బ్రిటన్ రాచరికంలో కొత్త శకం.. సింహాసనానికి కింగ్ చార్లెస్ ప్రస్థానం సాగిందిలా..
రాణి ఎలిజబెత్ మరణం ఒక కొత్త శకానికి ప్రారంభసూచిక కూడా అవుతుంది. యునైటెడ్ కింగ్డమ్ సింహాసనాన్ని ఇప్పుడు కొత్త రాజు అధిరోహించారు. రాణి కుమారుడు, మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్ల్స్ ఇప్పుడు బ్రిటన్‌కు రాజు.
మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్... బ్రిటన్ సింహాసనాన్ని చేరుకోవటానికి ముందు సుదీర్ఘ ప్రస్థానం సాగించారు.
చాలా మంది పదవీ విరమణ గురించి ఆలోచించే వయసులో ఆయన ఎప్పటి నుంచో సంసిద్ధమవుతూ ఉన్న పాత్రలోకి చేరుకున్నారు.
దేశం యుద్ధం నుంచి కోలుకుంటున్న సమయంలో 1948లో ఆయన జన్మించారు. నాడు రాచ కుటుంబం ప్రతిష్ట ఉచ్ఛస్థితిలో ఉంది.
తల్లి ఎలిజబెత్ రాణిగా సింహాసనం అధిష్టించినపుడు ఆయన వయసు కేవలం నాలుగేళ్లు. భవిష్యత్తు గురించి అర్థం చేసుకోగల వయసు కాదు.
1969లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా అభిషిక్తుడై ప్రజా కర్తవ్యంలో దిగడం ఆయన జీవితంలో మరో మైలురాయి.
ఆయన రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి, విమానం నడపటం నేర్చుకున్నారు.
రాచరిక సంప్రదాయానికి అనుగుణంగా రాయల్ నేవీలో పనిచేశారు. చివరికి కోస్టల్ మైన్-హంటర్ హెచ్ఎంఎస్ బ్రోనింగ్టన్ నౌకకు కమాండర్ అయ్యారు.
రాచరిక వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం మీదకు కూడా ఆలోచనలు మళ్లాయి.
యువరాజుకు పలువురు మహిళలతో సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయి. వారిలో ఇద్దరు ముఖ్యులు.
కామిలా షాండ్‌ను ఆయన 1970లో కలిశారు. అపుడు ఆయన వయసు 22 ఏళ్లు.
ఆయన సంకోచంతో వెనక్కు తగ్గగా... కామిలా సైనికాధికారి ఆండ్రూ పార్కర్ బోవెల్స్‌ను పెళ్లాడారు.
బయటి ప్రపంచానికి సంబంధించినంతవరకూ, 1981లో లేడీ డయానా స్పెన్సర్‌తో చార్లెస్ వివాహం అసలుసిసలైన జానపద కథ వంటిది.
ఇద్దరు పిల్లలు - విలియం, హ్యారీ - పుట్టిన తర్వాత వీరు 1992లో విడిపోయారు.
ప్రజల్లో సానుభూతి స్పష్టంగా డయానా వైపే ఉంది. ఈ కథలో చార్లెస్‌ను విలన్‌గా చూశారు.
తన వ్యక్తిగత జీవితం మీద శూలశోధనకు దూరంగా.. చార్లెస్ బ్రిటిష్ సమాజానికి ఉపయోగపడే సేవ చేయాలని ఆరాటపడ్డారు.
పేద కుటుంబాల చిన్నారులకు సాయం కోసం 'ది ప్రిన్సెస్ ట్రస్ట్' అనే సేవా సంస్థను స్థాపించారు.
పర్యావరణం, భూతాపం వల్ల కలిగే ప్రమాదాలపై ఆందోళనలు వ్యక్తంచేసిన తొలి ప్రముఖుల్లో ఆయన ఒకరు.
అనేక పర్యావరణ ప్రశ్నల్లో కేవలం ఒకటి మాత్రమే. సముద్రాలు మురుగు కాల్వలుగా మారుతున్నాయి. మనం చాలా బలమైన విషాలు తయారు చేస్తున్నాం. వాటిని ఎక్కడ పెట్టాలో కూడా మనకు తెలియటం లేదు. వర్షారణ్యాలు ఎడారులుగా మారుతున్నాయి'' అని ఆయన గతంలో అన్నారు.
సేంద్రియ సేద్యం అనే ఆలోచన ప్రధాన స్రవంతిలోకి చేరటానికి చాలా ముందే ఆయన ప్రచారం చేశారు.
కొన్నిసార్లు ఆయన జోక్యం, ముఖ్యంగా ప్రత్యామ్నాయ వైద్యం, ఆధునిక భవన నిర్మాణశాస్త్రంలో ఆయన జోక్యం.. ప్రభుత్వాలకు కోపం తెప్పించాయి. కానీ ఆయన చింతించలేదు.
వివాదాస్పద అంశాలపై ఆయన ఉద్రేకంగా మాట్లాడతారు. అయితే ఇప్పుడు రాజు కావటంతో దాని మీద పరిమితులు తప్పవని ఆయన మద్దతుదారుల ఆందోళన.
చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ సుప్రీం గవర్నర్‌గా ఆయన పాత్ర విషయంలో కూడా ఆందోళన ఉంది.
ఆధ్యాత్మిక విషయాల్లో ఆయన ఆసక్తి రీత్యా.. మతానికి తను భవిష్యత్తు సంరక్షకుడినని చెప్పారు కానీ 'ఆ మతానికి' రక్షకుడిగా చెప్పలేదు. ఇది చర్చ్‌తో ఆయన సంబంధం మీద ఎలా ప్రభావం చూపుతుందో తెలీదు.
ఆయన ఎట్టకేలకు 2005లో కామిలాను పెళ్లాడారు. చార్లెస్ సుదీర్ఘ కాలంగా నిరీక్షించిన భార్య ఆమె.
కొత్త రాజు వయసు పైబడిన తర్వాత సింహాసనం అధిష్టించారు. కాబట్టి ఆయన పాలన సుదీర్ఘంగా ఉండకపోవచ్చు. ఏదేమైనా.. కిరీటం ఆయన వారసుడికి అందినపుడు రాచరికం స్థానాన్ని బట్టి ఈ కొత్త రాజు విజయం మీద తీర్పు వస్తుంది.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
- రాజ కుటుంబంలోని సభ్యులు ఎవరు, రాజు నిర్వర్తించే విధులు ఏంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: రాజు చార్లెస్ తర్వాత సింహాసనాన్ని అధిష్టించే వారసులు ఎవరు?
- రాయల్ బ్రాండింగ్: రాణి మరణంతో బ్రిటన్ కరెన్సీ నోట్లు, నాణేలు, స్టాంపులు, పాస్‌పోర్టుల్లో వచ్చే మార్పులేంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: కోట్ల మంది భారతీయుల హృదయాలను ఈ రాణి ఎలా గెలుచుకున్నారు
- సంస్మరణ: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)