బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
ఆమె చార్లెస్ జీవితంలో యుక్త వయసు నుంచే ప్రేమికురాలు, నమ్మకమైన సహచరి. 17ఏళ్లుగా ఆయన భార్యగా ఉన్న కామిలా ప్రస్తుతం క్వీన్ కన్సొర్ట్ అయ్యారు.
ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, ఉత్సవాల సమయంలో కామిలాను కింగ్ చార్లెస్ పక్కనే చూసేందుకు ప్రజలు అలవాటుపడ్డారు. కానీ, తనకు ప్రజల ఆమోదం అంత సులభంగా లభించలేదని కామిలా కూడా అంగీకరిస్తారు.
కామిలా పార్కర్ బౌల్స్ అని పిలుస్తూ ఆమెను బహిరంగంగా దూషించిన సందర్భాలు ఉన్నాయి. ఈ శతాబ్ధంలోనే అతి పెద్ద వివాహ బంధం తెగిపోవడంలో కీలకపాత్ర పోషించిన మహిళగా ఆమెను విమర్శించేవారు. ఆమెను చార్లెస్ మొదటి భార్య డయానాతో నిత్యం పోల్చి చూస్తుండేవారు.

ఫొటో సోర్స్, Getty Images
చార్లెస్‌ను ఎంపిక చేసుకోవడంతో కామిలా జీవితం కూడా తారుమారయింది. కొన్నేళ్ల పాటు మీడియా ఆమెను వెంటాడింది. ఆమె వ్యక్తిత్వం, కనిపించే తీరుపై తరచుగా దాడి చేసేవారు. కానీ, కామిలా మాత్రం వీటన్నిటినీ తట్టుకుని నెమ్మదిగా రాజ కుటుంబంలో సీనియర్ మహిళా సభ్యురాలిగా తన స్థానాన్ని దృఢపరుచుకున్నారు.
ఆమె 20లలో ఉన్నప్పుడే ప్రిన్స్ చార్లెస్ మొదటి చూపులోనే ఆమెకు ఆకర్షితులయ్యారు. అయితే, ఎలిజబెత్ రాణి వీరి బంధాన్ని ఆమోదించేందుకు సమయం పట్టింది. చివరకు ఎటువంటి షరతులు లేకుండా ఆమె కామిలాను ఆమోదించారు.
"కొత్త రాణికి ప్రజల నుంచి పూర్తి ఆమోదం లభించకపోవచ్చు. నేను వీటన్నిటినీ దాటి జీవితంలో ముందుకు సాగడానికి అలవాటు పడ్డాను" అని వోగ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామిలా స్వయంగా చెప్పారు.
జులై 17న 1947లో కామిలా జన్మించారు. ఆమెది రాజకుటుంబం కాదు. సంపన్న, అత్యున్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న కుటుంబం.
ఆమె సస్సెక్స్‌లో ఫ్యామిలీ ఎస్టేట్‌లో ప్రేమతో కూడిన వాతావరణంలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో ఆడుకుంటూ పెరిగారు.
ఆమె తండ్రి బ్రూస్ షాన్డ్, సైన్యంలో పని చేసి పదవీ విరమణ చేశారు. తల్లి రోసాలిండ్ పిల్లలను స్కూలుకు తీసుకుని వెళ్లి రావడం, వాళ్ల పనులు చూసుకోవడం, పిల్లలను బీచ్‌కు తీసుకెళ్లడం లాంటివి చేసేవారు. చార్లెస్‌తో పోలిస్తే ఆమెది భిన్నమైన బాల్యం.
చార్లెస్ తల్లితండ్రులు ఎక్కువ సమయం విదేశీ పర్యటనల్లో గడుపుతూ ఉండటంతో ఆయన బాల్యం చాలా వరకు ఒంటరిగా సాగింది.
కామిలా లండన్‌లో ప్రముఖుల జాబితాలో చేరారు. 60ల మధ్య నాటికి ఆండ్రూ పార్కర్ బౌల్స్‌తో సంబంధాలను నెరుపుతూ ఉండేవారు.

