కోవిడ్ 19: ఊపిరితిత్తులపై దాడి చేసి, ప్రాణాలు తీసే ప్రమాదకరమైన జన్యువును కనుగొన్న శాస్త్రవేత్తలు

ఊపిరితిత్తులపై దాడి చేసి, ప్రాణాలు తీసే ప్రమాదకరమైన జన్యువును కనుగొన్న శాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, స్మిత ముండాసాద్
    • హోదా, బీబీసీ హెల్త్ రిపోర్టర్

ఒక ప్రత్యేకమైన జన్యువు వలన కోవిడ్ సోకినప్పుడు ఊపిరితిత్తులు పాడైపోయి, ప్రాణాలు కోల్పోయే అవకాశం రెట్టింపు అవుతుందని ఆక్స్‌పర్డ్ యునివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

దక్షిణ ఆసియావాసుల్లో 60 శాతం, యూరోప్ మూలవాసుల్లో 15 శాతంలో ఈ ప్రమాదకర జన్యువు ఉందని అంటున్నారు.

అయితే దీనితో పోరాడేందుకు వాక్సీన్లు సహాయపడతాయని, ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిశోధకులు తెలిపారు.

దక్షిణ ఆసియా, బ్రిటన్ మూలవాసుల్లో కొంతమందికి కోవిడ్ రిస్క్ ఎందుకు అధికంగా ఉందన్న అంశంపై 'నేచర్ జెనెటిక్స్' అధ్యయనం కొంత పరిశోధన చేసిందిగానీ పూర్తి కారణాలను వివరించలేదు.

గతంలో చేసిన జన్యు పరిశోధన ఆధారంగా, పరిశోధకులు కృత్రిమ మేధస్సు, నూతన పరమాణు సాంకేతికతలను ఉపయోగించి కోవిడ్ రిస్కును పెంచే ఈ జన్యువును కనుగొన్నారు.

దాని పేరు LZTFL1. దీనివలనే కోవిడ్ రిస్క్ పెరుగుతోందని తేలింది.

ఆఫ్రికన్-కరేబియన్ నేపథ్యాలకు చెందినవారిలో సుమారు 2 శాతం, తూర్పు ఆసియా వాసుల్లో 1.8 శాతానికి ఈ జన్యువు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే, ఈ జన్యువు అన్ని ప్రాంతాల జనాభాను ఒకే విధంగా ప్రభావితం చేయదు అన్నది ఈ పరిశోధనలో ముఖ్యాంశమని ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ జేమ్స్ డేవిస్ అన్నారు.

ప్రమాదం వ్యక్తిగత స్థాయిలో ఉంటుందని, కొన్ని కారణాల వలన కొంతమందికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని, అందులో వయసు కూడా ఒక ముఖ్య కారణమని తెలిపారు.

"మహమ్మారి వల్ల కొన్ని సముదాయాలు ఎందుకు తీవ్రంగా ప్రభావితమయ్యాయో వివరించడంలో సామాజిక, ఆర్థిక కారకాలు కూడా ముఖ్యమైనవి" అని ఆయన అన్నారు.

"జన్యునిర్మాణాన్ని మనం మార్చలేం కానీ, ఈ హై రిస్క్ జన్యువు ఉన్నవారు వ్యాక్సీన్ వేయించుకోవడం వలన ప్రమాదం తప్పించుకోగలరని మా పరిశోధనలో వెల్లడైంది."

వీడియో క్యాప్షన్, కరోనా బాధితుల్లో కాలి వేళ్ల మీద పుండ్లు ఎందుకు వస్తున్నాయి?

'రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తుంది'

ఈ జన్యువు ఉన్నవారిలో కరోనావైరస్ ఊపిరితిత్తులను మరింత ఎక్కువగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు.

కరోనావైరస్ నుంచి కాపాడుకునేందుకు ఊపిరితిత్తుల చుట్టూ సహజంగా ఏర్పడే రక్షణ వ్యవస్థను ఈ జన్యువు దెబ్బతీస్తుందని వారు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా, కరోనావైరస్ దగ్గరకు రాగానే ఊపిరితిత్తులను కప్పి ఉంచే కణాలు తమ సహజ సామర్థ్యాన్ని తగ్గించుకుని వైరస్ లోనికి చొచ్చుకుపోయే అవకాశాన్ని తగ్గిస్తాయి.

సామర్థ్యాన్ని తగ్గించుకునే ప్రక్రియలో కణాల ఉపరితలంపై ఉండే కీలకమైన ప్రొటీన్ ACE-2 స్థాయి తగ్గుతుంది.

కణాలకు కరోనావైరస్ అతుక్కోవడానికి ఈ ప్రొటీనే కీలకం. దీని స్థాయి తగ్గిపోతుంది కాబట్టి వైరస్ కణాల్లోకి వెళ్లే అవకాశాలు తగ్గుతాయి.

కానీ, ప్రమాదకరమైన LZTFL1 జన్యువు ఉన్నవారిలో ఈ ప్రక్రియ సరిగ్గా జరగదు. అందువల్ల ఊపిరితిత్తుల చుట్టూ ఉండే కణాల్లోకి వైరస్ సులువుగా చొచ్చుకుపోతుంది.

అయితే, ఈ జన్యువు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది కానీ, రోగ నిరోధక వ్యవస్థకు హాని కలిగించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అందువల్ల, వ్యాక్సీన్ తీసుకుని రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు.

ఊపిరితిత్తుల రక్షణపై దృష్టి సారించే కొత్త ఔషధాల ఆవిష్కరణకు తమ పరిశోధన సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న మందులు రోగ నిరోధక శక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, కరోనాతో కోమాలో ఉండగానే కవల పిల్లలు పుట్టారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)