Temperature Rise - Fishing: ‘మేం సముద్రంలో గంటల తరబడి వేటాడినా వలలో చేపలు పడట్లేదు’

దర్శన్ కినీ

ఫొటో సోర్స్, Shardul Kadam/BBC Marathi

ఫొటో క్యాప్షన్, దర్శన్ కినీ
    • రచయిత, జాహ్నవీ మూలే
    • హోదా, బీబీసీ మరాఠీ

పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు మత్స్యకారుల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. భారత్‌లోని తీర ప్రాంతాల్లో పెద్దయెత్తున ప్రజలకు చేపల వేటే జీవనాధారం.

''కొన్నిసార్లు మేం సముద్రంపై గంటలపాటు ఉన్నప్పటికీ, ఒక్క చేప కూడా పట్టలేకపోతున్నాం. మా వలలన్నీ ఖాళీగానే వస్తున్నాయి''అని ముంబయి తీరంలో చేపలుపట్టే దర్శన్ కినీ ఆవేదన వ్యక్తం చేశారు.

ముంబయిలోని మలాడ్‌లో మార్వే బీచ్ హార్బర్‌ నుంచి ఆయన తరచూ చేపలు పట్టడానికి వెళ్తుంటారు. పశ్చిమ తీరంలోని అరేబియా సముద్ర ప్రాంతంలో ఆయన చేపలు పడతారు.

మూడు నుంచి నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచీ ఆయన పెద్దవారితో కలిసి చేపల వేటకు వెళ్లేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయని ఆయన అంటున్నారు.

''ఇక్కడ తిమింగలాలు, డాల్ఫిన్‌లు లాంటి పెద్దపెద్ద చేపలు తిరిగేవని మా పెద్దవారు చెప్పేవారు. చిన్నప్పుడు మేం ఒకసారి వల వేస్తే, బకెట్ నిండా చేపలు వచ్చేవి. కానీ, నేడు మా వలలు ఖాళీగా ఉంటున్నాయి''అని ఆయన అన్నారు.

చేపల వేట

ఫొటో సోర్స్, Shardul Kadam/BBC Marathi

విపరీత ఉష్ణోగ్రతలు..

ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదయ్యాయి. దీంతో ఈ పరిసరాల్లోని తీర ప్రాంతాల్లో చేపలు కనిపించకుండా పోయాయి.

తీరం నుంచి రెండు, మూడు కి.మీ. దూరం వెళ్లిన తర్వాత మత్స్యకారులకు ఒకప్పుడు భారీగా చేపలు దొరికేవి. కానీ, ఇప్పుడు అవే చేపల కోసం వారు 30 నుంచి 40 కి.మీ. వెళ్లాల్సి వస్తోంది.

అయితే, పెరుగుతున్న చమురు ధరల వల్ల ఈ చేపల వేట ఖర్చు కూడా పెరుగుతోందని కినీ అన్నారు. మరోవైపు ట్రాలర్స్‌తో భారీగా చేపలు పట్టే పెద్దపెద్ద పడవల నుంచి తమకు విపరీతమైన పోటీ ఉంటోందని వివరించారు.

తీరం గుండా కిందకు వెళ్తే కేరళ కనిపిస్తుంది. అక్కడే బైజు పీబీ చేపలు పడుతుంటారు. తుపానుల వల్ల తమ చేపల వేటపై చాలా ప్రభావం పడుతోందని ఆయన అన్నారు. ముఖ్యంగా 2017లో వచ్చిన ఓఖి తుపాను తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు.

బైజుకు కొన్ని పడవలు ఉన్నాయి. ఇవి తరచూ వేటకు వెళ్తుంటాయి. అయితే, ఇటీవల కాలంలో ఇక్కడి తీరంలో కవ్వళ్లు (శార్డైన్) అసలు పడటంలేదని ఆయన అన్నారు.

చేపల వేట

ఫొటో సోర్స్, Shardul Kadam/BBC Marathi

ఏం మారింది?

1951 నుంచి 2015 మధ్య హిందూ మహా సముద్రంలోని భూమధ్య రేఖ పరిసరాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరిగాయి. అంటే ఒక్కో దశాబ్దానికి 0.15 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున పెరుగుతూ వచ్చాయని భారత భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో తెలిపింది.

ఉష్ణోగ్రతలు పెరగడంతో పశ్చిమ తీరంలో తీవ్రమైన తుపానులు కూడా ఎక్కువయ్యాయి.

మరోవైపు ఇక్కడ మెరీన్ హీట్‌వేవ్‌ల సంఖ్య కూడా ఎక్కువైంది.

నీరు వేడెక్కడంతో ఇక్కడి చేపలు కొత్త ప్రాంతాలను వెతుక్కుంటున్నాయి.

''మనం భవనాల్లో ఎలా జీవిస్తామో.. చేపలు కూడా అలానే పగడపు దిబ్బల్లో జీవిస్తుంటాయి. అయితే, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల పగడాలు ధ్వంసమవుతున్నాయి''అని మెరీన్ బయాలజిస్ట్ వర్ధన్ పటన్కర్ చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల చేపల సంతానోత్పత్తిపైనా ప్రభావం పడుతోందని వివరించారు.

చేపల వేట

ఫొటో సోర్స్, Shardul Kadam/BBC Marathi

''ప్రత్యుత్పత్తి విషయంలో కొన్ని రసాయనిక సంకేతాలపై చేపలు ఆధారపడుతుంటాయి. తమకు అనుకూలమైన పరిస్థితులు ఉండేటప్పుడు మగ, ఆడ చేపలు ఒకేసారి అండాలు, శుక్రకణాలు విడుదల చేస్తాయి. ఫలితంగా కొత్త చేపలు పుడతాయి''అని ఆయన అన్నారు.

