సంస్మరణ: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2

క్వీన్ ఎలిజబెత్ 2

ఫొటో సోర్స్, Getty Images

విధి నిర్వహణలో ఎలిజబెత్ రాణి-2 చూపిన దృఢ చిత్తం,సింహాసనానికి, తన ప్రజలకు అంకితం కావాలన్న ఆమె దృఢ నిశ్చయం ఆమె సుదీర్ఘ పాలనకు ప్రత్యేక గుర్తింపును సాధించిపెట్టాయి.

ప్రపంచంపై బ్రిటిష్ ప్రభావం తగ్గాక, రాచరిక పాలన పాత్ర క్రమంగా దానికదే ప్రశ్నార్థకమవుతూ ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచంలోనూ ఆమె కేంద్ర బిందువుగా నిలిచారు.

సింహాసనానికి అంకితమవుతారని ఆమె పుట్టినప్పుడు ఎవరూ ఊహించలేదు. అనేక విపత్కర సందర్భాలను దాటుకుంటూ రాచరికాన్ని కొనసాగించడంలోనూ ఆమె విజయం సాధించారు.

లండన్‌లోని బర్క్‌లీ స్క్వేర్ సమీపంలోని ఓ ఇంట్లో 1926 ఏప్రిల్ 21న ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ విండ్సర్ జన్మించారు. కింగ్ జార్జి-5 రెండో సంతానమైన ఆల్బర్ట్, ఆయన భార్య ఎలిజబెత్‌లకు ఆమె తొలి సంతానం.

పేరు పెట్టే సమయంలో తల్లిదండ్రులతో చిన్నారి ఎలిజబెత్ 2

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేరు పెట్టే సమయంలో తల్లిదండ్రులతో చిన్నారి ఎలిజబెత్ 2

ఎలిజబెత్ సోదరి మార్గరెట్ రోజ్ 1930లో జన్మించారు. అక్కచెల్లెల్లిద్దరూ అన్యోన్యంతో నిండిన కుటుంబ వాతావరణంలో పెరుగుతూ ఇంట్లోనే విద్యాభ్యాసం సాగించారు. ఎలిజబెత్ ఆమె తండ్రికి, తాతకు ఎంతో ఇష్టురాలు.

ఆరేళ్ల వయసున్నప్పుడు తనకు గుర్రపు స్వారీ నేర్పుతున్న శిక్షకుడితో ఎలిజబెత్..''పెద్దయ్యాక ఇలాంటివి ఎన్నో గుర్రాలు, కుక్కలు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.

చిన్నతనం నుంచే ఆమె బాధ్యతాయుతంగా ఉండేవారని చెప్తుంటారు. ''ఈ చిన్నారిలో అబ్బురపరిచే అధికారపు దర్జా కనిపిస్తోంది'' అని తాను ప్రధాని కావడానికి ముందే విన్‌స్టన్ చర్చిల్ ఆమె గురించి వ్యాఖ్యానించారు.

ఎలిజబెత్ పాఠశాలకు వెళ్లకున్నా వివిధ భాషల్లో ఆమెకున్న ప్రావీణ్యం అసామాన్యం. అంతేకాదు, రాజ్యాంగ చరిత్రనూ ఆమె సునిశితంగా అధ్యయనం చేశారు.

తన ఈడు అమ్మాయిలతో ఆమె కలిసిమెలసి ఉండేందుకు గాను ప్రత్యేకంగా 'ఫస్ట్ బకింగ్‌హామ్ ప్యాలస్ కంపెనీ' అనే పేరుతో ఒక గర్ల్ గైడ్స్ కంపెనీ ఏర్పాటు చేశారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రేడియోలో ప్రసంగిస్తున్న ప్రిన్సెస్ ఎలిజబెత్ 2
ఫొటో క్యాప్షన్, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రేడియోలో ప్రసంగిస్తున్న ప్రిన్సెస్ ఎలిజబెత్ 2

ఉద్రిక్తతలు

తండ్రి పట్టాభిషేక సమయంలో తల్లిదండ్రులు, చెల్లితో ప్రిన్సెస్ ఎలిజబెత్ 2

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తండ్రి పట్టాభిషేక సమయంలో తల్లిదండ్రులు, చెల్లితో ప్రిన్సెస్ ఎలిజబెత్ 2

1936లో జార్జి-5 మరణించిన తరువాత ఆయన పెద్ద కుమారుడు డేవిడ్ ‘ఎడ్వర్డ్-8’ అయ్యారు. అయితే, రెండుసార్లు విడాకులు తీసుకున్న అమెరికా వనిత వాలిస్ సింప్సన్‌ను ఆయన పెళ్లాడారు. అయితే, రాజకీయ, మతపరమైన కారణాల వల్ల ఆమెతో వివాహాన్ని అందరూ ఆమోదించకపోవడంతో చివరకు ఆయన సింహాసనాన్ని వదులుకున్నారు.

