యూకేలో రాచరికం పాత్ర: రాజ కుటుంబంలోని సభ్యులు ఎవరు, రాజు నిర్వర్తించే విధులు ఏంటి?

కింగ్ చార్లెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్

క్వీన్ ఎలిజబెత్ 2 గురువారం మరణించడంతో ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ 3 బ్రిటన్‌కు తదుపరి రాజు అయ్యారు.

96 ఏళ్ల వయస్సున్న రాణి బల్మోరల్ క్యాసిల్‌లో కన్నుమూశారు.

ఈ ఏడాది ప్రారంభంలోనే క్వీన్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు జరిగాయి. బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహించారు.

ఇప్పుడు ఏం జరుగనుంది?

రాణి మరణంతో బ్రిటన్ సింహాసనం ఇప్పుడు ఆమె వారసుడు చార్లెస్ వశమైంది. బ్రిటన్‌కు రాజుగా చార్లెస్ వ్యవహరించనున్నారు.

లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో శనివారం చార్లెస్‌ను అధికారికంగా బ్రిటన్ రాజుగా ప్రకటించనున్నారని అంచనా.

2019 అక్టోబర్ 14న 'స్టేట్ ఓపెనింగ్ ఆఫ్ పార్లమెంట్' కార్యక్రమం సందర్భంగా క్వీన్ ఎలిజబెత్ 2తో మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2019 అక్టోబర్ 14న ‘స్టేట్ ఓపెనింగ్ ఆఫ్ పార్లమెంట్’ కార్యక్రమం సందర్భంగా క్వీన్ ఎలిజబెత్ 2తో మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్

రాజు ఏం చేస్తారు?

యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) అధిపతిగా కింగ్ వ్యవహరిస్తారు. అయితే, ఆయన అధికారాలు కేవలం ప్రతీకాత్మకమైనవి. రాజకీయపరంగా రాజు తటస్థంగా ఉంటారు.

ముఖ్యమైన సమావేశాలకు సంబంధించిన సమాచారం, సంతకం చేయాల్సిన పత్రాలను ప్రభుత్వం రోజూవారీగా ఒక ఎర్రటి లెదర్ బాక్స్‌లో రాజుకు పంపిస్తుంది.

దేశ ప్రధాని ప్రతీ బుధవారం బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో రాజును కలుస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని చెబుతుంటారు.

ప్రధానికి, రాజుకు మధ్య జరిగే ఈ సమావేశాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతారు. ఈ సమావేశానికి సంబంధించిన అధికారిక రికార్డులు ఉండవు.

రాజు నిర్వర్తించాల్సిన పార్లమెంట్‌ విధులు కూడా ఉంటాయి.

ప్రభుత్వాన్ని నియమించడం: సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ నాయకుడిని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం బకింగ్‌హమ్ ప్యాలెస్‌కు పిలుస్తారు. ఎన్నికలకు ముందు రాజు, ప్రభుత్వాన్ని అధికారికంగా రద్దు చేస్తారు.

పార్లమెంట్‌లో ప్రసంగం: కింగ్ ప్రసంగంతో బ్రిటన్ పార్లమెంట్ సెషన్ ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియను 'స్టేట్ ఓపెనింగ్ సెరిమొనీ'గా పిలుస్తారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో వెలువరించే ఈ ప్రసంగంలో ప్రభుత్వ పథకాలను ఆయన వివరిస్తారు.

రాచరిక ఆమోదం: పార్లమెంట్ ఆమోదించిన బిల్లు చట్టంగా మారాలంటే దాన్ని అధికారికంగా రాజు ఆమోదించాలి.

వీటితో పాటు పర్యటనకు వచ్చే దేశాధినేతలకు ఆయన ఆతిథ్యం ఇస్తారు. యూకేలోని విదేశీ రాయబారులను, హై కమిషనర్లతో సమావేశం అవుతారు. లండన్‌లోని సెనెటాఫ్‌ వేదికగా నవంబర్‌లో జరిగే వార్షిక సంస్మరణ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు.

