క్వీన్ ఎలిజబెత్ 2: రాజు చార్లెస్ తర్వాత సింహాసనాన్ని అధిష్టించే వారసులు ఎవరు?

క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తర్వాత ఆమె పెద్ద కుమారుడు చార్లెస్ రాజుగా మారారు.

ఆయను కింగ్ చార్లెస్ 3గా పిలుస్తారు. 1685 తర్వాత సింహాసనాన్ని అధిష్టించే తొలి చార్లెస్ ఆయనే. సెప్టెంబరు 8న మరణించిన క్వీన్ ఎలిజబెత్, బ్రిటిష్ చరిత్రలోనే సుదీర్ఘ కాలం పాలించిన రాణి.

బ్రిటన్ రాజ కుటుంబం, ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్టించబోయే రాజు కుటుంబ వారసుల గురించి తెలుసుకుందాం.

లైను

క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్

సుదీర్ఘ కాలం పాలించిన బ్రిటన్‌ రాణిగా ఎలిజబెత్ 2 చరిత్ర సృష్టించారు. ఆమె పాలన దాదాపు 70ఏళ్లు కొనసాగింది. 96ఏళ్ల వయసులో సెప్టెంబరు 8న ఆమె కన్నుమూశారు.

1925లో ప్రిన్సెస్ ఎలిజబెత్ జన్మించారు. తండ్రి కింగ్ జార్జ్ 6 మరణం తర్వాత 1952లో ఆమె రాణిగా బాధ్యతలు తీసుకున్నారు.

1947లో డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా ఫిలిప్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. చార్లెస్, అన్నె, ఆండ్రూ, ఎడ్వర్డ్.

బ్రిటిష్ రాజు లేదా రాణికి జీవిత భాగస్వామిగా సుదీర్ఘ కాలం కొనసాగిన వ్యక్తిగా ఫిలిప్ చరిత్ర సృష్టించారు. 2017లో ఆయన అధికారిక విధుల నుంచి పదవీ విరమణ పొందారు. 2021 ఏప్రిల్ 9న ఆయన మరణించారు.

లైను

కింగ్ చార్లెస్ 3

జననం: 1948

ప్రిన్స్ చార్లెస్ 3

ఫొటో సోర్స్, Getty Images

తల్లి మరణానంతరం చార్లెస్ రాజు అయ్యారు.

ఇదివరకు ఆయన ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా ఉండేవారు. ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానా స్పెన్సర్‌ను 1981 జులై 29న ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు విలియం, హ్యారీ ఉన్నారు. అయితే, 1996లో చార్లెస్, డయానా విడిపోయారు.

1997 ఆగస్టు 31న పారిస్‌లోని ఓ కారు ప్రమాదంలో ప్రిన్సెస్ డయానా మరణించారు.

ఆ తర్వాత కామిలా పార్కర్‌ను ఏప్రిల్ 9, 2005లో పెళ్లి చేసుకున్నారు. తన కుమారుడు రాజుగా బాధ్యతలు తీసుకునేటప్పుడు ఆయన పక్కన రాజు జీవిత భాగస్వామిగా డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ కామిలా ఉండాలని క్వీన్ ఎలిజబెత్ ఒకసారి చెప్పారు.

ఆ తర్వాత వారసులు ఎవరు?

1. ప్రిన్స్ విలియం, డ్యూక్ ఆఫ్ కార్న్‌వాల్, కేంబ్రిడ్జ్

జననం: 1982

ప్రిన్స్ విలియం

ఫొటో సోర్స్, Getty Images

కింగ్ చార్లెస్ 3, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానాల పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం. సింహాసనంపై చార్లెస్ తర్వాత కూర్చొనే వారిలో మొదటివారు విలియం.

తల్లి చనిపోయినప్పుడు డ్యూక్ విలియం వయసు 15ఏళ్లు. ఆ తర్వాత సెయింట్ ఆండ్రూ యూనివర్సిటీలో ఆయన చదువుకోవడానికి వెళ్లారు. అక్కడే తన భార్య కేట్ మిడిల్‌టన్‌ను ఆయన కలిశారు. వీరికి 2011లో వివాహమైంది.

తన 21వ పుట్టిన రోజున కౌన్సిలర్ ఆఫ్ స్టేట్‌గా విలియం నియమితులయ్యారు. అధికారిక కార్యక్రమాల్లో రాణి పక్కన కౌన్సిలర్ ఆఫ్ స్టేట్ నిలబడతారు.