అనంతరం డ్యూక్ ఆఫ్ యార్క్ ఆల్బర్ట్ 'కింగ్ జార్జి-6' అయ్యారు. అప్పటికి యూరప్‌లో కొన్ని ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ కింగ్ జార్జి-6, ఆయన భార్య రాణి ఎలిజబెత్‌లు రాచరికంపై ప్రజల్లో విశ్వాసం పోకుండా చూడగలిగారు. వారి కుమార్తె ఆ వారసత్వాన్ని కాపాడారు.

1939లో పదమూడేళ్ల యువరాణి తన తల్లిదండ్రులు కింగ్ జార్జి-6, ఎలిజబెత్‌లతో కలిసి డార్ట్‌మౌత్‌లోని రాయల్ నేవల్ కాలేజికి వెళ్లారు. ఆమె వెంట సోదరి మార్గరెట్ కూడా ఉన్నారు. అక్కడ క్యాడెట్‌గా ఉన్న వారి బంధువు 'ప్రిన్స్ ఫిలిప్ ఆఫ్ గ్రీస్' వారికి ఎస్కార్ట్‌గా ఉన్నారు.

ఇబ్బందులు

పెళ్లి సమయంలో క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, పెళ్లి సమయంలో క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ ఫిలిప్

ప్రిన్స్ ఫిలిప్, యువరాణి కలుసుకోవడం అదే మొదటిసారి కాదు. కానీ, ఫిలిప్ పట్ల ఆమె ఆసక్తి చూపడం మాత్రం అదే తొలిసారి.

ఆమెకు 18 ఏళ్లు వయసు వచ్చేనాటికి అంటే 1944 నాటికి ఆమె ఫిలిప్‌తో పూర్తిగా ప్రేమలో మునిగిపోయారు. ఆమె తన గదిలో ఫిలిప్ చిత్రపటాన్ని దాచుకోవడంతో పాటు ఇద్దరూ లేఖలు కూడా రాసుకుంటూ ఉండేవారు.

యువరాణి ఆ తర్వాత ఆక్సిలరీ టెరిటోరియల్ సర్వీసెస్ (ఏటీఎస్)లో చేరారు. యుద్ధం ముగిసేనాటికి ఆమె లారీ నడపడం, సర్వీస్ చేయడం నేర్చుకున్నారు.

యుద్ధం ముగిసిన తర్వాత బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో ఆమె తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ద మాల్‌లో జరిగిన విక్టరీ ఇన్ యూరప్ డే ( వీఈ డే) కార్యక్రమానికి వేలమంది హాజరయ్యారు.

అయితే..యుద్ధం తరువాత ఫిలిప్‌ను వివాహమాడాలన్న ఆమె కోరిక నెరవేరడానికి ఎన్నో ఆటంకాలేర్పడ్డాయి.

తన గారాలపట్టిని ఫిలిప్‌కు ఇచ్చి పెళ్లి చేయడానికి కింగ్ జార్జి-6 అంతగా ఇష్టపడలేదు. విదేశీ మూలాలను అంతగా సమ్మతించని రాజరికపు తాలూకు అనుమానాలను ఫిలిప్ అధిగమించాల్సి వచ్చింది.

తండ్రి మరణం

కానీ, యువరాణి, ఫిలిప్‌లు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతుండడంతో 1947 నవంబరు 20న వెస్ట్ మినిస్టర్ అబేలో వారికి వివాహం జరిపించారు. ఆ తరువాత ప్రిన్స్ ఫిలిప్ డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా అయ్యారు.

ప్రిన్స్ ఫిలిప్ నేవల్ ఆఫీసర్‌గా తన పదవీ బాధ్యతలలో కొనసాగారు.

