కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?

చార్లెస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సీన్ కౌలన్
    • హోదా, రాయల్ కరస్పాండెంట్

బ్రిటిష్ చరిత్రలో సుదీర్ఘకాలం రాణిగా ఉన్న ఎలిజబెత్ 2 మరణంతో ఆమె వారసుడు చార్లెస్ బ్రిటన్‌కు రాజు అయ్యారు.

ఆయన గత 70 ఏళ్లుగా బ్రిటిష్ రాణికి వారసుడిగా ఉన్నారు. ఇంత పెద్ద వయసులో బ్రిటిష్ రాజ సింహాసనాన్ని అధిష్టించిన వారెవరూ లేరు.

73ఏళ్ల రాజు తన తల్లితో పాటు కొన్ని తరాలుగా మారుతూ వచ్చిన ప్రపంచ నాయకులను ప్రత్యక్షంగా చూశారు. ఆయన 15 మంది యూకే ప్రధాన మంత్రులు, 14 మంది అమెరికా అధ్యక్షులు పదవిని చేపట్టడానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.

ఒక తరాన్ని నిర్వచించిన సుదీర్ఘమైన ఎలిజబెత్ 2 శకం తర్వాత తమ రాజు ఎలా ఉండాలని బ్రిటన్ అనుకుంటోంది?

కింగ్ చార్లెస్ 3 రాజుగా మారిన తర్వాత గతంలో మాదిరిగా కాకుండా, బహిరంగంగా మాట్లాడే అంశాల పై రాజు తటస్థతను ఎలా అలవర్చుకుంటారు?

ఒక రాజుగా చార్లెస్‌కు తన సొంత పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండవు. ప్రజా సంబంధిత అంశాల పై బహిరంగంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేరు. రాజుకు సాధారణ వ్యక్తి కంటే ప్రాధాన్యత ఎక్కువ.

"ఈ పదవిలో భిన్నమైన పాత్రలు పోషించాల్సి ఉంటుంది, భిన్నమైన నియమాలు ఉంటాయి" అని రాజ్యాంగ సంబంధిత అంశాల ప్రొఫెసర్ వెర్నన్ బోగ్డనోర్ అన్నారు.

ఒక రాజు ఆచి తూచి మాట్లాడాలనే విషయం గురించి చార్లెస్ కు అవగాహన ఉంది. "నేను మూర్ఖుడిని కాదు. ఒక రాజు ప్రవర్తించాల్సిన విధానం భిన్నంగా ఉంటుందని నాకు తెలుసు" అని ఆయన 2018లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

"రాజు అయిన తర్వాత కూడా ఇప్పటి మాదిరిగానే ఉంటానని అనుకోవడం పిచ్చితనం" అని అన్నారు.

రాజుగా పదవిలోకి వచ్చిన వెంటనే బ్రిటన్ కరెన్సీ కాయిన్ల పై రాజు చిత్రం వ్యతిరేక దిక్కులో కనిపించే విధంగా మార్పులు జరుగుతాయి.

చార్లెస్ పదవిని చేపడుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆయన తల్లి రాణి అయినప్పటి పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా, వైవిధ్యంగా ఉంటాయి. చార్లెస్ భిన్న సంస్కృతులు, విశ్వాసాలతో కూడిన బ్రిటన్ ప్రజలకు చేరువవుతారని ప్రొఫెసర్ బోగ్డనోర్ భావిస్తున్నారు.

స్వదేశీ జాతులు, వెనుకబడిన వర్గాల వారితో కూడా కలిసి అందరినీ సమైక్యం చేసే శక్తిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నారు.

చార్లెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్

రాజ కుటుంబం కళలు, సంగీతం, సంస్కృతిని పెంపొందించేందుకు కృషి చేసి, గుర్రపు పందేల పై కాకుండా షేక్ స్పియర్ పై ఎక్కువగా దృష్టి పెడతారని కూడా ఆయన ఆశిస్తున్నారు.

