రాయల్ బ్రాండింగ్: రాణి ఎలిజబెత్ 2 మరణంతో బ్రిటన్‌ కరెన్సీ నోట్లు, నాణేలు, స్టాంపులు, పాస్‌పోర్టుల్లో వచ్చే మార్పులేంటి?

స్టాంపులు

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్ సింహసనాన్ని అధిష్టించి 70 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన క్వీన్ ఎలిజబెత్ 2, ప్రజల జీవితాల్లో అంతర్భాగంగా మారారు.

బ్రిటన్‌ ప్రజల దైనందిన జీవనంలో ఆమె భాగమయ్యారు. రాణి ఫొటోలు, చిత్రాలు అక్కడి ప్రజలకు సుపరిచితం. ఇప్పుడు ఆమె మరణంతో అక్కడ వచ్చే మార్పులేంటో చూద్దాం.

1960లో క్వీన్ ఎలిజబెత్ 2 పొటోతో ముద్రించిన నోటు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1960లో క్వీన్ ఎలిజబెత్ 2 పొటోతో ముద్రించిన నోటు

అంతా మారుతుంది

యూకేలో చెలామణిలో ఉన్న మొత్తం 29,000 కోట్ల (29 బిలియన్ల కాయిన్స్) నాణేలపై రాణి ముఖచిత్రం ముద్రించి ఉంది. తాజాగా 2015లో ఆమె ముఖచిత్రంతో నాణేలను ముద్రించారు. ఆ నాణేలపై 88 ఏళ్ల వయస్సులో ఉన్న రాణి ముఖచిత్రం ఉంది. ఆమె హయాంలో నాణేలపై ముద్రించిన అయిదో డిజైన్ ఇది.

రాణి మరణంతో బ్రిటన్‌కు రాజు అయిన చార్లెస్ 3 ముఖచిత్రంతో కూడిన నాణేలను జారీ చేయడం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది ఇంకా రాయల్ మింట్ చెప్పలేదు.

అయితే, ప్రస్తుతం రాణి ముఖచిత్రంతో చెలామణిలో ఉన్న నాణేలు మరికొన్నేళ్ల పాటు మార్కెట్‌లో ఉండే అవకాశం ఉంది. నాణేలపై రాణి స్థానంలో రాజు చార్లెస్ 3 చిత్రాన్ని ముద్రించే ప్రక్రియ క్రమంగా సాగుతుంది.

1971లో బ్రిటన్‌లో నాణేల దశాంశీకరణ (డెసిమలైజేషన్) జరిగింది. అంతకుముందు వరకు అక్కడ గతంలో పాలించిన అనేక మంది రాజుల ముఖ చిత్రాలతో కూడిన నాణేలు చెలామణిలో ఉండేవి. 1971 తర్వాత వీటి వాడకం ఆగిపోయింది.

చార్లెస్

ఫొటో సోర్స్, THE ROYAL MINT

కింగ్ చార్లెస్ 3 ముఖచిత్రంతో వచ్చే నాణేల డిజైన్ ఎలా ఉండనుందో ఇంకా ఎవరికీ తెలియదు. కానీ, 2018లో రాయల్ మింట్, చార్లెస్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక నాణేన్ని విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే, నాణేంపై రాజు ముఖం ఎడమ వైపు చూస్తున్నట్లుగా ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు. నాణేలపై రాజు లేదా రాణి చిత్రాలు అంతకుముందు ఉన్న ముఖచిత్రాలకు ఎదురుగా ఉండాలనేది బ్రిటిష్ సంప్రదాయం.

ప్రభుత్వం కొత్త డిజైన్‌కు ఆమోదం తెలిపితే సౌత్ వేల్స్‌లోని రాయల్ మింట్ వీటిని ముద్రిస్తుంది.

1960 నుంచి అన్ని 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్' నోట్లపై క్వీన్ చిత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం 80 బిలియన్ పౌండ్ల (రూ. 7,37,388 కోట్లు) విలువ చేసే నోట్లు చెలామణిలో ఉన్నాయి. నాణేల తరహాలోనే క్రమంగా నోట్లపై నుంచి కూడా క్వీన్ ఫొటోలను కింగ్ చార్లెస్ ఫొటోతో భర్తీ చేస్తారు.

ప్రిన్స్ చార్లెస్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం 2018లో ఆరు కొత్త స్టాంపులను విడుదల చేశారు

ఫొటో సోర్స్, ROYAL MAIL

ఫొటో క్యాప్షన్, ప్రిన్స్ చార్లెస్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం 2018లో ఆరు కొత్త స్టాంపులను విడుదల చేశారు

స్టాంపులు, పోస్ట్ బాక్సులు

1967 నుంచి రాయల్ మెయిల్ జారీ చేసిన స్టాంపులు అన్నింటిపై క్వీన్ ఎలిజబెత్ 2 సైడ్ ప్రొఫైల్‌తో కూడిన సిలౌట్ (నీడలా కనిపించే ఫొటో) ఉంటుంది.