కొన్నాళ్లపాటు మాల్టాలో పనిచేయాల్సి రావడంతో దంపతులు అక్కడ సాధారణ జీవితం గడపగలిగారు. 1948లో వారికి ప్రథమ సంతానంగా చార్లెస్ జన్మించారు. ఆ తరువాత 1950లో కుమార్తె అన్నె జన్మించారు.

యుద్ధకాలంలో విపరీతమైన ఒత్తిడికి లోనవడంతో పాటు పొగతాగే అలవాటు వల్ల వచ్చిన ఊపిరితిత్తుల క్యాన్సర్ కింగ్ జార్జి-6ను కుంగదీసింది.

1952లో దంపతులిద్దరూ విదేశీ పర్యటనకు బయలుదేరగా కింగ్ జార్జి-6 వారిని సాగనంపడానికి విమానాశ్రయానికి వెళ్లారు. వైద్యులు వద్దంటున్నా ఆయన వినలేదు. ఎలిజబెత్ ఆయనను సజీవంగా చూడడం అదే చివరిసారి.

దంపతులిద్దరూ కెన్యాలో ఉన్న సమయంలో రాజు చనిపోయారన్న విషాద వార్త అందింది. వెంటనే ఆమె లండన్‌కు చేరుకున్నారు. తండ్రి మరణించడంతో ఎలిజబెత్ 2 యువరాణి నుంచి రాణి అయ్యారు.

రాణి బాధ్యతలకు సంబంధించి ఆమె ఏమీ తెలుసుకోకముందే అకస్మాత్తుగా ఆ పదవి చేపట్టాల్సి వచ్చింది.

''నాకు అప్పటికి అప్రెంటిస్‌షిప్ కూడా లేదు. మా నాన్న చాలా చిన్న వయసులో మరణించారు. అందువల్ల హఠాత్తుగా నేను ఈ పదవీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది'' అని ఓ సందర్భంలో రాణి వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన

1953లో క్వీన్ ఎలిజబెత్ 2 పట్టాభిషేకం బ్రిటీష్ టీవీలో ప్రత్యక్ష ప్రసారమైంది

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1953లో క్వీన్ ఎలిజబెత్ 2 పట్టాభిషేకం బ్రిటీష్ టీవీలో ప్రత్యక్ష ప్రసారమైంది

1953 జూన్‌లో ఆమె పట్టాభిషేక మహోత్సవాన్ని టీవీలో ప్రసారం చేశారు. అప్పటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ వ్యతిరేకించినప్పటికీ లక్షలాది మంది ప్రజలు టీవీల ముందు గుమిగూడి ఎలిజబెత్-2 ప్రమాణస్వీకారోత్సవాన్ని తిలకించారు.

యుద్ధం తరువాత బ్రిటన్ ఆర్ధికంగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో కూడా, టీవీ వ్యాఖ్యాతలు ఆమె ప్రమాణ స్వీకారాన్ని బ్రిటన్‌లో సరికొత్త ఎలిజబెతన్ శక ప్రారంభంగా అభివర్ణించారు.

రెండో ప్రపంచ యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్య ప్రాభవం పతనాన్ని వేగిరం చేసింది. ఆ తరుణంలో కొత్త రాణి ఎలిజబెత్-2 కామన్‌వెల్త్ దేశాల పర్యటన మొదలు పెట్టారు.

1953 నవంబరులో ఆమె మొదలుపెట్టిన ఈ పర్యటన సుదీర్ఘ కాలం సాగింది. స్వాతంత్ర్యం పొందిన భారత్ సహా ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్న పలు దేశాల్లో ఆమె పర్యటించారు.

అంతేకాదు... న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో ఒక బ్రిటన్ రాణి పర్యటించడం కూడా అదే తొలిసారి. ఆమెను స్వయంగా చూసేందుకు ఆస్ట్రేలియా లోని మూడొంతులమంది ఆసక్తి చూపించినట్లు అంచనా.

1950ల నాటికి చాలాదేశాలు బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటకీ, ఒక కుటుంబంలాగా కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయి.

అప్పుడే ఎదుగుతున్న యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీకి కామన్‌వెల్త్ పోటీ కానుందని కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించగా, మరికొందరు బ్రిటన్ విధానం ఈ ఖండం నుంచి దూరమైనట్టు అయ్యిందని అన్నారు.