విలియం, మిడిల్‌టన్‌లకు తొలి సంతానంగా జులై 2013లో జార్జ్ జన్మించారు. రెండో సంతానంగా 2015లో షార్లెట్ జన్మించారు. మూడో సంతానంగా 2019లో లూయిస్ జన్మించారు.

సైన్యం, నౌకా దళం, వాయు సేనలో ప్రిన్స్ విలియం శిక్షణ తీసుకున్నారు. నార్త్ వేల్స్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ వ్యాలీలో మూడేళ్లపాటు సెర్చ్ అండ్ రెస్క్యూ పైలట్‌గా ఆయన పనిచేశారు. రాజ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంతోపాటు ఈస్ట్ ఆంగ్లియన్ ఎయిర్ అంబులెన్స్‌లో కో-పైలట్‌గానూ రెండేళ్లు విధులు నిర్వర్తించారు. 2017లో ఆ బాధ్యతల నుంచి తప్పుకొని క్వీన్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరాల నుంచి మరికొన్ని రాజ కుటుంబ బాధ్యతలను తీసుకున్నారు.

అయితే, ప్రిన్స్ విలియం ఆటోమేటిక్‌గా ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా మారరు. దీని కోసం రాజు ప్రకటన చేయాల్సి ఉంటుంది.

మరోవైపు డ్యూక్ ఆఫ్ కార్న్‌వాల్ టైటిల్ ఆయనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. ఇప్పుడు విలియం, కేట్‌లను డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కార్న్‌వాల్, కేంబ్రిడ్జ్‌లుగా పిలుస్తున్నారు.

సింహాసనానికి వారసుడిగా ఆయన రాజుకు, రాజ కుటుంబ బాధ్యతలకు సంపూర్ణ సహకారం అందించాల్సి ఉంటుంది.

2. ప్రిన్స్ జార్జ్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జి

జననం: 2013

ప్రిన్స్ జార్జ్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జి

ఫొటో సోర్స్, Getty Images

ప్రిన్స్ జార్జ్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జ్ జులై 22 , 2013లో లండన్‌లోని సెయింట్ మేరీ హాస్పిటల్‌లో జన్మించారు. అప్పుడు తండ్రి ప్రిన్స్ విలియం అక్కడే ఉన్నారు.

పుట్టినప్పుడు ప్రిన్స్ జార్జ్ బరువు 3.8 కేజీలు.

సింహాసనాన్ని అధిష్టించే వారసులో జాబితాలో ఆయన రెండో వారు.

3. ప్రిన్సెస్ షార్లెట్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జ్

జననం: 2015

ప్రిన్సెస్ షార్లెట్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జ్

ఫొటో సోర్స్, Getty Images

డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జ్‌కు రెండో సంతానంగా 2 మే 2015న సెయింట్ మేరీ హాస్పిటల్‌లో ప్రిన్సెస్ షార్లెట్ జన్మించారు. అప్పుడు తండ్రి విలియం అక్కడే ఉన్నారు.

పుట్టినప్పుడు షార్లెట్ బరువు 3.7 కేజీలు. ఆమెకు షార్లెట్ ఎలిజబెత్ డయానాగా డ్యూక్, డచెస్ నామకరణం చేశారు.

సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో షార్లెట్ మూడో వారు. ఆమె కంటే ముందుగా తండ్రి విలియం, సోదరుడు జార్జ్ వరుసలో ముందున్నారు.

షార్లెట్‌ను హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ షార్లెట్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జ్‌గా పిలుస్తున్నారు.

4. ప్రిన్స్ లూయిస్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జి

జననం: 2018

ప్రిన్స్ లూయిస్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జి

ఫొటో సోర్స్, Getty Images

డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ అండ్ కేంబ్రిడ్జ్‌కు మూడో సంతానంగా 2018, ఏప్రిల్ 23న లండన్‌లోని సెయింట్ మేరీ హాస్పిటల్‌లో ప్రిన్స్ లూయిస్ జన్మించారు. పుట్టినప్పుడు లూయిస్ బరువు 3.8 కేజీలు.

లూయిస్ పూర్తి పేరు లూయిస్ ఆర్థర్ చార్లెస్.

సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో లూయిస్ నాలుగో వారు.

