అడవిలో ఒంటరిగా 40 ఏళ్లు జీవించిన ఆ వ్యక్తి గురించి బాహ్య ప్రపంచానికి ఎలా తెలిసింది?

కెన్ స్మిత్ ప్రధాన ఆహారం చేపలే

ఫొటో సోర్స్, KEN SMITH

ఫొటో క్యాప్షన్, కెన్ స్మిత్ ప్రధాన ఆహారం చేపలే
    • రచయిత, స్టీవెన్ బ్రాకల్‌హర్స్ట్
    • హోదా, బీబీసీ స్కాట్లాండ్

ఆయన పేరు కెన్ స్మిత్. స్కాట్లాండ్‌‌లోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న సరస్సు ఒడ్డున నివసిస్తుంటారు. ఇక్కడ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఆయన అందరిలాంటి మనిషి కాదు.

గత 40 ఏళ్లుగా కెన్ స్మిత్ సాధారణ ప్రజల జీవితానికి భిన్నంగా జీవిస్తున్నారు. ఆయన ఉండే ఇంట్లో కరెంటు లేదు. కుళాయి కూడా కనిపించదు. ''ఈ జీవితం చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఇలా బతకాలని అనుకుంటారు. కానీ, ఎవరూ అలా చేయలేరు''అన్నారు కెన్.

ఒంటరిగా ఉండటం, ఆరు బయటే స్నానం, బట్టలు ఉతుక్కోవడం, చేపలు పట్టుకోవడం, కట్టెలు ఏరుకొచ్చి వంట వండుకోవడం లాంటివన్నీ ఆదర్శవంతమైనవని అందరూ అనుకోకపోవచ్చు.

కానీ, 74 సంవత్సరాల వయసులో ఆయన ఈ పనులన్నీ చేస్తున్నారు. ఆయన నివసించే చిన్న గది నుంచి మెయిన్ రోడ్డుకు చేరుకోవాలంటే 2 గంటలు పడుతుంది.

''దీనిని ఏకాంత సరస్సు (లోన్లీ లోచ్) అని పిలుస్తారు'' అన్నారు స్మిత్. '' ఇక్కడికి రోడ్డు కూడా సరిగా లేదు. ఆనకట్ట నిర్మించక ముందు ఇక్కడ ప్రజలు నివసించేవారు" అని ఆయన వెల్లడించారు.

చిత్ర నిర్మాత లిజ్జీ మెకెంజీ కి తొమ్మిదేళ్ల కిందట కెన్‌తో పరిచయం ఏర్పడింది. బీబీసీ స్కాట్లాండ్ డాక్యుమెంటరీ 'ది హెర్మిట్ ఆఫ్ ట్రీగ్' కోసం ఆమె కెన్ మీద అనేక దృశ్యాలను చిత్రీకరించారు.

డెర్బిషైర్‌ కు చెందిన కెన్, 15 సంవత్సరాల వయసు నుంచే ఫైర్ స్టేషన్ నిర్మాణం కోసం పని చేశానని ఈ డాక్యుమెంటరీలో వివరించారు.

తలకు గాయాల కారణంగా కెన్ ఇక మాట్లాడలేరని, నడవలేరని డాక్టర్లు చెప్పారు.

ఫొటో సోర్స్, URUNA PRODUCTIONS

ఫొటో క్యాప్షన్, తలకు గాయాల కారణంగా కెన్ ఇక మాట్లాడలేరని, నడవలేరని డాక్టర్లు చెప్పారు.

జీవితాన్ని మార్చేసిన ఘటన

కానీ, 26 ఏళ్ల వయసులో రాత్రిపూట ఆయనపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. మెదడులో రక్తస్రావం జరిగి 23 రోజుల పాటు కోమాలో ఉన్నారు.

