బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ 3 అధికారిక ప్రకటన.. తొలిసారి టీవీల్లో ప్రసారమైన చారిత్రక కార్యక్రమం

ఫొటో సోర్స్, PA Media
చార్లెస్ 3ని అధికారికంగా బ్రిటన్ రాజుగా ప్రకటించారు. లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో చారిత్రక వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
శనివారం ఉదయం సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా టీవీల్లో ప్రసారం చేశారు.
రాణి మరణానంతరం సంతాప సూచకంగా అవనతం చేసిన పతాకాన్ని, కొత్త కింగ్ ప్రకటన వేడుకల సందర్భంగా పూర్తిగా ఎగురవేశారు.
యూకే అంతటా ఆదివారం వరకు ఈ తతంగం కొనసాగుతుంది. అయితే, జెండాలను మళ్లీ సగానికి అవనతం చేస్తారు. సంతాప దినాలు ముగిసేంతవరకు పతాకాన్ని పూర్తిగా ఎగురవేయరు.
సెప్టెంబర్ 8న క్వీన్ ఎలిజబెత్ 2 మరణించినట్లు బకింగ్‌హమ్ ప్యాలెస్ ప్రకటించింది.
చార్లెస్ 3ని బ్రిటన్ కొత్త రాజుగా యాక్సెషన్ కౌన్సిల్ ప్రకటించింది. పూర్తిగా సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో కింగ్ చార్లెస్ 3 ప్రమాణ స్వీకారం చేశారు. గత 70 ఏళ్లుగా ఈ వేడుక జరగలేదు.

అధికారిక ప్రకటన (ప్రొక్లమేషన్) అంటే ఏంటి?
1701 సెటిల్మెంట్ యాక్ట్ నిబంధనల ప్రకారం తన తల్లి క్వీన్ ఎలిజబెత్ 2 మరణానంతరమే చార్లెస్, బ్రిటన్ తదుపరి రాజు అయ్యారు.
'యుక్సెషన్ కౌన్సిల్' నిర్వహించిన ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే... బ్రిటన్ కొత్త రాజును అధికారికంగా ప్రకటించడం మాత్రమే. ఇదొక వేడుక లాంటిది.
సాధారణంగా రాజు లేదా రాణి మరణించిన 24 గంటల్లోగా ఈ వేడుక జరగాలి. కానీ, ఈసారి ఇది కాస్త ఆలస్యంగా జరిగింది. బకింగ్‌హమ్ ప్యాలెస్‌కు అతి సమీపంలో ఉండే సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో అధికారిక ప్రకటన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రసారం చేయాలని కింగ్ చార్లెస్ 3 నిర్ణయించారు. ఇలా చేయడం ఇదే మొదటిసారి.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరు పాల్గొన్నారు?
క్లెర్గీ సభ్యులతో పాటు ప్రైవీ కౌన్సిల్ సభ్యులు మొత్తం 200 మందికి పైగా సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రైవీ కౌన్సిల్‌లో రాణి లేదా రాజు సలహాదారుల బృందం. ఇందులో ఎక్కువగా రాజకీయవేత్తలు ఉంటారు. ఈ కౌన్సిల్, నార్మన్ కింగ్స్ కాలం నాటిది. ఇందులో 700 మంది సభ్యులు ఉంటాయి. అయితే, 200 మందిని మాత్రమే ఆహ్వానించారు.
యూకే మాజీ ప్రధానులు గోర్డెన్ బ్రౌన్, డేవిడ్ కామెరాన్, బోరిస్ జాన్సన్, థెరిసా మే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. లండన్ నగర మేయర్, సీనియర్ జడ్జిలు, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు.
కింగ్ చార్లెస్3 భార్య, 'క్వీన్ కన్సొర్ట్' కామిలా పార్కర్ బౌల్స్‌తో పాటు ఆయన కుమారుడు 'ప్రిన్స్ ఆఫ్ వేల్స్' విలియం కూడా హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
తొలి భాగం: కొత్త రాజు పేరు ప్రకటన
యాక్సెషన్ కౌన్సిల్ కార్యక్రమం రెండు భాగాలుగా జరిగింది.
మొదటి భాగంలో లార్డ్ ప్రెసిడెంట్ పెన్నీ మోర్డాంట్, రాణి మరణం గురించి ప్రకటన చేశారు.
తర్వాత ఆమె, యాక్సెషన్ ప్రొక్లమేషన్ (ప్రకటన)ను చదవాల్సిందిగా 'క్లర్క్ ఆఫ్ కౌన్సిల్' ను కోరారు. ఇది చార్లెస్ 3ని తదుపరి కింగ్ అని చెప్పే ప్రకటన.
ఇది చదవగానే అక్కడ ఉన్న 200 మంది 'గాడ్ సేవ్ ద కింగ్' అని నినాదాలు చేశారు.
ఇదంతా ప్రిన్స్ విలియం, ప్రధాని లిజ్ ట్రస్, ఆర్చ్‌బిషప్ జస్టిన్ వెల్బీ చూస్తుండగా జరిగింది.

ఫొటో సోర్స్, PA Media
ఆ తర్వాత ఈ అధికారిక ప్రకటన పత్రంపై రాజకుటుంబ సభ్యులు, ప్రధాని, కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్, లార్డ్ చాన్స్‌లర్, ఈర్ల్ మార్షల్ సంతకం చేశారు.
బెల్‌ఫాస్ట్, కార్డిఫ్, ఎడిన్‌బరాలతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ అధికారిక ప్రకటనను చదివి వినిపించారు.
రెండో భాగం: కింగ్ ప్రసంగం
ఈ కార్యక్రమం రెండో భాగంలో కొత్త రాజుకు ప్రైవీ కౌన్సిల్ శుభాకాంక్షలు తెలిపింది.
ఆయన రాకకు స్వాగతం పలికేందుకు కౌన్సిలర్లు అంతా వరుసలో నిల్చున్నారు. రాజు వస్తుండగా ఎవరూ కూర్చోకూడదనే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వారంతా నిలబడ్డారు.