5. ప్రిన్స్ హ్యారీ, డ్యూక్ ఆఫ్ ససెక్స్

జననం: 1984

ప్రిన్స్ హ్యారీ, డ్యూక్ ఆఫ్ ససెక్స్

ఫొటో సోర్స్, Getty Images

శాండస్ట్ రాయల్ మిలిటరీ అకాడమీలో ప్రిన్స్ హ్యారీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. సైన్యంలో లెఫ్టినెంట్‌గా, హెలికాప్టర్ పైలట్‌గానూ ఆయన పనిచేశారు.

మొత్తంగా సాయుధ బలగాల్లో పదేళ్ల పాటు ఆయన సేవలు అందించారు. 2012 నుంచి 2013 మధ్య రెండుసార్లు అఫ్గానిస్తాన్‌లో విధులు నిర్వర్తిస్తూ ఆయన కనిపించారు. ఒకసారి అపాచె హెలికాప్టర్ కో-పైలట్‌గా, గన్నర్‌గా మరోసారి ఆయన కనిపించారు.

2015లో ఆయన సైన్యం నుంచి పదవీ విరమణ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆఫ్రికాలో ప్రకృతి పరిరక్షణ, గాయపడిన సైనికులకు పోటీలు నిర్వహించడం లాంటి పనులను ఆయన చూసుకుంటున్నారు.

21వ పుట్టినరోజు తర్వాత హ్యారీ కూడా కౌన్సిలర్ ఆఫ్ స్టేట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అధికారిక కార్యక్రమాల్లో రాణి పక్కన ఆయన కూడా కనిపించేవారు.

అమెరికా నటి మెఘన్ మెర్కెల్‌ను విండ్సర్ క్యాజిల్‌లో 2018 మే 19న ఆయన పెళ్లి చేసుకున్నారు. సీనియర్ రాజ కుటుంబ బాధ్యతల నుంచి తాము తప్పుకోబోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. ఆర్థికంగా తాము స్వతంత్రంగా ఉండాలని అనుకుంటున్నట్లు వారు చెప్పారు.

దీనికి ఏడాది తర్వాత, వీరు రాజ కుటుంబ బాధ్యతలను మళ్లీ నిర్వర్తించబోవడంలేదని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. మరోవైపు గౌరవ సైనిక నియామకాలతో, ఇతర హోదాలను కూడా వారు వదులుకుంటున్నట్లు తెలిపింది.

6. ఆర్చీ హ్యారిసన్ మౌంట్‌బ్యాటెన్ - విండ్సర్

జననం: 2019

ఆర్చీ హ్యారిసన్ మౌంట్‌బ్యాటెన్ - విండ్సర్

ఫొటో సోర్స్, Getty Images

ససెక్స్ తొలి సంతానంగా ఆర్చీ హ్యారిసన్ మౌంట్‌బ్యాటెన్-విండ్సన్ మే 6, 2019న జన్మించారు.

పుట్టినప్పుడు హ్యారిసన్ బరువు 3.2 కేజీలు. హ్యారిసన్‌కు రాయల్ టైటిల్‌ను ఉపయోగించకూడదని తన తల్లిదండ్రులు భావించారు.

హ్యారిసన్‌కు పేరు ప్రకటించినప్పుడు బీబీసీ రాయల్ కరస్పాండెంట్ జానీ డైమండ్ మాట్లాడుతూ.. చిన్నారిని రాజ కుటుంబ సభ్యుడిగా పెంచడం ఆ జంటకు ఇష్టంలేదని చెప్పడానికి.. టైటిల్ ఉపయోగించకపోవం ఒక ఉదాహరణగా చెప్పొచ్చని విశ్లేషించారు.

7. లిలిబెట్ డయానా మౌంట్‌బ్యాటెన్

జననం: 2021

ససెక్స్ రెండో సంతానంగా కాలిఫోర్నియాలో 2021 జూన్ 4న లిలిబెట్ డయానా మౌంట్‌బ్యాటెన్-విండ్స్ జన్మించారు. ఆమెను అంతా లిలి అని పిలుస్తారు. క్వీన్‌ను కూడా రాజ కుటుంబం ముద్దుగా లిలి అని పిలుచుకుంటుంది. రాణికి ఆమె 11వ ముని మనవరాలు.

ఆమె పేరులో మధ్యలో కనిపించే డయానా అనేది ప్రిన్స్ హ్యారీ తల్లి పేరు. 1997లో హ్యారీకి 12ఏళ్ల వయసున్నప్పుడు డయానా కారు ప్రమాదంలో మరణించారు.

