క్వీన్ ఎలిజబెత్ 2: ప్రపంచ నేతల నివాళులు

ఇంగ్లండ్‌లో గత ఏడాది జరిగిన జీ7 కూటమి సమావేశం సందర్భంగా జో బైడెన్, జిల్ బైడెన్‌లతో క్వీన్ ఎలిజబెత్ 2

ఫొటో సోర్స్, 10 DOWNING STREET

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్‌లో గత ఏడాది జరిగిన జీ7 కూటమి సమావేశం సందర్భంగా జో బైడెన్, జిల్ బైడెన్‌లతో క్వీన్ ఎలిజబెత్ 2

క్వీన్ ఎలిజబెత్ 2 మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నేతలు, ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

పదవి బాధ్యతల పట్ల ఆమెలోని నిబద్ధతను, విధి నిర్వహణలో ఆమె సహనశీలతను దేశాధినేతలు, మాజీ అధ్యక్షులు కొనియాడారు. ఆమె సహృదయత, హాస్య చతురతలను వారు గుర్తు చేసుకున్నారు.

క్వీన్ ఎలిజబెత్ 2తో జరిగిన సమావేశాలను తాను ఎన్నడూ మరచిపోలేనని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.

''ఆమె సహృదయతను, ఆత్మీయతను మరువలేను. ఆమెతో ఒక సమావేశం సందర్భంగా... తన వివాహానికి మహాత్మా గాంధీ ఇచ్చిన హ్యాండ్ కర్చిఫ్‌ను ఆమె నాకు చూపించారు. ఈ సందర్భాన్ని ఎన్నటికీ మర్చిపోలేను'' అని మోదీ తన ట్విటర్ సందేశంలో పేర్కొన్నారు.

ఒకరోజు సంతాప దినంగా ప్రకటించిన భారత్..

క్వీన్ ఎలిజబెత్ మృతి చెందడంతో ఆమె గౌరవార్థం సెప్టెంబర్ 11వ తేదీన దేశవ్యాప్తంగా సంతాపదినంగా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

సంతాపదినం రోజున అన్ని భవనాలపై ఎగిరే జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ఆరోజున అధికారికంగా ఎలాంటి వినోదకార్యక్రమాలూ ఉండవు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

క్వీన్ ఎలిజబెత్ 2 దయార్ద్ర హృదయురాలని ఫ్రాన్స్ ప్రధాని ఎమాన్యుయెల్ మేక్రాన్ అన్నారు. ఫ్రాన్స్‌కు ఆమె ఆప్తురాలని తన సంతాప సందేశంలో ఆయన పేర్కొన్నారు.

క్వీన్ ఎలిజబెత్ 2 తన హుందాతనంతో ఆ పదవికి వన్నెతెచ్చారని, ప్రపంచాన్ని ముగ్ధులను చేశారని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు.

''ఆమె ఆత్మీయత ఎప్పుడూ మాకు గుర్తుకు వస్తుంటుంది. ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. సందర్భానికి తగినట్లుగా, ఎంతో హుందాగా సాగే ఆమె హాస్య చతురత అందరినీ ఆకట్టుకుంటుంది'' అని ఒబామా తన ప్రకటనలో పేర్కొన్నారు.

''ఆమె రాజరికానికే వన్నె తెచ్చారు. తనదైన శకాన్ని లిఖించారు'' అని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

40 ఏళ్ల కిందట బైడెన్ మొదటిసారి ఆమెను కలిశారు.

అమెరికా అధ్యక్షుడిగా 2021లో బ్రిటన్‌ను సందర్శించిన జో బైడెన్ ఆ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ''ఆమె మాతో చాలా మర్యాదగా, సమున్నతంగా వ్యవహరించారు. తన ఆలోచనలను మాతో పంచుకున్నారు'' అని బైడెన్ అన్నారు.

వాషింగ్టన్ డీసీలోని బ్రిటిష్ దౌత్య కార్యాలయంలో సంతాప పుస్తకంలో సంతకం చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పక్కన ఆయన భార్య జిల్ బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాషింగ్టన్ డీసీలోని బ్రిటిష్ దౌత్య కార్యాలయంలో సంతాప పుస్తకంలో సంతకం చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పక్కన ఆయన భార్య జిల్ బైడెన్

రాణిగా ఉన్న కాలంలో క్వీన్ ఎలిజబెత్ 13మంది అమెరికా అధ్యక్షులతో సమావేశమయ్యారు.