ఫొటో సోర్స్, Frank Barratt / Getty Images
1970లలో ఆమెకు చార్లెస్‌తో పరిచయమయింది. చార్లెస్ జీవిత చరిత్ర రచయత జోనాథన్ డింబిల్‌బై "ఆమె చాలా ప్రేమతో ఉంటారు. ఊహించలేనంత గాఢత నిండిన ప్రేమతో ఆమె తొలి చూపులోనే చార్లెస్ మనసును దోచుకున్నారు" అని రాశారు.
కానీ, వారిద్దరూ కలిసిన సమయం సరైంది కాదు. చార్లెస్ ఇంకా 20లలోనే ఉన్నారు. ఆయన నేవీలో కెరీర్‌ను ఏర్పరుచుకుంటున్నారు.
ఆయన 1972 చివర్లో విదేశాల్లో పని చేసేందుకు వెళ్లారు. ఆయన విదేశాల్లో ఉండగా, ఆండ్రూ కామిలాకు ప్రతిపాదన చేశారు.
ఆమె వెంటనే ఆ ప్రతిపాదనను ఆమోదించారు. చార్లెస్ కోసం ఎందుకు ఎదురు చూడకూడదని ఆమె స్నేహితులు చెప్పినప్పటికీ, ఆమె తనను తాను క్వీన్ కన్సొర్ట్ అయ్యే అర్హత ఉన్నట్లుగా ఎన్నడూ ఊహించలేదు.
కానీ, వీరిద్దరూ ఒకరి జీవితాల్లో ఒకరున్నారు. ఇద్దరూ ఒకే విధమైన సామాజిక హోదా ఉన్న వర్గాల్లో తిరుగుతూ ఉండేవారు.
చార్లెస్, ఆండ్రూ కలిసి పోలో ఆడేవారు. వాళ్ల మొదటి కొడుకు టామ్‌కు చార్లెస్‌ను గాడ్ ఫాదర్‌గా ఉండమని కూడా కామిలా దంపతులు కోరారు.
పోలో ఆట సమయంలో కలిసినప్పుడు చార్లెస్, కామిలా ఫోటోలు చూస్తే వారి మధ్యనున్న సాన్నిహిత్యం తెలుస్తుంది.
1981 వేసవి నాటికి చార్లెస్ డయానాను కలిసి ఆమెకు ప్రతిపాదన చేశారు. కానీ, అప్పటికే కామిలా ఆయన జీవితంలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కామిలా కోసం చార్లెస్ తయారు చేయించిన బ్రేస్‌లెట్‌లో వారి ముద్దు పేర్లు ఫ్రెడ్ , గ్లేడీస్‌లకు సంకేతంగా ఎఫ్, జీ అనే అక్షరాలు ఉండటంతో పెళ్లికి రెండు రోజుల ముందు కూడా డయానా పెళ్లిని రద్దు చేయమని కోరినట్లు రచయత ఆండ్రూ మోర్టన్ 'హర్ ట్రూ స్టోరీ'లో రాశారు.
చార్లెస్‌కు కామిలాతో ఉన్న సంబంధం వల్ల డయానా ఇబ్బంది పడ్డారనే విషయంలో సందేహం లేదు. కానీ, చార్లెస్ మాత్రం డయానాతో విడిపోయిన తర్వాతే కామిలాతో ప్రేమలో పడినట్లు చెబుతారు.
1995లో డయానా పనోరమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ వివాహంలో ముగ్గురు వ్యక్తులున్నారని చెప్పారు. ఈ ఇంటర్వ్యూ విషయంలో తలెత్తిన వివాదంతో వాటిని తొలగించాల్సి వచ్చింది.
చార్లెస్, కామిలా ...ఇరువురి వైవాహిక బంధాల్లో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కొన్ని పత్రికలు 1989లో రికార్డ్ చేసిన రహస్య ఫోన్ కాల్ లో వివరాలను నాలుగేళ్ల తర్వాత వెల్లడించాయి. తనకు కామిలా టాంపోన్(మహిళలు నెలసరి సమయంలో వాడే ఒక రకమైన ప్యాడ్ ) గా ఉండాలని ఉందంటూ చార్లెస్ వ్యక్తపరిచిన కోరిక వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టింది.