8. డ్యూక్ ఆఫ్ యార్క్

జననం: 1960

ప్రిన్స్ ఆండ్రూ

ఫొటో సోర్స్, Getty Images

సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో ఎనిమిదో వ్యక్తి అయిన ప్రిన్స్ ఆండ్రూ. క్వీన్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరాల మూడో సంతానం. రాజు లేదా రాణి అధికారంలో ఉన్నప్పుడు, 103 ఏళ్ల తర్వాత పుట్టిన తొలి బిడ్డ ఆయనే.

1986లో సారా ఫెర్గుసన్‌ను ఆండ్రూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె డచెస్ ఆఫ్ యార్క్‌గా మారారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1988లో బియాట్రిస్, 1990లో యూజినీ వీరికి జన్మించారు. అయితే, ఆండ్రూ, సారా విడిపోతున్నట్లు 1996లో ప్రకటించారు.

22ఏళ్లపాటు రాయల్ నేవీలో డ్యూక్ పనిచేశారు. 1982లో ఫాల్క్‌లాండ్స్ యుద్ధంలో మూడుసార్లు ఆయన కనిపించారు. రాజ కుటుంబ బాధ్యతలతోపాటు ప్రభుత్వానికి ప్రత్యేక వాణిజ్య ప్రతినిధిగా 2011లో ఆయన పనిచేశారు.

సెక్స్ ట్రాఫికింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆత్మహత్య చేసుకున్న అమెరికా ఫైనాన్షియర్ జెఫరీ ఎప్స్‌టీన్‌తో సంబంధాలపై బీబీసీ ఇంటర్వ్యూ అనంతరం, 2019లో రాజ కుటుంబ బాధ్యతల నుంచి ప్రిన్స్ ఆండ్రూ తప్పుకున్నారు.

ఆ కేసులోనే కొందరు బాధితులు ఆండ్రూపైనా ఆరోపణలు చేశారు. అయితే, ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజమూలేదని ఆండ్రూ ఖండించారు.

9. ప్రిన్సెస్ బియాట్రిస్

జననం: 1988

ప్రిన్సెస్ బియాట్రిస్

ఫొటో సోర్స్, Getty Images

ప్రిన్స్ ఆండ్రూ, డచెస్ ఆఫ్ యార్క్‌ సారాల పెద్ద కుమార్తె ప్రిన్సెస్ బియాట్రిస్. ఆమె పూర్తి పేరు రాయల్ హైనెస్ ప్రిన్సెస్ బియాట్రిస్ ఆఫ్ యార్క్. ఆమెకు అధికారికంగా ఎలాంటి ఇంటి పేరు లేదు. అయితే, యార్క్‌ను పేరు ముందు పెట్టి పిలుస్తుంటారు.

రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎడ్వార్డో మపెల్లీ మొజ్జిని విండ్సర్‌లోని రాయల్ చాపెల్‌లో జులై 2020లో ఆమె పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఆ ఏడాది మే నెలలోనే వారి పెళ్లి జరగాల్సి ఉంది. కరోనావైరస్ వ్యాప్తి నడుమ అది వాయిదా పడింది.

10. సియెనా ఎలిజబెత్ మపెల్లీ మొజ్జి

జననం: 2021

ప్రిన్సెస్ బియాట్రిస్‌కు సెప్టెంబరు 2021లో సియెనా ఎలిజబెత్ జన్మించారు. సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో సియెనా పదో వారు. ఈమె క్వీన్‌కు 12వ ముని మనుమరాలు.

ఎడ్వార్డో మపెల్లీ మొజ్జికి మొదటి భార్య డారా హువాంగ్ ద్వారా కలిగిన సంతానం క్టిస్టోఫర్ వూల్ప్‌కు ప్రిన్సెస్ బియాట్రిస్ సవతి తల్లి.

11. ప్రిన్సెస్ యూజినీ

జననం: 1990

ప్రిన్సెస్ యూజినీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రిన్స్ ఆండ్రూ, డచెస్ ఆఫ్ యార్క్‌ల చిన్న కుమార్తె ప్రిన్సెస్ యూజినీ. ఆమె పూర్తి పేరు హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ యూజినీ ఆఫ్ యార్క్. సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో ఆమె 11వ వారు.

