రాణి ఎలిజబెత్ అనంతరం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్

తదుపరి రాజు చార్లెస్

ఫొటో సోర్స్, © NADAV KANDER

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో సింహాసనం తక్షణమే వారసుడైన మాజీ వేల్స్ యువరాజు చార్లెస్‌కు బదిలీ అయింది.

అయితే, రాజుగా పట్టాభిషక్తుడు కావడానికి ముందు ఆయన తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు, సంప్రదాయాలు చాలా ఉన్నాయి.

ఆయనను ఏమని పిలుస్తారు?

ఆయన కింగ్ చార్లెస్-3 పేరుతో వ్యవహరిస్తారు.

కొత్త రాజు పాలనలో తీసుకున్న తొలి నిర్ణయం అదే అవుతుంది. ఆయన తనకున్న నాలుగు పేర్లలో, చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్ - ఏదైనా ఎంచుకుని ఉండవచ్చు.

పేరు విషయంలో మార్పు అన్నది బ్రిటన్ రాచరిక చరిత్రలో కొత్తేమీ కాదు.

సింహాసనానికి వారసుడే అయినప్పటికీ, ప్రిన్స్ విలియం సహజంగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేరు. ఆ హోదాను విలియంకు ఆయన తండ్రి కట్టబెట్టాలి. ఆయన తన తండ్రి రాచరిక నామమైన 'డ్యూక్ ఆఫ్ కార్న్‌వాల్'ను పొందుతారు. విలియం, కేట్ వీరిద్దరికీ డ్యూక్ ఆఫ్ కార్న్‌వాల్, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్ట్ టైటిల్స్ దక్కాయి.

చార్లెస్ భార్య కామిలా పేరు కూడా మారుతుంది. ఇకపై ఆమెను క్వీన్ కాన్సర్ట్‌గా వ్యవహరిస్తారు. బ్రిటన్ రాజు జీవిత భాగస్వామిని కాన్సర్ట్ అని వ్యవహరిస్తారు. చార్లెస్ తాత అయిన జార్జ్ 6 అసలు పేరు ఆల్బర్ట్. అయితే, ఆయన తన మధ్య పేరుతో పాలన సాగించారు. ప్రస్తుతం మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్ అనే నాలుగు పేర్లలో ఏదో ఒక పేరును స్వీకరించవచ్చు. ఇలా పేరు మార్పు ఆయన ఒక్కరితోనే ఆగిపోదు.

సంప్రదాయ వేడుకలు

చార్లెస్ అధికారికంగా శనివారం నాడు రాజుగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు. ఈ వేడుక అక్సెషన్ కౌన్సిల్‌ సమక్షంలో లండన్‌లోని సెయింట్ జేమ్స్' ప్యాలెస్‌లో జరుగుతుంది.

రాజరిక అధికారాలను అప్పగించే వేడుకను నిర్వహించే అక్సెషన్ కౌన్సిల్‌లో ప్రీవీ కౌన్సిల్‌ సభ్యులైన ప్రస్తుత, మాజీ ఎంపీలు, కొందరు ఉన్నతాధికారులు, కామన్‌వెల్త్ హైకమిషనర్లు , లండన్ లార్డ్ మేయర్ తదితరులు ఉంటారు.

తదుపరి రాజు చార్లెస్

ఫొటో సోర్స్, PA Media

నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అర్హులైన వారు 700 మందికి పైగా ఉంటారు. ఈసారి సమయం తక్కువగా ఉండడంతో కొద్ది మంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. 1952లో జరిగిన అక్సెషన్ కౌన్సిల్‌ కార్యక్రమానికి దాదాపు 200 మంది హాజరయ్యారు. ఈ సమావేశంలో మొదట ప్రీవీ కౌన్సిల్ లార్డ్ ప్రెసిడెంట్, రాణి మరణాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. (ప్రస్తుతం ఎంపీ పెన్ని మోర్డాంట్ ఈ పదవిలో ఉన్నారు). ఈ ప్రకటనను సభలో బిగ్గరగా చదివి వినిపిస్తారు.

ఈ ప్రకటనలో ఉపయోగించే పదాలలో మార్పు ఉండవచ్చు. కానీ, ఆ ప్రకటనలో ప్రార్థనలు, ప్రతిజ్ఞలు, అంతకుముందు రాజుగా లేదా రాణిగా ఉన్నవారిపై ప్రశంసలు, కొత్త రాజుకు అండగా ఉంటామనే వాగ్దానాలు ఉండడమన్నది సంప్రదాయంగా వస్తోంది.

ప్రధానమంత్రి, కాంటర్‌బరీ ఆర్చిబిషప్‌తోపాటు, లార్డ్ చాన్స్‌లర్, పలువురు సీనియర్లు ఈ ప్రకటనపై సంతకాలు చేస్తారు.

తదుపరి రాజు చార్లెస్

ఫొటో సోర్స్, Getty Images

రాజుగా తొలి ప్రకటన

అక్సెషన్ కౌన్సిల్ రెండో సమావేశానికి రాజు ప్రీవీ కౌన్సిల్‌తో పాటుగా హాజరవుతారు. అమెరికా తదితర దేశాలలో ఉన్నట్లుగా ఇది బ్రిటన్ రాజు తన పాలన ప్రారంభానికి ముందు 'ప్రమాణ స్వీకారం' చేయడం లాంటిది కాదు. దీనికి బదులుగా కొత్త రాజు స్కాట్లండ్ చర్చిని పరిరక్షిస్తానని ప్రమాణం చేస్తారు. ఇది అక్కడ 18వ శతాబ్దం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం.