''నేను ఇక ఎప్పటికీ కోలుకోలేనని, మాట్లాడలేనని వైద్యులు చెప్పారు. నడవలేనని కూడా అన్నారు. కానీ, నడిచాను'' అని ఆయన గుర్తు చేసుకున్నారు

''అప్పటి నుంచి ఎవరి పైనా ఆధారపడకుండా, ఎవరి సలహాల మీద కాకుండా నా సొంత ఆలోచనలతో జీవించాలని అనుకున్నా'' అని తన ఏకాంత జీవితపు నేపథ్యాన్ని కెన్ వివరించారు.

మొదట్లో ఆయన యాత్రల మీద దృష్టి పెట్టారు. కానీ, తర్వాత అడవిలో ఒంటరిగా జీవించడం గురించి ఆలోచించారు.

ఓసారి అలాస్కా సరిహద్దులోని కెనడియన్ భూభాగం యుకాన్‌ ప్రాంతంలో నడుస్తుండగా, ఈ హైవే మీద ఇలా నడుచుకుంటూ వెళ్లిపోతే ఎలా ఉంటుంది అనుకున్నారట కెన్. అనుకున్నట్లుగానే ఆయన దాదాపు 35 వేల కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన ప్రయాణించారు.

ఆ తర్వాత ఇంటికి చేరుకున్న ఆయనకు తల్లిదండ్రులు చనిపోయినట్లు తెలిసింది. ఇంటికి చేరే వరకు ఆయన ఎక్కడున్నారో బంధువుల్లో ఎవరికీ తెలియదు.

కెన్ బ్రిటన్ వ్యాప్తంగా పర్యటించారు. స్కాటిష్ హైలాండ్స్‌లోని రానోచ్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకు అకస్మాత్తుగా తల్లిదండ్రుల గుర్తొచ్చారు.

''నేను నడుస్తున్నంత సేపూ ఏడుస్తూనే ఉన్నా'' అన్నారు కెన్. ''బ్రిటన్‌లో అత్యంత ఏకాంత ప్రదేశం ఎక్కడుంది అన్నదాని గురించి నేను ఆలోచించాను'' అని కెన్ డాక్యుమెంటరీలో చెప్పారు.

''ఇల్లంటూ కనిపించని ప్రాంతం గురించి చాలా ప్రాంతాలలో వెతికాను. అలా వేల కిలోమీటర్లు నడిచాను. తర్వాత ఈ సరస్సు ప్రాంతంలో అడవులు కనిపించాయి. ఇక్కడ ఎవరూ లేరు'' అన్నారు కెన్.

1980లలో నిర్మించుకున్న కర్రల షెడ్డు ముందు కెన్ స్మిత్

ఫొటో సోర్స్, KEN SMITH

ఫొటో క్యాప్షన్, 1980లలో నిర్మించుకున్న కర్రల షెడ్డు ముందు కెన్ స్మిత్

గమ్యం దొరికింది

తాను నివసించాలనుకున్న స్థలం దొరికిందని ఆయనకు అర్ధమైంది. ఇక బాధను, దు:ఖాన్ని ఆపుకుని తన యాత్రను ముగించారు కెన్. చిన్న చిన్న కర్రలతో అక్కడే ఒక ఇల్లు నిర్మించుకున్నారు.

నాలుగు దశాబ్దాలుగా ఆ ఇంట్లో ఒక కట్టెల పొయ్యి వెలుగుతూనే ఉంది. కానీ కరెంటు, గ్యాస్, నీటి కుళాయిలాంటి సౌకర్యాలేవీ లేవు. ఇక్కడికి మొబైల్ సిగ్నల్ వచ్చే అవకాశమే లేదు.

అడవిలో కట్టెలు కొట్టుకుని ఇంటికి మోసుకుంటూ తెస్తారు. కూరగాయలు, బెర్రీలు సొంతంగా పెంచుతారు. ఇక ఆయన ప్రధాన ఆహారం మాత్రం సరస్సులో దొరుకుతుంది. అవి మరేమిటో కాదు...చేపలు.