కామిలా 1995లో విడాకులు తీసుకున్నారు. చార్లెస్, డయానా విడాకులు కూడా 1996 నాటికి పూర్తయ్యాయి.
ఇది కామిలాకు చార్లెస్‌తో ఉండాలనే కోరికకు సంకేతం. వీరి బంధం పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయింది. ఆమె కుటుంబం కూడా ముక్కలయింది. ముఖ్యంగా ఆమె పిల్లలు టామ్, లారాల పై ఇది ప్రభావం చూపించింది.
విల్ట్‌షైర్‌లో ఉన్న ఆమె కుటుంబం ముందు పత్రికల వాళ్లు పొదల్లో దాక్కుని వేచి చూసేవారని టామ్ పార్కర్ చెప్పారు.
"మా మనసులు గాయపరిచే విధంగా మా కుటుంబం గురించి చెప్పేందుకు ఇంకేమి మిగిలిలేదు. మా అమ్మను వేలెత్తి చూపేందుకు ఏమీ లేదు" అని ఆయన 2017లో టైమ్స్ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
"నిరంతరం ఇతరుల దృష్టి తమ పై ఉండాలని ఎవరూ అనుకోరు. ఇలాంటి పరిస్థితులతో కలిసి బ్రతికేందుకు ఏదో దారి వెతుక్కోవాలి" అని కామిలా అప్పటి రోజుల గురించి మాట్లాడుతూ అన్నారు.
డయానా మరణం తర్వాత ఎదురైన విమర్శలను ఎదుర్కోవడం మరింత కష్టంగా మారింది. చార్లెస్ తన పిల్లలు విలియం, హ్యారీల పై దృష్టి పెట్టారు. కామిలా బయటకు కనిపించడం మానేశారు. కానీ, చార్లెస్, కామిలా మధ్య సంబంధం మాత్రం కొనసాగింది.
కామిలా తన జీవితంలో ఉండటం తిరుగు లేని విషయమని చార్లెస్ అంటారు. ప్రజల దృష్టిలో ఆమె ప్రతిష్టను పెంచేందుకు జాగ్రత్తగా ప్రచారాన్ని నిర్వహించారు. 2005లో కామిలా, చార్లెస్ వివాహం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, ఊహించినట్లుగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురు కాలేదు. వారికి హార్దిక స్వాగతాలు, అభివాదాలు లభించాయి. కానీ, ఆమె ఎప్పటికైనా క్వీన్ అనిపించుకోగలరా లేదా అనే విషయం పట్ల మాత్రం చాలా సందేహాలు తలెత్తాయి.
క్వీన్ అనే బిరుదును వాడేందుకు ఆమెకు అధికారికంగా హక్కు ఉన్నప్పటికీ, ఆమెను ప్రిన్సెస్ కన్సొర్ట్ అని మాత్రమే వాడాలని అధికార వర్గాలు సూచించాయి.
ఇదంతా ఆమెను విమర్శించిన వారిని తృప్తిపరిచేందుకు అవలంబించిన వైఖరి.
చివరకు 2022లో క్వీన్ ఎలిజబెత్ సమయం వచ్చినప్పుడు కామిలాను క్వీన్ కన్సొర్ట్ అని పిలవాలని ప్రకటించారు. చార్లెస్ పక్కన నిలబడే స్థానాన్ని సంపాదించుకున్నారనడానికి ఈ ప్రకటన నిదర్శనం. దీంతో, బహిరంగ చర్చలకు తెర పడింది.
కామిలా విషయంలో రాణి మొదట్లోనే జాగ్రత్తగా వ్యవహరించి ఉండి ఉంటే ప్రిన్స్ విలియం హ్యారీల పరిస్థితి మరోలా ఉండేదేమో. వారు తల్లిదండ్రుల విడాకులు, తల్లి మరణాన్ని చూడాల్సి వచ్చింది. డయానా మరణించే నాటికి విలియంకు 15ఏళ్లు, హ్యారీకి 12 ఏళ్లు.