అయితే, చార్లెస్ ప్రస్తుతం దృష్టి పెడుతున్న వాతావరణ మార్పులు, సేంద్రియ వ్యవసాయం నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంటారని అనుకోవడం లేదని ప్రిన్స్ ట్రస్ట్ చారిటీలో చాలా కాలం పాటు కింగ్ చార్లెస్ తో పని చేసిన సర్ లోయిడ్ డోర్ఫ్ మ్యాన్ అన్నారు.

"ఆయన చాలా జ్ఞానం కలిగిన వారు. చాలా ప్రభావవంతంగా పని చేస్తారు. ఆయన రాజు కాగానే ఇప్పుడు చేస్తున్న పనులన్నిటినీ పక్కకు తోసేస్తారని ఊహించడం కూడా చాలా కష్టం" అని ఆయన అన్నారు.

రాచరిక వ్యవస్థ కారణంగా తనకు సన్నహితంగా ఉండే వారిని కొంత వరకు తగ్గించవచ్చనే అభిప్రాయం కూడా చాలా మంది నుంచి వినిపిస్తోంది.

రాచరిక ప్రధాన కూటమిలో చార్లెస్ తో పాటు కామిలా, ప్రిన్స్ విలియం, క్యాథరీన్ మాత్రమే ఉండొచ్చని భావిస్తున్నారు.

కానీ, కొత్త రాజు పదవీ కాలంలో స్థిరత్వం ఉండాలనే సందేశం ఎక్కువగా వినిపిస్తున్నట్లు రాయల్ ఫ్యామిలీ వ్యవహారాల పై వ్యాఖ్యానించే విక్టోరియా మర్ఫీ అన్నారు.

"భారీ మార్పులేవో చోటు చేసుకుంటాయని ఊహించొద్దు. ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు" అని అన్నారు.

"మారుతున్న జాతీయ జీవన స్రవంతిలో రాణిని స్థిరంగా ఉన్నవారిగా భావిస్తూ వచ్చాం. కానీ, ఆమెతో పాటు చార్లెస్ కూడా ప్రజా జీవనంలో ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. ఆయన ఒక రాజకీయ నాయకుని కంటే ఎక్కువగానే ప్రజా జీవనాన్ని చూశారు" అని రచయత రాబర్ట్ హార్డ్ మ్యాన్ చెప్పారు.

రాయల్ ఫ్యామిలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాయల్ ఫ్యామిలీ

వాతావరణ మార్పుల పై హెచ్చరికలు చేయడంతో ఆయనను ఒక పరిమితిలో చూస్తున్నారని చరిత్రకారులు సర్ ఆంథోనీ సెల్డన్ అన్నారు. "ఒకప్పుడు అపహాస్యానికి గురైన ఆయన ప్రస్తుతం అటెన్ బరో లాంటి వెలుగును సంపాదించుకున్నారు" అని సర్ ఆంథోనీ అన్నారు.

గ్లాస్గోలో 2021లో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో చార్లెస్ అభిప్రాయాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాంటి వారు తీవ్రంగానే పరిగణన లోకి తీసుకున్నారు" అని హార్డ్ మ్యాన్ అన్నారు. "ప్రపంచ రంగస్థలంలో ఆయనకున్న హోదా రాజుగా అయిన తర్వాత కూడా కొనసాగుతుంది" అని అన్నారు.

ఈ సదస్సులో చార్లెస్, బైడెన్ సమావేశం కూడా అయ్యారు. "ఈ మొత్తం వ్యవహారం ముందుకు కదిలేలా చేశారు" అని బైడెన్ ఆయనతో అన్నారు.

కొత్త రాజు వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?

చార్లెస్ గురించి బాగా తెలిసిన వారు ఆయన సిగ్గరి అని, నలుగురికీ దూరంగా ఉండే వ్యక్తి అని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే "సున్నితమైన మనసు" కలిగిన వారని అంటారు.

స్కూలులో చదువుకునేటప్పుడు కూడా చార్లెస్ ఒంటరిగా ఉండేవారని, తోటి విద్యార్థులు ఆట పట్టిస్తూ, ఏడిపిస్తూ ఉండేవారనే లాంటి ఫిర్యాదులు కూడా చేశారు.