క్వీన్ ఎలిజబెత్ 2 సహృదయతను, ఉన్నత ఆలోచనా విధానాలను, హాస్య చతురతను ఎప్పటికీ మర్చిపోలేమని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు.

''ఆమె ఎంతో గొప్ప మనిషి. ఆమెలాంటి వ్యక్తి మరొకరు ఉండరు'' అని ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్‌లో రాశారు.

''ఆమె ఎంతో మేధస్సు ఉన్న నాయకురాలు'' అని క్వీన్ ఎలిజబెత్ 2 ను అమెరికా మరో మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ కొనియాడారు.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా సంతాపం తెలిపారు.

''కెనడియన్ల పట్ల ఆమె ఎంతో ఆప్యాయత కనబరిచారు '' అని జస్టిన్ ట్రూడో తన భావోద్వేగమైన సందేశంలో అన్నారు.

''ఈ సంక్లిష్ట ప్రపంచంలో ఆమె నాయకత్వం మనందరికి సంక్షేమాన్ని అందించింది. ఆమెతో జరిపే చర్చలు ఎంతో ఆలోచనాత్మకంగా, మేధస్సుతో, హాస్య చతురతతో ఉండేవి. ఇప్పుడు అవన్నీ నేను మిస్సవుతున్నాను'' అంటూ ట్రూడో కంటతడి పెట్టారు.

క్వీన్ ఎలిజబెత్ 2 చాలా సార్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో‌తో సమావేశమయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా వీరిద్దరూ విండ్సర్‌లో కలుసుకున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్ 2 చాలా సార్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో‌తో సమావేశమయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా వీరిద్దరూ విండ్సర్‌లో కలుసుకున్నారు

''ఉన్నతమైన వ్యక్తిత్వం''

బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ కమిషన్ కార్యాలయం సహా పలు దేశాలలో జెండాలను సగానికి అవనతం చేశారు.

''సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రతీ తరంతోనూ కలిసిపోయే గుణం ఆమెలోని నిజమైన నాయకత్వ లక్షణాలకు నిదర్శనం'' అని యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లియెన్ అన్నారు.

క్వీన్ ఎలిజబెత్ 2 కు వరసకు సోదరుడైన నెదర్లాండ్ కింగ్ విల్లెమ్ అలెగ్జాండర్ ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆమె ఎంతో చురుకైన, తెలివైన నాయకురాలని, ప్రజల నుంచి ఆమె ఎంతో గౌరవ మర్యాదలను అందుకున్నారని అన్నారు.

స్వీడన్ రాజు కింగ్ కార్ల్ 16 గుస్టాఫ్ కూడా క్వీన్ ఎలిజబెత్ 2‌కు దగ్గరి బంధువే. ''ఆమె మా కుటుంబానికి ఎంతో దగ్గరివారు. మా రాజరికపు చరిత్రతో ఆమెకు అనుబంధం ఉంది'' అని పేర్కొన్నారు.

''తన పదవీకాలంలో అత్యంత నిబద్ధత, పట్టుదల, ధైర్యాన్ని ప్రదర్శించిన నాయకురాలు'' అని బెల్జియం రాజు కింగ్ ఫిలిప్, క్వీన్ మథైల్డే పేర్కొన్నారు.

''ఆమెలోని హాస్య చతురత ఎంతో గొప్పది'' అని జర్మన్ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్ వ్యాఖ్యానించారు. ''రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్-బ్రిటిష్ సంబంధాలను కొనసాగించడంలో ఆమె చూపించిన చొరవ మరపురానిది'' అని పేర్కొన్నారు.

సౌదీ అరేబియా కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌లు కూడా రాణి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు.

''నాయకత్వానికి ఆమె ఒక రోల్ మోడల్‌గా చరిత్రలో నిలిచిపోతారు'' అని వారు పేర్కొన్నారు.

''బ్రిటిష్ ప్రజలకు, ప్రభుత్వానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఇది బ్రిటిష్ ప్రజలకు తీరని లోటు''అని చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ అన్నారు.

2015లో బకింగ్‌హల్ ప్యాలెస్‌లో క్వీన్ ఎలిజబెత్ 2ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2015లో బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో క్వీన్ ఎలిజబెత్ 2ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు

ఉనికి చాటుకున్న నేత

క్వీన్ ఎలిజబెత్ 2 ఏడు దశాబ్దాలుగా బ్రిటన్‌కు రాణిగా వ్యవహరించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన అనేక సామాజిక మార్పులకు ఆమె సాక్షిగా మారారు. ఆమెకు అర్పిస్తున్న నివాళుల్లో ఇదే విషయాన్ని అనేకమంది ప్రస్తావించారు.

