘‘వ్యక్తిగత గోప్యతా హక్కు అనేది రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉంది. ఆర్టికల్ 21లోని స్వేచ్ఛగా జీవించే హక్కు పరిధిలోకి ఇది వస్తుంది’’అని ఆ రోజు జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
సరిగ్గా ఇదే అంశంపై 41ఏళ్ల క్రితం వచ్చిన తీర్పుకు ఇది పూర్తి విరుద్ధమైన అభిప్రాయం. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలోని నిబంధనలకు భాష్యం చెప్పడంలోనూ మార్పులు వస్తున్నాయని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ.
గత కొన్నిఏళ్లుగా కొన్ని కీలకమైన తీర్పులు, నిర్ణయాల విషయంలో జస్టిస్ చంద్రచూడ్ పేరు మీడియాలో పతకా శీర్షికల్లో నిలుస్తూ వస్తోంది.
రాజ్యాంగంలో భిన్న అంశాలకు ఆయన చెబుతున్న వివరణలు, చేస్తున్న వ్యాఖ్యలు కేవలం న్యాయ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియా, పత్రికల్లోనూ చర్చలకు కారణం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయన పేరు ట్విటర్‌లో ట్రెండ్ కూడా అయింది.
రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిరక్షణ, ఎల్‌జీబీటీక్యూఐ కమ్యూనిటీ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ లాంటి అంశాలపై తీర్పులు ఇచ్చిన జస్టిస్ డాక్టర్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్.. మన దేశానికి 50వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా బాధ్యతలు తీసుకోబోతున్నారు.
ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ పదవీ కాలం నవంబరు 8తో ముగియనుంది. ఆ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు తీసుకుంటారు. ఆయన రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. అంటే నవంబరు 2024వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.

ఫొటో సోర్స్, SC office
జస్టిస్ డీవై చంద్రచూడ్ వెలువరించిన కొన్ని చరిత్రాత్మక తీర్పులను ఇప్పుడు చూద్దాం..
అవివాహితలకూ అబార్షన్ హక్కులు
24 వారాల గర్భంతోనున్న ఓ అవివాహిత అబార్షన్ చేసుకునేందుకు అనుమతిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన తీర్పును వెల్లడించింది.
వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా గర్భస్రావం చేయించుకునేందుకు అవివాహితలకు అనుమతించకపోవడం అనేది వారి వ్యక్తి గత స్వేచ్ఛ, వారి శరీరంపై వారికుండే హక్కులను ఉల్లంఘించడం కిందకే వస్తుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కేవలం పెళ్లి కానంత మాత్రాన చట్టంలో వారికి ఈ హక్కులు లేకుండా చేయకూడదని కోర్టు అభిప్రాయపడింది.
ఒక మహిళ ‘‘బిడ్డకు జన్మను ఇవ్వాలా వద్దా?’’ అనే హక్కు ఆర్టికల్ 21లోకి వ్యక్తిగత స్వేచ్ఛ పరిధిలోకి వస్తుందని కోర్టు స్పష్టంచేసింది. కేవలం పెళ్లి కాలేదని ఒక మహిళను అబార్షన్ చేసుకోకుండా అడ్డుకుంటే, చట్టానికి స్ఫూర్తిగా నిలిచిన నియమ, నిబంధనలకు మనమే తూట్లు పొడిచినట్లు అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, SC office

వ్యక్తిగత జీవితం ఇలా..

- 2016 మే 13 నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ కొనసాగుతున్నారు.
- 2013 అక్టోబరు 31 నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా వచ్చే వరకు ఆయన ఉత్తర్ ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు.
- 2000 మార్చి 29 నుంచి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే వరకు ఆయన బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.
- 1998 నుంచి బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యేవరకు భారత అదనపు సోలిసిటర్ జనరల్‌గా ఆయన సేవలు అందించారు.
- అంతకుముందు సుప్రీం కోర్టు, బాంబే హైకోర్టులలో న్యాయవాదిగా పనిచేశారు.
- అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం డిగ్రీ పట్టా పొందారు. అక్కడే ఫొరెన్సిక్ సైన్స్‌లోనూ డాక్టరేట్ తీసుకున్నారు.
- దిల్లీ యూరివర్సిటీ లా సెంటర్ క్యాంపస్ నుంచి ఎల్ఎల్‌బీ పట్టా తీసుకున్నారు.
- దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనమిక్స్‌లో హానర్స్ పూర్తిచేశారు.


ఫొటో సోర్స్, Getty Images
‘‘స్వలింగ సంపర్కం నేరం కాదు’’
హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణించకూడదని 2018 సెప్టెంబరు 6న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది.
