ఉచిత పథకాల్లో మంచివి, చెడ్డవి ఉంటాయా? ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ఒకటేనా?

సైకిళ్ళ పై స్కూలుకు వెళుతున్న బాలికలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోయా మటీన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఓట్ల కోసం ఉచిత పథకాలను అమలు చేయాలనుకోవడం దేశానికి ప్రమాదకరమని ప్రధాని మోదీ ఇటీవల హెచ్చరించిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ చర్చ మొదలయింది. దీనికి సంబంధించి బీజేపీ నాయకుడు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ప్రస్తుతం విచారణలో ఉంది.

భారతదేశంలో రాజకీయ నాయకులు ఉచిత పథకాలను విరివిగా అమలు చేస్తారా?

గత కొన్ని వారాలుగా దేశంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను అమలు చేయడం గురించి చర్చ సాగుతోంది. ఓట్ల కోసం ఉచిత పథకాలను అమలు చేయాలనుకోవడం దేశానికి ప్రమాదకరమని ప్రధాని మోదీ ఇటీవల హెచ్చరించిన తర్వాత ఈ చర్చ మొదలయింది.

ఇలా ఉచితాలను పంచి పెట్టడాన్ని 'రేవ్డీ సంస్కృతి' (ఇష్టం వచ్చినట్లు మిఠాయిలు పంచడం) లాంటిదని పోల్చారు.

అయితే, దేశంలో అసమానతలను తగ్గించేందుకు ప్రవేశపెట్టే పథకాలను ఉచితాలుగా చూడకూడదని ఆయన ప్రత్యర్ధులు వాదించారు. మోదీ చేస్తున్న ప్రకటనలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న వివిధ సంక్షేమ పథకాలకు చట్టబద్ధత లేకుండా చేసేందుకు తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలని ఆరోపించారు.

ప్రభుత్వ నిధులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతూ ఉచిత పథకాలను ప్రకటించే రాజకీయ పార్టీల పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశం పై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది.

వీడియో క్యాప్షన్, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏం మారింది? యువతీయువకులు ఏం చెబుతున్నారు?

ఉచిత పథకాల్లో మంచివి, చెడ్డవి ఉంటాయా?

ఉచిత పథకాలకు కచ్చితమైన నిర్వచనం ఏమి లేకపోవడంతో ఇది మంచిదా, చెడ్డదా అనే విషయాన్ని చెప్పడం కష్టం. ప్రజల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉత్పత్తులు, సేవలను అందించడాన్ని ఉచిత పథకాలని చెప్పొచ్చు.

దీనికొక కచ్చితమైన నిర్వచనం లేకపోవడంతో కొంత మంది ఈ పథకాలు మంచివని అంటుంటే, కొంత మంది ఇవి మంచివి కావని అంటూ తమ వాదనలు వినిపిస్తున్నారు.

మొత్తంగా ఈ ఉచిత పథకాలు అనే అంశమే విమర్శనాత్మకం అని కొంత మంది అంటారు. ఉచిత పథకాలు ఓటర్లను ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకు అవరోధంగా పని చేస్తాయి అని అంటారు. కొంత మంది ఓటర్లు తామెవరిని ఎన్నుకోవాలనే నిర్ణయం నుంచి పూర్తిగా పక్కకు తప్పుకునేట్లు చేస్తాయని విమర్శిస్తారు.

ఎవరెటువంటి వాదన చేసినప్పటికీ, ఉచిత పథకాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికల రాజకీయాల్లో అంతర్భాగంగా ఉన్నాయి.

నగదు బదిలీలు, ఆరోగ్య బీమా, ఆహార ఉత్పత్తులు నుంచి కలర్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సైకిళ్ళు, బంగారం వరకు కూడా ఓటర్లకు ఇస్తామని చాలా మంది రాజకీయ నాయకులు హామీలు చేస్తూ ఉంటారు.

గత ఏడాది తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడు 100 రోజుల పాటు చంద్రమండలానికి, అధిక ఉష్ణోగ్రతల నుంచి బయటపడేందుకు చల్లని దీవికి పర్యటనకు తీసుకుని వెళతానని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రకటన చేయడం వెనుకనున్న ఉద్దేశ్యం గురించి చెబుతూ, రాజకీయ నాయకులు చేసే భారీ హామీల గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకే ఇలాంటి ప్రకటన చేశానని ఆయన అన్నారు.