ఆ తర్వాత రాయల్ బ్యాండ్ వాద్యాల నడుమ, చార్లెస్‌ను కొత్త రాజుగా ప్రకటిస్తారు. సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లోని ఫెయిరీ కోర్ట్ బాల్కనీ నుంచి 'గార్టర్ కింగ్ ఆఫ్ ఆర్మ్స్'గా వ్యవహరించే ఓ అధికారి ప్రజా సమక్షంలో ఈ ప్రకటన చేస్తారు.

'రాజును ఆ భగవంతుడు రక్షించుగాక' (God save the King) అంటూ బిగ్గరగా చెబుతారు. 1952 తరువాత తొలిసారిగా 'గాడ్ సేవ్ ద కింగ్' అంటూ జాతీయ గీతాన్ని వినిపించబోతున్నారు. హైడ్ పార్క్‌, టవర్ ఆఫ్ లండన్, నేవీ షిప్స్ దగ్గర తుపాకులు పేల్చి వందన సమర్పణ చేస్తారు. ఎడిన్‌బరా, కార్డిఫ్, బెల్‌ఫాస్ట్‌ నగరాలలో కూడా చార్లెస్ రాజు అయినట్లు ప్రకటన చేస్తారు.

పట్టాభిషేకం

రాజుగా పగ్గాలు చేపట్టే ప్రక్రియలోని అత్యున్నత సంకేతాత్మక కార్యక్రమం కిరీటధారణ. ఈ కార్యక్రమంలో చార్లెస్‌కు సంప్రదాయబద్ధంగా కిరీటాన్ని ధరింపచేస్తారు. దీనికి సంప్రదాయబద్ధంగా చేయాల్సిన ఏర్పాట్లు చాలా ఉంటాయి. అందుకే, ఇది ఈసారి వెంటనే జరగకపోవచ్చు. క్వీన్ ఎలిజబెత్ 1952 ఫిబ్రవరిలో రాణి అయినప్పుడు, ఆమె కిరీటధారణ కార్యక్రమం 1953 జూన్‌లో జరిగింది.

ఈ పట్టాభిషేక మహోత్సవం గత 900 ఏళ్లుగా వెస్ట్‌మినిస్టర్ అబేలోనే జరుగుతూ వస్తోంది.

ఇక్కడ పట్టాభిషేకం జరిగిన మొదటి బ్రిటన్ చక్రవర్తి విలియం-ది కాంకరర్ కాగా, చార్లెస్ 40వ రాజు అవుతారు.ఈ పట్టాభిషేకంలో ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్‌బరీ మతపరమైన క్రతువు నిర్వహిస్తారు. కార్యక్రమం చివరలో సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్ తలమీద అలంకరిస్తారు. పూర్తిగా బంగారంతో చేసిన ఈ కిరీటాన్ని 1661లో తయారు చేశారు.

ఈ కిరీటం టవర్ ఆఫ్ లండన్‌లో ఉన్న రాజాభరణాలలో ప్రధానమైన భాగం. దీనిని పట్టాభిషేకం సమయంలో మాత్రమే రాజు ధరిస్తారు. ఇది 2.23 కిలోల బరువు ఉంటుంది. రాచరిక వివాహాల్లా కాకుండా, పట్టాభిషేకం అనేది దేశానికి సంబంధించిన వ్యవహారం. ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అతిథుల జాబితాను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

తదుపరి రాజు చార్లెస్

ఫొటో సోర్స్, MIRRORPIX / GETTY IMAGES

పట్టాభిషేక సమయంలో సంగీతం, మంత్ర పఠనాలు ఉంటాయి. నారింజ, గులాబీ, దాల్చిన చెక్క, కస్తూరి, అంబర్‌గ్రిస్ నూనెలతో కొత్త చక్రవర్తికి స్నానం చేయించే ఆచారం కూడా ఉంటుంది. ప్రపంచమంతా చూస్తుండగా కొత్త రాజు పట్టాభిషేకం రోజున ప్రతిజ్ఞ చేస్తారు. ఈ వేడుకలో ఆయన తన కొత్త పాత్రకు చిహ్నాలుగా గోళం, రాజదండం అందుకుంటారు. ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్‌బరీ ఆయన తలపై బంగారు కిరీటం పెడతారు.

కామన్‌వెల్త్ అధినేత

240 కోట్ల జనాభా ఉన్న 56 స్వతంత్ర దేశాల కామన్‌వెల్త్ కూటమికి చార్లెస్ నాయకుడు అయ్యారు. వీటిలో 14 దేశాలకు, బ్రిటన్‌కు ఆయన అధినేత.

కామన్వెల్త్ రాజ్యాలుగా పిలిచే ఆ 14 దేశాలు: ఆస్ట్రేలియా, ఆంటిగ్వా, బార్బుడా, బహమాస్, కెనడా, గ్రెనడా, జమైకా, పపువా న్యూ గినియా, సెయింట్ క్రిస్టఫర్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, న్యూజీలాండ్, సాల్మన్ ఐలాండ్స్, తువాలూ ఈ 14 దేశాలు.

©All photographs are copyright