ఆంధ్రప్రదేశ్-గుర్రగరువు: నెలల పసికందులు నిద్రలోనే ఊపిరి వదిలేస్తున్నారు... ఏమిటీ డెత్ మిస్టరీ?

గుర్రగరువు
ఫొటో క్యాప్షన్, బుదిలి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అది 2022 ఆగష్టు 22. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గుర్రగరువు గ్రామంలో నివాసం ఉంటున్న శాంతి, సింగారి ఇద్దరి ఇంట్లో మూడు నెలల వయసున్న ఆడ శిశువులు ఏడుస్తూ ఉన్నారు.

వారికి పాలు ఇచ్చిన తల్లులు, కాసేపు ఆ బిడ్డలను ఆడించి నిద్రపుచ్చారు. గంట తర్వాత సింగారి ఇంట్లో శిశువు మరణించింది. అది జరిగిన కొద్ది సేపటికే శాంతి ఇంట్లో చిన్నారి కూడా ప్రాణాలు విడిచింది.

దీనికి దాదాపు నెల రోజుల ముందు కూడా గుర్రగరువు గ్రామంలో మూడు నెలల మగ శిశువు ప్రాణం కూడా ఇలాగే పోయింది. 2019-2021 మధ్య పెదబయలు మండలం రూఢకోట గ్రామంలోనూ ఇలాంటి శిశువులు 12 మంది చనిపోయారు. రెండు గ్రామాల్లోనూ చనిపోయిన శిశువుల వయసు మూడు నుంచి ఆరు నెలలలోపే.

మిస్టరీగా మారిన శిశు మరణాలు సంభవిస్తున్న గుర్రగరువు గ్రామంలో బీబీసీ తెలుగు పర్యటించింది. గతంలో రూఢకోటలో కానీ, ప్రస్తుతం గుర్రగరువు గ్రామాల్లో మరణిస్తున్న శిశువులంతా మూడు నుంచి ఆరు నెలల వయసున్న శిశువులే. అలాగే ఈ మరణాలన్నీ అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజాముకు మధ్య జరిగినవే.

గుర్రగరువు
ఫొటో క్యాప్షన్, సింగారి, ప్రవీణ్ కుమార్

‘పడుకుందని అనుకున్నా.. ప్రాణం పోయిందని తెలియలేదు’

గుర్రగరువు గ్రామంలో పాంగి ప్రవీణ్‌, సింగారి...శాంతి, గోవింద్...సురేష్, కొండమ్మ దంపతులకు పుట్టిన బిడ్డలు మూడు నెలల వయసులోపే మరణించారు. ఈ మరణాల తర్వాత ప్రస్తుతం గ్రామంలో కొందరు శిశువులు జ్వరాలతో బాధపడుతుండగా...కొందరు తల్లులు కూడా గత రెండు నెలల్లో జ్వరాలతో బాధపడ్డారు. ఈ పరిస్థితుల్లో గ్రామంలో చిన్నారులు ఉన్న ఇంట్లో ఏ క్షణం ఏ జరుగుతుందోననే ఆందోళన కనిపించింది.

“ఆ రోజు రాత్రి పాప బాగా ఏడ్చింది. అలా రాత్రి రెండు గంటలు దాటే వరకు ఏడుస్తూనే ఉంది. తెల్లవారుజామున పాలు పట్టాను. మళ్లీ ఏడుస్తూనే ఉంది. ఎలాగో తెల్లవారుతోంది కదా ఆసుపత్రికి తీసుకుని వెళ్దామని నేను రెడీ అవుతున్నాను. ఇంతలో పాప ఏడుపు వినిపించలేదు. పడుకుందేమోనని అనుకున్నాను. కాసేపటికి దగ్గరకి వెళ్లి చూస్తే పాప చనిపోయిందనే విషయం తెలిసింది” అని గుర్రగరువు గ్రామానికి చెందిన శాంతి బీబీసీతో చెప్పారు. ఈ విషయం చెప్తున్నంత సేపు శాంతి కన్నీళ్లు ఆగలేదు.