ఫొటో సోర్స్, Getty Images
2005లో వారి పెళ్ళైన కొన్ని నెలల తర్వాత 21 ఏళ్ల హ్యారీ "మా తండ్రిని సంతోషపెట్టిన అద్భుతమైన మహిళ కామిలా" అని వ్యాఖ్యానించారు. "నేను, విలియం ఆమెను ప్రేమిస్తాం. ఆమెతో సన్నిహితంగా మెలుగుతాం" అని అన్నారు.
ఆ తర్వాత ఆమె గురించి సోదరులిద్దరూ ఎటువంటి ప్రకటనలు చేయలేదు.
కానీ, బహిరంగ కార్యక్రమాలు జరిగినప్పుడు విలియం భార్య క్యాథరీన్ , కామిలా ఒకరితో ఒకరు వ్యవహరించే తీరు వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు కనిపించేవి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Chris Jackson / Getty images
70లలో ఉన్న కామిలా జీవితం ఆమె భర్తకు సహకారం అందించడం, కుటుంబాన్ని చూసుకోవడం చుట్టూ తిరుగుతుంది.
కామిలా ఐదుగురు మనవలు మనవరాళ్లకు మామ్మ కూడా.
ఆమె విల్ట్‌షైర్, రే మిల్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోవడానికి వెళుతూ ఉంటారు.
"ఆమెకు సహకారం అందించే కుటుంబం, స్నేహితులు ఉన్నారు" అని ఆమె మేనల్లుడు బెన్ఎలియట్ వ్యానిటీ ఫెయిర్ పత్రికకు చెప్పారు.
"ఆమె భర్తను, పిల్లలను, మనుమలు, మానమరాళ్ళను ప్రేమిస్తారు. ఆమెకు ఆసక్తి ఉన్న రంగాల్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు."
కోవిడ్ సమయంలో తన మనవలు, మానవరాళ్లను దగ్గరకు తీసుకోలేని పరిస్థితుల పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆమె ఇతరులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించగలరు. ఉత్కంఠ రేపే ప్రసంగాలు చేస్తారు. ఆమె చాలా మంది నమ్మకాన్ని గెలుచుకున్నారు.
చార్లెస్, కామిలా 17 ఏళ్లుగా దంపతులుగా ఉన్నారు. బహిరంగ కార్యక్రమాల్లో వారిద్దరూ సన్నహితంగా ఉన్నట్లు కనిపిస్తూనే ఉంటుంది
"వారికి ఒకరి పై ఒకరికి ప్రేమ, గౌరవం ఉన్నాయి" అని ఎలియట్ వ్యానిటీ ఫెయిర్‌కు చెప్పారు.
"వారు విలాసవంతమైన జీవితాలు గడుపుతారు. కానీ, వారి జీవితాలపై నిశితమైన పర్యవేక్షణ ఉంటుంది. వీరికి తట్టుకోలేనంత ఒత్తిడి కూడా ఉంటుంది" అని అన్నారు.
"మనతో పాటు ఎప్పుడూ ఎవరో ఒకరు పక్కనే ఉండటం బాగుంటుంది" అని ప్రిన్స్ చార్లెస్ సిఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఇచ్చే సహకారం ఎనలేనిది. ఆమె జీవితంలో పాజిటివ్ అంశాలను మాత్రమే చూస్తారు. ఇందుకు దేవుడికి ధన్యవాదాలు" అని అన్నారు.
"కొన్ని సార్లు చీకట్లో నౌకలు ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది" అని ఆమె తన జీవితం గురించి అన్నారు. ‘‘కానీ, మేమెప్పుడూ కలిసి కూర్చుని టీ తాగుతూ రోజులో జరిగిన సంఘటనలను చర్చించుకుంటాం. కొన్ని క్షణాలను కలిసి గడుపుతాం" అని అన్నారు.
రాజు జీవితం ఒంటరిగా ఉంటుంది. ఆయన బాధ్యతలు చేపట్టబోయే పాత్రలో కామిలా మాత్రమే ఆయనకు సాహచర్యం ఇవ్వగలరని భావించడం వల్లే ఆమెను వదులుకోవడానికి ఆయన ఇష్టపడకపోయి ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