వ్యక్తిగత దాడి

1957లో క్వీన్ ఎలిజబెత్ 2 అమెరికాలో పర్యటించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1957లో క్వీన్ ఎలిజబెత్ 2 అమెరికాలో పర్యటించారు

1956లో సూయజ్ కాలువ విషయంలో బ్రిటన్ మాట నెగ్గించుకోలేకపోయిన తరువాత బ్రిటిష్ ప్రభావం క్షీణించడం మరింత వేగవంతమైంది. సంక్షోభాల సమయంలో కామన్ ‌వెల్త్ కూటమి కలిసికట్టుగా వ్యవహరించలేకపోవచ్చన్నది ఈ ఉదంతంతో స్పష్టమైంది.

సూయజ్ కాలువను జాతీయం చేయాలన్న ఈజిప్ట్ ప్రయత్నాన్ని నిలువరించడానికి పంపిన బ్రిటన్ సైనిక బలగాలను అర్ధంతరంగా ఉపసంహరించుకోవడం, అప్పటి ప్రధాని ఆంథోనీ ఈడెన్ రాజీనామా చేయడం వంటివన్నీ ఎలిజబెత్-2కి రాజకీయంగా చిక్కులు తెచ్చిపెట్టాయి.

ప్రధాని రాజీనామా తరువాత కొత్త నాయకుడిని ఎన్నుకునే విధానం అప్పటికి కన్జర్వేటివ్ పార్టీలో లేకపోవడంతో అనేక సంప్రదింపుల అనంతరం హెరాల్డ్ మెక్‌మిలన్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా రాణి ఆహ్వానించారు.

మరోవైపు రాణిని లక్ష్యంగా చేసుకుని లార్డ్ ఆల్ట్రించామ్ ఒక మేగజైన్‌లో తీవ్ర విమర్శలు చేశారు. ఆమె చుట్టూతా వాతావరణం అంతా పూర్తిగా ''కులీన వర్గాలు'', ''టూ బ్రిటిష్'' అని విమర్శించారు. రాసింది చదవకుడా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేరని ఆరోపించారు.

ఆయన రాతలు సంచలనం సృష్టించాయి. లీగ్ ఆఫ్ ఎంపైర్ రాయలిస్ట్స్ కు చెందిన మనిషొకరు ఆయనపై భౌతిక దాడి చేశారు.

బ్రిటన్ రాజ కుటుంబం పట్ల అక్కడి సమాజపు వైఖరి మారుతోందన్న సంకేతాలు ఈ ఘటనలతో ప్రస్ఫుటమయ్యాయి.

రాచరికపు పాలన స్థానంలో రాజకుటుంబం

ప్రధాని హెరాల్డ్ మెక్‌మిలన్ రాజీనామాతో బ్రిటన్‌లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని హెరాల్డ్ మెక్‌మిలన్ రాజీనామాతో బ్రిటన్‌లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది
వైట్ లైన్

గడ్డకట్టుకుపోయిన రాచరికపు విధానాల పట్ల అసహనంగా ఉండే భర్త ప్రోత్సాహంతో బ్రిటన్‌లో కొత్త విధానాన్ని అమలులో పెట్టడం ప్రారంభించారు. కులీన కుటుంబాలకు చెందిన నవయవ్వన యువతులు అందమైన బట్టల్లో తమను తాము రాచకుటుంబం ముందు ప్రదర్శించుకునే ఆనవాయితీ అంతకుముందు ఉండేది. రాణి ఆ ఆనవాయితీని రద్దు చేశారు.

రాచరికపు పాలన అనే పదం స్థానంలో రాజకుటుంబం అనే మాటను వినియోగించడం ప్రారంభించారు.

1963లో రాణి మరోసారి రాజకీయ వివాదంలో కేంద్ర బిందువయ్యారు. హెరాల్డ్ మెక్‌మిలన్ ప్రధాని పదవి నుంచి వైదొలగ్గా. తదుపరి ప్రధానిపై కన్సర్వేటివ్ పార్టీ మల్లగుల్లాలు పడుతుండగానే ఆమె మెక్‌మిలన్ సలహాతోనే ఆయన స్థానంలో అప్పటి ఎర్ల్ ఆఫ్ హోంను నియమించారు.

రాజ్యాంగపరమైన కచ్చితత్వానికి మారుపేరైన ఆమె పాలనకు అది గడ్డుకాలంగా మారింది. అయితే అలాంటి సందర్భం రావడం అదే చివరిసారి. ఆ తరువాత కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునేందుకు సరైన విధానాన్ని ఏర్పరుచుకుంది.