ఫొటో సోర్స్, PA Media
కౌన్సిల్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ కింగ్ చార్లెస్ 3, రాణిగా తన ప్రియమైన తల్లి చేసిన సేవ గురించి మాట్లాడారు. ఆమె అడుగుజాడల్లోనే తాను కూడా నడుస్తానని ప్రతిజ్ఞ చేశారు.
''మనం పూడ్చలేని లోటు ఏర్పడింది. ఈ సమయంలో నాతో పాటు ప్రపంచం మొత్తం నిట్టూర్చుతోంది. పాలించిన సమయం, అంకిత భావం, భక్తి పరంగా చూస్తే నా తల్లి పాలన అసమానమైనది. ఆమెకు కృతజ్ఞులుగా ఉండాలి'' అని కింగ్ చార్లెస్ 3 అన్నారు.
తన కొత్త బాధ్యతల గురించి కూడా ఆయన మాట్లాడారు.
''నాకు కొత్తగా అప్పగించిన ఈ బాధ్యతలు, విధులతో పాటు లోతైన వారసత్వం గురించి నాకు పూర్తి అవగాహన ఉంది'' అని అన్నారు.
''నా ప్రియమైన భార్య నన్ను నిరంతరం ప్రోత్సహించారు'' అని తన భార్య, క్వీన్ కన్సొర్ట్ కామిలాను ఉద్దేశించి అన్నారు.

ఫొటో సోర్స్, PA Media
కింగ్ చార్లెస్ ఏమని ప్రమాణం చేశారు?
యూనియన్ యాక్ట్ నిబంధనల ప్రకారం కొత్త రాజు, స్కాట్లాండ్ చర్చిని సంరక్షిస్తాననే ప్రమాణం చేయాల్సి ఉంటుంది.
ఎందుకంటే స్కాట్లాండ్‌లో చర్చి, ప్రభుత్వాల మధ్య అధికార విభజన ఉంటుంది.
ప్రైవీ కౌన్సిల్ ఎదుట ప్రమాణానికి సంబంధించిన రెండు కాపీలపై చార్లెస్ సంతకం చేశారు. ప్రిన్స్ విలియం, కామిలా కూడా సాక్షులుగా దీనిపై సంతకాలు పెట్టారు.
మిగతా సాక్షులు సంతకాలు పెట్టే సమయంలో బ్యాండ్ మోగడం మొదలైంది.

ఫొటో సోర్స్, PA Media
బాల్కనీలో ఏం జరిగింది?
కింగ్ చార్లెస్ 3 ప్రొక్లమేషన్ వేడుకను చూడటం కోసం ప్రజలు తరలి వచ్చారు.
సెయింట్ జార్జ్ ప్యాలెస్‌లోని ఫ్రైరీ కోర్ట్ బాల్కనీ పైనుంచి ప్రజల కోసం అధికారిక ప్రకటన చదివి వినిపించారు. అదే సమయంలో ట్రంపెట్స్ మోగిస్తూ రాయల్ సెల్యూట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
''పెంపుడు జంతువులు, పూల గుత్తులు, పసిపిల్లల్ని తీసుకొని ప్రజలు ఈ వేడుక కోసం తరలి వచ్చారు'' అని బీబీసీ ప్రతినిధి జేమ్స్ బ్రయాంట్ చెప్పారు.
ఏడు దశాబ్దాలలో తొలిసారిగా జాతీయ గీతాన్ని 'గాడ్ సేవ్ ద కింగ్' పేరుతో ఆలపించారు.
అనంతరం రాజు పేరిట జయ జయ ధ్వానాలు చేస్తూ వేడుకలు చేసుకున్నారు.
తర్వాత లండన్ నగరంలోని రాయల్ ఎక్స్‌చేంజ్ వద్ద కూడా ఈ ప్రకటనను చదివారు.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత ఏంటి?
''కింగ్... కామన్వెల్త్ అధిపతి, విశ్వాస రక్షకుడు'' అని ప్రైవీ కౌన్సిల్ చేసిన ప్రకటనతో ఈ వేడుక ముగిసింది.
తర్వాత పెన్సీ మోర్డాంట్, ప్రొక్లమేషన్ ఆమోదించాల్సిన డ్రాప్టులు చదవగా... ఒక్కొక్కటిగా వాటికి కింగ్ చార్లెస్ 3 ఆమోదం తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకానికి మరికొంత సమయం పట్టొచ్చు.
క్వీన్ ఎలిజబెత్ 2 తండ్రి కింగ్ జార్జ్ 6 మరణించిన 16 నెలల తర్వాత క్వీన్ పట్టాభిషేకం జరిగింది.
1952 ఫిబ్రవరిలో కింగ్ జార్జ్ మరణించగా, 1953 జూన్‌లో క్వీన్ పట్టాభిషిక్తురాలు అయ్యారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 జీవితం ఛాయాచిత్రాల్లో
- రాణి ఎలిజబెత్ అనంతరం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్
- సంస్మరణ: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2
- బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూత-ప్రకటించిన బకింగ్‌హమ్ ప్యాలెస్
- బ్రిటన్ రాణి నియమించిన ప్రధానమంత్రులు వీరే... ఫోటో ఫీచర్
- క్వీన్ ఎలిజబెత్ 2: కోట్ల మంది భారతీయుల హృదయాలను ఈ రాణి ఎలా గెలుచుకున్నారు
- క్వీన్ ఎలిజబెత్ 2: ప్రపంచ నేతల నివాళులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