"వాళ్ళు రాత్రంతా జోళ్లు విసరడం లేదా దిండ్లను విసరడం, గదిలోకి వచ్చి ఎంత గట్టిగా వీలయితే అంత గట్టిగా కొట్టడం లాంటివి చేసేవారు" అని స్కూల్ డార్మిటరీలో ఆయనకు ఎదురైన ఇబ్బందుల గురించి ఇంటికి రాసిన లేఖలో చార్లెస్ పేర్కొన్నారు.

"ఆయనకు సహనం లేదు. రేపు జరగాల్సిన పనులు నిన్ననే అయిపోవాలని అనుకుంటారు. ఆయన పనులను ఇదే మాదిరిగా చేయించుకుంటారు" అని క్వీన్ కన్సొర్ట్, ఆయన భార్య కామిలా అన్నారు.

ప్రజలు ఆయనను బయటకు చూసే గంభీరమైన వ్యక్తిత్వం వెనుక చిలిపితనం కూడా దాగి ఉందని ఆమె చార్లెస్ 70వ పుట్టినరోజు సందర్భంగా ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

"ఆయన చాలా సీరియస్ వ్యక్తి అని అనుకుంటారు. ఆయన సీరియస్‌గానే ఉంటారు. కానీ, ఆయనలో మరో కోణం కూడా ఉంది. దానిని కూడా ప్రజలు చూడాలి. ఆయన పిల్లలతో కలిసి ఆడుకుంటారు. వారికి హ్యారీ పాటర్ చదివి వినిపిస్తారు. రకరకాల గొంతులను అనుకరిస్తారు" అని కామిలా అన్నారు.

కింగ్ చార్లెస్-3

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్-3
కింగ్ చార్లెస్-3, కామిలా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్-3,

చార్లెస్ ప్రజలను కలిసేటప్పుడు చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటారు. తన పై తానే జోకులు వేసుకుంటూ ఉంటారు. కానీ, ఈ విధమైన ప్రవర్తన రాజు అయిన తర్వాత ఉండకపోవచ్చు. కానీ, వేల్స్ ప్రిన్స్ గా ఆయన స్నేహపూర్వకమైన, పెద్దరికాన్ని అలవరుచుకున్నారు.

70 ఏళ్ల రాజు చురుకుదనంలో ఎటువంటి మార్పు లేదు.

చార్లెస్ నిరంతరం శ్రమిస్తూ తనపై అనేక బాధ్యతలు పెట్టుకుని కష్టపడుతూనే ఉంటారని ప్రిన్స్ టీచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చార్లెస్‌తో కలిసి పని చేసిన క్రిస్ పోప్ అన్నారు.

"భావితరాల భవిష్యత్తు కోసం ఆయనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆయన చేసే పనిలో ఆయనకున్న ఆసక్తిని గమనించవచ్చు" అని పోప్ అన్నారు.

సంస్కృతీని కాపాడటం, సంప్రదాయ కళల పరిరక్షణకు సంబంధించిన స్వచ్చంద కార్యక్రమాలలో ఆయన పాల్గొంటున్నారు.

వీటితో పాటు కొత్త ఆవిష్కరణలు, మార్పులు జరిగేందుకు కూడా ప్రోత్సహిస్తున్నారు.

"సంస్కృతీ సంప్రదాయాలు కోల్పోకుండా చూడటం పట్ల ఆయనకు చాలా శ్రద్ధ ఉంది. అలా అని, కాలంలో వెనక్కి వెళ్లాలనే ఆలోచన ఆయనకు లేదు" అని పోప్ అన్నారు.

ఈ అంశాలన్నిటి పైనా ఆయన శ్రద్ధ వహించే అవకాశముంది. సంస్కృతిని పరిరక్షిస్తూనే మార్పును కూడా స్వీకరిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సంప్రదాయ విప్లవకారుడు.