నింపాదిగా...

1969లో రాజకుటుంబంపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ ప్యాలెస్ విశేషాలను ప్రజలకు చూపించింది

ఫొటో సోర్స్, Hulton Archive / Getty Images

ఫొటో క్యాప్షన్, 1969లో రాజకుటుంబంపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ ప్యాలెస్ విశేషాలను ప్రజలకు చూపించింది
వైట్ లైన్

కాగా,1960ల చివరి నాటికి రాజకుటుంబం సామాన్యులకు మరింత చేరువైంది. రాజ కుటుంబ కార్యకలాపాలు, జీవన విధానాన్ని ప్రజలకు చూపించేందుకు డాక్యుమెంటరీ చిత్రీకరణకు బీబీసీకి అవకాశమిచ్చారు. క్రిస్మస్ ట్రీని అలంకరించడం, పిల్లలను కారులో తీసుకెళ్లడం వంటి సాధారణ కార్యకలాపాలే అయినా బ్రిటిష్ ప్రజలు మునుపెన్నడూ చూడని రాజకుటుంబ విశేషాలను బీబీసీ చిత్రీకరించింది.

అయితే, విమర్శకులు మాత్రం రాజకుటుంబ గొప్పతనాన్ని ఈ చిత్రం పోగొట్టేసిందని.. వారూ సాధారణ మనుషులే అన్నట్లుగా చూపించిందని, ముఖ్యంగా డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా వంట చేసే చిత్రాలు వంటివి ప్రజల్లో వారి పట్ల ఉన్న అద్భుత భావనను పోగొట్టాయని అభిప్రాయపడ్డారు.

అయితే..ఈ చిత్రం మాత్రం ఆ కాలాన్ని చిత్రించింది. రాజకుటుంబానికి ఉన్న మద్దతు కొనసాగేలా చేయగలిగింది.

రాణి పట్టాభిషిక్తురాలై పాతికేళ్లయిన సందర్భంగా 1977లో రజతోత్సవాలు నిర్వహించారు. బ్రిటన్ వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రాణిపై ఉన్న అభిమానం ప్రస్ఫుటమైంది. రాణి పట్ల బహుళ ఆదరణ కనిపించింది.

ఆ తర్వాత రెండేళ్లకు మార్గరెట్ థాచర్ ప్రధాని పదవి చేపట్టారు. బ్రిటన్‌కు ఆమె తొలి మహిళా ప్రధాని. రాణి, ప్రధాని స్థానంలో ఉన్న ఈ ఇద్దరు మహిళల మధ్య పలుమార్లు ఇబ్బందికర సందర్భాలు తలెత్తాయని చెబుతారు.

కుటుంబ సమస్యలు

విండ్సర్ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో చిక్కుకుంది

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, విండ్సర్ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో చిక్కుకుంది
వైట్ లైన్

కామన్‌వెల్త్‌ అధిపతిగా, వాటి వ్యవహారాలు రాణికి జటిలంగా మారాయి.

ఎలిజబెత్‌కు ఆఫ్రికా నాయకులు తెలుసు. వారి సమస్యలపై ఆమెకు సానుభూతి ఉండేది.

మార్గరెట్ థాచర్ వ్యవహార శైలి ఆమెకు చిత్రంగా అనిపించేదని సమాచారం. దక్షిణాఫ్రికా జాత్యహంకార పాలనపై ఆంక్షలను థాచర్ వ్యతిరేకించడం కూడా చిత్రంగానే అనిపించేది.

1991 గల్ఫ్ యుద్ధం తరువాత ఆమె అమెరికా వెళ్లారు. అక్కడి కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన తొలి బ్రిటిష్ రాజ కుటుంబీకురాలు ఆమే.

కామన్‌వెల్త్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు క్వీన్ ఎలిజబెత్ 2

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కామన్‌వెల్త్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు క్వీన్ ఎలిజబెత్ 2

అటు తరువాత ఏడాదికే వరుస ఘటనలు రాజకుటుంబంపై ప్రభావం చూపాయి.

రాణి రెండో కుమారుడు డ్యూక్ ఆఫ్ యార్క్, ఆయన భార్య సారా విడిపోయారు. మార్క్‌ ఫిలిప్‌ను పెళ్లి చేసుకున్న యువరాణి అన్నె కూడా ఆయన నుంచి విడిపోయారు. ఆ తర్వాత ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానాల బంధం కూడా ఇబ్బందుల్లో పడింది. కొన్నాళ్లకు వారు కూడా విడిపోయారు.