''70సంవత్సరాలపాటు బ్రిటన్‌ను ఏకీకృతంగా నిలిపారు'' అని ఫ్రాన్స్ ప్రధాని మేక్రాన్ వ్యాఖ్యానించగా.... ''అనేక సమస్యల నుంచి విజయాల వరకు ఆమె ఎన్నో ఒడిదుడుకులను చూశారు. చంద్రుని మీద పాదం మోపడం నుంచి బెర్లిన్ గోడ కూలడం వరకు ఆమె ఎన్నో ఘటనలకు సాక్షి'' అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.

''కష్ట సమయాలలో బ్రిటిష్ సామ్రాజ్యానికి అండగా నిలిచిన క్వీన్ ఎలిజబెత్ 2 మరణం బ్రిటన్ ప్రజలకే కాక, యావత్ ప్రపంచానికి కూడా తీరని లోటు'' అని జపాన్ ప్రధాని ఫ్యుమియయో కిషిడా అన్నారు.

బాధ్యతల నిర్వహణలో ఆమె అత్యంత శ్రద్ధ, దీక్ష కనబరిచేవారని ఐర్లాండ్ ప్రెసిడెంట్ మైఖెల్ డి హిగ్గిన్స్ అన్నారు.

''బ్రిటిష్ చరిత్రలో ఆమె విలక్షణమైన స్థానాన్ని సంపాదించారు. 70 ఏళ్ల తన పదవీ కాలంలో అనేక పరిణామాల్లో ఆమె బ్రిటిష్ ప్రజలకు అండగా నిలిచారు'' అని తన ప్రకటనలో పేర్కొన్నారు.

''పాలనలో ఆమె నిబద్ధతతో వ్యవహరించారు'' అని ఐర్లాండ్ టీషక్ (ప్రధానమంత్రి) మైఖేల్ మార్టిన్ అన్నారు.

''ఆసియా, ఆఫ్రికా దేశాలలో వలస పాలన అంతం లాంటి అనేక కీలక పరిణామాలకు ఆమె సాక్ష్యంగా నిలిచారు'' అని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ అన్నారు.

''ఆమె నాయకత్వాన్ని, నిబద్ధతను ప్రపంచ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

క్వీన్ ఎలిజబెత్ 2, ఆస్ట్రేలియాలో 16 సార్లు పర్యటించారు. తన కోసం వచ్చిన ప్రజలను పలకరిస్తోన్న క్వీన్ ఎలిజబెత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్ 2, ఆస్ట్రేలియాలో 16 సార్లు పర్యటించారు. సిడ్నీలో తన కోసం వచ్చిన ప్రజలను పలకరిస్తోన్న క్వీన్ ఎలిజబెత్

తన పదవీ కాలంలో క్వీన్ ఎలిజబెత్2 కామన్ వెల్త్ దేశమైన ఆస్ట్రేలియాను 16 సార్లు సందర్శించారు. ''ఆమె లేని ఈ ప్రపంచాన్ని ఊహించలేకపోతున్నాం'' అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ అన్నారు.

''తన పదవీ కాలంలో అనేక సమస్యలకు ఆమె తనదైన శైలిలో, హుందాగా పరిష్కారాలు చూపించారు'' అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం 4.50 గంటలకు రాణి మరణ వార్త తనకు తెలిసినట్లు న్యూజీలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెన్ వెల్లడించారు.

''ఆమెది అత్యద్భుతమైన వ్యక్తిత్వం. ఆమె తన చివరి క్షణాల వరకు ప్రజల సంక్షేమాన్ని కాంక్షించారు'' అన్నారు ఆర్డెన్.

2018లో న్యూజీలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్, క్వీన్ ఎలిజబెత్ 2ను కలిశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2018లో న్యూజీలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్, క్వీన్ ఎలిజబెత్ 2ను కలిశారు

చరిత్ర సృష్టించారు

''ఉన్నతమైన వ్యక్తిత్వానికి, మానవత్వానికి, దేశభక్తికి ఆమె నిలువుటద్దం'' అని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఇసాక్ హెర్జోగ్ వ్యాఖ్యానించారు.

''ఆమె ఒక చరిత్రాత్మక మహిళ. ఆమె చరిత్ర సృష్టించారు. ఘనమైన, అద్భుతమైన వారసత్వాన్ని ఆమె వదిలి వెళ్లారు'' అని హెర్జోగ్ అన్నారు.