కింగ్ చార్లెస్-3

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్-3
కింగ్ చార్లెస్-3

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్-3

ఆయన ఒక్కొక్కసారి 18వ శతాబ్దపు వర్ణ చిత్రం నుంచి దిగి వచ్చిన భూస్వామిలా కనిపిస్తారు. కొన్నిసార్లు విసుగు చెందిన సంస్కర్తగా అనిపిస్తారు. కొన్ని జాతుల పట్ల జరిగిన నిర్లక్ష్యం, వెనుకబాటు ధోరణి పట్ల చికాకు ప్రదర్శిస్తారు.

ఆయన తల్లి నుంచి కర్తవ్యాన్ని గ్రహించారు. అలాగే ఆమెలోని మతపరమైన విశ్వాసాలు, హాస్యచతురతను కూడా వారసత్వంగా అందిపుచ్చుకున్నారు.

2007లో బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసే సమయంలో ఆయనతో కలిసి హితన్ మెహతా పని చేశారు.

"ఆయన మానవతావాది. ఆయన ఎంత శ్రద్ధ వహిస్తారనే విషయాన్ని ప్రజలు చాలా తక్కువగా అంచనా వేస్తారు. భావితరాలకు ఎటువంటి ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళతానో అనే ఆందోళనను తరచుగా వ్యక్తం చేస్తూ ఉంటారు" అని మెహతా చెప్పారు.

ఏదైనా చర్యను చేపట్టేందుకు ఇది నేరుగా పిలుపునివ్వడం లాంటిదే. "శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో ఫోన్ చేసి "నేనిప్పుడే పాకిస్తాన్ వరదల గురించి విన్నాను. మనమేం చేస్తున్నాం? అని అడుగుతారు. అలా అని ఆయన ఖాళీగా ఉండే వ్యక్తి కాదు. సమస్య గురించి వినగానే దాని పై శ్రద్ధ పెడతారు" అని అన్నారు.

"ఈయన రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తారు. డెస్క్ పై అర్ధరాత్రి వరకు పని చేసుకుంటూ అక్కడే నిద్రపోతారు" అని ప్రిన్స్ హ్యారీ చెప్పారు.

కింగ్ చార్లెస్-3, తల్లితండ్రులతో

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్-3, తల్లితండ్రులతో

చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్ బకింగ్‌హం ప్యాలెస్‌లో 1948లో నవంబరు 14న జన్మించారు.

ఆయన పుట్టినప్పుడు బీబీసీ వార్తల్లో "యువరాణి కుమారుడికి జన్మనిచ్చారని మాత్రమే ప్రకటించలేదు. సురక్షితంగా రాకుమారునికి జన్మనిచ్చారు" అని చెప్పింది.

నాలుగేళ్ల తర్వాత ఆయన రాణికి వారసునిగా మారారు.

"నేను ఈ పదవి చేపట్టేందుకే పుట్టాను. నేను ఇక్కడ నుంచి వీలైనంత తీసుకుంటాను. నేను చేయగల్గినదంతా చేస్తాను" అని చార్లెస్ 2005లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

ఆయన 400కు పైగా సంస్థలకు అధ్యక్షునిగా ఉన్నారు. 1976లో ఆయన సొంత స్వచ్చంద సంస్థ ది ప్రిన్సెస్ ట్రస్ట్ ను ప్రారంభించారు. దీని కోసం రాయల్ నేవీ నుంచి ఆయనకు వచ్చే నిధులను వినియోగించారు.

ఈ సంస్థ ద్వారా సుమారు 900,000 అట్టడుగు వర్గాల యువతకు సహాయం చేశారు. ఇది ఆయనకు సామాజిక సమస్యల పట్ల అవగాహనను కలుగచేసింది.

"అయితే సమాజంలో అట్టడుగు వర్గాల వారిని చేరుకునేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్దగా ఆదరణ లభించలేదు.

"ఈ ఆలోచనను హోమ్ ఆఫీస్ సానుకూలంగా చూడలేదు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లడం చాలా కష్టం" అని ఆయన 2018లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.