56 స్వతంత్ర దేశాలతో కూడిన కామన్వెల్త్ కూటమికి రాజు అధ్యక్షుడిగా ఉంటారు. ఇందులోని 14 కామన్వెల్త్ రాజ్యాలకు కూడా ఆయనే అధిపతి.

2021లో బార్బడోస్ గణతంత్ర దేశంగా అవతరించినప్పటి నుంచి ఇతర కరీబియన్ కామన్వెల్త్ రాజ్యాలు తాము కూడా ఇదే బాటను అనుసరిస్తామనే సూచనలు ఇచ్చాయి.

రాయల్ మెయిల్ స్టాంపులు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కరెన్సీపై రాణి చిత్రం స్థానంలో కింగ్ చార్లెస్ 3 చిత్రాన్ని ముద్రిస్తారు. బ్రిటిష్ పాస్‌పోర్ట్‌లలో 'హిజ్ మెజెస్టీ' అనే పదాన్ని చేర్చుతారు.

జాతీయ గీతం కూడా 'గాడ్ సేవ్ ద కింగ్' గా మారుతుంది.

ఫ్యామిలీ ట్రీ

వారసత్వం

రాజు మరణించినప్పుడు లేదా పదవీ విరమణ చేసినప్పుడు తదుపరి రాజుగా రాజకుటుంబ సభ్యుల్లో ఎవరు బాధ్యతలు స్వీకరించాలనేది వారసత్వ క్రమం నిర్దేశిస్తుంది. రాజు మొదటి సంతానం ఇందులో మొదటి వరుసలో ఉంటారు. రాజు మరణిస్తే ఆయన మొదటి సంతానం తర్వాత సింహాసనాన్ని అధిష్టిస్తుంది.

క్వీన్ ఎలిజబెత్ తొలి సంతానమైన చార్లెస్ 3, ఆమె మరణం తర్వాత బ్రిటన్ సింహసనాన్ని అధిష్టించనున్నారు. చార్లెస్ భార్య క్యామిలా క్వీన్ కాన్సర్ట్ అయ్యారు.

2013లో రాజకుటుంబ వారసత్వ నియమాలను సవరించారు.

ఇప్పడు కింగ్ చార్లెస్ వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం ఉంటారు. ప్రిన్స్ విలియంకు 'డ్యూక్ ఆఫ్ కార్న్‌వాల్' అనే బిరుదు వారసత్వంగా లభించింది.

కింగ్ కాకముందు 'ప్రిన్స్ ఆఫ్ వేల్స్'గా చార్లెస్ ఉండేవారు. అయితే, ఇప్పుడు ఆ బిరుదును చార్లెస్, అధికారికంగా విలియంకు ప్రదానం చేసేంతవరకు విలియంను 'ప్రిన్స్ ఆఫ్ వేల్స్'గా పరిగణించరాదు.

ప్రిన్స్ విలియమ్స్ తొలి సంతానం ప్రిన్స్ జార్జ్...సింహసనాన్ని అధిష్టించే వారసత్వ క్రమంలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన కూతురు ప్రిన్సెస్ చార్లెస్ మూడో స్థానంలో ఉంటారు.

1953 జూన్‌లో క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేకం

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, వెస్ట్‌మినిస్టర్ అబేలో పట్టాభిషిక్తురాలైన 39వ బ్రిటన్ సార్వభౌమాధికారి క్వీన్ ఎలిజబెత్ 2

పట్టాభిషేకంలో ఏం చేస్తారు?

పట్టాభిషేకం అంటే చక్రవర్తిని అధికారికంగా నియమించే వేడుక. సంతాప దినాలు పూర్తయ్యాక ఈ వేడుకను నిర్వహిస్తారు.