గుర్రగరువు
ఫొటో క్యాప్షన్, శాంతి, గోవింద్

‘మళ్లీ పిల్లలను కనాలంటే భయంగా ఉంది’

శాంతి ఇంటికి దిగువనే ఉన్న సింగారి ఇంటికి వెళ్లాం. సింగారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. కానీ, ఆమె ఎక్కువగా మాట్లాడలేకపోయారు. అయితే తమ ఇంట్లో మూడు నెలల బిడ్డ చనిపోయిన రోజు పరిస్థితిని సింగారి భర్త ప్రవీణ్ కుమార్ బీబీసీకి వివరించారు. మాట్లాడుతూ, మాట్లాడుతూ ప్రవీణ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

“నాన్న నాన్నా... పాపకు ఊపిరాడటం లేదు, ఏమైందో చూడు అంటే, నాన్న వచ్చి చూశారు. అప్పటికే పాప చనిపోయింది. అంతకు ముందే పాపకు నా భార్య పాలు ఇచ్చి పడుకోబెట్టింది. పడుకోబెట్టిన కొద్ది సేపటికే ఇలా జరిగింది. ఇప్పుడు పిల్లలను కనడానికి కూడా మాకు ధైర్యం చాలడం లేదు. మళ్లీ బిడ్డను కన్నా కూడా ఇలాగే అవుతుందేమోనని భయంగా ఉంది” అని గుర్రగురువు గ్రామస్థుడు ప్రవీణ్ కుమార్ తడి చేరిన కళ్లతో చెప్పారు.

గుర్రగరువు

ప్రవీణ్ మళ్లీ పిల్లలు కనాలంటేనే భయంగా ఉందని చెప్పగానే అసలు గ్రామంలో ఎంత మంది గర్భిణులు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం. స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడ రిజిస్టర్‌లో నమోదైన గర్భిణుల పేర్లు చూశాం. ఆరుగురు ఉన్నారు. అందులో బుదిలి అనే గర్భిణి ఇంటికి వెళ్తుంటే.. ఆమె తన మూడేళ్ల బాబును తీసుకుని అంగన్వాడీ కేంద్రం వద్దకు వస్తున్నారు. మిగతా ఐదుగురు గర్భిణులు పొలం పనులకు వెళ్లారని ఆమె చెప్పారు.

గుర్రగరువు

‘పుట్టబోయే బిడ్డలు ఏమవుతారనే భయం ఉంది’

గ్రామ రికార్డుల ప్రకారం గ్రామంలో 110 కుటుంబాలకు చెందిన 390 మంది జీవనం సాగిస్తున్నారు. వీరంతా కొందు తెగకు చెందిన గిరిజనం. ఈ తెగకు చెందిన వారు గిరిజన ఆచార వ్యవహారాలు కచ్చితంగా పాటిస్తారు. ఈ గ్రామంలో చదువుకు మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో కూడా పిల్లలు ఎక్కువగానే కనిపించారు.

గ్రామంలో ఉన్న ఆరుగురు గర్భిణులు మూడు నెలల నుంచి ఆరు నెలల గర్భంతో ఉన్నవారే. డెలివరీ టైమ్ దగ్గరపడుతున్న సమయంలో గ్రామంలో సంభవిస్తున్న వరుస శిశు మరణాలు ఈ గర్భిణులను కలవరానికి గురిచేస్తోంది.

గుర్రగరువు

“నేను ఆరు నెలల గర్భవతిని. నెల రోజుల సమయంలోనే మా గ్రామంలో ముగ్గురు చిన్న పిల్లలు చనిపోయారు. వీరంతా మూడు నెలల లోపు వయసున్న వారే. చనిపోయిన వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని వారి తల్లిదండ్రులు చెప్పారు. కానీ, ఎందుకు చనిపోతున్నారో తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో మాకు పుట్టబోయే బిడ్డలు ఏమవుతారోననే భయం పట్టుకుంది” అని బుదిలి బీబీసీతో చెప్పారు.

గుర్రగరువు

‘రూఢకోట శిశు మరణాల సమయానికి మా పాపకు ఏడాది’

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని రూఢకోట గ్రామంలో వరుస శిశుమరణాలు సంభవించినప్పుడు 2021 నవంబరులో అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు బీబీసీ తెలుగు బృందం వెళ్లింది. రెండేళ్ల కాలంలో 14 మంది చనిపోయారని గ్రామస్థులు చెప్పారు. అధికారులు మాత్రం 12 మంది అని తెలిపారు.

అయితే మరణించిన శిశువులు ఆరోగ్యంగానే ఉన్నా...చనిపోయే ముందు పొట్ట ఉబ్బడం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపించాయని స్థానిక పీహెచ్ వైద్యులు శ్యామ్ సుందర్ బీబీసీతో అప్పుడు చెప్పారు.