''అయితే, ఉష్ణోగ్రతలు పెరగడంతో నీటిలో రసాయనిక మార్పులు వస్తున్నాయి. ఫలితంగా రెండు చేపలు ఒకేసారి అండాలు, శుక్రకణాలు ఉత్పత్తి చేయడం లేదు. దీంతో చేపల సంఖ్య తగ్గిపోతోంది''అని ఆయన వివరించారు. చేపలకు ఆహారమైన ఫైటోప్లాంక్టన్స్ కూడా ఉష్ణోగ్రతలకు తట్టుకొని నిలబడలేవని ఆయన తెలిపారు.

అయితే, 2010లో మత్స్యకారుల వలలకు చిక్కిన చేపలు 3.2 మిలియన్ టన్నులుగా ఉండగా, 2020నాటికి ఇది 3.7 మిలియన్ టన్నులకు పెరిగిందని భారత మత్స్య సంపద శాఖ ఒక నివేదిక విడుదల చేసింది.

అయితే, ఈ నివేదికలోని అంశాలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని మహారాష్ట్ర మత్స్యకారుల యాక్షన్ కమిటీకి చెందిన దేవేంద్ర దామోదర్ తాండెల్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, భారత్ ఆక్వా ఎగుమతుల్లో మూడో వంతు ఆంధ్రప్రదేశ్‌ నుంచే..

నెలల వారీగా చూడాలి..

''సంవత్సరంలో ఎన్ని చేపలు పడ్డాయని చూడకూడదు. ఏ నెలలో చేపలు ఎలా దొరుకుతున్నాయనే అంశాలను పరిశీలించాలి''అని ఆయన చెప్పారు.

''సాధారణంగా నైరుతి రుతుపవనాలకు మూడు నెలల ముందు చేపల వేటను ఆపేస్తాం. ఎందుకంటే అది చేపలు పిల్లలు పెట్టేందుకు అనువైన సమయం. అయితే, ఇప్పుడు ఆ మూడు నెలలను రెండు నెలలకు తగ్గించాం. కొన్ని పడవలు నిషేధిత ప్రాంతాల్లోనూ ప్రస్తుతం చేపల వేటకు వెళ్తున్నాయి''అని ఆయన అన్నారు.

''ఇలాంటి అక్రమ వేట, వాతావరణ మార్పులతో మహారాష్ట్ర తీరంలో చేపలు మరో రెండుమూడేళ్లలో పూర్తిగా తగ్గిపోయే ముప్పుంది''అని ఆయన అన్నారు.

''ప్రజలు ఈ మార్పులను పట్టించుకోవడం లేదు. నేలపై అంటే చెట్లు పెంచడం లాంటి చర్యలు తీసుకోవచ్చు. సముద్రంలో అయితే, ఏం జరుగుతుందో మనకు తెలియదు''అని ఆయన అన్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల చేపలు అమ్ముకునే వారు, ముఖ్యంగా మహిళలపై విపరీతమైన ప్రభావం పడుతోంది.

భారత్‌లోని చేపల పరిశ్రమపై దాదాపు 28 లక్షల మంది ఆధారపడుతున్నారు. దీనిలో చేపల వేట తర్వాత పనులను 70 శాతం మహిళలే చేస్తారు. ముఖ్యంగా చేపలను శుభ్రం చేయడం, అమ్మడం లాంటి పనులు వారు చూసుకుంటారు. చేపల సంఖ్య తగ్గడంతో వారి జీవనోపాధిపై ప్రభావం పడుతోంది.

ముంబయిలోని చార్కోప్ మార్కెట్‌లో ఏళ్లుగా నయనా భండారీ చేపలు అమ్ముతున్నారు. ''ఒకప్పుడు నా భర్త తీసుకొచ్చిన డబ్బులు ఇంట్లోకి వాడుకుంటే.. నేను సంపాదించేది దాచుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు అలా కాదు. మేం ఏమీ దాచుకోలేకపోతున్నాం''అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, చేపలు మనుషులను చంపాలనుకుంటాయా.. ఏ చేపలు ప్రమాదకరం?

సముద్రంలో చేపల సంఖ్య తగ్గిపోవడంతో వీటిని ప్రధాన ఆహారంగా తీసుకునే వారిపైనా ప్రభావం పడుతోంది.

''చందువాయి (పాంఫ్రెట్)లాంటి చేపల ధరలు భారీగా పెరిగాయి''అని ఎక్కువగా చేపలు ఆహారంగా తీసుకునే మనీషా చెప్పారు.

ప్రస్తుతం మలాడ్ హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక చందువాయి చేప రూ.2500 (32 డాలర్లు) వసూలు చేస్తున్నారు. గతేడాది కంటే ఇది రూ.1400 ఎక్కువ.

''గతంలో మేం చాలా రకాల చేపలు తినేవాళ్లం. పెద్దపెద్ద చేపలు కూడా తెచ్చుకునేవాళ్లం. వారంలో మూడు నుంచి నాలుగు రోజులు చేపలే తినేవాళ్లం. ఇప్పుడు వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే తింటున్నాం''అని మనీషా అన్నారు.

భారత్‌లోని పశ్చిమ తీరాన్ని ఇప్పటికే రుతుపవనాలు తాకాయి. సాధారణం కంటే కొన్ని రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయి. వర్షాల తర్వాత మళ్లీ తమకు ఎక్కువ చేపలు దొరకాలని కినీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)