క్వీన్ ఎలిజబెత్-2: రాణి ఉన్న చోట నవ్వుల జల్లులే

ఫొటో సోర్స్, Getty Images
క్వీన్ ఎలిజబెత్-2 బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, నలుగురిలో ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలో ముందుగానే నిర్దేశించి ఉంటుంది.
ఆమె అందుకు అనుగుణంగానే నడుచుకోవాల్సి ఉంటుంది. అందుకే తన ముఖంలోని భావాలను బయటకు కనిపించకుండా వాటిని రాణి దాచేయాల్సి వచ్చేది. తొలినాళ్లలో రాణి అలాగే చేశారు. కానీ ఆ తరువాత మెల్లగా తనలోని హాస్య చతురతను మెల్లగా బయటి ప్రపంచానికి చూపించారు.
ఇదే విషయాన్ని రాణి మనుమడు ప్రిన్స్ హారిస్ కూడా చెప్పారు. 'రాణికి ఉన్న మంచి లక్షణాల్లో సెన్స్ ఆఫ్ హ్యుమర్ కూడా ఒకటి' అని ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పాడింగ్టన్ బేర్‌తో టీ పార్టీ
జూన్‌లో జరిగిన రాణి ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఒక ఫిలిం తీశారు. అందులో పాడింగ్టన్ బేర్‌తో టీ తాగుతున్నట్లుగా రాణి నటించారు. పాడింగ్టన్ బేర్ అనేది నిజమైన జంతువు కాదు. అది పాడింగ్టన్ సినిమాలోని ఒక పాత్ర.
అనుకోకుండా టేబుల్ మీద ఉన్న ఫుడ్‌ను పాడింగ్టన్ బేర్ తొక్కేస్తుంది. 'అత్యవసరమైనప్పుడు కావాల్సొస్తుందని ఒకటి దాస్తాను' అంటూ తన తల మీద ఉన్న టోపీ తీసి అందులోని శాండ్‌విచ్‌ను రాణికి ఆఫర్ చేస్తుంది పాడింగ్టన్ బేర్.
అప్పుడు రాణి, 'నేను కూడా అంతే' అంటూ తన హ్యాండ్ బ్యాగ్‌లోని శాండ్‌విచ్‌ను బయటకు తీస్తారు.

ఫొటో సోర్స్, PA Media
'మిమిక్రీ కూడా చేస్తారు'
వ్యక్తిగత సమయంలో రాణి మిమిక్రీ కూడా చేస్తారని చెబుతారు. ఇతరులు మాట్లాడే తీరును అనుకరిస్తారని ది క్రౌన్ వెబ్ సిరీస్‌కు కన్సల్టెంట్‌గా పని చేసిన లేసియ్ తెలిపారు. ప్రత్యేకించి రష్యా మాజీ అధ్యక్షుడు బోరిస్ ఎల్ట్‌సిన్‌ను బాగానే అనుకరించే వారని 'విక్డ్ విట్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్-2' పుస్తక రచయిత కరేన్ డాల్బే తెలిపారు.
అంతేకాదు ఆమె రాజకీయనేతలు, టీవీ పాత్రలను కూడా ఇమిటేట్ చేసేవారు.
'ఒకసారి రాణితో జరిగిన ప్రైవేటు మీటింగ్‌లో ఒక రాజకీయ నేత పాల్గొన్నారు. సమావేశం జరుగుతుండగా ఆ నేత ఫోన్ మోగింది. వెంటనే ఆ నేత దాన్ని స్విచాఫ్ చేశారు. కాస్త ఇబ్బందిగాను ఫీలయ్యారు. 'ఇంతకు ఆ ఫోన్ చేసిన వాళ్లు చాలా ముఖ్యమైన వాళ్లు అయితే కాదు కదా?' అంటూ రాణి చమత్కరించారు' అని లేసియ్ వెల్లడించారు.

ఖడ్గంతో కేకు కోసిన రాణి
తన జీవితంలో రాణి ఎన్నో సార్లు కేక్ కోశారు. కానీ ఒకటి మాత్రం చాలా ప్రత్యేకం. కార్న్‌వాల్‌లో జరిగిన ఒక చారిటీ ఈవెంట్‌లో పాల్గొన్న రాణి, గార్డ్ దగ్గర ఉండే పెద్ద ఖడ్గం తీసుకొని దానితో కేక్ కట్ చేశారు.
కేక్ కొసే కత్తి అక్కడ ఉందని చెప్పినప్పటికీ రాణి పట్టించుకోలేదు.
'నాకు తెలుసు కత్తి ఉందని, ఇది అంతకు మించి' అంటూ ఖడ్గంతోనే రాణి కేకును కోశారు.

