తెలంగాణలో వాటర్ స్పౌట్: సింగూరు ప్రాజెక్టు నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎందుకు వెళ్లాయి?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం 'నిర్జప్ల' వద్ద మంజీరా నదిలో అరుదుగా కనిపించే వాటర్ స్పౌట్ ఏర్పడింది. ఆదివారం (4-9-2022) సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్న వాతావరణం ఏర్పడి సింగూరు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నీరు సుడులు తిరుగుతూ పైకిలేచి మేఘాల వైపు వెళ్లింది.
సుమారు 3 నిముషాల పాటు ఈ దృశ్యం కనిపించింది. ఈ వాటర్ స్పౌట్ వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏం జరిగింది?
ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం, భారీ వర్షం కురిసే సూచనలు కనిపించడంతో సింగూరు డ్యామ్ చుట్టుపక్కల పొలాల్లో అప్పటికే పనులు ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళ్లే హడావిడిలో రైతులు ఉన్నారు. ఆ సమయంలో ఏర్పడ్డ వాటర్ స్పౌట్ దృశ్యాన్ని కొంతమంది రైతులు, స్థానికులు, ఆదారి వెంట వెళ్తున్నవారు తమ సెల్ ఫోన్ లలో రికార్డ్ చేశారు.
''మా పొలంలో పనిచేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా భారీ గాలి మేఘం ఒకటి డ్యామ్ లోపల ఏర్పడి నీటిని తనతో పాటూ పైకి తీసుకెళ్లింది. గతంలో నేను ఎప్పుడూ ఇలాంటి దృశ్యాన్ని చూడలేదు. మేఘాలు ఆకాశం నుండి కిందకు వచ్చి నీళ్లు తాగిపోతాయని చిన్నప్పుడు మా పెద్దోళ్లు చెబితే వినేవారిమి, ఇది అదేనేమో అని అనుకున్నాం''అని నిర్జప్ల గ్రామానికి చెందిన పాతులగూడ సురేష్ బీబీసీతో అన్నారు.

తెలంగాణలో వాటర్ స్పౌట్లు..
సాధారణంగా సముద్ర ప్రాంతాలు, నదులు లాంటి పెద్ద నీటివనరుల దగ్గర ఎక్కువగా వాటర్ స్పౌట్‌లు ఏర్పడటం చూస్తుంటాం.
ఈమధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దృశ్యాలు అడపాదడపా కనిపిస్తున్నాయి. గతంలో కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్(ఎల్ఎండీ)లో రెండు సార్లు వాటర్ స్పౌట్ ఏర్పడింది. తాజాగా ఇప్పుడు మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్ట్ లో ఇలాంటిదే కనిపించింది. మొత్తం మీద ఈమధ్య కాలంలో తెలంగాణలో వాటర్ స్పౌట్‌లు ఏర్పడటం ఇది మూడో సారి.
వీటి గురించి స్థానికులు చర్ఛించుకోవడం కనిపించింది.
''సింగూరు ప్రాజెక్ట్ లో నీరు ధారగా, పెద్ద పైపు ఆకారంలో పైకి లేచింది అని స్థానికులు చెప్పగా విన్నాం. దీని గురుంచి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి ఎవరూ రాలేదు'' అని వట్ పల్లి మండలం తహసిల్దార్ 'ప్రభువులు' బీబీసీ కి తెలిపారు.

వాటర్ స్పౌట్ ఎందుకు ఏర్పడుతుంది?
తెలంగాణలో ఈ మధ్య కాలంలో వాటర్ స్పౌట్లు ఏర్పడటానికి కారణాలు ఏంటి? అసలింతకూ వాటర్ స్పౌట్ అనేది ఎలా ఏర్పడుతుంది? అన్న అంశంపై విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ఓషియానోగ్రఫీ, మెటియొరాలజీ విభాగం ప్రొఫెసర్ సునీతను బీబీసీ సంప్రదించింది.
''ఉదయం, మధ్యాహ్నం ఉష్ణోగ్రతల్లో పెద్దమొత్తంలో తేడాలు ఉండి వాతావవరణంలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు 'కన్వెక్టివ్ ఇన్ స్టెబిలిటీ' అనే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడి వాటర్ స్పౌట్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వాతావరణంలో థర్మల్ ఇన్ స్టెబిలిటీ దీనికి కారణం. సముద్ర ఉపరితలం వేడెక్కడం, అదే సమయంలో వాతావరణంలోని తేమ, గాలి వేగం అన్నీ కలిసి ఒక స్పూన్ లాంటి ఆకారం ఏర్పడుతుంది. దీన్నే వాటర్ స్పౌట్ అని పిలుస్తాం. సాధారణంగా వేసవి కాలంలో ఇవి ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి'' అని వివరించారు.
‘‘ప్రస్తుతం బ్రేక్ కండీషన్స్ వల్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు గాలి వేగం కూడా పెరుగుతుంది. ఒక్క తెలంగాణ లోనే అని కాదు కొంతకాలంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లోని నదులు, చెరువులు, డ్యామ్ లలో కూడా వాటర్ స్పౌట్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి’’ అని ప్రొఫెసర్ సునిత తెలిపారు.

చేపల వర్షం-వాటర్ స్పౌట్..
ఆకాశం నుండి చేపల వర్షం కురిసిందన్న వార్తలు మనం వినే ఉంటాం. ఈ మధ్య కాలంలో తెలంగాణలోని కాళేశ్వరం, జగిత్యాల, వైరాలో చేపల వర్షం కురిసిందన్న వార్తలు వచ్చాయి.
నిజానికి ఆకాశం నుండి చేపలు వర్షంలా పడటం అంటూ ఉండదని, చేపల వర్షానికి వాటర్ స్పౌట్లకు మధ్య సంబంధం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
‘'బలమైన గాలులతో ఏర్పడ్డ వాటర్ స్పౌట్లు సాధారణంగా మూడు కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయాణిస్తాయి. ఆరోజు ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి ఆ సమయంలో ఉండే బలంతో తనతో పాటూ చేపలను పైకి తీసుకెళ్లి బలహీనపడ్డాక దూరంగా కిందకు వదిలేస్తాయి. దీంతో అది చేపలవర్షం అని అనుకుంటారు. మేఘాల్లో చేపలు లాంటిది జరగదు'' అని ప్రొఫెసర్ సునీత చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రేమిస్తే 30 రోజుల్లోగా ప్రభుత్వానికి చెప్పాలి, పెళ్లికి 6 నెలలు ఆగాలి.. పెళ్లయ్యాక 27 నెలలు అక్కడే గడపాలి..
- అమెరికాలో నీటి సంక్షోభం: ‘ఇక్కడ కుళాయి నీళ్లు తాగలేం, వాటితో స్నానం చేయలేం, పళ్లు కూడా తోముకోలేం’
- బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నిక.. ఆమె గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..
- ‘హిందువులు, సిక్కులను మిషనరీలు క్రైస్తవులుగా మారుస్తున్నాయ్’ అంటూ పంజాబ్లో వివాదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