''ఎవరైనా స్వతంత్రంగా బతకడం గురించి ఆలోచించేవారు చేపలు పట్టడం నేర్చుకోక తప్పదు'' అంటారు కెన్.

డాక్యుమెంటరీ నిర్మాత లిజ్జీ పది రోజులపాటు ఆయన దగ్గర ఉండి వెళ్లిపోయిన తర్వాత ఆయన ఒంటరి జీవితాన్ని కొన్నాళ్లు వదిలి పెట్టక తప్పలేదు. 2019లో ఆయన గుండెపోటుకు గురయ్యారు.

అనారోగ్యం కారణంగా ఆయన స్వతంత్రంగా, ఒంటరిగా జీవించలేని పరిస్థితి ఏర్పడింది.

ఫొటో సోర్స్, URUNA PRODUCTIONS

ఫొటో క్యాప్షన్, అనారోగ్యం కారణంగా ఆయన స్వతంత్రంగా, ఒంటరిగా జీవించలేని పరిస్థితి ఏర్పడింది.

ఆరోగ్య సమస్యలు

కట్టెలు కొడుతుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి పడిపోయారు. తన దగ్గర ఉన్న జీపీఎస్ పర్సనల్ లొకేటర్ ద్వారా ఆపదలో ఉన్నట్లు సిగ్నల్ పంపారు. ఈ సిగ్నల్ హ్యూస్టన్‌లోని రెస్పాన్స్ సెంటర్‌ సందేశం పంపింది. ఇక్కడి నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌లో కోస్ట్ గార్డ్‌కు మెసేజ్ వెళ్లింది.

చివరకు విమానంలో తరలించి ఆయన్ను ఇంగ్లాండ్ లోని ఫోర్డ్ విలియమ్ ఆసుపత్రికి చేర్చారు. ఆసుపత్రిలో ఆయన ఏడు వారాలు గడిపారు.

గుండెపోటు రావడానికి కొద్ది రోజుల ముందే కెన్ చేతికి జీపీఎస్ పర్సనల్ లొకేటర్‌ వచ్చింది.

అయితే, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కేర్ సెంటర్‌లో చేరాల్సిందిగా ఆయనకు సూచించారు. అక్కడ కూడా ఒంటరిగా జీవించే అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారు. కానీ, కెన్ అందుకు ఒప్పుకోక, సరస్సు ఒడ్డున ఉన్న తన పాత ఇంటికి రావాలని నిర్ణయించుకున్నారు.

కాకపోతే, గుండెపోటు తర్వాత ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా కెన్ ఇంతకు ముందులా కాకుండా, కొందరి సాయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కెన్ నివసించే అటవీ ప్రాంతాన్ని చూసుకునే అధికారులు ప్రతి రెండు వారాలకు ఒకసారి ఆయనకు అవసరమైన ఆహారాన్ని అందించి వెళుతుంటారు. ప్రభుత్వం పెన్షన్ కూడా ఇస్తోంది. '' వీళ్లంతా నా పట్ల ఎంతో దయతో వ్యవహరిస్తున్నారు'' అన్నారు కెన్.

ఒక చెట్టు ఆయన మీద పడిపోవడంతో రెండోసారి కెన్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అయితే, తన భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం లేదని కెన్ అంటున్నారు.

''మనం ఈ భూమి మీద ఎల్లకాలం ఉండలేం కదా. నా చివరి రోజు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. జీవితంలో చాలా పరిణామాలను ఎదుర్కొని నిలబడ్డాను. ఇప్పుడు కూడా అంతే. మళ్లీ ఎప్పుడైనా నాకు అనారోగ్యం కలగవచ్చు. ఏదో ఒక రోజు నేను ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లిపోతా'' అని అన్నారు కెన్.

''నేను 102 సంవత్సరాల వరకు బతుకుతానని అనిపిస్తోంది'' అన్నారు కెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)