క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?

బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు.
స్కాట్లండ్‌లోని బల్మోరల్ క్యాజిల్‌లో ఆమె తుది శ్వాస విడిచారు.
రాజ కుటుంబ సంప్రదాయంలో బ్రిటన్‌లో ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఆమె శవపేటికను ఎక్కడ ఉంచుతారు?
లండన్‌కు తీసుకొచ్చిన తర్వాత ఆమె శవపేటికను వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో నాలుగు రోజులపాటు ఉంచుతారు. అంత్యక్రియలకు ముందుగా ఆమె కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు కూడా నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పిస్తారు.
బ్రిటన్ వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లో అత్యంత పురాతనమైన కట్టడాల్లో వెస్ట్‌మినిస్టర్ హాల్ కూడా ఒకటి.
ఈ హాల్‌లో చివరిసారిగా 2002లో రాజ కుటుంబానికి చెందిన క్వీన్ తల్లి శవపేటికను ఉంచారు. అప్పట్లో 2,00,000 మందికిపైగా ప్రజలు ఆమెకు నివాళులు అర్పించారు.
మధ్యయుగంనాటి కలపతో 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ హాల్‌లో ‘‘క్యాటఫాక్’’గా పిలించే వేదికపై రాణి శవపేటికను ఉంచుతారు. రాజ కుటుంబానికి భద్రత కల్పించే సైనికులే ఈ శవపేటిక చుట్టూ రక్షణగా ఉంటారు.
బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి అంతిమ యాత్రగా రాణి శవ పేటికను తీసుకెళ్తారు. ఆమె వెంట రాజ కుటుంబ సభ్యులు వస్తారు. సైనిక కవాతు కూడా ఉంటుంది.
వీధుల గుండా అంతిమ యాత్ర కదిలేటప్పుడు ప్రజలు వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు లండన్ రాయల్ పార్కులలో కార్యక్రమాన్ని బ్రాడ్‌కాస్ట్ చేసేందుకు పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటుచేస్తారు.
రాయల్ స్టాండర్డ్ పతాకంలో ఆమె శవపేటికను చుడతారు. వెస్ట్‌మినిస్టెర్ హాల్‌కు చేరుకున్నాక దీనిపై ఇంపీరియల్ స్టేట్ క్రౌన్, ఆర్బ్, సెప్టెర్ ఉంచుతారు.
ఒకసారి హాల్‌కు శవపేటికను తీసుకొచ్చిన తర్వాత, ఆమెను చూసేందుకు ప్రజలకు అనుమతిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆమె అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారు?
వెస్ట్‌మినిస్టర్ అబేలో మరో రెండు వారాల్లో రాణి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ తేదీ ఎప్పుడు ఉంటుందో బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటిస్తుంది.
అబే ఒక చారిత్రక ప్రాధాన్యమున్న చర్చి. బ్రిటన్ రాజులు, రాణులు ఇక్కడే పట్టాభిషిక్తులవుతారు. ఎలిజబెత్ 2 కూడా 1953లో ఇక్కడే రాణిగా మారారు. మరోవైపు ప్రిన్స్ ఫిలిప్‌తో 1947లో ఆమె పెళ్లి కూడా ఇక్కడే జరిగింది.
అయితే, 18వ శతాబ్దం తర్వాత, అబేలో ఒక్క రాజ కుటుంబ అంత్యక్రియలు కూడా జరగలేదు. 2002లో రాణి తల్లి అంత్యక్రియలను కూడా ఇక్కడ చేపట్టలేదు.
రాణిని నివాళులు అర్పించేందుకు ప్రపంచ దేశాల నాయకులు రానున్న రోజుల్లో బ్రిటన్‌కు రాబోతున్నారు. బ్రిటన్‌కు చెందిన సీనియర్ నాయకులు, మాజీ ప్రధానులు కూడా రాజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తారు.

ఆ రోజు ఏం జరుగుతుంది?
అంత్యక్రియల రోజు రాణి శవపేటికను వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు తీసుకువస్తారు. రాయల్ నేవీకు చెందిన గన్ క్యారేజ్‌లో ఆమెను తీసుకెళ్తారు.
చివరిసారిగా 1979లో ప్రిన్స్ ఫిలిప్ బాబాయి లార్డ్ మౌంట్‌బ్యాటెన్‌ను చివరిసారిగా ఇలా క్యారేజ్‌లోి తీసుకెళ్లారు. దీన్ని నౌకా దళానికి చెందిన 142 మంది నావికులు తీసుకెళ్తారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త రాజుతోపాటు రాజ కుటుంబ సభ్యులంతా ఈ యాత్రలో పాల్గొనే అవకాశముంది.
వెస్ట్‌మినిస్టర్ డీన్ డేవిడ్ హోయల్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగే అవకాశముంది. కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ జస్టిన్ వెల్బీ సంతాప ప్రసంగాన్ని ఇస్తారు. మరోవైపు ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ కూడా ప్రసంగించే అవకాశముంది.

ప్రసంగాలు పూర్తైన తర్వాత రాణి శవపేటికను అబే నుంచి లండన్ హైడ్ పార్క్ కార్నర్‌లోని వెల్లింగ్టన్ ఆర్చ్‌కు తీసుకొస్తారు. అక్కడి నుంచి విండ్సర్‌కు తీసుకెళ్తారు.
ఆ రోజు మధ్యాహ్నం చివరగా విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌కు రాణి శవపేటికను తీసుకువస్తారు.

విండ్సర్ క్యాజిల్‌లోని క్వాడ్రాంగిల్‌లో జరిగే అంతిమ యాత్రలో రాజుతోపాటు రాజ కుటుంబం కూడా పాల్గొంటుంది. చివరగా శవపేటికను సెయింట్ జార్జ్ చాపెల్‌కు తీసుకెళ్తారు.
రాజ కుటుంబ వివాహాలు, అంత్యక్రియలు, నామకరణాలు, క్రైస్తవ మత స్వీకరణ లాంటి కార్యక్రమాలు ఎక్కువగా సెయింట్ జార్జ్ చాపెల్‌లో జరుగుతుంటాయి. ఇక్కడే ప్రిన్స్ హ్యారీ, మేఘన్ పెళ్లి చేసుకున్నారు. రాణి భర్త ఫిలిప్ అంత్యక్రియలు కూడా ఇక్కడే జరిగాయి.

సెయింట్ జార్జ్ చాపెల్‌లోని కింగ్ జార్జ్ 6 మెమోరియల్ చాపెల్‌లోకి తీసుకెళ్లిన తర్వాత చివరగా రాయల్ వాల్ట్‌లో రాణి శవపేటికను ఉంచుతారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