అయితే, ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ఒకటేనా?

ఉచిత పథకాన్ని సంక్షేమ పథకం నుంచి వేరు చేసేందుకు కచ్చితమైన నియమాలేమి లేవు.

భారతదేశంలో ఎన్నికలకు ముందు, తర్వాత ఓటర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం చట్టవ్యతిరేకం కాదు. దేశంలో అన్ని పార్టీలు, ఆఖరుకు బీజేపీ కూడా ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంది.

ప్రభుత్వాలు కూడా పౌరుల సామాజిక ఆర్ధిక అభివృద్ధికి కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటిస్తాయి.

బీజేపీ కూడా ఉచిత, సబ్సిడీ గృహ పథకాలు, గ్యాస్ సిలిండర్లు, టాయిలె‌‌ట్ల లాంటి అనేక పథకాలను అమలు చేసింది.

దేశవ్యాప్తంగా ఇతర పార్టీలు కూడా ఇలాంటి సంక్షేమ పథకాలనే అమలు చేస్తూ ఉంటాయి.

బిహార్ లో ప్రభుత్వం స్కూలు చదువు పూర్తి చేస్తున్న బాలికలకు నగదు ప్రోత్సాహాకాలిస్తోంది.

తమిళనాడులో ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీ ద్వారా తక్కువ ధరకు భోజనం ఇచ్చే క్యాంటీన్ లను నిర్వహిస్తోంది.

కానీ, ఇందులో ఏవి చట్టబద్ధమైన సంక్షేమ పధకాలు, ఏవి ఉచితాలు?

దీనికి సమాధానం చెప్పడం కష్టం.

ఆర్థికవేత్తలు వ్యక్తి ప్రయోజనం కంటే కూడా సమాజ ప్రయోజనం చేకూర్చే విద్య, ఆరోగ్యం లాంటి ప్రయోజనం కలిగించే సేవలను , ప్రయోజనం కలిగించని ఉత్పత్తులు, సేవలను వేరు చేసి చూస్తారు.

కానీ, వీటిని వేర్వేరుగా చూడటం కష్టం.

ప్రభుత్వం, రాజకీయ పార్టీలు సైకిళ్లను పంచిపెట్టడం ఎన్నికల గిమ్మిక్కుగా కనిపించొచ్చు. కానీ, రవాణా సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కొన్ని లక్షల మంది బాలికలకు సైకిళ్ళు ఇవ్వడం ద్వారా వారు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేందుకు వీలవుతుంది.

రాజధాని దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత విద్యుత్ ను ఇవ్వడం మధ్య తరగతి వారికి ప్రయోజనం కాకపోవచ్చు. కానీ, ఇది అసంఘటిత రంగంలో పని చేస్తున్న కొన్ని లక్షల మంది జీవితాలను మలుపు తిప్పే అంశంగా మారొచ్చు.

సుప్రీం కోర్టు విచారణలో భాగంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ కూడా "ఒక క్షురకునికి షేవింగ్ కిట్, ఒక విద్యార్థికి సైకిల్, గీత కార్మికులకు అవసరమైన పనిముట్లు, రజకునికి ఇస్త్రీ పెట్టె ఇవ్వడం వల్ల వారి జీవన శైలిని మార్చి జీవితాలను మెరుగుపరుస్తుంది" అని వ్యాఖ్యానించారు.

కొన్ని కీలకమైన సంక్షేమ పథకాలను కూడా ఉచిత పథకాలని అంటున్నారని కొంత మంది అన్నారు.

ఉదాహరణకు తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం వల్ల విద్యార్థుల హాజరు మెరుగుపడుతుందని భావించడంతో ఇది క్రమంగా ఇతర రాష్ట్రాలకు, తర్వాత దేశ వ్యాప్తంగా కూడా విస్తరించింది.

మోదీ ప్రభుత్వం కొంత మందికి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఉచిత పథకాలు ఎందుకు వివాదాస్పదంగా మారుతున్నాయి?

నిజానికి ఇవి ఉచిత పథకాలు కావు. వీటికి పన్నుదారులు డబ్బులు చెల్లిస్తున్నట్లు లెక్క.

దీంతో, ఇవి దేశ ఆర్ధిక వనరుల పై భారం కలిగించి ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయని కొంత మంది వాదిస్తారు.