ఇద్దరు వయోజనుల మధ్య పూర్తి సమ్మతితో జరిగే హోమోసెక్సువల్ సంబంధాలను ఇకపై నేరంగా పరిగణించకూడదని ఈ తీర్పుతో కోర్టు స్పష్టంచేసింది.
ఈ తీర్పును ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రతోపాటు న్యాయమూర్తులు జస్టిస్ రోహింటన్ నారీమన్, జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్నారు.
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీలోని సెక్షన్ 377ను 1994లోనే మొదట కోర్టులో సవాల్ చేశారు. అయితే, వరుస అప్పీళ్ల నడుమ 24 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు ఈ కేసులో తుది తీర్పు వెల్లడించింది.
నవ్‌తేజ్ జోహార్ కేసుగా పిలిచే ఈ కేసులో.. సెక్షన్ 377ను ‘‘పురాతన వలసపాలన చట్టం’’గా జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ఇది రాజ్యాంగంలోని సమానత్వం, స్వేచ్ఛ, గౌరవప్రదంగా జీవించే హక్కులను ఉల్లంఘిస్తోందని ఆయన అన్నారు.
మరోవైపు సెప్టెంబరు 2022లోనూ హోమోసెక్సువాలిటీపై ఓ ప్రసంగంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. ‘‘కేవలం హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణించనంత మాత్రాన సమానత్వం రాదు. దీని గురించి ప్రతి ఇంటిలో, ప్రతి ఆఫీసులో, ప్రతి చోటా చర్చ జరగాలి. అందరికీ అవగాహన కల్పించాలి’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యక్తిగత గోప్యతా హక్కు
2017 ఆగస్టు 24న వ్యక్తిగత గోప్యతా హక్కు (రైట్ టు ప్రైవసీ)ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ సుప్రీం కోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది.
ఈ రాజ్యాంగ ధర్మాసనంలో అప్పటి సీజేఐ జేఎస్ ఖేహార్‌తోపాటు న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఆర్‌కే అగర్వాల్, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ ఏఎం సప్రే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌లు సభ్యులుగా కొనసాగారు.
వ్యక్తిగత గోప్యతా హక్కు అనేది.. ఆర్టికల్ 21లోని గౌరవంగా జీవించే హక్కులో భాగమని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఇదివరకు ఇది ప్రాథమిక హక్కుకాదని చెప్పిన రెండు సుప్రీం కోర్టు తీర్పులను ఆనాడు ఆ ధర్మాసనం తిరగరాసింది.
1954లో ఎంపీ శర్మ కేసులో ఆరుగురు సభ్యుల ధర్మాసనం, 1962లో ఖరాగ్ సింగ్ కేసులో ఎనిమిది మంది సభ్యుల ధర్మాసనం.. వ్యక్తిగత గోప్యతా హక్కును సంపూర్ణ హక్కు కాదని, ప్రభుత్వం దీనిపై కావాలంటే సహేతుక ఆంక్షలు విధించొచ్చని పేర్కొన్నాయి. ఈ రెండు తీర్పులను 2017లో సుప్రీం కోర్టు తిరగరాసింది.
కొన్ని పథకాలకు ఆధార్ తప్పనిసరి చేస్తూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వ్యక్తిగత గోప్యతా హక్కుపై అప్పట్లో పెద్దయెత్తున చర్చ మొదలైంది. కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వ్యక్తిగత గోప్యతా హక్కును గుర్తించేందుకు నిరాకరించారు. ఇదివరకటి సుప్రీం కోర్టు తీర్పులను వారు ప్రస్తావించారు. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం మొత్తంగా ఈ హక్కు ప్రాథమిక హక్కుల కిందకు వస్తుందని కోర్టు స్పష్టంచేసింది.

ఫొటో సోర్స్, Getty Images
శబరిమల, భీమా కోరేగావ్, మహమ్మద్ జుబైర్...
షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం కేసులో హదియా మతపరమైన స్వేచ్ఛకు, తనకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా గుర్తించే హక్కుకు జస్టిస్ డీవై చంద్రచూడ్ మద్దతు పలికారు.
హదియా ఇస్లాంలోకి మతం మారి షఫీన్ జహాన్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆమెను తప్పుదోవ పట్టించి మతం మార్చారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.
వయోజనుల విషయంలో నచ్చిన మతాన్ని అనుసరించడం, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు వస్తుందని ఆనాడు జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.
శబరిమల కేసులో పది నుంచి 50ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించడం అనేది వివక్ష కిందకు వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.
రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, స్వతంత్రత, గౌరవప్రదమైన జీవితాలను ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నాయని తీర్పు ఇచ్చే సమయంలో జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 నిషేధించిన అంటరానితనాన్ని కూడా ఆ ఆంక్షలు ప్రోత్సహించేలా ఉన్నాయని, ముఖ్యంగా మహిళలు అపవిత్రమైనవారని చెబుతూ ఆ ఆంక్షలు విధిస్తున్నారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, SC office
మరోవైపు దిల్లీ ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీకి అధిపతి కాదని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
‘‘ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి అధిపతిగా కార్యనిర్వాహక ప్రతినిధులు ఉంటారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలిని ప్రభుత్వానికి అధిపతిగా భావించాలి. ఆ మంత్రి మండలి ఇచ్చే సూచనలను లెఫ్టినెంట్ గవర్నర్ పాటించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో ఆయనకంటూ ఎలాంటి స్వతంత్ర అధికారాలూ లేవు’’అని ఆయన చెప్పారు.
మరోవైపు తహ్‌సీన్ పూనావాలా కేసులో జడ్జి లోయా మరణం వెనుక పరిస్థితులపై విచారణ చేపట్టాలనే డిమాండ్‌ను జస్టిస్ చంద్రచూడ్ తోసిపుచ్చారు. సోహ్రాబుద్దీన్ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయా అప్పట్లో మరణించడంపై మీడియాలో చాలా వార్తలు వచ్చాయి.
జోసెఫ్ షైన్ కేసులో వివాహేతర సంబంధాలు నేరంకాదని తీర్పునిచ్చిన ధర్మాసనంలోని మెజారిటీ సభ్యుల్లో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఒకరు. ఐపీసీలోని సెక్షన్ 497 అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 21లను ఉల్లంఘిస్తోందని వీరు చెప్పారు. వివాహేతర సంబంధాలను నేరంగా చెప్పేటప్పుడు మహిళను సదరు వ్యక్తి ప్రాపర్టీగా చూడటమనే వాదనతో వీరు విభేదించారు.
మరోవైపు జర్నలిస్టు మహమ్మద్ జుబైర్ కేసులో ఆయనకు జస్టిస్ చంద్రచూడ్ బెయిల్ మంజూరు చేశారు. అరెస్టు చేసే అధికారాలను పోలీసులు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని కేసుల్లో భిన్నాభిప్రాయాలు
భీమా కోరేగావ్ కేసులో ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తలకు అరెస్టుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేయాల్సిన అవసరంలేదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యతిరేక స్వరం వినిపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కూడా కుట్ర పన్నినట్లు ఆ ఐదుగురు కార్యకర్తలపై ఆరోపణలు మోపారు.
ఈ అరెస్టులు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21 వారికి ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ, స్వేచ్ఛగా జీవించే హక్కులకు వ్యతిరేకంగా జరిగాయో లేదో తెలుసుకోవడం అసవరమని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దీని కోసం సిట్‌ను ఏర్పాటుచేయాల్సిన అవసరముందని అన్నారు. అయితే, ఈ కేసులో మెజారిటీ నిర్ణయంతో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
2018లో ఆధార్ అవసరంతోపాటు ఇది వ్యక్తిగత గోప్యతా హక్కును ఉల్లంఘిస్తుందా? అనే అంశంపై సుప్రీం కోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఆధార్ రాజ్యాంగంలోని నిబంధనల కోణంలో చూస్తే చెల్లుబాటు అవుతుందని మెజారిటీతో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. కానీ, చంద్రచూడ్ మాత్రం ఆధార్ అనేది రాజ్యాంగ వ్యతిరేకమని అభిప్రాయం వ్యక్తంచేశారు.
అసలు ఆధార్ చట్టాన్ని ఆర్థిక బిల్లుగా పేర్కొంటూ పార్లమెంటు ఆమోదించడం అనేది రాజ్యాంగానికి ద్రోహం చేయడమేనని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
2020 ఫిబ్రవరిలో గుజరాత్‌లో ఓ సమావేశంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ‘‘అసమ్మతి అణచివేయడానికి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటే ప్రజల్లో భయం పెరుగుతుంది. ఇది చట్టాలకు అనుగుణంగా పాలన అనే సూత్రానికే విరుద్ధం’’అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘అసమ్మతిని దేశ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం అని ముద్రవేయడంతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు మనం తూట్లు పొడుస్తున్నాం’’అని ఆయన వ్యాఖ్యానించారు.
కలిసి పనిచేసేవారు ఏం చెబుతారు?
విశ్రాంత జస్టిస్ అమర్ శరణ్ అలహాబాద్ హైకోర్టులో 2013 నుంచి 2016 మధ్య జస్టిస్ చంద్రచూడ్‌తో కలిసి పనిచేశారు. జస్టిస్ చంద్రచూడ్ గురించి జస్టిస్ అమర్ బీబీసీతో మాట్లాడారు. ‘‘జస్టిస్ చంద్రచూడ్ ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్నారని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ పిల్లల సొంత తల్లిదండ్రులు నిరుపేదలు. ఆయన మంచి న్యాయమూర్తి. అంతేకాదు మంచి మనిషి’’అని జస్టిస్ అమర్ వ్యాఖ్యానించారు.