తన తండ్రి కింగ్ జార్జ్ 6 మరణానంతరం, 1952 ఫిబ్రవరి 6న ఎలిజబెత్ 2 బ్రిటన్ రాణి అయ్యారు. అయితే, 1953 జూన్ 2 వరకు ఆమెకు పట్టాభిషేకం జరగలేదు.

ఆమె పట్టాభిషేక వేడుకను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. 20 మిలియన్లకు పైగా ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

గత 900 ఏళ్లుగా పట్టాభిషేక ఉత్సవం, వెస్ట్‌మినిస్టర్ అబేలో జరుగుతోంది. అక్కడ పట్టాభిషేకం జరిగిన తొలి చక్రవర్తి విలియం కాగా, చార్లెస్ 40వ రాజు కానున్నారు.

ఈ వేడుకను కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్ నిర్వహిస్తారు.

ఈ వేడుకలో చక్రవర్తికి 'పవిత్ర తైలం’ ను పూస్తారు. రాజరికపు చిహ్నాలైన ఆర్బ్, రాజదండాన్ని అందుకుంటారు. వేడుక చివర్లో ఆర్చి బిషప్ చార్లెస్ తలపై సెయింట్ ఎడ్వర్డ్స్ కిరిటాన్ని అలంకరిస్తారు. ఈ బంగారు కిరీటం 1661నాటిది.

కేవలం పట్టాభిషేకం సమయంలో మాత్రమే ఈ కిరీటాన్ని రాజు ధరిస్తారు.

పట్టాభిషేకాన్ని ప్రభుత్వ ఖర్చులతో నిర్వహిస్తారు.

క్వీన్ ఎలిజబెత్ పుట్టినరోజు సందర్భంగా రాజ కుటుంబ సభ్యులు

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, రాజ కుటుంబ సభ్యులందరూ కలిసి 2019లో బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో క్వీన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు

రాజ కుటుంబ సభ్యులు

కింగ్ చార్లెస్, 'ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్' డయానా తొలి సంతానం 'డ్యూక్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జ్' ప్రిన్స్ విలియం.

ప్రిన్స్ విలియం వివాహం 'డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జ్' కేథరిన్‌తో జరిగింది. వారికి ముగ్గురు సంతానం: ప్రిన్స్ జార్జ్, ప్రిన్సెస్ చార్లెట్, ప్రిన్స్ లూయిస్

క్వీన్ ఎలిజబెత్ 2కు ఏకైక కుమార్తె 'ప్రిన్సెస్ రాయల్' ఆన్నె. ఆమె రాణికి రెండో సంతానం. ప్రిన్సెస్ ఆన్నె వివాహం వైస్ ఆడమ్ టిమోతీ లారెన్స్‌తో జరిగింది. మొదటి భర్త కెప్టెన్ మార్క్ ఫిలిప్స్‌తో ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు పీటర్ ఫిలిప్స్, జారా టిండాల్.

క్వీన్ ఎలిజబెత్‌ నాలుగో సంతానం 'ఈర్ల్ ఆఫ్ వెసెక్స్' ప్రిన్స్ ఎడ్వర్డ్. 'కౌంటెస్ ఆఫ్ వెసెక్స్' సోఫీ జెన్స్‌ను ప్రిన్స్ ఎడ్వర్డ్ వివాహమాడారు. వారికి లూయిస్, జేమ్స్ మౌంట్‌బాటెన్ విండ్సర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

క్వీన్ ఎలిజబెత్ 2 మూడో సంతానం 'డ్యూక్ ఆఫ్ యార్క్' ప్రిన్స్ ఆండ్రూ. ఆయనకు తన మాజీ భార్య 'డచెస్ ఆఫ్ యార్క్' సారా ఫెర్గూసన్‌తో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ప్రిన్సెస్ బీట్రైస్, ప్రిన్సెస్ యూజీని.