ఆయన చేపట్టిన కార్యక్రమాల వల్ల ఆయన రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని, తలదూరుస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. 2004 నుంచి వ్యవసాయం, నగర ప్రణాళిక, నిర్మాణ శైలి, విద్య లాంటి అంశాల పై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ప్రభుత్వ మంత్రులకు లేఖలు రాసేవారని అంటారు.

కింగ్ చార్లెస్-3

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్-3

"చార్లెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారని అనిపించటం లేదని, కానీ, ఆయనకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయని మాజీ క్యాబినెట్ మంత్రి అన్నారు. ఏదైనా అంశం పై తలెత్తే వ్యతిరేక వాదనలను వినకుండా ఆయనకున్న అభిప్రాయాలను అమలు చేసేందుకు చూస్తారు" అని అన్నారు.

"ఆయన ఎవరినీ తరిమి కొట్టరు. ఆయన లేఖల ద్వారా జోక్యం చేసుకుంటారు. అలా అని కచ్చితంగా అమలు చేయాలని గట్టిగా చెప్పరు, అమర్యాదగా ప్రవర్తించరు" అని అన్నారు.

"ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పై ఆయన పై వచ్చిన ఆరోపణలకు స్పందిస్తూ, "నేను చేసేది రాజకీయ జోక్యం అనుకుంటే, దాని గురించి గర్వపడుతున్నాను" అని అన్నారు. ఆయన తన వాదన గెలవాలనే పరిస్థితుల్లో లేనట్లు ఆయనకు తెలుసు’’ అని చెప్పారు.

"ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఫిర్యాదులు చేస్తారు. ఏదైనా విషయంలో తలదూర్చి సహాయం చేయాలని చూస్తే, దానికి కూడా ఫిర్యాదు చేస్తారు" అని ఆయన అన్నారు.

పార్టీ రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నట్లు ఆయన మరొక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ, ప్రజలు నివసిస్తున్న పరిస్థితుల గురించి మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు.

"చార్లెస్ నిశిత దృష్టి, ఏదైనా పనిని చేపట్టాలంటే అధికారిక అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చూపే తెగింపు చూసి ఆశ్చర్యపోయాను" అని మాజీ కార్మిక మంత్రి క్రిస్ మలిన్ తన డైరీలో రాసుకున్నారు.

ఆయన ఎప్పుడూ వెనుకబడిన వర్గాలు, యువతకు ఏదైనా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నేను చార్లెస్‌ను చూసి చాలా ముగ్ధుడినయ్యానని ఒప్పుకోవాలి. ఇంత కార్యదక్షత ఉన్న మనిషి కావాలనుకుంటే తన సొంత ప్రపంచంలోకి కూడా వెళ్లి ఏ పనీ చేయకుండా కూడా గడిపే అవకాశముంది" అని అన్నారు.

రాయల్ ఫ్యామిలీ

ఫొటో సోర్స్, Chris Jackson / Clarence Hous via Getty images

ఫొటో క్యాప్షన్, రాయల్ ఫ్యామిలీ

కింగ్ చార్లెస్‌కు ప్రజల మద్దతు ఎంత వరకు లభిస్తుంది?

"ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోని పక్షంలో రాచరికానికి మనుగడ ఉండదు. ప్రజలు వద్దనుకుంటే, వారికి రాచరికం ఉండదు" అని చార్లెస్ అన్నారు.

డిసెంబరు 2021లో యూగవ్ నిర్వహించిన అధ్యయనంలో చార్లెస్ ప్రాముఖ్యం రోజురోజుకీ పెరుగుతున్నట్లు తెలిసింది. మూడింట రెండొంతుల మంది ప్రజలు ఆయనను సానుకూల దృక్పథంతోనే చూస్తున్నారు.

కానీ, ఒపీనియన్ పోల్స్ మాత్రం ఎలిజబెత్ రాణి కంటే ఆయనకు తక్కువ ప్రాముఖ్యం ఉన్నట్లు చూపించాయి.