క్వీన్ ఎలిజబెత్ ఇంత వరకు ఒక్కసారిగా కూడా ఇజ్రాయెల్‌ను సందర్శించలేదు. అయితే, దివంగత ప్రిన్స్ ఫిలిప్ తల్లి సమాధి జెరూసలేంలో ఉన్న కారణంగా ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ ఎడ్వర్డ్, ప్రిన్స్ ఫిలిప్‌లు గతంలో ఇజ్రాయెల్ సందర్శించారు.

''ఒక ఘనమైన నేతను కోల్పోయాం'' అంటూ జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా 2 తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

క్వీన్ ఎలిజబెత్ 2 మరణం భర్తీ చేయలేని లోటని యుక్రెయిన్ ప్రెసిడెంట్ వొలదిమీర్ జెలియెన్ స్కీ అన్నారు.

1984లో పెట్రా ఆర్కియాలజికల్ ప్రాంతాన్ని సందర్శించిన ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్ 2, జోర్డాన్ రాజు హుస్సేన్, రాణి నూర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1984లో పెట్రా ఆర్కియాలజికల్ ప్రాంతాన్ని సందర్శించిన ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్ 2, జోర్డాన్ రాజు హుస్సేన్, రాణి నూర్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా క్వీన్ ఎలిజబెత్ 2 మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ కింగ్ చార్లెస్ 3 కి సందేశం పంపారు.

''వర్తమాన బ్రిటిష్ చరిత్ర మొత్తం ఆమె పేరుతో పెనవేసుకుపోయింది'' అంటూ పుతిన్ తన సంతాప సందేశంలో రాశారు.

కామన్‌వెల్త్ దేశాల అధినేతగా క్వీన్ ఎలిజబెత్ 2తో అనుబంధం ఉన్న ఆఫ్రికన్ దేశాల నేతలు కూడా రాణి మరణం పట్ల సంతాపం తెలిపారు.

''ఆమెతో మా దేశానికి ఉన్న అనుబంధం ఇంతటితో ముగిసింది. ఆమె చరితార్ధురాలు'' అని కెన్యా ప్రెసిడెంట్ ఎలెక్ట్ విలియం రూటో అన్నారు.

కెన్యాతో ఎలిజబెత్ 2 రాణికి ప్రత్యేక అనుబంధం ఉంది. 25 సంవత్సరాల వయసులో ఎలిజబెత్ 2 విహార యాత్రకు కెన్యా వచ్చిన సమయంలోనే ఆమె తండ్రి, బ్రిటన్ చక్రవర్తి జార్జ్ 6 మృతి చెందారు. దీంతో ఆమె రాణిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.

కెన్యాతో క్వీన్ ఎలిజబెత్ 2కు ప్రత్యేక అనుబంధం ఉంది. 1983లో కెన్యా పర్యటన సందర్భంగా కెన్యా అధ్యక్షుడు డేనియల్ అరప్ మొయ్‌తో క్వీన్ ఎలిజబెత్ 2

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెన్యాతో క్వీన్ ఎలిజబెత్ 2కు ప్రత్యేక అనుబంధం ఉంది. 1983లో కెన్యా పర్యటన సందర్భంగా కెన్యా అధ్యక్షుడు డేనియల్ అరప్ మొయ్‌తో క్వీన్ ఎలిజబెత్ 2

''ఆమె మా ఆఫ్రికా దేశాలకు గొప్ప స్నేహితురాలు. మా పట్ల ఆమె ఎంతో ఆప్యాయత చూపేవారు'' అని గబన్ అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా అన్నారు.

''ఆమె స్నేహతత్వం, వైభవం, హుందాతనం, పదవీ బాధ్యతల పట్ల ఆమెకున్న నిబద్ధత ఎంతో గొప్పవి'' అని ఘనా అధ్యక్షుడు అకుఫో-అడ్డో అన్నారు.

క్వీన్ ఎలిజబెత్ 2 రెండుసార్లు ఘనా దేశాన్ని సందర్శించారు. ఆమె మొదటి యాత్ర వివాదాస్పదమైంది. రాణి భద్రతపై అనుమానాలు తలెత్తాయి.

ఆమె పర్యటనకు అయిదు రోజుల ముందు రాజధాని అక్రాలో బాంబులు పేలాయి. అయినా, క్వీన్ తన పర్యటనను కొనసాగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)