ఫొటో సోర్స్, Max Mumby/Indigo
'మీరు రాణిని చూశారా?'
రాణి హాస్య చతురతకు సంబంధించిన మరొక కథ ప్రచారంలో ఉంది.
ఒకసారి బల్మోరల్ క్యాజిల్ వద్ద వానలో రాణి నడుస్తున్నారు. అప్పుడు ఆమెతో సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు ఉన్నారు.
అదే సమయంలో కొందరు అమెరికా టూరిస్టులు బల్మోర్ క్యాజిల్ వద్దకు వచ్చారు. కానీ వారు రాణిని గుర్తు పట్టలేక పోయారు. పైగా 'మీరు రాణిని చూశారా?' అంటూ వారు రాణినే అడిగారు.
అప్పుడు ఆమె 'నేను చూడలేదు, కానీ ఈయన చూశారు' అంటూ సెక్యూరిటీ ఆఫీసర్ వైపు చేయి చూపించారు.
వాతావరణం గంభీరంగా మారినప్పుడు కాస్త తేలిక పరిచేందుకు రాణి తన సెన్స్ ఆఫ్ హ్యుమర్‌ను వాడేవారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కళ్లన్నీ రాణి మీదనే’
అధికారిక లేదా ఉన్నత స్థాయి వేడుకలకు హాజరైనప్పుడు అందరి కళ్లు రాణి మీదనే ఉంటాయి. అది రాణికి కాస్త ఒత్తిడి కలిగించే అంశం. అలాంటప్పుడు నవ్వితే కాస్త బరువు తగ్గినట్లు అనిపిస్తుందని బ్రిటిష్ సైకలాజికల్ సొసైటీ ఆడ్రీయ్ టాంగ్ అన్నారు.
అంతే కాదు హాస్యం, చిరునవ్వు వల్ల బంధాలు కూడా బలపడతాయి. రాణి, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ చాలా సందర్భాల్లో కలిసి నవ్వుతూ కనిపించేవారని చెబుతారు.
'జాన్ క్రటియన్ కెనడా ప్రధానిగా ఉన్నప్పుడు రాణితో కలిసి ఒక ఒప్పందం మీద సంతకం చేస్తున్నారు. కానీ జాన్ తీసుకున్న పెన్ టిప్ విరిగి పోయింది. దాంతో ఆయనకు కోపం వచ్చి అరిచారు.
అప్పుడు రాణి పెద్దగా నవ్వారు' అని డాల్బే వివరించారు.
ఇలా పరిస్థితులు గంభీరంగా మారినప్పుడు ఆమె తన హాస్య చతురతతో వాతావరణాన్ని తేలిక పరిచే వారని సర్ ఆంథోనీ తెలిపారు.

ఫొటో సోర్స్, PHIL NOBLE
2003లో ఒకసారి విండ్సర్ క్యాజిల్‌లో సైనిక ప్రదర్శన జరుగుతోంది. అప్పుడు ఒక తేనేటీగల గుంపు ఒకటి వచ్చి గందరగోళం సృష్టించింది. అది చూసి రాణి నవ్వుతుంటే ఆ క్షణాలను క్రిస్ యంగ్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాతో బంధించారు.
'రాణి చిన్న పిల్ల మాదిరిగా కేరింతలు కొడుతోంది' అని యంగ్ అన్నారు.
1991లో క్రిస్‌మస్ సందర్భంగా ఇచ్చిన సందేశంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్రాముఖ్యాన్ని రాణి వివరించారు.
'మనం మరీ అంత సీరియస్‌గా ఉండొద్దు. మనలో ఎవరూ పరిపూర్ణులు కారు' అని రాణి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ 3 అధికారిక ప్రకటన.. తొలిసారి టీవీల్లో ప్రసారమైన చారిత్రక కార్యక్రమం
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
- రాజ కుటుంబంలోని సభ్యులు ఎవరు, రాజు నిర్వర్తించే విధులు ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