ఈ పదవిలో క్వీన్ ఎలిజబెత్ 2 లేదా చార్లెస్ కొడుకు విలియంను ఉంటే బాగుంటుందని చాలామంది అనేవారు. దీనిని బట్టీ చూస్తే ఆయన ఇంకా చాలా మంది మన్ననలు పొందాల్సి ఉంది. ముఖ్యంగా యువతలో ఆయనకు ప్రాముఖ్యత తక్కువగా ఉంది.

మొదటి భార్య డయానాతో ఆయనకున్న సంబంధాలను సినిమాల్లో, టీవీ షో లలో ప్రదర్శించిన తీరు కూడా ఇందుకొక కారణం. డయానా 1997లో కారు ప్రమాదంలో మరణించారు.

ఆయన డయానాతో వ్యవహరించిన తీరులో కొంత నిజం, కొంత కాల్పనికత ఉండి ఉండొచ్చు. కానీ, వీరిద్దరి సంబంధాలు మాత్రం చాలా ప్రభావం చూపించాయి.

"చార్లెస్ పదవిని చేపట్టిన తర్వాత ప్రజాభిప్రాయాలు మారే అవకాశముంది" అని లండన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పాలీన్ మెక్ లారన్ అన్నారు.

గతంలో కామెడీ షో లలో హాస్యాస్పదంగా చూపించే ఆయన వ్యక్తిత్వాన్ని క్రమంగా పర్యావరణం గురించి మాట్లాడే వ్యక్తిగా హుందాగా చూపించడం మొదలయింది.

అత్యున్నత అంశాల పై ప్రజలకు ఆసక్తి ఉండకపోవచ్చు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌కు రాజ కుటుంబంతో ఉండే సంబంధాల పట్ల ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉత్కంఠతో చూస్తూ ఉంటారు.

కింగ్ చార్లెస్-3

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్-3

ప్రిన్స్ ఆండ్రూ పై వచ్చిన లైంగిక వేధింపుల అభియోగాల పై చేసుకున్న ఒప్పందం తర్వాత ఆయన భవిష్యత్తులో నిర్వహించాల్సిన పాత్ర గురించి కొన్ని కఠినమైన నిర్ణయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా చార్లెస్ ముందుంది.

యూకేకు అవతల కామన్‌వెల్త్ దేశాలతో ఆధునిక సంబంధాలను పునర్నిర్వచించుకోవాల్సి ఉంది. కామన్‌వెల్త్ కొత్త అధినేతగా వలసవాదం, బానిసత్వం లాంటి కఠినమైన వారసత్వాలను ఎలా కొనసాగిస్తారో చూడాల్సి ఉంది.

కింగ్ చార్లెస్ యూకేతో పాటు మరో 14 దేశాలకు రాజుగా మారారు. ఇందులో కొన్ని దేశాలు కామన్‌వెల్త్‌లో సభ్యులుగా ఉంటూనే రిపబ్లిక్‌గా మారాలని అనుకుంటున్నాయి. అయితే, మార్పుకు సంబంధించిన చర్చలను నిర్వహించేందుకు చార్లెస్ ఇప్పటికే సుముఖతను వ్యక్తం చేశారు.

ఆయన పదవిని నిరాటంకంగా చేపట్టేందుకు ఇప్పటికే కొన్ని నిర్ణయాలను తీసుకుని ఉంటారు.

ఆయన తల్లి బ్రతికుండగా కామిలా ప్రిన్సెస్‌కు బదులు క్వీన్ కన్సొర్ట్ అనే బిరుదును వాడాలని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడి ఉంటారు.

చాలామంది పదవీ విరమణ చేసే వయసులో చార్లెస్ బ్రిటన్ రాజుగా అత్యున్నత స్థానాన్ని అధిరోహిస్తున్న సమయంలో కామిలా ఆయనకిచ్చే మద్దతు చాలా కీలక పాత్ర వహిస్తుంది.

ఈ క్షణంలో మాత్రం ఆయన జీవితం ముందు ఎప్పటి నుంచో ఎదురుగా ఉన్న పదవిని చేపట్టబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం చార్లెస్ సమయం మొదలయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)