"రూఢకోటలాగే మా గ్రామంలో కూడా జరుగుతుండటంతో ఒక ఆరోగ్య శిబిరం పెట్టారు. అప్పటికే ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు మా గ్రామంలో తల్లి కాబోతున్నామన్న సంతోషంకన్నా భయమే ఎక్కువగా ఉంది. రూఢకోట శిశు మరణాలను విని ఆందోళన చెందేవాళ్లం. ఆ సమయానికి మా పాప వయసు ఏడాది. చాలా భయంగా ఉండేది” అని ఏడాదిన్నర పాప ఉన్న సూర్య కుమారి బీబీసీతో చెప్పారు.

గుర్రగరువు

‘అధ్యయనంలో ప్రాథమికంగా తేలినవి ఇవే…’

రూఢకోట, గుర్రుగరువు గ్రామాల్లోని శిశు మరణాలు అందర్నీ కలవరపరుస్తున్నాయి.

రూఢకోటలో 2021 డిసెంబర్ 3న చివరి శిశు మరణం సంభవించిందని పాడేరు ఐటీడీఏ అధికారులు తెలిపారు. అక్కడ మరణాలపై కమిటీ వేయడం, విశాఖపట్నం కేజీహెచ్ నుంచి వైద్య బృందాలను పంపడం, గ్రామంలో నీరు, ఆహారం నమూనాలను పరీక్షించడంతో పాటు గుర్రుగరువు గ్రామంలో కూడా ఆరోగ్య శిబిరం పెట్టి అవగాహన కల్పించామని తెలిపారు.

"నవజాత శిశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి పాలు పట్టడం నుంచి, తిండి, నిద్ర అన్నింటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. గుర్రుగరువు, రూఢకోటలలో మరణాలు సంభవించిన సమయానికి ముందు పుట్టిన పిల్లలంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ శిశు మరణాలు సంభవిస్తున్న గ్రామాల్లో కొన్ని కారణాలను గుర్తించాం. చనిపోయిన వారిలో నాటు మందు వాడటం, పాలు సమయానికి ఇవ్వకపోవడం, మోతాదుకు మించి ఇవ్వడం, ఊపిరి సరిగా అందకపోవడం, డయేరియా వంటి కారణాలతో చనిపోయారని ప్రాథమిక నిర్ధరణ జరిగింది’’అని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, విశాఖ ఏజెన్సీలో జోరుగా సాగుతున్న స్టాబెర్రీ సాగు

‘హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’

శిశు మరణాలపై కమిటీల ద్వారా అధికారులు ప్రాథమికంగా తేల్చిన అంశాలను, అందులో శిశువులకు తల్లులు పాలిచ్చే విధానం కూడా ఒకటనే విషయాన్ని గుర్రగరువు గ్రామానికి చెందిన సూర్యకుమారి వద్ద బీబీసీ ప్రస్తావించింది.

“పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు కన్నతల్లులుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అధికారులు చెప్తున్న ‘పాలు ఇచ్చే విధానమేంటో’ మాకు అర్థం కావడం లేదు. పిల్లలు ఎందుకు చనిపోతున్నారనే విషయం అయితే మాకు తెలియడం లేదు” అని సూర్యకుమారి అన్నారు. అలాగే తన ఏడాదిన్నర బిడ్డకు తల్లిపాలనే ఇస్తున్నట్లు చెప్పారు.

వీడియో క్యాప్షన్, వీర్యం, అండం లేకుండా సృష్టించిన ఈ పిండం గుండె కొట్టుకుంటోంది

“ఇప్పుడు గుర్రుగరువులో కానీ, అప్పుడు రూఢకోటలో కానీ... ఏ వ్యాధితో లేదా ఏ కారణాలతో శిశువులు చనిపోయారని వివరించి చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. వరుస మరణాలు సంభవిస్తున్న ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి. అసలు గ్రామాలకు ఉన్నత వైద్యాధికారులు వచ్చి, స్థానికులకు ధైర్యం కల్పించి, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలి” అని అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన సంఘం అధ్యక్షులు పాలిక లక్కు బీబీసీతో చెప్పారు.

ఏజెన్సీ గ్రామాల్లో వరుస శిశు మరణాల నియంత్రణ గురించి ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ బీబీసీతో మాట్లాడారు.

“గుర్రుగరవు మరణాలపై దృష్టి పెట్టాం. గర్భిణులు ధైర్యంగా ఉండాలి. వారి కోసం బర్త్ వెయింటింగ్ హాల్ నిర్మించాం. ఆయా, ఏఎన్ఎం, వైద్యులను అందుబాటులో ఉంచుతున్నాం. శిశుమరణాలు సంభవిస్తున్న గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లో కూడా బాలింతలకు, గర్భిణులకు తల్లి, బిడ్డ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం రూ. కోటి 25 లక్షలు నిధులు కేటాయిస్తున్నాం” అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)