ఇప్పుడు క్వీన్ ఎలిజబెత్ 2 ఉండే స్టాంపుల ఉత్పత్తిని రాయల్ మెయిల్ నిలిపేస్తుంది. కొత్త వాటి తయారీని మొదలుపెడుతుంది. అయితే, ఇప్పటివరకు తయారై ఉన్న స్టాంపులను ఉత్తరాలు, పార్సిల్స్ కోసం వాడతారు.

గతంలో చార్లెస్ ముఖచిత్రంతో కూడిన స్టాంపులను రాయల్ మెయిల్ తయారు చేసింది. అయితే, ఇప్పుడు తయారు చేయబోయే కొత్త డిజైన్ ఎలా ఉండనుందో ఇంకా రాయల్ మెయిల్ చెప్పలేదు.

రాయల్ మెయిల్, స్టాంపులపై రాజు చిత్రాన్ని పెట్టడంతో పాటు పోస్ట్‌బాక్స్‌లపై రాయల్ సైపర్స్‌ను ఏర్పాటు చేస్తుంది.

యూకేలోని 60 శాతం పోస్ట్ బాక్స్‌లపై EIIR అనే రాయల్ సైపర్ ముద్ర ఉంటుంది. ఇందులోని E అంటే ఎలిజబెత్ 2అని, R అంటే రెజీనా (రాణి అని అర్థం)అని అర్థం.

ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే పోస్ట్ బాక్స్‌లపై కింగ్ సైపర్‌ను ఏర్పాటు చేస్తారు.

రాజముద్ర

రాజముద్ర

బ్రిటన్‌లో టొమాటో కెచప్ నుంచి పెర్‌ఫ్యూమ్‌ల వరకు ప్రతీ వస్తువుపై రాజముద్ర కనిపిస్తుంది. 'బై అపాయింట్‌మెంట్ టు హర్ మెజెస్టీ ద క్వీన్' అనే అక్షరాలు దానిపై ముద్రించి ఉంటాయి. ఈ ముద్ర కలిగి ఉన్న వస్తువులు, ఉత్పత్తులకు రాయల్ వారెంట్ లభించినట్లు లెక్క.

గత 100 ఏళ్ల కాలంగా రాజ కుటుంబానికి చెందిన సభ్యులు ప్రతీ ఒక్కరూ తమ సొంత రాయల్ వారెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం 900 రాజముద్రలు అమల్లో ఉన్నాయి.

ఒకవేళ రాయల్ వారెంట్‌ను మంజూరు చేసిన రాజ కుటుంబ సభ్యుడు చనిపోతే, కంపెనీలు రెండేళ్లలో ఆ రాజముద్రను వాడటం ఆపేయాలి.

'ప్రిన్స్ ఆఫ్ వేల్స్' హోదాలో చార్లెస్ జారీ చేసిన రాజ ముద్రలు ఇప్పుడు కూడా చెలామణిలో ఉంటాయి.

వీడియో క్యాప్షన్, బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ 2 జీవిత కథ

పాస్‌పోర్ట్‌లు

రాణి మరణంతో ప్రభావితమయ్యేవి స్టాంపులు, కరెన్సీ, రాజముద్రలు మాత్రమే కాదు ఈ జాబితాలో పాస్‌పోర్ట్‌లు కూడా ఉన్నాయి.

బ్రిటిష్ పాస్‌పోర్ట్‌లు అన్నీ 'హర్ మెజెస్టీ' పేరుతో జారీ అవుతాయి. ఇలా జారీ అయిన పాస్‌పోర్ట్‌లు ఇప్పటికైతే ప్రయాణానికి చెల్లుబాటు అవుతాయి. కానీ, వీటిని మార్చాల్సిన అవసరం ఉంది. వీటిపై అక్షరాలను 'హిజ్ మెజెస్టీ'గా మార్చుతారు.

ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లోని పోలీసు బలగాలు తమ హెల్మెట్లపై ఉన్న క్వీన్ ఎలిజబెత్ 2 అనే రాయల్ సైపర్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది.

రాణి ద్వారా నియమితులైన బారిష్టర్లు, సొలిసిటర్లు తక్షణమే 'క్వీన్స్ కౌన్సిల్' నుంచి 'కింగ్స్ కౌన్సిల్'గా మారతారు.

జాతీయ గీతంలోని 'గాడ్ సేవ్ ద క్వీన్' అనే పదాలను, చార్లెస్ అధికారికంగా బ్రిటన్ రాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత 'గాడ్ సేవ్ ద కింగ్'గా మార్చుతారు.

వీడియో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్‌-2 పెళ్లి ఎలా జరిగిందంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)