అక్కడ బియాట్రిస్‌లానే యూజినీకి కూడా అధికారికంగా ఇంటి పేరు లేదు. అయితే, యార్క్‌ను పేరు ముందు పెట్టి పిలుస్తారు.

ప్రియుడు జాక్ బ్రూక్స్‌బ్యాంక్‌ను విండ్సర్ క్యాజిల్‌లో 2018 అక్టోబరు 12న ఆమె పెళ్లి చేసుకున్నారు.

12. ఆగస్ట్ ఫిలిప్ హాక్ బ్రూక్స్‌బ్యాంక్

జననం: 2021

ఆగస్ట్ ఫిలిప్ హాక్ బ్రూక్స్‌బ్యాంక్

ఫొటో సోర్స్, Getty Images

ప్రిన్సెస్ యూజినీ, జాక్ బ్రూక్స్‌బ్యాంక్‌లకు 2021 ఫిబ్రవరి 9న తొలి కుమారుడిగా ఆగస్ట్ ఫిలిప్ హాక్ జన్మించారు. రాణికి ఈయన తొమ్మిదవ ముని మనుమడు.

13. ద ఎర్ల్ ఆఫ్ వెసెక్స్

జననం: 1964

ద ఎర్ల్ ఆఫ్ వెసెక్స్

ఫొటో సోర్స్, Getty Images

1999లో సోఫీ రైస్-జోన్స్‌తో వివాహం తర్వాత ప్రిన్స్ ఎడ్వర్డ్‌కు ద ఎర్ల్ ఆఫ్ వెసెక్స్ అండ్ విస్కౌంట్ సెవెర్న్‌గా టైటిల్ వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2003లో లేడీ లూయిస్, 2007లో జేమ్స్ వీరికి జన్మించారు.

రాయల్ మెరైన్స్ కొంత కాలం పనిచేసిన తర్వాత, సొంత టీవీ ప్రొడక్షన్ కంపెనీని ప్రిన్స్ ప్రారంభించారు.

రాణికి అధికారిక కార్యక్రమాల్లో ప్రిన్స్ సాయం చేసేవారు. ప్రజా కార్యక్రమాల్లోనూ ఆయన పాలుపంచుకునేవారు.

సింహాసనాన్ని అధిష్టించే రాజ కుటుంబ వారసుల జాబితాలో ప్రిన్స్ ఎడ్వర్డ్ 13వ వారు.

14. జేమ్స్, విస్కౌంట్ సెవెర్న్

జననం: 2007

జేమ్స్, విస్కౌంట్ సెవెర్న్

ఫొటో సోర్స్, PA

ఎర్ల్, కౌంటెస్ ఆఫ్ వెసెక్స్‌ల చిన్న కుమారుడు జేమ్స్. తమ పిల్లలకు ప్రిన్స్ లేదా ప్రిన్సెస్ అని పిలిచేందుకు బదులుగా సన్స్ లేదా డాటర్స్ ఆఫ్ ఎర్ల్‌గా పిలవాలని జేమ్స్ తల్లిదండ్రులు భావించారు. ముఖ్యంగా రాజ కుటుంబ టైటిల్ బరువు బాధ్యతలు పిల్లలపై పడకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

15. లేడీ లూయిస్

జననం: 2003

లేడీ లూయిస్

ఫొటో సోర్స్, PA Media

ఎర్ల్, కౌంటెస్ ఆఫ్ వెసెక్స్‌ల కుమార్తె లేడీ లూయిస్. సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో తమ్ముడి కంటే ఆమె వెనుకన ఉన్నారు. ఎందుకంటే అక్క కంటే ముందు తమ్ముడినే వారసుల వరసలో నిలబెట్టే చట్టాన్ని ఆమోదించక ముందు ఆమె జన్మించారు.

16. ద ప్రిన్సెస్ రాయల్

జననం: 1950

ద ప్రిన్సెస్ రాయల్

ఫొటో సోర్స్, Getty Images

క్వీన్ ఎలిజబెత్‌కు రెండో సంతానంతోపాటు ఏకైక కుమార్తె అన్నె. జన్మించేటప్పుడు సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితో అన్నె మూడో వ్యక్తిగా ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆమె 16వ స్థానానికి వచ్చారు. 1987లో ప్రిన్సెస్ రాయల్ టైటిల్‌ను ఆమెకు ఇచ్చారు.