ప్రిన్స్ విలియం తమ్ముడు 'డ్యూక్ ఆఫ్ ససెక్స్' ప్రిన్స్ హ్యారీ. ఆయన 'డచెస్ ఆఫ్ ససెక్స్' మేఘన్ మర్కెల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు: ఆర్చీ, లిలిబెట్.

రాజరికపు బాధ్యతల నుంచి తాము వైదొలుగుతున్నట్లు 2020లో హ్యారీ, మేఘన్ ప్రకటించారు. వారు అమెరికాకు వెళ్లిపోయారు.

ప్రిన్స్ జార్జ్, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్, ప్రిన్స్ లూయిస్, డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్, ప్రిన్సెస్ చార్లెట్ (వరుసగా ఎడమ నుంచి కుడికి)

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, ప్రిన్స్ జార్జ్, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్, ప్రిన్స్ లూయిస్, డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్, ప్రిన్సెస్ చార్లెట్ (వరుసగా ఎడమ నుంచి కుడికి)

రాజ కుటుంబ సభ్యులు ఎక్కడ నివసిస్తారు?

కింగ్ చార్లెస్, క్వీన్ కాన్సర్ట్ క్యామిలా బకింగ్‌హమ్ ప్యాలెస్‌కు వెళ్లనున్నట్లు అందరూ భావిస్తున్నారు. వీరు అంతకుముందు లండన్‌లోని క్లారెన్స్ హౌజ్‌లో, గ్లౌసెస్టర్‌షైర్‌లోని హైగ్రోవ్‌లో నివసించారు.

ప్రిన్స్ విలియం, డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జ్ కేథరిన్ ఇటీవలే లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ నుంచి క్వీన్స్ విండ్సర్ ఎస్టేట్‌లోని అడిలైడ్ కాటేజ్‌కు మారారు.

ప్రిన్స్ జార్జ్, ప్రిన్సెస్ చార్లెట్, ప్రిన్స్ లూయిస్... బెర్క్‌షైర్‌లోని లంబ్రూక్ స్కూల్‌లో చదువుతారు.

ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మర్కెల్ కాలిఫోర్నియాలో ఉంటారు.

'డ్యూక్ ఆఫ్ ససెక్స్' ప్రిన్స్ హ్యారీ, 'డచెస్ ఆఫ్ ససెక్స్' మేఘన్ మర్కెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ‘డ్యూక్ ఆఫ్ ససెక్స్’ ప్రిన్స్ హ్యారీ, ‘డచెస్ ఆఫ్ ససెక్స్’ మేఘన్ మర్కెల్

రాచరికానికి ఉన్న ప్రజాదరణ ఎంత?

ప్లాటినమ్ జూబ్లీ సమయంలో యూగోవ్ నిర్వహించిన పోల్‌లో 62 శాతం మంది దేశంలో రాచరికాన్ని కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. 22 శాతం మంది మాత్రం రాచరికానికి బదులుగా దేశంలో ప్రజలు ఎన్నుకున్న దేశాధినేత ఉంటే బావుంటుందని చెప్పారు.

2021లో ఇప్సోస్ మోరీ చేసిన సర్వేలో ప్రతీ అయిదుగురిలో ఒకరు, యూకేలో రాచరిక వ్యవస్థను రద్దు చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.

2012లో 75 శాతం మంది రాచరికాన్ని ఆమోదించగా, 2022లో ఈ సంఖ్య 62 శాతానికి పడిపోయిందని యూగోవ్ పోల్ సూచించింది.

వృద్ధులు, రాచరికానికి ఎక్కువగా మద్దతు ఇస్తున్నారని పోల్‌లో తేలింది.

2011లో యూగోవ్ ఈ పోల్‌ను మొదటిసారిగా ప్రారంభినప్పుడు 18-24 ఏళ్ల వయస్సున్న వారిలో 59 శాతం మంది రాచరికాన్ని కొనసాగించాలని భావించారు. కానీ, 2022 నాటికి ఈ సంఖ్య 33 శాతానికి పడిపోయినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)