ఆ ఏడాది చివర్లో రాణి ఫేవరెట్ నివాసం విండ్సర్ కాజిల్లో అగ్ని ప్రమాదం అప్పటి పరిస్థితికి దర్పణం పడుతుంది. మరమ్మతులకు ప్రజల పన్నుల నుంచి వచ్చిన సొమ్ము వాడాలా, లేక రాణి సొంతంగా ఖర్చుపెట్టుకోవాలా అనే చర్చ జరగడం నాటి ఇబ్బందికర స్థితికి దర్పణం పడుతుంది.

మరోవైపు బకింగ్ హామ్ ప్యాలస్‌లోకి సందర్శకులను అనుమతించడం మొదలుపెట్టారు. విండ్సర్ మరమ్మతుల కోసం నిధులు సమకూర్చుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాలన తొలినాళ్లలో కామన్‌వెల్త్ పై ఆమె పెట్టుకున్న ఆశలు పూర్తిస్థాయిలో ఫలించలేదు. ఐరోపాలో సరికొత్త సంబంధాల కారణంగా బ్రిటన్ తన పాత మిత్రుల్లో చాలామందికి మొహం చాటేసింది. అయినప్పటికీ రాణికి మాత్రం కామన్‌వెల్త్ దేశాల్లో ఇప్పటికీ విలువ ఉండడం విశేషం.

వేల్స్ యువరాణి డయానా మరణం

ప్రిన్సెస్ డయానా మరణంతో రాజప్రసాదానికి సంతాపాలు వెల్లువెత్తాయి

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, ప్రిన్సెస్ డయానా మరణంతో రాజప్రసాదానికి సంతాపాలు వెల్లువెత్తాయి

బ్రిటన్ రాజవంశానికి ప్రపంచ వ్యాప్తంగా మరింత శోభను తీసుకొచ్చిన ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానా 1997 ఆగస్టులో ఊహించని విధంగా కారు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ఘటన రాచకుటుంబాన్ని షాక్‌కు గురిచేసింది.

అయితే, ఆ తరువాత దు:ఖసాగరంలో మునిగిన బ్రిటన్ ప్రజలు డయానాకు నివాళులర్పించారు. కానీ, ఆ విషయం అంతగా ప్రజల్లో చర్చనీయాంశం కావడాన్ని రాణి ఇష్టపడలేదు. ఇది విమర్శకుల నోళ్లకు పనిచెప్పింది.

డయానా ఇద్దరు కుమారుల ఆలనాపాలనా రాణి స్వయంగా చూసుకున్నారు.

కోడలు డయానాకు ఆమె నివాళి అర్పిస్తున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో కనిపించాయి.

విషాదాలు.. వేడుకలు

దశాబ్దాలపాటు రాణిగా కొనసాగినా ఆమె కీర్తి ఏమాత్రం తగ్గలేదు

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, దశాబ్దాలపాటు రాణిగా కొనసాగినా ఆమె కీర్తి ఏమాత్రం తగ్గలేదు

2002 సంవత్సరంలో రాణిగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటున్న సమయంలోనే ఆమె తల్లి, సోదరి మార్గరెట్ మృతి చెందడంతో వేడుకల స్థానంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.

అయినా, స్వర్ణోత్సవాల రోజు సాయంత్రాన సుమారు 10 లక్షల మంది బకింగ్ హామ్ ప్యాలస్‌కు దగ్గరకు చేరారు.

2006 ఏప్రిల్‌లో రాణి 80 పుట్టినరోజు జరుపుకొన్నారు. అలాగే 2007 నవంబరులో రాణి దంపతులు తమ 60వ వివాహ వార్షికోత్సవాలను వెస్ట్‌ మినిస్టర్ అబేలో 2వేల మంది నడుమ జరుపుకొన్నారు.

ఆ తరువాత 2011 ఏప్రిల్‌‌లో మనవడు విలియమ్స్..కేట్ మిడిల్డన్‌ వివాహ వేడుక ఆమె పాల్గొన్న మరో సంతోష సందర్భం.