ప్రిన్సెస్ అన్నెకు రెండుసార్లు వివాహమైంది. మొదటగా కెప్టెన్ మార్క్ ఫిలిప్స్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత వైస్ అడ్మిరల్ టొమోతీ లారెన్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.

స్వచ్ఛంద సంస్థ సేవ్ ద చిల్డ్రన్‌కు 1970 నుంచీ ఆమె అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

17. పీటర్ ఫిలిప్స్

జననం: 1977

పీటర్ ఫిలిప్స్

ఫొటో సోర్స్, Getty Images

క్వీన్ మనవళ్లలో పీటర్ ఫిలిప్స్ పెద్దవారు. కెనడాకు చెందిన ఆటమ్ కెల్లీని 2008లో ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2010లో సవానా, 2012లో ఇస్లా వీరికి జన్మించారు.

ప్రిన్సెస్ రాయల్ పిల్లలకు ఎలాంటి టైటిల్స్ లేవు. ఎందుకంటే వీరు రాణి కుమార్తె ద్వారా జన్మించారు.

2020 ఫిబ్రవరిలో పీటర్ ఫిలిప్స్, ఆయన భార్య విడిపోతున్నట్లు ప్రకటించారు.

18. సవానా ఫిలిప్స్

జననం: 2010

సవానా ఫిలిప్స్

ఫొటో సోర్స్, PA Media

2010లో సవానా జన్మించారు. ఆమె పీటర్, ఆటమ్ ఫిలిప్స్‌ల పెద్ద కుమార్తె. క్వీన్ తొలి ముని మనవరాలు.

19. ఇస్లా ఫిలిప్స్

జననం: 2012

ఇస్లా ఫిలిప్స్

ఫొటో సోర్స్, PA Media

2012లో ఇస్లా జన్మించారు. పీటర్, ఆటమ్ ఫిలిప్స్‌ల రెండో కుమార్తె ఇస్లా.

20. జారా టిండల్

జననం: 1981

జారా టిండల్

ఫొటో సోర్స్, Getty Images

తల్లి అన్నెలానే జారా టిండల్‌కు కూడా స్పోర్ట్స్ అంటే చాలా అభిమానం. 2012 లండన్ ఒలింపిక్స్‌లో హార్స్ రైడింగ్‌లో ఆమెకు రజత పతకం వచ్చింది. ఇంగ్లండ్ మాజీ రగ్బీ ప్లేయర్ మైక్ టిండల్‌ను 2011లో ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరికి 2014లో మియా గ్రేస్ జన్మించారు.

ప్రిన్స్ రాయల్ పిల్లలకు ఎలాంటి రాజ కుటుంబ టైటిల్స్ లేవు. ఎందుకంటే వీరు రాణి కుమార్తె ద్వారా జన్మించారు. అయితే, సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో ఆమె 20వ వారు.

ప్రిన్సెస్ అన్నెను పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన ఎర్ల్‌డమ్‌ను మార్క్ ఫిలిప్స్ తిరస్కరించారు. దీంతో వీరి పిల్లలకు ఎలాంటి మర్యాద పూర్వక టైటిల్స్ లేవు.

21. మియా గ్రేస్ టిండల్

జననం: 2014

మియా గ్రేస్ టిండల్

ఫొటో సోర్స్, Getty Images

క్వీన్ మనవరాలు జారా టిండల్ 2014 జనవరిలో మియా గ్రేస్‌కు జన్మనిచ్చారు.

22. లీనా ఎలిజబెత్ టిండల్

జననం: 2018

లీనా ఎలిజబెత్ టిండల్

ఫొటో సోర్స్, PA Media

జారా టిండల్ రెండో కుమార్తెగా 2018 జూన్ 18న స్ట్రౌడ్ మెటర్నిటీ యూనిట్‌లో లీనా జన్మించారు.

క్వీన్ ఎలిజబెత్ పేరునే లీనాకు కూడా పెట్టారు.

అక్కలానే లీనాకు కూడా ఎలాంటి రాజ కుటుంబ టైటిల్స్ లేవు. వీరిని మిస్ టిండల్‌గా పిలుస్తుంటారు.

23. లూకస్ ఫిలిప్ టిండల్

జననం: 2021

జారా, మైక్ టిండల్‌ల కుమారుడు లూకస్ ఫిలిప్. క్వీన్ పదవ ముని మనవడైన లూకస్ 2021 మార్చి 21న జన్మించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)