ఈ కేసును విచారిస్తూ, ‘‘ఉచిత పథకాలు దేశ ఆర్ధిక వ్యవస్థను ఎండగట్టే విధంగా ఉండకూడదు" అని జస్టిస్ ఎన్‌వి రమణ అన్నారు.

కొన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితికి ఉచిత విద్యుత్, మంచి నీరు లాంటి ఉచిత పథకాలే కారణమని జూన్ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక కూడా తెలిపింది. వీటిని ప్రజా ప్రయోజనాలు కలిగించే ఖర్చు నుంచి ఉచిత పథకాలను వేరు చేయాలని సూచించింది.

కానీ, ప్రతిపక్ష పార్టీలు, ఆర్థికవేత్తలు ఈ వాదనతో ఏకీభవించలేదు.

సాంఘిక సంక్షేమ పథకాలను ఉచిత పథకాలుగా చూసేందుకు లేదని వాదించారు. ఈ ఖర్చు అంతా ప్రభుత్వం ప్రజల పట్ల నిర్వర్తించాల్సిన ప్రాధమిక బాధ్యతల కిందకు వస్తుందని అన్నారు.

మధ్యాహ్న భోజన పథకం

ఫొటో సోర్స్, Getty Images

"ఉచిత పథకాలతో రాజకీయాలను చేయడం ఆర్ధిక విధానాన్ని తప్పు పట్టడంతో పాటు మానవ వనరుల్లో పెట్టుబడి పెట్టే సంక్షేమ రాజ్య స్థాపన చేసేందుకు విఫలం కావడమే" అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికలో ఆర్థికవేత్త యామినీ అయ్యర్ రాసిన సంపాదకీయంలో రాశారు.

"ప్రభుత్వం కీలకమైన విద్య, ఆరోగ్య రంగాల్లో తగినంత పెట్టుబడులు పెట్టడంలో విఫలమవ్వడంతో తీవ్రమైన అసమానతలు నెలకొన్నాయి. ఈ సమస్యకు పరిహారంగా వివిధ సేవలను అందించాలని చూస్తోంది" అని అయ్యర్ అంటారు.

"ఇది కేవలం ఓటర్లను కొనుక్కోవడం గురించి కాదు. ఓటర్లు కూడా వారి అవసరాల కోసం రాజకీయాలపై ప్రజాస్వామ్యబద్ధంగా ఒత్తిడి పెట్టడం కిందకు కూడా వస్తుంది" అని ఆమె అంటారు.

ప్రస్తుతం ఉచిత పథకాల పై లేవనెత్తిన చర్చ కేవలం రాష్ట్రాల పై నియంత్రణ సాధించేందుకు చేసే ప్రయత్నంగా కొంత మంది భావిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ రుణ, ఆర్ధిక విధానాలను కేంద్ర ప్రభుత్వ జోక్యం కోర్టు జోక్యం లేకుండా నిర్వహించే హక్కులు కలిగి ఉంటాయి.

కొంత మంది పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ప్రభుత్వం నుంచి పన్ను రాయితీలు, రుణ మాఫీలు పొందుతున్నప్పుడు పేదలకు ఇచ్చే సబ్సిడీలను మాత్రమే ఉచిత పథకాలని ఎందుకంటారని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.

ఓటర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఉచిత పథకాలు ఎన్నికల్లో గెలిచేందుకు సహాయపడతాయా?

ఉచిత పథకాలు ఓటర్లను ఆకర్షిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

కానీ, ఎన్నికలకు ముందు వీటిని ప్రకటించడం, అమలు చేయడం పట్ల రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శించుకుంటూ ఉంటాయి.

ఉదాహరణకు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉచిత విద్యుత్, నీరు కల్పిస్తామని చేసిన ప్రకటనలు విమర్శలకు గురయ్యాయి.

కానీ, ఓటర్లు ఈ మొత్తం వ్యవహారాన్ని భిన్నంగా చూస్తారు.

కొంత మంది ఉచిత పథకాలు వారి అవసరాలను తీర్చేందుకు పనికొస్తాయని అంటుంటే, ఇది అర్ధం పర్ధం లేని వ్యవహారం అని మరి కొందరు అంటారు. ఈ విషయంలో వ్యవస్థాగతమైన మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసిన హామీలను నెరవేర్చని పక్షంలో ఎవరినీ చట్టబద్ధంగా బాధ్యులను చేసే అవకాశం మాత్రం లేదు. ఈ అంశం చుట్టూ నెలకొన్న సందిగ్ధతలను కోర్టు ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)