రిఫరెండమ్

ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ కమాండర్‌ మార్టిన్ మెక్‌గిన్నెస్‌తో కరచాలనం చేస్తున్న క్వీన్ ఎలిజబెత్ 2

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ కమాండర్‌ మార్టిన్ మెక్‌గిన్నెస్‌తో కరచాలనం చేస్తున్న క్వీన్ ఎలిజబెత్ 2

డైమండ్ జూబ్లీ వేడుకలలో భాగంగా ఆమె ఉత్తర ఐర్లాండ్‌లో పర్యటించారు. అక్కడ అధికారికంగా పర్యటించిన తొలి బ్రిటిష్ రాణి అయ్యారు. ఆ పర్యటనకు విశేష ప్రాధాన్యం దక్కింది. ఆ సందర్భంగా ఐరిష్ భాషలో ప్రసంగించి అక్కడివారిని ఆమె ఆకట్టుకున్నారు. అక్కడ ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ కమాండర్ మార్టిన్ మెక్‌గిన్నెస్‌తో రాణి కరచాలనం చేశారు.

అది ఒక రకంగా భావోద్వేగభరితమైన సంఘటన. ఎందుకంటే, రాణికి ఎంతో ఇష్టుడైన సోదరుడు లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్‌ 1979లో ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ జరిపిన బాంబు దాడిలో మరణించారు.

లండన్‌లో వేలమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి డైమండ్ జూబ్లీవేడుకలను జరుపుకున్నారు.

2014 సెప్టెంబరులో స్కాట్లాండ్ స్వాతంత్ర్యంపై జరిగిన రెఫరెండం కూడా రాణికి పరీక్ష సమయమే. 1977లో ఆమె పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని చాలామంది మర్చిపోయారు. ఐక్య బ్రిటన్ కోసం ఆమె తన నిబద్ధతను ఆమె తన ప్రసంగంలో ఉద్ఘాటించారు.

కాగా, స్కాటిష్ రెఫరెండం సమయంలో ఆమె బల్మోరల్ క్యాసిల్ మాట్లాడుతూ ''ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి తమ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకుంటారు'' అని ఆమె వ్యాఖ్యానించారు.

రెఫరెండం ఫలితం రాగానే రాణి చేసిన వ్యాఖ్యలు ఆమె ఎంతగా ఉపశమనం పొందారన్నది చెప్పాయి. ఐక్యతకు భంగం కలగలేదని, రాజ్యం చెక్కుచెదరలేదని వ్యాఖ్యానిస్తూనే, రాజకీయ ముఖచిత్రం మాత్రం మారడాన్ని ఆమె అంగీకరించారు.

2015 సెప్టెంబరు 9న నాటికి ఆమె బ్రిటన్ చరిత్రలోనే సుదీర్ఘకాలం పాలించిన రాజవంశీకురాలిగా చరిత్రకెక్కారు. విక్టోరియా మహారాణి రికార్డును ఆమె అధిగమించారు. అయితే, ఆమె ఎప్పటిలాగే, ఇది తాను కోరుకోని పదవి అంటూ వ్యాఖ్యానించారు.

2016 ఏప్రిల్లో ఆమె 90వ పుట్టినరోజు జరుపుకొన్నారు.

1955లో క్వీన్ ఎలిజబెత్ 2

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1955లో క్వీన్ ఎలిజబెత్ 2
వైట్ లైన్

ఆమె పట్టాభిషిక్తురాలైన నాటితో పోల్చితే ఇప్పుడు రాచరికం బలంగా లేనప్పటికీ ప్రజల్లో రాజకుటుంబం పట్ల గౌరవాభిమానాలకు మాత్రం ఢోకాలేదు. బ్రిటిష్ ప్రజల హృదయాల్లో వారికి ప్రత్యేక స్థానం ఇప్పటికీ ఉంది.

రాణి తన పట్టాభిషేక స్వర్ణోత్సవాల సమయంలో అంతకుముందు 30 ఏళ్ల కిందట దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకున్నారు.

''నాకు 21 ఏళ్లప్పుడు నేనో ప్రతిజ్ఞ చేశాను. ప్రజలకు సేవ చేయడానికే జీవితం అంకింతం చేస్తానని.. అది నిలుపుకొనే శక్తి కావాలని దేవుడిని కోరుకున్నాను. అందులో ఒక్క పదాన్ని కూడా ఉపసంహరించుకోలేదు, ఆ ప్రతిజ్ఞను మర్చిపోలేదు'' అన్నారామె.