మరోవైపు జస్టిస్ చంద్రచూడ్‌తో కలిసి చాలా ధర్మాసనాల్లో పనిచేసిన విశ్రాంత జస్టిస్ ప్రదీప్ కుమార్ సింగ్ కూడా బీబీసీతో మాట్లాడుతూ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ‘‘ఆయన న్యాయమూర్తిగా కాస్త కఠినంగా ఉంటారు. చట్టాలను తూచా తప్పకుండా పాటిస్తారు. అసలు ప్రజలు తన గురించి ఏం అనుకుంటారోనని ఆయన ఆలోచించరు’’అని జస్టిజ్ ప్రదీప్ చెప్పారు.
మరోవైపు ఆయనతో కలిసి పనిచేసిన జస్టిస్ బఘేల్ మాట్లాడుతూ ‘‘ఉత్తర్ ప్రదేశ్‌లో అన్ని ప్రధాన రోడ్లకూ సైకిల్ ట్రాక్‌లు ఉండాలని జస్టిస్ చంద్రచూడ్ ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే నానాటికీ అక్కడ కాలుష్యం పెరుగుతోంది. దీంతో ఆయన ఈ ఆదేశాలు ఇచ్చారు’’అని వివరించారు.
మరోవైపు అలహాబాద్ హైకోర్టులోనే జస్టిస్ గోవింద్ మాథుర్ కూడా జస్టిస్ చంద్రచూడ్‌తో కలిసి పనిచేశారు. ‘‘జస్టిస్ చంద్రచూడ్‌కు టెక్నాలజీపై మంచి పట్టుంది. సాంకేతికతకు సంబంధించి అన్ని విషయాలను ఆయన మెరుగ్గా అర్థం చేసుకోగలరు. కొత్త టెక్నాలజీని ఉపయోగించే దిశగా ఆయన చాలా చర్యలు తీసుకున్నారు. న్యాయవాదులు, ప్రజలకు ఈ టెక్నాలజీతో మేలు జరగాలని ఆయన కోరుకుంటారు’’అని చెప్పారు.
కొలీజియంపై అభ్యంతరాలు
సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో నాలుగు ఖాళీలను భర్తీ చేసేందుకు చర్చలు జరుగుతున్న సమయంలో కొత్త వ్యక్తులను ఎంపిక చేసేందుకు అనుసరిస్తున్న విధానాలపై అక్టోబరు 1న జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్‌లు అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంలో ఐదుగురు సభ్యులుంటారు. ప్రస్తుత కొలీజియంలో సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లు సభ్యులుగా ఉన్నారు.
సుప్రీం కోర్టుతోపాటు హైకోర్టులోని న్యాయమూర్తుల నియామకాలకు పేర్లను తొలుత కొలీజియం సిఫార్సు చేస్తుంది.
గతంలో కూడా కొందరు న్యాయమూర్తులు కొలీజియం అనుసరిస్తున్న విధానాలపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. తాజాగా చంద్రచూడ్ అభ్యంతరాలను వ్యక్తంచేయడాన్ని పరిశీలిస్తుంటే.. ఆయన సీజేఐగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ విధానాల్లో మార్పులు తీసుకొచ్చే అవకాశముందని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు.
జస్టిస్ చంద్రచూడ్ ప్రస్థానం ఇప్పటివరకు..
జస్టిస్ చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ 1978లో దేశానికి 16వ సీజేఐగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఏడేళ్లు ఈ పదవిలో కొనసాగారు. సుదీర్ఘ కాలం సీజేఐగా కొనసాగిన వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. మాజీ సీజేఐ కుమారుడు కూడా సీజేఐ కావడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి.
జస్టిస్ చంద్రచూడ్ తన ఎల్‌ఎల్‌బీ డిగ్రీని దిల్లీ యూనివర్సిటీ నుంచి పూర్తిచేశారు. ఆ తర్వాత స్కాలర్‌షిప్‌పై ఆయనే హార్వర్డ్‌కు వెళ్లారు. అక్కడే ఆయన న్యాయ విభాగంలో మాస్టర్స్ (ఎల్ఎల్ఎం), జ్యుడీషియల్ సైన్స్‌లో డాక్టరేట్ పూర్తిచేశారు.
ఆ తర్వాత సుప్రీం కోర్టుతోపాటు భిన్న హైకోర్టులలో న్యాయవాదిగా పనిచేశారు. తొలిసారిగా న్యాయమూర్తిగా బాంబే హైకోర్టులో ఆయన అడుగుపెట్టారు.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













